[డా. అమృతలత గారి ఆత్మకథ ‘నా ఏకాంత బృందగానం’ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు శ్రీమతి శీలా సుభద్రాదేవి.]
“If four things are followed – having a great aim, acquiring knowledge, hard work, and perseverance – then anything can be achieved.” – APJ Abdul Kalam
స్వాతంత్య్రానంతరం, రెండవ ప్రపంచయుద్ధం అనంతరం ప్రజాజీవనం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఆ సమయంలో జన్మించిన వారి బాల్యం అనేకానేక ఆటుపోట్లతోనే సాగింది.
సరిగ్గా అదే సమయంలోనే అమృతలత జన్మించారు. జక్రాన్‌పల్లికి దగ్గరగా పడకల్ లో పట్వారి ఇంట్లో ఆరో సంతానంగా పుట్టిన అల్లరి పిల్ల అమృతలత.
ఇక్కడినుండి తన జీవనగమనాన్ని అక్షరాలలో పరుచుకుంటూ పాదాలకి గుచ్చుకుని గాయం చేసిన ముళ్ళని ఆదరంగా తీసి తన వెనుక వచ్చేవారికి గుచ్చుకోకుండా మనసు పిన్ హోల్డర్‌లో దాచుకుంటూ, పడినప్పుడు మోకాళ్ళని గుండెల్నీ ఛిద్రం చేయ ప్రయత్నించిన రాళ్ళనీ ఏరుకుంటూ, పుంతలని సాపు చేసుకుంటూతన భవిష్యత్తును రాచబాట చేసుకోవటమే కాక తనవారినందరినీ చేయిపెట్టుకొని కష్టాలు కడలిని దాటించటానికి ప్రయత్నించిన సాహసి. అల్లరి పిల్ల అమృతలత బాల్య జ్ఞాపకాల్ని చదువుతున్న పాఠకుల హృదయాలను మీటుకుంటూ ఆనందభైరవి రాగంతో బృందగానం సాగుతోంది. ఆహ్లాదంగా సాగుతోన్న రాగంలో అంతలో చేతి గాయం ఒక అపశృతిలోకి తెగి తిరిగి ఆత్మవిశ్వాసంతో కొనసాగుతోంది.
తండ్రి మరణం, వైవాహిక జీవితంలో ఆటుపోట్లు అమృతలత జీవన రాగాన్ని అసావేరి రాగంలోకి మార్చి విషాదం గుండెల్ని చెమ్మగిల్లేలా చేస్తుంది. అంతలోనే అమృతలత గుండె ధైర్యాన్ని పుంజుకొని దృఢ వ్యక్తిత్వంతో తానే కాక తనవారిని సైతం వెన్నుతట్టి తన జీవన రాగాన్ని తిరిగి శృతి చేసి ఆహ్లాదకర సంగతులతో కళ్యాణి రాగంతో మైమరపింపజేసి తన కంటిపాప హిమచందన్కి కళ్యాణవేదికని అమరుస్తుంది.
చిన్ననాటి నుండి సాహిత్య,కళాభిరుచి గల అమృతలత, విద్యారంగంలోని ఒత్తిడి వలన సాహిత్యానికి దూరమౌతున్నానని భావించి ‘అమృత కిరణ్’ అనే పత్రికని రెండేళ్ళ పాటు నడిపారు. డబ్బూ, సమయం వెచ్చించినా పత్రికా నిర్వహణ అంత సులువేమీ కాదని భావించారు. పత్రికని నిలిపివేసిన అనంతరం విద్యాసంస్థల నిర్వహణ ఒత్తిడిలో సాహిత్యసృజనకు విరామం ప్రకటించేసినా వివిధ రంగాలలో కృషిచేసిన వ్యక్తులను ఎంపిక చేసి పదమూడేళ్ళకు పైగా రంగరంగ వైభవంగా ఒక పండుగలా సన్మానించి గౌరవిస్తూ, ఆత్మీయంగా స్నేహ సౌరభాలను అందిస్తూన్న ప్రతి అమృతమయ సంఘటననూ, ప్రతి సందర్భాన్ని అనేక ఫొటోలతో నమోదు చేసి జ్ఞాపకాల ఆల్బంగా ఏకాంత బృందగానాన్ని తీర్చిదిద్దటం అమృతలత కళాభినివేశానికీ, సాహిత్యాభిరుచికీ తార్కాణం.
అదృష్టవశాత్తూ ఆమెకు లభించిన గొప్ప భరోసా, ఆసరా ఆమె సహోదరులు.
