[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘విచిత్ర కుటుంబం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


గేటు తీసిన చప్పుడయింది. పుస్తకం చదువుతున్న శాంత ఆ వైపు చూసింది. ఇంటి వాటా ఖాళీ అయి ‘To-Let’ బోర్డ్ పెట్టాక వాటా చూడ్డానికి కొందరు వస్తున్నారు. బోర్డు పైన కొన్ని వివరాలు ఇచ్చింది శాంత.
“వాటా చూడ్డానికా బాబూ?” అంది శాంత.
“ఆ అవును” అన్నారు.
“ప్లీజ్, గేటు వేసి రండి. ఆవులు వచ్చి మొక్కలు తినేస్తాయి” అంది శాంత.
వచ్చిన వారు వాటా చూశారు. కూర్చుని వివరాల్లోకి వెళ్తున్నారు. చిన్నవాళ్లే; భార్య, భర్త స్కూటర్ పైన వచ్చేరు.
“ఇల్లు మాకు నచ్చింది. మా తమ్ముడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడకు షిఫ్ట్ అవుతాడు” అన్నాడు అతడు. పేరు రాహుల్.
“మరి అతనికి నచ్చాలి కదా!” అంది శాంత.
“నేను మాట్లాడి వివరాలు చెప్పేను. మీరు పర్మిషన్ ఇస్తే, వాటాను వీడియో తీసి సునీల్‌కు చూపిస్తాను” అన్నాడు రాహుల్. “మేమూ ఇక్కడే హనుమకొండలోనే ఉంటాం. మా ఇల్లు హసంపర్తిలో ఉంది. ఇక్కడికి కాస్త దూరం. కానీ ఇక్కడికి దగ్గరగా శ్యామ్ పేటలో మా తమ్ముడు ఓ స్థలం కొన్నాడు. అందులో ఇల్లు కట్టే ప్లాన్ ఉంది. ఆ ఇల్లు పూర్తయ్యేదాకా మీ వాటాలో ఉంటాడు. తర్వాత షిప్ట్ అవుతాడు” అన్నాడు రాహుల్
ఓ నిమిషం ఆలోచనలో పడింది శాంత. “సారీ! అంత మరీ టెంపరరీ స్టే అయితే మేం వాటా ఇవ్వలేము. కనీసం రెండేళ్లయినా ఉండాలి కదా”
“ఆంటీ సునీల్ Row House కట్టాలని ప్లాన్ వేసుకున్నాడు. మూడు అంతస్తులు. బిల్డర్‌కి కాంట్రాక్ట్ ఇవ్వాలి, పని ప్రారంభించాలి. కనీసం ఒక సంవత్సరం అయితే తప్ప పూర్తవదండి. ఇక్కడి నుంచి అయితే ఆ స్థలానికి బాగా దగ్గర, సునీల్ గాని, మా నాన్న గాని, వెళ్లి సూపర్వైజ్ చేసుకొనడానికి బాగుంటుంది. ప్లీజ్ కాదనకండి”. నెమ్మదిగా మర్యాదగా చెప్పాడు రాహుల్.
శాంత లోపల గదిలోకి వెళ్లి, తన కుమారుడిని విషయం చెప్పి, సంప్రదించింది. “పోనీలే అమ్మా, మనకు కూడా పదిహేను రోజులయి ఖాళీ పడింది కదా ఇల్లు. నీకు రోజూ ఇదో అదనపు పని, ఒక్కొక్కరే రావడం, చూడడం, తలుపులు వేయడం, నెగోషియేషన్స్, అన్నీ- అంతగా అడుగుతున్నాడు. హానెస్ట్‌గా నిజం చెప్పేడు. ఫరవా లేదు. ఓకే చేసెయ్యి అమ్మా” అన్నాడు.
రాహుల్ అతని భార్య సునీత “థాంక్స్ అండి”, అని వాటాలోకి వెళ్లి కొంతసేపు గడిపారు. సునీల్, పారు కూడా చాలా సంతోషించారు. “అడ్వాన్స్ రెండు నెలలకు ఇదిగో చెక్ రాసి ఇస్తున్నాను” అని, చెక్ ఇచ్చాడు రాహుల్.
ఓ వారంలో, లారీ, సామాన్లు వచ్చేయి. కాస్సేపటికి సునీల్, పారు వచ్చేరు. వాళ్లకు ఓ పాప, బాబు వున్నారు. మధ్యాహ్నానికి వాళ్ళ అమ్మ, నాన్నలు వచ్చారు.
