హన్మకొండ చౌరస్తా.. అది లోకల్ బస్‌స్టాండు సర్కిల్ వద్ద సుభాష్ చంద్రబోసు విగ్రహానికి ఎదురుగా ‘లక్ష్మీ కూరగాయల దుకాణం’. ఉదయం, సాయంత్రం రెండుపూటలా.. బెల్లం చుట్టూ ఈగల్లా జనం దుకాణాన్ని ముసురుకుంటూంటారు. అందులో విద్యార్థుల సంఖ్య మరీ అధికం. లక్ష్మీ దుకాణం ఒక సంతలా ఉంటే.. దాని పక్కనే.. మరో కృష్ణ కూరగాయల దుకాణం వెల, వెలా పోతూ.. ఉండేలు దెబ్బ తగిలిన పిట్టలా విల, లాడుతూ.. ఉంటుంది. కృష్ణకు ఈగలు తోలుకోవడమే పని. దీనికి బలమైన కారణం లేకపోలేదు. కస్టమర్లు లక్ష్మీ దుకాణంలో కూరగాయలు కొంటే అదనపు లాభాలు అధికం. అదే కృష్ణ దుకాణంలో.. అదనపు లాభం అటుంచి, అధిక ధరలు కూడానూ.
లక్ష్మీ కూరగాయల దుకాణం అంటే హన్మకొండలో అందరికీ అభిమానం. ఆమె చూపించే మర్యాదలే అందుకు తార్కాణం. లక్ష్మీ దుకాణంలో గల్లాపెట్టె మీద కూర్చోని ఉంటుంది. ఆమె ఇరువురు కొడుకులు కూరగాయలు తూకం వేయడం.. ప్రతీ కస్టమర్‌కి ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట, ఒక కరివేపాకు కట్ట పూర్తిగా ఉచితంగా పంచడం రివాజు. అడిగితే కాదనకుండా అర్ధరూయి బిల్లంత అల్లం ముక్క గూడా ఉచితంగా జత చేసి, ప్యాక్ చేసి ఇవ్వడం.. డబ్బులు లక్ష్మికి అందజేయడం.. అవసరమైతే ఆమె చిల్లర తిరిగి ఇవ్వడం లాంటి వారి కదలికలను చూస్తుంటే చూడ ముచ్చటేస్తుంది. ఆ పనిని వారు అత్యంత వేగంగా, సమర్థ వంతంగా నిర్వహిస్తుంటారు. అందుకే ఎంత రద్దీ ఉన్నా ఆలస్యమవదులే.. అనే ధీమాతో కస్టమర్లు దుకాణానికి రావడం మానరు.
మురహరికి ఆదుకాణంతో దాదాపు రెండు సంవత్సరాలుగా అనుబంధం వుంది. పావుకిలో కూరగాయలు కొన్నా.. ఉచితంగా పంచడం విస్తుపోయే వాడు. అలా చెయ్యడంలో వారు నష్టపోవడం లేదా! అనే అనుమానం అతని మదిలో అలజడి చేసేది.
ఒకరోజు ఆదివారం మద్యాహ్నం రద్దీ లేని సమయంలో.. “అమ్మా! మీరు ఇలా ఉచితంగా కొత్తిమీర, పుదీన, కరివేపాకు ఇవ్వడం మూలాన నష్టం రాదా..!” అంటూ ఎంతో వినయంగా అడిగాడు మురహరి.
అందుకు ఆమె చిరునవ్వు నవ్వుతూ తమ వ్యాపార లెక్కలు వివరించింది.
