[శ్రీ ఆర్. వి. వి. రాజా రచించిన ‘వెన్నెల ఓ హంతకురాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


చీమ చిటుక్కుమనకుండా
పట్టుకొని కూర్చుంది చీకటి
కిటకీ ఆవల చూపుల కావాలి కాస్తూ
జిబ్రాన్ ‘ప్రొఫెట్’ వింటున్నాను..
ఎక్కడో సన్నగా చీకటిని తరుగున్న చప్పడు
వెన్నెల వెలిమిడిలొంచి చీకటి బొగ్గును వేరుచేస్తున్న
చందమామ అలికిడి..
జిబ్రాన్ను మన్నించమని కోరుతూ
అడుగులు తోడుక్కొని బయటకొచ్చి
దారి చేయి పట్టుకొని ఆ రేయెండలోకి నడిసాను..
కొమ్మలల్లిన ఊయలుగుతూ దూరన జాబిలి..
గాలిని ఐశ్వర్యవం తురాల్ని చేస్తూ మల్లె పందిరిచ్చిన
అవిరళ పరిమళ విరాళం తరగలౌతుంటే
మంచు కూరిన లేతగ్గిలాంటి వెన్నెల గాడుపు తగలి
మెల్లమెల్లగా తన తల నెరిసిపోతుందని చీకటి ఏడుస్తుంది
చీకటి కుండ మీద పోసిన పూతరేకు పిండిలా
వెన్నెల కారుతుంటే చెరువు ముచ్చిరేకులా మెరుస్తుంది
తమకంతో మొగలి పువ్వు మూలుగుతుంది
వెన్నెల ధూళి దులుపుకొంటూ రంగు మచ్చల
సీతాకోక చిలక ముఖమ్మీది మచ్చలకి ఏమ్మందులు
వాడుతున్నావని చందమామని అడుగుతుంది..
రేయెండలో కరిగి తేనెపట్టు కారుతుంటే
హనీమూను కొచ్చిన వలసపిట్ట ఒట్రoగా చప్పరిస్తుంది
ఓర్వలేక పూదోట తేనెలపై నిషేదాజ్ఞలు జారీ చేసింది..
వెన్నెల వలలో పడి నది విలవిలా కొట్టుకోంటూ ఉంటే
కొండకడవ నిండా వెన్నెల్ని ఎత్తుకొంటుంది అడవి..
అందుకే అనుభవించాలే గాని వెన్నెల..
అమ్మ కలిపిన పెరుగన్నంలా
నిదుర కుదుళ్లు తెంపిన హంతకురాలులా
నీలి గాయాలకు కట్టిన హాయ్ గాజు గుడ్డలా
ఫక్కున పగిలిన దూది చేను ముఖంలా
మాటిమాటికీ అలవాటైన ఆలిలా.. అనిపిస్తుంది..
అందుకేనేమో వెన్నెలెప్పుడూ..
నేల కాగితం మీద జాబిలి చేసిన విరహ సంతకమే
అనంత ఆకాశం కింద ఓ దిగంబర దృశ్యమే..