కొన్ని రోజులకు సామాన్య సర్దుకుని సెటిల్ అయ్యారు
సునీల్ తల్లి సుందరమ్మ. కొంచెం పొట్టిగా ఉన్నా ముఖం మంచి కళగా ఉంది. ఓ రోజు సాయంత్రం వచ్చి శాంత ఇంటి బెల్ కొట్టింది. ఇద్దరూ మాటల్లో పడ్డారు. “ఇంట్లో ఎవరి పనులు వాళ్లవి కదా ఒక్కదానికీ ఏమీ తోచటం లేదు” అంది సుందరమ్మ. “మీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరమూ సాయంత్రం పార్కుకి వెళ్దాం. మన ఇంటికి చాలా దగ్గర. కొంతసేపు వాకింగ్, తర్వాత ఓచోట కూర్చుని సరదాగా మాట్లాడుకుందాం” అంది శాంత.
“తప్పకుండానమ్మా రోజూ వస్తాను”, అంది సుందరమ్మ సంతోషంగా.
ఆమె ముఖంలో నవ్వు ఇంతవరకు కనపడలేదు. ఎంతో ఉదాసీనంగా నైరాశ్యంతో ఉంది. మాటల్లో తెలిసిన విషయాలు భయంకరమైన నగ్న సత్యాలు. ఇలాంటివాళ్లు కూడా ఉంటారా? వీళ్ళు మనుషులా అని భయం వేస్తుంది. శాంత అవాక్కయింది.
సుందరమ్మ భర్త ఆనందరావు. నల్లగా లావుగా ఉన్నాడు. పొద్దున్నే స్కూటర్ పైన వెళ్లిన వాడు మళ్ళీ రాత్రికే ఇల్లు చేరుతాడు.
“నా ఖర్మ శాంతగారు. ఈ భర్త నాకు యముడు. పెళ్లయింది. కాపురానికి వెళ్లాను. ఆ రాత్రి గడిచింది. మర్నాడు ఉదయం ఇలా అన్నాడు – ‘నాకు వేరే ఆమెతో సంబంధం ఉంది. ఆమె మన కులం కాదు. అమ్మానాన్న బాధపడతారని చెప్పలేదు. ఆమెను వదిలే ప్రసక్తి లేదు. ఇక్కడా అక్కడా కూడా ఉంటాను’.
నేను బిక్క చచ్చిపోయాను. ఏం చేయగలను? నోరు ఎత్తకుండా పడి ఉన్నాను. ఇంతకన్నా చేసేది ఏముంది? అనాదిగా ఆడదాని బ్రతుకు ఎప్పుడూ నగుబాటే. పెద్ద జూదం! మూసి ఉంచితేనే గుప్పిడి. తెరిస్తే బట్టబయలు. మేము నలుగురం ఆడ పిల్లలం, నేను రెండో దాన్ని. పుట్టింటి వారికి సమస్యగా మారకూడదు కదా!
ఇద్దరు కొడుకులు! రాహుల్ సునీల్.
ఆనందరావు గడియారాలు రిపేరు చేయడంలో నేర్పరి. గోడ గడియారాలు. Time pieces, wrist watches, అన్నీ. కస్టమర్లు ఎంతో ఆనందపడేవారు. ఆ రోజుల్లో షాప్ పెట్టి బాగా సంపాదించేడు. రోజులు మారిపోయాయి కదా శాంత గారూ! సెల్ ఫోన్లు వచ్చేయి. గడియారాలు ఎవరికీ అవసరం లేని స్థితి కదా. షాప్ మూసి ఇంట్లో ఉంటున్నాడు. కొడుకుల మీదే ఆధారం. ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి.
కొన్ని రోజులు తర్వాత నేను పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాను. కాని ఓ రోజు పెద్ద కోడలు సునీత “అత్తమ్మా, మా అమ్మకు సడన్‌గా హార్ట్ ఆపరేషన్ పడింది. నేను అమ్మని తీసుకువచ్చి, అన్నీ చూస్తాను. నీవు వెంటనే సామాన్లు సర్దుకో. నిన్ను సునీల్ ఇంట్లో దింపుతాను” అని మధ్యాహ్నం ఎండలో దింపి వెళ్లిపోయింది.
