[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]


[అనుకున్నట్టుగానే ఆలివర్ ట్విస్ట్ కథని హరికథగా మలుస్తాడు వైనతేయ. ఆలివర్ అనాథాశ్రమంలో పడ్డ కష్టాలను పద్యాల రూపంలో రాసి, వివిధ రాగాలలో స్వరపరుస్తాడు. తల్లిదండ్రులు లేని, వీధిబాలలు, సంఘవ్యతిరేకశక్తులుగా మారకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన, సమాజం పైన ఉందనే సందేశంతో హరికథను ముగించి, సార్లు అందరికీ చూపించి, వారి సూచనలు, సలహాలతో కథకు మెరుగులు దిద్దుతాడు. స్కూలు వార్షికోత్సవం నాడు ముఖ్య అతిథిగా డోన్ ఎమ్.ఎల్.ఎ. శిఖామణి గుప్త, బేతంచెర్ల సి.ఐ. ఆంబ్రోజ్ ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తారు. కార్యక్రమంలో చివరగా వైనతేయ హరికథాగానం ఏర్పాటయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆహూతులు ముగ్ధులయ్యేలా హరికథా గానం చేస్తాడు వైనతేయ. ఎమ్.ఎల్.ఎ. గారు వైనతేయను అభినందించి, ఐదువందల పదహార్లు చదివిస్తారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలు బాగా రాసి, ఇంటికి వెళ్తాడు వైనతేయ. కోనేటయ్య, తిరుపాలమ్మ కొడుకును చూసి సంతోషిస్తారు. ఓ రోజు తండ్రి దిగులుగా ఉంటే, కారణం ఏంటని అడుగుతాడు వైనతేయ. రమణమ్మ పెండ్లికి అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తీర్చమని లేదా, పొలం తనకు రాసివ్వమని శేషశయనారెడ్డి ఒత్తిడి చేస్తున్నాడని చెప్తాడు కోనేటయ్య. తొందరపడి చేను రాసివ్వదానీ, దస్తగిరిసారు ఏదోక మార్గం చూద్దామని చెప్పాడు కదా అని గుర్తు చేస్తాడు. వాళ్ళ పొలంలో జొన్న బాగా పండుతుంది. ఒకరోజు జొన్నలన్నీ బస్తాల్లోకి ఎక్కిస్తుంటే, రెడ్డి మనుషులొచ్చి, వడ్డీ కింద వాటిని జమచేసుకుంటున్నామని తీసుకుపోతారు. కోనేటయ్య, వైనతేయ చాలా బాధపడతారు. తల్లిదండ్రులని ఈ కష్టాల తప్పించాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు వైనతేయ అక్కడ్నించి అక్క వాళ్ళ ఊరు గుంతకల్ వెళ్తాడు. బావ బస్ డ్రైవర్. అక్క ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటోంది. యానాదుల దిబ్బలో అమ్మానాన్నలకంటే, గుంతకల్‌లో అక్కాబావల పరిస్థితి మెరుగ్గా ఉందని గ్రహిస్తాడు వైనతేయ. రెండు రోజుల తర్వాత బేతంచెర్ల చేరుకుంటాడు. సెలవలు ఇంకా ఉండడంతో, దస్తగిరిసారు, కాశింబీ, వైనతేయ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రి అక్కడ ఓ భజన బృందం పాటలు పాడుతుంటే, వారిని – మీరు అనుమతిస్తే, నా శిష్యుడు, వైనతేయతో హరికథ చెప్పిస్తానంటారు సారు. వాళ్ళు ఒప్పుకుంటారు. – ఇక చదవండి.]
తొమ్మిదిన్నరకు వైనతేయ హరికథ మొదలైంది. మైకు లేదు. క్షేత్రంలో నిద్ర చేయడానికి వచ్చిన వారంతా వచ్చి కూర్చున్నారు. కాశింబీ కూడా లేచి వచ్చింది.
ఇంతకు ముందొకసారి ‘భక్త ప్రహ్లాద’ కథాగానం చేసి ఉన్నాడు కదా! వాడిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూంది. ముందుగా గురువులకు, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారికి వందనాలు తెలిపి, వినాయకుని ప్రార్థించాడు ఇలా.
శ్లో॥
ప్రాతఃస్మరామి గణనాథ మనాథ బంధుమ్
సిందూర పూర పరిశోభిత గండ యుగ్మమ్
ఉద్దండ విఘ్నపరి ఖండన చండదండం
ఆఖండలాది సురనాయక బృందవంద్యం”
భూపాల రాగంలో ఆ బాలుడాలపించిన గణేశ ప్రాతస్మరణ స్తోత్రం గుడిలో ప్రతిధ్వనించింది. దస్తగిరిసారు చక్కగా హర్మోనియం మీద ఆ రాగప్రస్తారాన్ని అనుసరించాడు.
ప్రహ్లాదుని కథ గంగాఝరిలా సాగింది. హిరణ్యకశ్యపుడు కొడుకును రకరకాలుగా హింసించడం, అయినా, భాగవతాగ్రేసరుడైన ఆ కారణజన్ముడు నారాయణుని పట్ల అచంచల భక్తి విశ్వాసాలతో, అన్ని ఆపదల నుంచి బయుటపడడం, తల్లి లీలావతి ఆవేదన – వైనతేయ గానం చేస్తూ, నర్తిస్తూ, అభినయిస్తూంటే, భక్తులు పరవశులైనారు.
