చిన్నప్పటినుండీ పౌరాణిక సినిమాలు అంటే ‘మహా భారతం’కి సంబంధించినవి చూసినప్పుడూ, లేదా తెలుగు క్లాస్ పాఠాల్లో భారతం వచ్చినప్పుడూ ధృతరాష్ట్ర ప్రేమ అనే మాట మరీ మరీ విని ఉంటారందరూ. దృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంలో పడి బుర్రతో సహా గుడ్డివాడై, తమ్ముడి పిల్లలని మాత్సర్యంతో సమాదరించలేక ప్రియపుత్రుల చావుకు కారణమై కౌరవ వంశాన్ని నాశనం చేసుకున్నాడని అది తగదని మనం అందరమూ విని ఉన్నాం. ఈ ఎరుకతో జీవితాన్ని గడిపే కొందరికి అనుకోకుండానే కళ్ళకి పొరలు అడ్డం పడకుండా ఉండే ఉచితజ్ఞత వస్తుంది. ఒక జాగరూకత వారి మనసులో వాచ్ డాగ్‌లా కూర్చుని ఉంటుంది.
దానివల్ల సంతానంపై అధికమైన మోహం ఉంటే పిల్లల తప్పొప్పులను సరిదిద్దలేని నిస్సహాయతలో పడతాం అన్న నీతి చాలామంది మెదళ్లలో నిక్షిప్తమై పోయి ఉంటుంది. అంచేత వారి ప్రవర్తన ఎప్పుడూ క్లాసులో బెత్తం పట్టుకున్న మాస్టారిలా ఉంటుంది. ఇది కొంచెం కుటుంబ సభ్యులకు విపరీతంగా కూడా తోస్తుంది. వారికి ఫామిలీ లోని సభ్యులపై ఆట్టే ప్రేమ లేదనీ, వారివి కరకు మనసులనీ పేరు తెచ్చుకుంటారు, ఇలాంటి వారు రాతి మనుషులని కూడా అపఖ్యాతి పొందుతారు. అయినా వారు నిబ్బరంగా అలాగే ఉంటారు తప్ప మారరు.
గమనించండి, కొందరు పిల్లల విషయంలో భార్యాభర్తలిద్దరూ సంపూర్ణంగా గుడ్డివారైపోతుంటారు. వాళ్ళ కళ్ళకి అధిక ప్రేమ అనే పొర అడ్డం పడుతూ ఉంటుంది. ఆ పొర అబ్బాయైతే తల్లికి రెండు రెట్లు గానూ అమ్మాయైతే తండ్రికి మూడు రెట్లు గానూ ఉంటుంది. తండ్రి కొడుకును కోప్పడుతూంటే తల్లి అడ్డం పడి రక్షిస్తుంది. తల్లి కూతురును సరిదిద్దబోతే తండ్రి తల్లిని కోప్పడతాడు. కొడుకు ఎక్కడికైనా వెళితే తల్లికి చెబుతాడు. కూతురు పార్టీలకి తండ్రి పర్మిషన్ పొంది తల్లికి తలెగరేస్తుంది. భార్యాభర్తలిద్దరూ తమ అధికమైన ప్రేమలతో గొడవపడుతూ ఉంటారు పిల్లల విషయమై.
వివేచనా జ్ఞానం లేని తల్లితండ్రులకి చదువులో కానీ ఇతర విషయాల్లో కానీ ఇతరుల పిల్లల ఉన్నతి ఈర్ష్యా జనకం అవ్వడం చూస్తుంటాం. అలా కాకుండా తమ పిల్లలకి వారిని చూపించి ప్రోత్సహించే తత్వం ఉంటే అది మంచి తల్లితండ్రులు కర్తవ్యం అవుతుంది. చాల కుటుంబాల్లో పిల్లలకి చదువులు సరిగా రాకపోవడానికి గట్టిగ మందలించలేని పేరెంట్స్ అశక్తత ఒక కారణం.