నాకు ఏ విధమైన ఆర్థిక స్థోమతా లేదు. కోడళ్ళు చులకనగా చూస్తారు. వాళ్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు! షికార్లు, సరదాలు, బయట తినడం అన్ని జల్సాలు చేస్తారు. పారు బెంగళూరులో ఉండి వచ్చింది. అన్నీ ఆన్లైన్ షాపింగులే. ఇంటికి దగ్గరలో రైతు బజార్ ఉంది. “పారూ, నేను తాజా కూరగాయలు తెస్తానమ్మ – నీకు ఏం కావాలో చెప్పు” అని నేను బ్రతిమాలినా లెక్క చెయ్యదు. ఎక్కువ ధరకు, నిల్వ సరుకులు, ఎండిన కూరగాయలు, వస్తాయి ఇంటికి.
తన పిల్లల్ని నా దగ్గరకు చేరనివ్వదు. అంత చిన్న పిల్లలు పదేళ్ల వయసు లోపలివాళ్లు అంటారట – “మామ్మా, మరేమో నీతో మాట్లాడ వద్దు అని మా అమ్మ చెప్పింది. మేము ఎందుకూ పనికిరాకుండా పోతామట” అని నవ్వుతారుట.
మొగుడికి లోకువైన ఆడది లోకానికంతా లోకువే కదా!
ఏమీ కాలక్షేపం లేక సునీల్ తో “నాయనా తెలుగు వార్తా పత్రిక వేయించు. కాసేపు చదువుకుంటాను” అంటే “ఎవరు చదువుతారు అమ్మా! నీ ఒక్కదాని కోసం అది వేస్ట్ – అనవసరమైన ఖర్చు” అన్నాడట సునీల్.
చెప్పుకుని బాధపడింది సుందరమ్మ.
ఇకపై శాంత తను చదివి, సుందరమ్మకు పేపర్ ఇస్తోంది. మంచి కథల పుస్తకాలు కూడా ఇస్తోంది
సుందరమ్మ దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంది. కేవలం మాట్లాడ్డానికే అది! తక్కువ రీఛార్జ్‌తో గడిచిపోతుంది
ఒకరోజు ఆమె, తన అక్క వరాలమ్మతో మాట్లాడుతున్నదట. “ఏమిటి సుందరీ విశేషాలు?” – అంటే “ఏం లేదు అక్కా! పని, పాటు లేదు. రోజు గడవదు. కోడలు వండి పిలిచినప్పుడు వెళ్లి భోజనం చేయడం – అంతే” అన్నదిట.
కాసేపట్లో సునీల్ “అమ్మా! నువ్వు పెద్దమ్మతో ఏం మాట్లాడావు? మా గురించి గాని, సునీత, పారుల గురించి గాని, కామెంట్లు చేయకు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు” అన్నాడట.
అంటే సుందరమ్మ ఫోన్ పై నిఘా! Phone tapping చేస్తున్నారు. ఎంత హేయమైన పని!
సుందరమ్మ ఫోన్ కాస్తా సునీల్‌కు అప్పగించేసింది.
సునీల్ ఇల్లు తయారయి, వాళ్లు వాటా ఖాళీ చేసి వెళ్లిపోయేరు. సుందరమ్మ బాధపడింది. “ఇక్కడ దగ్గర్లో గుడికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉంటాను లెండి శాంతమ్మా” అంది.
ఒకటి రెండుసార్లు వచ్చింది. తర్వాత జాడలేదు.
శాంత ఓసారి పారూకి ఫోన్ చేసి “అత్తమ్మ బాగున్నారా పారూ” అని అడిగింది.
“వాళ్ల అక్క ఇంటికి వెళ్లింది” అని సమాధానం వచ్చింది
ఆహా ఏమి కుటుంబం! ఇదీ ఓ కుటుంబమేనా? విచిత్ర బంధాలు.
అందరూ ‘వసుధైవ కుటుంబం’ అంటూ ఉంటారు.
అంతా భ్రమయేనా? ఆదర్శాలు ఎప్పుడూ అందవా?
‘భార్య, భర్త, అత్తమామలు, అమ్మ నాన్న, ఇంకా ముందు తరాల వాళ్లు, బంధువర్గం, పిల్లలు – కలసి మెలసి అనురాగంతో ఉన్నది కదా కుటుంబం. అర్థాలు మారిపోతున్నాయా! కలికాలం’ అని కాసేపు బాధపడింది శాంత.