అందుకే వివాహవిచ్ఛిత్తులను సైతం ధైర్యంగా అధిగమించి నిలదొక్కుకున్నారు. ఆ పరిస్థితులలో కూడా కుమార్తెకు తండ్రి లేనితనం తెలియకూడదని హిమచందన్కు చెందిన ప్రతి సందర్భంలోనూ తండ్రిని పిలిపించి కార్యక్రమాలు సక్రమంగా జరపడం అమృతలత మానసిక దృఢత్వానికి మచ్చుతునక. పాఠశాలలో జరిగే సృజనాత్మక వేడుకల్లో సైతం సాటి రచయిత్రులనూ, సినీరంగానికి చెందిన వారినీ సగౌరవంగా ఆహ్వానించి సత్కరించటం అమృతలత సహృదయ సాంప్రదాయం.
అమృతలత ఆధ్వర్యంలో జరిగే వేడుకలు అన్నింటినీ పొందుపరిచి ఒక క్రమపద్ధతిలో తన బృందగానంలో జతిస్వరాలుగా కూర్చారు. బాల్యంలోనే తల్లిని, కొంత పెరిగాక తండ్రినీ కోల్పోయినా, ఆర్థిక ఒడిదుడుకుల నుండి ఇప్పటివరకూ ఇన్ని మెట్లు ఎక్కేందుకు దృఢమైన ఆత్మవిశ్వాసంతో చేసిన జీవనపోరాటాన్ని ఏకాంత బృందగానం అంటూ సచిత్రంగా పాఠకుల ముందు ఆలపించారు.
ఆర్థిక పరిస్థితులు సరేసరి కాని ఆమెకు సంభవించిన ప్రమాదాలు పాఠకుల ఒళ్ళు జలదరింపజేస్తాయి. తుపాకి గుళ్ళ బ్లాస్ట్‌లో చేతివేళ్ళు పోగొట్టుకున్నా, ఆత్మన్యూనతకు గురికాకుండా తనని తాను వజ్రంలా చెక్కుకొంటూ అపురూప శిల్పంగా మారే క్రమమే ఏకాంత బృందగానం.
బాల్యం నుండీ తాను చేయిచేయి కలిపి నడిచిన స్నేహితురాళ్ళను, అడుగులలో, అడుగులు వేసి నడిపించిన బంధుజనాన్నీ, పలకరించిన, మాట కలిపిన, మనసు తెలిసిన ప్రతి వారిని గురించి తన గానంలో స్వరాల్ని చేసారు అమృతలత, వీరందరివీ సాధ్యమైనంత వరకు ఆనాటి ఫొటోలను కూడా సేకరించి చేర్చటంలో ఆమెకు గల అంకితభావం, అకుంఠిత దీక్ష వ్యక్తమౌతుంది.
బాలంనుండీ తన జీవనయానంలో కలిసిన వారందరిని కూడగట్టుకొని అమర్చటంలో ఆమె జ్ఞాపకశక్తి ఎంత అద్భుతమైనదో తెలుస్తోంది.
కాలేజీ రోజుల్లో అల్లిన కవితల్ని ఇందులో భాగంగా చేర్చి కూర్చారు. ప్రతి సందర్భంలో తాను కలసిన నాయకులను, సాహితీవేత్తలను, ప్రముఖులను గురించి ఉటంకించారు.
తన రచనలకు సంబంధించిన వివరాలే కాక బాల్యమిత్రులతో సహా తన జీవనయానంలోని ప్రతి సంఘటననూ, ప్రతి సందర్భాన్ని అనేక ఫొటోలతో నమోదుచేసి జ్ఞాపకాల ఆల్బంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, సుమారు యాభై అరవై ఏళ్ళ క్రితం ప్రజాజీవితంలో భాగమైన ఆనాటి పనిముట్లు, వాహనాలు, పాత్రలు, వంటలూ, వార్పులు మొదలైనవాటిని చిత్రకారులతో చిత్రాలు వేయించి ప్రతీ పేజీ నిండుగా పరచటం వలన యీ తరం వారికి పరిచయం అవుతాయి. కానీ అవి ఒక ప్రవాహవేగంతో బృందగానంలో లీనమై చదువుతున్న పాఠకులను కొంత దృష్టి మరల్చి వారి పఠనాన్ని ఆటంకపరుస్తుందేమోననిపించింది. అదే విధంగా రాసే క్రమంలో రాష్ట్రంలో దేశంలో జరిగిన అనేక సందర్భాలను, ఆనాటి నేతలను కూడా తన బృందగానంలో బంధించటం ఆమె నిబద్ధత.