“నేను వరంగల్ హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు ఆకు కూరలు కొనుగోలు చేస్తాను. ఉదాహరణకి ఒక వ్యాపారి వెయ్యి రూపాయల సరుకు తెచ్చి అమ్ముతూ నాలుగు వందల రూపాయల లాభం చూసుకుంటాడు అనుకుందాం. అంత లాభం నాకు వద్దనుకొని నేను కొంత కస్టమర్లకి పంచుతున్నాను. నేను కొత్తిమీర, పుదీన, కరివేపాకు, అల్లం ముక్క ఉచితంగా పంచడం మూలాన వంద రూపాయలు కోల్పోతాను. అంటే నా లాభం మూడు వందలు. కాని అలా అదనంగా ఇవ్వడం మూలాన కొనుగోలుదార్లను ఆకర్శించి నేను అయిదువేల రూపాయల వ్యాపారం చేయగలుగుతున్నాను. అంటే ప్రతీ రోజూ దాదాపు పదిహేనువందల రూపాయల లాభం. నెలకు నలభై ఐదు వేలు..”
నోరు తెరిచాడు మురహరి. ఆవిడ తెలివి తేటలకి మనసులో జోహార్లు సమర్పించుకున్నాడు. ఈ రహస్యం కృష్ణకు చెప్పాలని అతని మనసు తహ, తహలాడుతూ .. కడుపు ఉబ్బిపోసాగింది.
ఆ సాయంత్రమే కృష్ణ దుకాణానికి పరుగెత్తాడు. కృష్ణతో మాటలు కదుపుతూ.. నెమ్మదిగా లక్ష్మీ వ్యాపార రహస్యం చెప్పి కడుపులోని భారాన్ని దించుకున్నాదు మురహరి.
“సార్.. అలా మస్కా కొట్టి జనాలను ఆకర్శించడం నా వల్ల కాలేదు. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ నేనూ ప్రయత్నించి నష్టపోయాను. అప్పటి నుండి నా పరిధిలో నేను వ్యాపారం చేసుకుంటూ వున్నాను. అది స్థల మహిమ. ఒకవేళ మరీ నష్టాలు వస్తే దుకాణం అమ్ముకుంటాను గాని అలా చీప్ జిమ్మిక్స్ వాడను” అన్నాడు. అతడి తెలివి తక్కువతనానికి నవ్వాలో, ఏడవాలో అర్థంగాక . వాడి ఖర్మ అని మనసులో తిట్టుకున్నాడు.
మరో ఆలోచన కూడా మురహరి మది లోకి రాక పోలేదు. ఆ ప్రాంతంలో మరో దుకాణమూ దొరకదు. రెండు దుకాణాలున్నాక మరో దుకాణం పెట్టడమూ దండగ. కనుక కృష్ణ దుకాణాన్ని కొనుగోలు చేసి లక్ష్మీ చెప్పిన వ్యాపార సూత్రాన్ని అమలు పరిస్తే లాభాలే.. లాభాలు. ఒక ప్రైవేటు కంపెనీలో.. ‘గొర్రె తోక బెత్తెడే‘ అన్నట్టు.. ఎదుగూ, బొదుగూ లేని పార్ట్ టైం జాబ్ చేస్తున్న తను జీవితంలలో స్థిరపడవచ్చని కలలుగన్నాడు. ఆఫీసులో కుదురుగా అతని బడ్జెట్ లెక్కలు వేసుకుని కృష్ణ దుకాణం కొనాలని తీర్మానించుకున్నాడు.
***
మరునాడు మురహరి ఆఫీసులో పనుల ఒత్తిడి వల్ల చాలా ఆలస్యమయ్యింది. రాత్రి దాదాపు పది దాటింది. చలికాలం.. అర్థరాత్రి దాటినట్లు అనుభూతి కలుగుతోంది. అతను ఇంటికి వెళ్లే దారిలోనే లక్ష్మీ కూరగాయల దుకాణం. వాస్తవానికి ఆసమయానికి దుకాణాలు కట్టేయాలి. కాని కృష్ణ దుకాణం నుండి కూరగాయలు ఆమె కొడుకులిరువురు లక్ష్మీ దుకాణానికి తరలిస్తూండడం చూశాడు.