పిల్లలు లావైపోతున్నారనీ, డాక్టర్ చెప్పాడనీ భార్యాభర్తలిద్దరూ పిల్లలకి ఐస్‌క్రీమ్‌లూ, పేస్ట్రీలు పెట్టొద్దని ఒట్టేసుకుంటారు. అతిశయించిన ప్రేమతో భార్యకి తెలీకుండా భర్తా, భర్తకి తెలీకుండా భార్యా పిల్లలకి చాటుగా ఐస్‌క్రీమ్‌లు, కాడ్బరీలు తెచ్చి పెడుతుంటారు. ఇలా దంపతులిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకుంటారు. అది బాధ్యత రాహిత్యం అని కాక సహజ ప్రేమ అని వారు మురిసిపోతుంటారు. పిల్లల్ని భయభక్తుల్లో పెట్టడం, వారికిష్టమైనవి ఆరోగ్యానికి హాని అంటూ పెట్టడం మానెయ్యడం ప్రేమరాహిత్యం అని ఇలాంటి వారు మనసులో భావిస్తుంటారు.
పండితులు ‘రాగం అనేది ఉద్వేగానికి సంబంధించింది. అది వద్దు. పిల్లలపై ప్రేమ చూపించండి’ అంటుంటారు. ఈ రాగం అనేది గుడ్డిప్రేమ వల్ల వస్తుంది. తమ పిల్లలు ఏం చేసినా అది ఎంతో సవ్యంగానూ ఇతర పిల్లలు ఏం చేసినా అపసవ్యం గానూ కనబడడం మానసిక దృష్టి దోషం తప్ప మరొకటి కాదు. మా ఫ్రెండ్ సీత తన పదేళ్ల చిన్న కొడుకుని నిరంతరం వెనకేసుకొస్తూ భర్తని కూడా పిల్లాడిని ఏమీ అననిచ్చేది కాదు. వాడు గారాబం ఎక్కువై బీటెక్ పరీక్షలు మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడామె ‘వాడికి నాలెడ్జి ఉందిలెండి, పరీక్ష రాయకపోతే ఏమయ్యింది?’ అంటూ ఉండేది. పెద్దాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకున్నాడు. చిన్నవాడు వయసు మీరి ఉద్యోగం, పెళ్ళీ లేకుండా ఉన్నాడు.
ఈ ప్రేమ స్వప్రేమకి కూడా వర్తిస్తుంది. పాతికేళ్ల హీరోయిన్ నుంచి అరవయ్యేళ్లు దాటిన ప్రఖ్యాత సీనియర్ మహిళలు కూడా ఇంటర్వ్యూల్లో తరచుగా “ నేను చాలా అమాయకంగా అందరినీ నమ్మేసి బాధపడుతూ ఉంటాను. ఏంటో ఈ ప్రపంచం అంతా చాలా దుర్మార్గంగా ఉంటుంది. నా అంత మంచిగా ఎవరూ ఆలోచించరు. నేనొక్కదాన్నే నిష్కల్మషంగా ఉంటాను. లోకం అంతా అలా ఎందుకుండదు?” అంటూ వాపోతూ ఉంటారు. (నిజానికి ఎవరూ అమాయకంగా ఉండరు. మూడేళ్ళ పిల్లకి కూడా తనకి కావాల్సిన చాకోలెట్ ఎవరిని అడగాలి అన్న విషయంలో చాకచక్యం ఉంటుంది. స్వతహాగా కొందరు అతి తెలివిగా ఉంటారు. కొందరు సాధారణ తెలివితో ఉంటారు. అంతే.) ఇది కూడా ఒకరకమైన దృతరాష్ట్ర ప్రేమే వారి పట్ల వారికి. ఫలానా వ్యక్తులు చాలా అమాయకులు అని ఇతరులు అనుకోవాలి కానీ మనం కాదు. మన జీవన పధ్ధతి, ప్రవర్తన ఎదుటివారికి అలా అనిపించాలి తప్ప మనల్ని మనం జడ్జ్ చేసుకుంటే అపహాస్యం పాలవుతాం. ప్రపంచానికి మనల్ని మనం అడాప్ట్ చేసుకునే క్రమంలో మనకున్న అనుభవాన్ని బట్టి మనం చూపిన గడసరితనం, లాభసూటితనం మనం గుర్తించకపోయినా ఎదుటివారికి కనబడొచ్చుకదా. అంచేత సెల్ఫ్ పీటీ ఎంత తక్కువ ఉంటే మనకి అంత మనశ్శాంతి ఉంటుంది. ఇతరులకి మనపై గౌరవం ఉంటుంది.