తన సాహిత్యాన్ని, పత్రిక నిర్వహణను, అటుపోట్లుకి ఓర్చి స్థాపించిన వివిధ విద్యాసంస్థలను, ఒక అద్భుత అనుభూతి కారణంగా వెలయించిన అపురూప దేవాలయ నిర్మాణములోనూ తాను ఎదుర్కొన్న కష్టనష్టాలను సవివరంగా జీవనయనంలో వివరించారు.
ఒక అద్భుత అనుభూతి కారణంగానే వెలయించిన అపురూప వేంకటేశ్వర దేవాలయ నిర్మాణములోనూ ఆమె అనుభవాలను అక్షరబద్ధం చేసారు
‘నా ఏకాంత బృందగానం’ ఆవిష్కరణ సమావేశంలో ఈపుస్తకాన్ని అందుకొని ఇంటికి తెచ్చిన వెంటనే శీలా వీర్రాజుగారే ముందు చదివి నాకు ఇచ్చారు.


తదనంతరం నేను చదివి నా అభిప్రాయం పాయింట్లుగా రాసి వ్యాస రూపంలో రాయాలనుకుని పేపర్లు ఆ పుస్తకంలోనే పెట్టాను. అయితే, బైడింగ్ చేసేటప్పుడు కొన్ని పేజీలు మిస్ అయ్యాయని నేను తెలియజేస్తే అమృతలతగారు స్వయంగా మా ఇంటికి వచ్చి మేలు ప్రతిని అందజేసారు. మళ్ళా చదివి పూర్తి వ్యాసంగా రాయలనుకొని కూడా మా యింట్లో తదనంతర కాలంలో జరిగిన దుర్ఘటనల వలన మర్చిపోయాను.
ఇటీవల ఏకాంత బృందగానం చదవాలని తీస్తే పుస్తకంలోనే ఉన్న సగం రాసిన వ్యాసాన్ని ఇప్పటికైనా పూర్తి చేయాలని భావించి రాయటం మొదలుపెట్టాను. రెండోసారి చదువుతుంటే ఆమె తనను తానే తీర్చి దిద్దుకున్న అద్భుత శిల్పంగా గోచరించింది.
చిన్నచిన్న విషయాలకే ఒత్తిడికి గురై కృంగిపోతూ జీవితం విలువా, మానవ సంబంధాల విలువా, కౌటుంబిక జీవితం విలువా అవగాహన లేక అవాంఛిత నిర్ణయాలు తీసుకుంటున్న నేటి యువతరం చదవాల్సిన పుస్తకం ఈ ‘ఏకాంత బృందగానం’.
అబ్దుల్ కలాంగారు అన్నట్లు ఆమె స్వాప్నికురాలే. అయితే అబ్దుల్ కలాం గారి మాటలను అవగాహన చేసుకొని ‘కలలు కనటమేకాదు సాకారం చేసుకోవటానికి ఒక లక్ష్యాన్ని నిర్దేసించుకొని, దృఢసంకల్పంతో, అకుంఠిత దీక్షతో కృషిచేసినప్పుడు కన్న కలలు సాకారమౌతాయ’ని అన్నమాటల్ని ఆచరణలో పెట్టి అమృతలత తాను కన్న కలల్ని సాకారం చేసుకొన్న సాధకురాలు.
వ్యక్తిత్వం దృష్ట్యా లోహమహిళ అయిన అమృతలత హృదయం మాత్రం పేరుకు తగినట్లు అమృత పరిమళాలను వెదజల్లే సుమనోహర లతానికుంజము. ఆ స్నేహపరిమళాలు అలదుకొన్న వారిలో నేను కూడా వుండటం నాకు లభించిన గొప్ప బహుమతి.
అటువంటి స్నేహమయి అమృతలతగారికి స్నేహాభినందనలు.
***


రచన: డా. అమృతలత
ప్రచురణ: అపురూప పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 404
వెల: ₹ 600/-
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్, హైదరాబాద్. 9848787284
అచ్చంగా తెలుగు, హైదరాబాద్ 8558899478
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ 040-24652387
వలబోజు జ్యోతి, 8096310140
రచయిత్రి: 9848868068
8 Comments
పుట్టి నాగలక్ష్మి
‘నా ఏకాంత బృందగానం’ గురించి సవివరమైన సమీక్షను అందించారు.అభినందనలు మేడమ్ గారూ!


