మహదేవ మంగళం:
వేపంజేరి లక్ష్మీనారాయణ స్వామి దర్శనానంతరం అక్కడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వున్న మహదేవ మంగళం చేరాము. ఇది గంగాధర నెల్లూరు మండలంలో వున్నది. ఇక్కడ 500 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన వేణుగోపాలస్వామి ఆలయం, శనైశ్చరాలయం పక్క పక్కనే వున్నాయి. రెండు ఆలయాలు ఒక మోస్తరుగా పెద్దవే. శుభ్రంగా, ప్రశాంతంగా వున్నాయి. జనాలు లేరు.


వేణుగోపాలస్వామి ఆలయం పురాతనమైనదని చెప్పానుకదా. దానిలో 65 సంవత్సరాల క్రితం కృష్ణానంద స్వామి అనే ఆయన అఖండ దీపం వెలిగించారుట. అప్పటినుంచీ ఆ జ్యోతి అలాగే వెలుగుతోంది.


ఫిబ్రవరి నెలలో స్వామి కళ్యాణం, గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ కార్యక్రమాలకి విశేషంగా జనం వస్తారు. పూర్వం పైన కొండ మీద ఆలయం వుండేదిట. బహుశా అది 500 సంవత్సరాల క్రితం ఆలయమయి వుండవచ్చు. కింద ఆలయం కొత్తగా వున్నది. అది శిథిలమైతే కింద కట్టించారుట. అందుకే ఆలయం నవీనంగా వున్నది. ఒక పెద్దావిడ వున్నారు ఆలయంలో. స్వామికి హారతి ఇచ్చి, తీర్థం, ప్రసాదం ఇచ్చారు. ఆవిడకి తెలిసిన వివరాలు చెప్పారు.




సంతానం, పెళ్ళి, ఆరోగ్యం మొదలైన కోరికలు వున్నవారు అఖండంలో నూనె పోసి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయిట.
శనీశ్వరాలయం:
పక్కనే శనీశ్వరాలయం వున్నది. ఇది కూడా పెద్దదే. శుభ్రంగా వున్నది. అన్నింటికన్నా ఎక్కువ ఆకర్షించింది ఆలయాల పరిశుభ్రత. మేము వెళ్ళినపుడు సాయంత్రం 6 గంటలయింది. భక్తులు ఎవరూ లేరు. మేమే అంత ప్రశాంతంగా, పరిశుభ్రంగా వున్న ఆలయ ప్రాంగణాల్లో కొంచెంసేపు తిరిగి అక్కడనుండి బయల్దేరి అక్కడికి 20 కి.మీ. ల దూరంలో వున్న చిత్తూరు చేరాము.




ఈ రోజుకి ఇంక యాత్ర చాలనుకున్నాము. బాగా అలసిపోయాంకదా, పొద్దున్ననుంచి తిరిగి.

శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.