[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘విశ్వావసు గాంధర్వం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]


ఈ ఉగాదికి
కృత్రిమ మేధ
ప్రకృతి కవితలను అల్లింది.
వెలుగు తెరల అంతర్జాలం
మేలు కలయికల పండుగ
సంబరాలను చేసింది.
విద్యా, వివాహ ఉద్యోగ వ్యాపార శుభ యోగాల
సంవత్సర ఫలితాలకు
గ్రహ రాశులకు శాంతిని కలిగించగల
పూజా పాఠ జప తపాల నన్నింటిని
గూగుల్ గంటల పంచాంగం
కాల గుళికలననుసరించి
లెక్క తప్పని జ్యోతిషం ఒప్ప జెప్పింది.
మూడవతరం అమ్మాయిలకు
స్వేచ్ఛ లభించింది.
సమాన హక్కులు, సమ వస్త్రాలు,
కార్యాచరణలలో సర్వ సమర్థులు,
మాయా సాంగత్యాలకు పొరబడి
విధి ఆటకు పోవద్దని ముఖం చాటు
బ్రతుకు బొమ్మ హెచ్చరించింది.
అంతరిక్ష పథం నుండి
వ్యోమగామికి కనుపించిన
జగదేక సుందర భారతదేశం
సహజ వనరుల శిఖర పతాకం.
అంతరంగాల తీపి రుచితో
అనుభవాలను రంగరించి
మనిషి ప్రేమను పంచినప్పుడు
సాంకేతిక నగరాలకు
చిగురాకులు స్వాగతమిస్తాయి.
రహదారుల కాలి బాటలలో
నాటుకున్న
చెట్టుకొమ్మల నెక్కికోకిల
వేదఋషుల స్వరిత ఛందస్సుల ననుసరించి
విశ్వావసు గాంధర్వ గానాలను వినిపిస్తుంది.