శీలా సుభద్రాదేవి
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
“నడక దారిలో…” అంటూ తన ఆత్మకథ రాస్తున్న కవయిత్రి, రచయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి మరో కవయిత్రి, రచయిత్రి అయిన శ్రీమతి అమృతలత గారి ఆత్మకథ “నా ఏకాంతం బృందావనం…” పై విశ్లేషణ చేయడం విశేషం.
కవిత్వమే పలచబడిపోతున్న ఈ రోజుల్లో ఈ వ్యాసాన్ని ఆద్యంతం కవిత్వాత్మకంగా, అందమైన ఉపమలతో, అమృతభరితమైన, ఆహ్లాదకరమైన లత లా అల్లారు సుభద్రాదేవి. చాలామంది (నాతో సహా) ఈ పుస్తకం పై విశ్లేషణ చేసినా ఇది మాత్రం ప్రత్యేకమైంది అనిపించింది.
ఇరువురికీ నా హృదయ పూర్వక అభినందనలు.
శీలా సుభద్రాదేవి
సుశీల గారూ చాలా ఆత్మీయంగా నా వ్యాసం గురించి రాయటం సంతోషం కలిగింది.మీకు బహుధన్యవాదాలు
డా.అమృతలత
శీలా సుభద్రాదేవి గారూ ,
నమస్తే !
ఎంతో శ్రమ తీసుకుని
‘ నా ఏకాంత బృందగానం ‘ పుస్తకాన్ని చక్కగా సమీక్షించారు!
ఒక్క మాటలో చెప్పాలంటే –
నా పుస్తకం మీద మీ సమీక్షనే నాకో ‘పెద్ద అవార్డు’!
******
‘ నా ఏకాంత బృందగానం ‘ పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సయ్యాయని తెలిసి , దాని బదులుగా మరో ప్రతిని మీ ఇంటికి తీసుకొచ్చినపుడు …
శీలా వీర్రాజు గారు మీ ఇంట్లోని గదుల గోడలపై వేలాడదీసిన తన తైల వర్ణ చిత్రాలని ఎంతో ఓపిగ్గా , మరెంతో మురిపెంగా , సంబరంగా చూపిస్తూంటే … ఎంతో ముచ్చటగా అన్పించింది.
అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో ఎన్నో బహుమతులను కైవసం చేసుకోగలిగినంత అత్యంత అద్భుతంగా చిత్రించిన తైల వర్ణ చిత్రాలు అవి !
ఒక్కో చిత్రం ..ఒక్కో కళా ఖండం !
ముఖ్యంగా ప్రతి చిత్రంలోనూ .. పల్లె వాతావరణాన్ని ఎంతో చక్కగా ప్రొజెక్ట్ చేసారు ఆయన.
అంత అందమైన తైలవర్ణ చిత్రాలు గీస్తారని అప్పటివరకూ తెలియని నా అజ్ఞానానికి ఎంతో బాధపడ్డాను. మరోసారి వచ్చి తనవి తీరా ఆ చిత్రాలను చూద్దామనుకున్నాను.
అంతలోనే వారు కను మరుగవడం బాధ కలిగించింది.
*****
అయితే ..
అంతకు ముందు 2017 లో ‘కవిత్వం’ విభాగంలో మీరు అపురూప అవార్డు అందుకున్న రోజు ..
ఆ సభలో శీలావీ గారున్నారని తెలిసి , అది మా మహద్భాగ్యంగా తలచి , వారిని కూడా స్టేజీ మీదకు పిలిచి .. మీ దంపతులిద్దరినీ ఒకేసారి సత్కరించుకున్నానన్న తృప్తిని మాత్రం దక్కించుకోగలిగానని కదా అని సంతోషపడుతుంటాను
అయన పరమపదించాక .. ఆయన గీసిన చిత్రాలన్నీ మ్యూజియంలో భద్రపరిచారని తెలిసింది !
అలా ఇస్తారని ఏ మాత్రం ముందుగా తెలిసినా . .. వారి స్మృతి చిహ్నంగా నేనూ వాటిలో కొన్నింటిని ఇవ్వమని బతిమాలుకుని, వారిని ఒప్పించి – వాటిని అపురూప కల్యాణ మండపపు గోడలపై .. నాలుగు దిక్కులా వేలాడదీసి వుండేదాన్ని కదాని అనిపించింది.
