[విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ‘విశ్వావసు ఉగాది’ అనే శీర్షికతో పద్య కవితని అందిస్తున్నారు శ్రీ మాడుగుల మురళీధరశర్మ.]


చం.మా-1
నవనవ మాధురీ మృదుల
నవ్యవసంతపు హేల మ్రోలగా!
భువిపరిపూర్ణశోభలుగ
పూసినవృక్షపు కొమ్మరెమ్మలున్!
యవనికలై వెలుంగు నవ
యామిని విశ్వ వసూ యుగమ్ముగా!
ప్రవిమల షడ్రుచుల్ ప్రకృతి
భాస్కరతేజ విరాజమానమౌ!
ఉ.మా-2
క్రోధివరాంగిగా వరలి
కూర్మిని మార్పును జేయు భూమికై!
బాధయు సంతసమ్ములను
ప్రస్ఫుట రీతిని యేర్చి కూర్చుచున్!
సాధులు సంతులున్,ముదము
సాగిరి పుష్కర కుంభ మేళ; సం
బోధిత శాస్త్ర సంపదలు
పూర్ణత నిచ్చెను వీడుకోలుగన్!
శార్దూలం-3
భావోద్వేగము లన్నితీర్చు విధమున్
భాసిల్లు నీభారతిన్!
జీవావర్ణము చేవ పంచు గతిలో!
జీవాత్మ సంభావనల్!
రేవా తీరమునందు శుధ్ధినవగన్
లీలావిశాలాత్మగన్!
ఈ విశ్వావసు నిచ్చు శాంతి, సుఖముల్
ఈడేర్చు సత్కామనల్!
ఉ.మా-4
కోయిల కూయు మోసములు
కూసిన మాధురి కూత గాంచుమా!
వాయిస కూతలౌ కఠిన
వాక్కులు సత్య వివేక వర్ధనుల్!
కాయమనేక రూపముల
గాంచిన కూతలు ఖేద భేదముల్!
ప్రాయము మారువేళ పరి
పాలిత పాలక నిత్యశుభ్రతల్!
మత్తేభం-5
యుగముల్ మార్పును కోరుచుండును సదా
యోగ్యమ్మయోగ్యమ్మునై!
జగముల్ మారును చేవయంచు
సతమున్
జాజ్వల్యమౌ జాగృతిన్!
రగులున్ మానస చిత్త భ్రాంతి కరమై
రమ్యాతి రమ్యమ్ముగన్!
వగలౌ భాగ్య విధాత రాతలు భువిన్
విశ్వావసూ వీక్షణల్!
చం.మా-6
భగభగ మండుటెండలును
ప్రస్తుత భారత మాత నీడలో!
జగజగ వెల్గునిచ్చు తమ
జాగృతి యాన వికాస పంకజుల్!
ధగధగ శోభలొల్కు తమ
దైన సుశైలిని పెంచి పంచుచున్!
యుగయుగ ధర్మమై నిలిచి
యోగిత యోగ ప్రయోగ మోదిగన్!
సీసం-7
విశ్వవసూ నామ
విశ్వాస యుగముగా!
విశ్వావసూ వచ్చె
వినయ శీలి!
సధ్ధర్మ రక్షిగా
సామాన్య జనులెల్ల!
సంతసమ్మునునొందు
సాధు శీలి!
క్రోధాగ్ని జ్వాలలన్
కూకటి వేళ్ళతో!
ద్రుంచగా నెంచుచు
దూరిపోయె!
క్రోధికి వీడ్కోలు
కొంగ్రొత్త రీతిగా!
విశ్వావసూ వచ్చె
వేడ్కమీర!
తే.గీ.
ఇట్లు అరిషడ్వర్గములు
ఈప్సితమున!
శాంతి సౌభాగ్య సౌఖ్యాల
సంపదలను!
పంచు నవ యుగాదిగవచ్చె
ప్రజల కొరకు!
స్వాగతమ్ము విశ్వావసూ
స్వాగతమ్ము!
ఉ.మా-8
మానవ మానసమ్ములను
మార్పునుఁగోరు సనాతనమ్ముగా!
తానుగ నూత్న వత్సరము
ధర్మ విరాజితమైన రీతిలో!
పూనిక తోడు ప్రాకృతిక
భూషి వసంతపు శోభ
పంచుచున్!
మానవ మానవీయకర
మంజుల తత్త్వము నింపు మెల్లెడన్!