పాపం! కృష్ణ గత్యంతరం లేక లక్ష్మీ వాళ్ళకే తన దుకాణం అమ్ముకున్నాడనుకున్నాడు మురహరి. ఆ అవకాశం అతనికి దక్కనందుకు మనసులో తెగ బాధ పడ్డాడు. అయినా ఫరవా లేదు. కృష్ణ దుకాణాన్ని అద్దెకు తీసుకుంటే సరి అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు.
ఇంతలో ముగ్గురూ ఒక దగ్గరికి చేరి ఏదో గుస, గుస లాడుకోవడం మురహరికి ఆసక్తి రేకెత్తించింది. కృష్ణ ఎంతకు బేరం కుదుర్చుకున్నాడో..! తెలుసుకుందామన్నట్లుగా.. వాళ్ల మాటలు చాటుగా వినడానికి ప్రయత్నించాడు. కాని అతని పని ‘చెవిటి వాని ముందు శంఖమూదినట్టు’గానే అయింది. ఏమీ వినరావటం లేదు. కడుపులో ఎలుకలు పరుగెడుతుంటే నిరాశగా అతని గదికి దారి తీశాడు.
తెల్లవారుతూనే.. ఆదుర్దాగా కృష్ణ కూరగాయల దుకాణం అద్దె విషయమ ఆరా తీద్దామని పరుగు తీశాదు మురహరి.. దుకాణాలు యథాతథంగా తీసి ఉన్నాయి. వ్యాపారాలలో మార్పులేదు. అతనికి ఆశ్చర్యమేసింది. ‘దీని భావమేమి తిరుమలేశా!’ అంటూ అతని మనసు పరి, పరి విధాల వ్యాకులత పడసాగింది.
లక్ష్మీ చిన్న కొడుకు ప్రసాద్‌తో మురహరికి కాస్తా చనువెక్కువ. ప్రసాద్‌ని ప్రసన్నం చేసుకొని విషయం లాగాలనుకున్నాడు. మధ్యాహ్నమయితే షాపులో కాస్తా రద్దీ తక్కువ ఉంటుందని ఆరోజు ఆఫీసుకు సగం దినం సెలవు పెట్టి లక్ష్మీ కూరగాయల దుకాణానికి వడి, వడిగా వెళ్ళాడు.
పథకం ప్రకారం ప్రసాదును బుట్టలో వేసుకున్నాడు.
బస్‌స్టాండు సర్కిల్ లోని అమ్జద్ కేఫ్‌కు ఇద్దరు కలిసి వెళ్ళారు. టీ తాగుతూ నింపాదిగా విషయం కదిలించాడు మురహరి.
“కృష్ణ దుకాణం మీరు కొనలేదా?” అంటూ నెమ్మదిగా అడిగాడు.
“మరో దుకాణం మేము కొనడమా!” అంటూ నివ్వెర పోయాడు ప్రసాద్.
“రాత్రి మీరు అతడి షాపులోని కూరగాయలన్నీ మీ షాపులోనికి మారుస్తుంటే చూశాను. ఆ షాపు మీరు కొన్నారనుకున్నాను” అంటూ మురహరి బిక్కమొహం వేశాడు.
నిండు నీళ్ళ కుండ నేల మీద పడి పగిలినట్లు భళ్ళున నవ్వాడు ప్రసాద్. ‘ఎక్కడైనా మామా అను గానీ.. వంగ తోట కాడ కాదు సుమా..!’ అన్నట్టు అసలు విషయం దాట వేశాడు. మురహరి అవాక్కయ్యాడు.
కృష్ణ అతని పెద్ద అన్నయ్యని తెలిసినా.. పెళ్ళి చేసుకొని వేరే కాపురం పెడితే వ్యాపారాలు కూడా వేరే అని అందరూ అనుకోవాలనీ.. వాళ్ళంతా కూడబలుక్కొని ఇలా ఉమ్మడి వ్యాపారం సాగిస్తున్నారని… మరెవ్వరూ మరో దుకాణం దరిదాపుల్లో తెరిచే సాహాసం చెయ్యకుండా.. ఈ ఉచిత వ్యాపార సూత్రం గూడా కృష్ణదేనన్న విషయం చెప్పలేదు ప్రసాద్.