*****
కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ ని కొనసాగిస్తూ … శీలా వీర్రాజు గారి పేర.. ప్రతి నెలా ‘కవితా పోటీ ‘లను నిర్వహిస్తూ , కవులనూ , కవయిత్రులను ఎంతగానో ప్రోత్సహిస్తూ , వారికి బహుమతులను కూడా ప్రకటిస్తూ సాహిత్యానికి ఎనలేని సాహితీ పోషకురాలు మీరు ! మీ ముందు నేనెంత అమ్మా!
బిడ్డ ఏదైనా ఓ చిన్న ఆటలోనొ , పాటలోనో తన ప్రతిభని చూపి – పరిగెత్తుకొచ్చి తల్లి ముఖంలోకి చూస్తే –
అమాంతం తన గుండెలకు అదుముకుని నుదుట ఓ ముద్దుని బహుమతిగా ఇచ్చే తల్లిని దర్శించాను మీ విశ్లేషణలో !
థాంక్యూ అమ్మా ! మీ పలుకులు నాకు వెయ్యేనుగుల బలం !
******
నిజం చెప్పాలంటే – ఏ పనీ చేయకపోతే ఉండలేని నాకు .. కరోనా సమయం పెద్ద సవాలు విసిరింది. ఊరికే తిని కూర్చుని ఉండాల్సిన స్థితి అది.
అప్పటికే నా హితులు, సన్నిహితులు, గురువులు పలుమార్లు ఇచ్చిన సలహా మేరకు – నా జీవితంలో మరచిపోలేని కొన్ని ఘట్టాలను రాయాలని ‘ నా ఏకాంత బృందగానం ( రాయడం ) మొదలుపెట్టాను .
రాస్తున్నకొద్దీ నాకే ఆశ్చర్యం కలిగేలా ఎన్నో సందర్భాలు, ఎందరో మనుషులు, ఎన్నో మనస్తత్వాలు, కొంత సంతోషం, మరికొంత సంతృప్తి, ఎంతో వేదన …ఇవన్నీ కలిసి ఇంత పెద్ద పుస్తకం అవుతుందనుకోలేదు.
నా జీవితం సాహిత్యాంశంగా అవుతుందనీ, మీలాంటి గొప్ప సాహిత్యకారుల ప్రశంసలు/ విమర్శలు అందుకుంటుందని కూడా నేను అనుకోలేదు .
నా ‘ఏకాంత బృందగానాన్ని’ ఆసాంతం విని/ చదివి మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు చాలా సంతోషం.
ముఖ్యంగా వివిధ ఘట్టాలను సంగీతంలోని రాగాలతో పోలుస్తూ చేసిన మీ విశ్లేషణ నా మనసును హత్తుకుంది.
మీ అభిప్రాయాన్ని నేను ఎంతో గౌరవంగా స్వీకరించాను …మీ స్నేహంలా,
మీ ఆత్మీయతలా !!
మీ విశ్లేషణను ఆ పుస్తకం తాలూకు రివ్యూల పుస్తకంలో పొందుపరుస్తాను.
ఆ రివ్యూల పుస్తకంతో పాటు , ‘నా ఏకాంత బృందగానం’ తాలూకు ఇంగ్లీష్ అనువాద పుస్తకం
‘ MY SOLITARY CHORUS’ (Translated by Shanthi Ishan ) పుస్తకం రెండూ ఒకేసారి రిలీజ్ అవుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
శీలా సుభద్రాదేవి
అమృతలతగారూ మీ ఏకాంత బృందగానం పై నేను రాసిన పరిచయాన్ని గురించి మీరు ఇంత సుదీర్ఘ స్పందనను తెలియజేయండం మీకు మా కుటుంబంపై గల అభిమానాన్ని సహృదయతను వ్యక్తం చేస్తున్నాయి.మీకు మనసారా ధన్యవాదాలు
G.S.lakshmi
ఒక మనిషిలోని గొప్పతనాన్ని మరో గొప్ప మనిషే తెలుసుకోగలడు. అలాగే అమృతలతవంటి అమృతహృదయిని గురించి కవయిత్రి, రచయిత్రి, చిత్రకారిణి అయిన శీలా సుభద్రాదేవిగారు తప్ప ఇంత గొప్పగా ఇంకెవరు చెప్పగలరూ!
శీలా సుభద్రాదేవి
అమృతలతగారూ మీ ఏకాంత బృందగానం పై నేను రాసిన పరిచయాన్ని గురించి మీరు ఇంత సుదీర్ఘ స్పందనను తెలియజేయండం మీకు మా కుటుంబంపై గల అభిమానాన్ని సహృదయతను వ్యక్తం చేస్తున్నాయి.మీకు మనసారా ధన్యవాదాలు