[శ్రీ సారధి మోటమఱ్ఱి రచించిన ‘2024: శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ఆకసాన్ని అంటే ఆశలు
మనిషి మనసులో నిరాశలు…
మనిషి మనిషిపై అపోహలు –
మనిషి మనసులో చీకటి పొరలు…
అయిన వారిపై తేనెల జల్లులు
నడుమ నడుమ అల్లరి మాటలు…
కాని వారిపై క్రోధ జ్వాలలు
ఎచట చూసిన అసూయ అలలు…
పుడమి పై వెన్నెల లేదే ఎచట?
కొండపై వాగు నిలిచే దెక్కడ??
కోనేటిలో నింగినందే అల ఉండదే –
కడలిలో అలల దాటి కాచేదెట్ల!?
నీ హృదిలో చలువను చూడవదే?
నీ భృకిటి శక్తిని నిలదీసి –
ఆశల, అపోహాల, అసూయల క్రోధిని –
బూడిద చేయవోయ్ – వెలిగే ఉగాదికై!!

ఏకీకృత భావనతో వీక్షించ గలిగితే – ప్రకృతి అంతా, భిన్న విజ్ఞానాల సమాహారమేనని; కళల మరియు శాస్త్రీయ శాలలు, వేరు వేరు కాదని; వాటి అభేద భావనయే – జ్ఞానానికి పరాకాష్టయని – మోటమర్రి సారధి ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఒక కవిత వ్రాయంలో, ఒక వంతెన నిర్మించడంలో లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం సృజించడంలో – భేదాలు తనకెప్పుడూ అగపడలేదంటారు.
మనుషులు, మనుషుల తత్వాలు; కొండలు, కోనలు; నదులు, సముద్రాలు; వినీలాకాశం, నిర్మలత్వం – ఇవన్నీ ఆయనకు ప్రేరణ కలిగించేవే. మానవజాతిని ఉన్నత స్థితికి కొనిపోవాలని, అత్యున్నత సాహితీ సంపదను, మనకందించిన, ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలందరికీ, మనమెంతో ఋణపడి ఉన్నామని అభిప్రాయపడతారు.
మానవజాతి చరితను క్లుప్తంగా క్రోడీకరించిన, స్వామి వివేకానంద, ఈ నాలుగు మాటలు, తననెంతో ప్రభావితం చేశాయని చెబుతారు:
“మనిషి అడుగు వేసినప్పుడు, ముందుకు పోయేది – మెదటి కంటే, అతని ఉదరమే (ఆకలి)! ఉదరాన్ని (ఆకలిని) దాటి, మానవజాతి ముందుకు అడుగు వెయ్యడానికి, యుగాలు పట్టవచ్చు.”