అనేకమంది మగాళ్ళకి తమకున్న వాదనా పటిమనంతా ఉపయోగిస్తూ ప్రపంచంలోని మనుషుల్ని విమర్శించాలంటే ఎక్కడలేని వెర్రి ఉత్సాహం ఉంటుంది. ఇంట్లో భార్యని అలా కాదు ఇలా అనే సాహసం మాత్రం చెయ్యరు. అసలావిడ జోలికే పోరు. అది కూడా గుడ్డి ప్రేమే. భార్యలకు భర్తలపై అలాంటి అతి ప్రేమ సాధారణంగా ఉండదు. వాళ్ళు నిర్భయంగా భర్తలను విమర్శిస్తుంటారు అవసరమైతే ఇతరులతో పోల్చికూడా నాలుగు విసుర్లు వేస్తుంటారు.
పరమ గయ్యాళిగా ఊరూ వాడా ప్రసిద్ధికెక్కిన స్త్రీ గారి భర్త మాత్రం ‘మా ఆవిడకి కాస్త నోరు పెద్దది కానీ మనసు మంచిది’ అంటూ ఉంటాడు నా భార్యే కదా అన్న అధిక ప్రేమ వల్ల. అలా కాకుండా ఆవిడ అతిగా ప్రవర్తించకుండా మొదటినుండీ అతను కాస్త జాగ్రత్త వహిస్తూ ఉంటే ఆవిడలా నోరు గలావిడగా ప్రఖ్యాతి గడించేది కాదు కదా. ఆఫీస్ సమయం దాటాక కూడా నా భర్త ఆఫీస్ పని ఎందుకు చేస్తున్నాడన్న ఆరా ఆవిడ తీసుకోకుండా మా వారి ఆఫీస్‌లో ఈయనొక్కడే పనిమంతుడు అన్న అంధ ప్రేమలో ఆవిడ పడిందనుకోండి. చీటికీ మాటికీ ఆయన తెచ్చే గిఫ్ట్ లకి ఆవిడ అతిప్రేమతో మురిసిందనుకోండి. తర్వాత పరిణామాలు వేరుగా ఉండొచ్చు. అప్పుడు వగచి లాభం ఉండదు.
సినీ నటుల అభిమానులు కూడా ఇలాంటి రుగ్మతకు లోనవుతుంటారు. వారికొక హీరో/హీరోయిన్ నచ్చితే మిగిలిన హీరో/హీరోయిన్లకు అందం లేదు, నటన రాదనే మూర్ఖత్వంలో పడతారు. ప్రతి హీరోయిన్/హీరోలో అందమూ, నటన ఎంతో కొంత ఉండకపోతే వారా స్థాయిలో ఉండరన్న కామన్ సెన్స్ పోగుట్టుకుంటారు దురభిమానం వల్ల.
కొందరికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం ఉంటుంది. ఇక అతను చేసే అవినీతికీ, ఆశ్రితపక్షపాతానికీ, అవకతవకలకీ వీరు జవాబుదారీ వహిస్తూ “అవునండీ, రాజకీయంలో ఇవన్నీ తప్పవు. ఏం! అప్పుడు మీ అభిమాన నాయకుడు ఇంతకన్నా ఎక్కువ చెయ్యలేదా?” అంటూ దేశంలోని రాజకీయ మురికినంతా నెత్తికి రాసుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటారు. అలా ఆ అభిమానం విచక్షణా జ్ఞానాన్ని పోగొడుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఏదో ఒక ఉన్మాద ప్రేమలో పడకుండా జరుగుతున్న తప్పొప్పులను గమనిస్తూ జీవిక సాగించడం మంచిది అన్న ఇంగితం వదలకూడదు మనం.
మన కళ్ళకి ఈ గుడ్డిప్రేమ పొరలు కమ్మినపుడు ఎదురుగా ఉన్న విషయం స్వచ్ఛంగా, సహజంగా కనబడదు. ఆ విషయచిత్రం రూపు మార్చుకుని మరొకలా కనబడుతుంది. ఈ యుక్తాయుక్త వివేకం కలిగి ఉండడం అందరికీ మంచిది. మనల్ని మనం అప్పుడప్పుడూ, మన వారి పట్ల (జీవిత భాగస్వామి కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇతరేతర అభిమాన ప్రముఖులు కావచ్చు) నిష్పక్షపాతంగా ఉంటున్నామా? లేక ఏదొక ప్రలోభంలో పడి గుడ్డివారం అవుతున్నామా? అన్నది స్కాన్ చేసుకుని, వచ్చిన రిపోర్ట్‌ను మంచి కళ్లద్దాలు పెట్టుకుని చూసుకుంటే అనేక ప్రమాదాల బారినుండి తప్పించుకున్నవారం అవుతాం.