పరిచయం
పేరు: చెన్నూరి సుదర్శన్,
విద్య; ఎం.ఎస్సి, ఎం.ఫిల్ ( గణితశాస్త్రం),
DAST ( Diploma in Advanced Software Technology – CMC)
పుట్టిన తేది: 18-08-1952 ( 69 సం.లు)
తల్లి దండ్రులు: చెన్నూరి లక్శ్మి, చెన్నూరి లక్శ్మయ్య.
పుట్టిన స్థలం: హుజురాబాదు (అమ్మమ్మగారిల్లు) కరీంనగర్ జిల్లా
స్వస్థలం: ములుగు, ములుగు జిల్లా.
ఉద్యోగం: 1976-1982 టెలీఫోన్ ఆపరేటర్
1982-2008 జూనియర్ లెక్చరర్ (గణితశాస్త్రం)
2008-2010 ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగునూరు, సిద్దిపేట
2010 ఆగష్టు – పదవీ విరమణ.
అభిరుచులు: చిత్రలేఖనం, కార్టూన్లు గీయడం, సుద్దముక్కలపై శిల్పాలు, సూక్ష్మ కళ, రచనావ్యాసాంగం
రచనలు: దాదాపు 120 కథలు, 50 కార్టూన్లు, 100 కవితలు.
ప్రచురణలు: 1. ఎంసెట్-ప్రశ్నావళి (తెలుగు, ఆంగ్లమాధ్యమం) 2. ఝాన్సీ, హెచ్.ఎం (కథల సంపుటి) 3. మహాప్రస్థానం (కథానికల సంపుటి) 4. జీవన చిత్రం (ఆత్మకథ) 5. ప్రకృతిమాత ( పిల్లల కథలు) 6. జీవన గతులు ( కథా సంపుటి) 7. జర్నీ ఆఫ్ ఏ టీచర్ (నవల) ధారావహికంగా ‘అచ్చంగా తెలుగు’ మాస పత్రికలో వస్తోంది. 8. అనసూయ ఆరాటం (తెలంగాణ మాండలికంలో నవల)
9. అమ్మ ఒడి (కథా సంపుటి) 10. రామచిలుక (పిల్లల కథలు) ప్రచురణలో ఉన్నాయి.
మెప్పుకోలు: 1. ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ’ (2008). 2. బెస్ట్ టెలీఫోన్ ఆపరేటర్ (1977).
3. వాలీ బాల్, బాల్ బ్యాట్మింటన్, కేరమ్స్ ఆటలలో జిల్లాస్థాయిలో బహుమతులు.
4. “యువ కవి” ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ములుగులో సన్మానం
5. “హాస్య కవి” శ్రీ కరణం రాంచంద్రం మాజీ విద్యాశాఖామాత్యులతో సంగారెడ్డి లో ‘వృషనామ’ ఉగాది పండుగ(25-03-2001) సందర్భంగా సన్మానం.
పలు కార్టూన్లకు.. కథలకు బహుమతులు. శ్రీవాకాటి పాండురంగారావు స్మారక అవార్డు.
6. యాదగిరి టీవీ. చ్ఛానల్లో ‘సాహితీ సౌరభాలు’ కార్యక్రమంలో నా ఇంటర్వ్యూ ప్రసారం.
7. పలు కథలు రేడియోలలో.. ప్రసారం. ‘పోటువ’ కథ పై సమీక్ష సి.వి.ఆర్. టీ.వీ.లో..
8. గిడుగు రామమూర్తి పంతులు సాహితీ పురస్కారం
ప్రస్తుత చిరునామా: చెన్నూరి సుదర్శన్.
1-1-21/19, ప్లాట్ # 5, రోడ్ #1, శ్రీ సాయి లక్ష్మీ శోభా నిలయం,
రాంనరేష్ నగర్, హైదర్‌నగర్,
హైద్రాబాదు- 500 085 (తె.రా.)
చరవాణి : 94405 58748
email: sudarshan.chennoori@gmail.com