మరీ అతి అనర్ధానికి దారి తీసేట్టుగా కాకపోయినా, తగుమోతాదులో నైనా ఈ గుడ్డిప్రేమ ఉండడం వల్లనే ఈ లోకం ఇలా నడుస్తూ ఉందేమో కూడా. ఏమో? మీరూ ఆలోచించండి.
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
*ఇది డా. వై. కామేశ్వరి, గుంటూరుగారి వ్యాఖ్య:* బాగుంది. నేను మా పిల్లలకు బెత్తం పట్టుకున్న మేస్టారీనే. Dr.Y.Kameswari..Guntur
*ఇది విజయలక్ష్మి, మల్కాజిగిరి గారి వ్యాఖ్య:* కాలమ్ చిన్నదైనా ఎన్ని ఒంపులు తిరిగి ఎన్ని వయ్యారాలు ఒలక బొసిందో మీ కలం..చాలా బావుంది.. విజయలక్ష్మి, మల్కాజిగిరి
*ఇది వెంకటరమణ, హైదరాబాద్ గారి వ్యాఖ్య:* చాలా అద్భుతంగా రాశారు. శుభాకాంక్షలు. అయితే మానవ స్వభావం లోని సంబంధబాంధవ్యాలు ఫలితంగా ఏర్పడే ప్రేమ అపరిమితంగానే ఉంటుంది. Venkatramana…Hyd
*ఇది కె.కృష్ణ, కొత్తపేట గారి వ్యాఖ్య:* సంచికలో మీ ధృతరాష్ట్ర ప్రేమలు most practical ఉంది. మా చుట్టాల్లో ఒకాయన ఒక్కతే కూతురని అతి వాత్సల్యoతో పెళ్ళైన కూతురి కాపురం చెడకొట్టీ తన దగ్గరే ఉంచుకున్నాడు. అందుకే విస్తృతమైనా పరిశీలనా పరిజ్ఞానంతో తో మీ article అన్నీ కోణాల్ని touch చేసిందని most practical అన్నాను. చాలా బాగుంది. 👍 K.Krishna..Kottapeta
కుటుంబాలలో కల్లోలం… పిల్లల అభివృద్ధికి నిరోధకం… సమకాలీన ప్రపంచాన్ని శాసిస్తూ… వివిధ రంగాలలో విలువల పతనానికి కారణమైన ‘ధృతరాష్ట్ర ప్రేమలు’… మీ కలం బలం లో బందీ అయాయి… మేడమ్! 🙏🏻
గౌరీలక్ష్మి గారి ధృత రాష్ట్ర ప్రేమ వ్యాసం బాగుంది. ఈ ప్రేమ ఆడ, మగ పిల్లల పెంపకంలో మగపిల్లలపట్ల ఉంటుంది. కూతురు పట్ల కోడలికి పోటీగా కూడా ఉంటుంది. అందుకే విచక్షణా జ్ఞానం ఉండాలి. రచయిత్రి కి అభినందనలు.
*ఇది జి. ప్రమీల… గుడివాడ గారి వ్యాఖ్య:* “గుడ్డి ప్రేమ గురించి గౌరీ లక్ష్మి గారు చాలా బాగా వ్రాశారు”… జి. ప్రమీల… గుడివాడ
ధృతరాష్ట్ర ప్రేమలు చాల బావుంది. వీరినిచదుతుంటె బీనా దేవి గారిని చదుతున్నట్లె.అలవోకగా సాగే శైలి,వాస్తవికత వ్యంగ్యం ,మంచి చురకలు.తిరిగి చదుకోవాల్సినవి.మనసు తేలికై పోతుంది.
*This is a comment by Mangataayru..Balanagar.* “Love always in different types..handling them is very sensitive..good column” Mangataayru..Balanagar
*ఇది వేణు, మంగళగిరి గారి వ్యాఖ్య:* గుడ్డి ప్రేమల గురించి కళ్ల కు కట్టినట్టు చూపించారు..అందరి కళ్లూ తెరిపించారు. వేణు, మంగళగిరి
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™