ప్రహ్లాదుని వ్యక్తిత్యం ఎంత ఆదర్శప్రాయమైనదో పోతనగారు తమ భాగవతం లోని సప్తమ స్కంధంలో వివరించారు. దానిని ఉటంకించే ముందు వైనతేయ చెప్పాడు – “భక్తులారా, ప్రహ్లాదుడు కేవలం మహా భక్తుడే కాదు. ఉత్తమ మానవీయ విలువలు కలవాడు. మనం జీవితంలో ఎలా నడుచుకోవాలో, పరిపూర్ణమైన వ్యక్తిత్యం ఎలా ఉంటుందో పోతన గారు వర్ణిస్తారు ఈ సీస పద్యంలో. దీనిలో ఉత్తమ లక్షణాలున్నాయి. ఈ గుణాలు ఉన్నవారు భగవంతునికి దగ్గర కాగలరు. కేవలం భక్తి మాత్రమే చాలదు. శీలం, సత్ప్రవర్తన, నిజాయితీ, సమదర్శనం, ఉంటేనే ఆ భక్తి అనే పుష్పానికి పరిమళం అయ్బితుంది. ఈ పద్యం వినండి.” అని.
“శ్రీమద్రమారమణ గోవిందో హరి!” అని అందరితో నినదింపచేశాడు. దస్తగిరిసారును చూసి, “సార్, కల్యాణి!” అని సూచించాడు. వెంటనే, సారు శృతి అందించాడు. వైనతేయ నోటివెంట పోతన్నగారి సీసపద్యం మందారమకరందమై దుమికింది.
సీ.:
తనయందు నఖిల భూతములందు నొక భంగి
సమహితత్వంబున జరుగువాడు
పెద్దల బొడగన్న భృత్యుని కైవడి
చేరి నమస్కృతుల్ సేయువాడు
కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన
మాతృభావన సేసి మరలువాడు
తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను
దీనులగావ జింతించువాడు
సఖులయెడ సోదరస్థితి జరుపువాడు
దైవతములంచు గురువులదలచువాడు
లీలలందును బొంకులు లేనివాడు
లలిత మర్యాదుడైన ప్రహ్లాదు డధిప
~
అట్లే, ఆ బాలునిలో ఆధ్యాత్మిక గరిమ కూడ ఒప్పారుచున్నది.”
సారును చూసి, ‘తోడి’ అన్నాడు.
“ఈ పద్యంలో పోతన్నగారు పైన చెప్పిన దానికంటే ఉత్కృష్టమైన స్థితిని ప్రహ్లాదునిలో ఆవిష్కరించారు
సీ.:
ఆకార జన్మ విద్యావరిష్ఠుడై
గర్వ సంస్తంభ సంగతుడు గాడు
వివిధ మహానేక విషయసంపన్నుడై
పంచేంద్రియములచే పట్టుబడడు
భవ్య వయో బలప్రాభవోపేతుడై
కామరోషాదుల గ్రందుకొనడు
కామినీ ప్రముఖ భోగము లెన్ని గల్గిన
వ్యసన సంసక్తి నావంక బోడు
విశ్వమందుగన్న విన్న యర్థములందు
వస్తుదృష్టి జేసి వాంఛయిడడు
ధరణినాథ! దైత్య తనయుండు హరిపర
తంత్రుడై హతాన్యతంత్రుడగుచు
~
అయ్యలారా! బాగా గమనించండి. మొదటి పద్యంలో లౌకికమైన ఉత్తమ వ్యక్తిత్యాన్ని, రెండవ పద్యంలో అలౌకికమైన వ్యక్తిత్వాన్ని చెప్పాడు పోతన్న గారు. అంత చిన్న పిల్లవాడికి ఆ గుణాలు అసహజం కాదా అని మీరు అడగవచ్చు. ప్రహ్లాదుడు దైవాంశసంభూతుడు వయసుకు మించిన పరిణతి గలవాడు. ఆదిశంకరులవారు మూడేండ్ల నుండి అద్భుత పాండిత్యాన్ని ప్రదర్శించలేదా”
ఒక్కొక్క పాదాన్నిమళ్లీ మామూలుగా చెబుతూ వాటిలోని పరమార్థాన్ని వివరించాడు వైనతేయ.
“ప్రహ్లాదుడు ‘ఆత్మవత్ సర్వభూతాని’ అన్న ఉపనిషద్వాక్యానికి మూర్తీభూతుడు. సకల జీవులను తనవలె భావించే సమదర్శి. పెద్దల పట్ల అమిత గౌరవం. పరస్త్రీలను తల్లులవలె భావించేవాడు. దీనులను దయతో చూసేవాడు. గురువులను దైవములుగా కొలిచేవాడు. హాస్యానికైనా అబద్ధాలు చెప్పడు. అటువంటి లలిత మర్యాదుడా ప్రహ్లాదుడు. ఇవన్నీ లౌకిక ఉత్తమగుణాలు.
ఇక రెండవ పద్యంలో, ‘సకల విద్యలు కరతలామలకములైనా, ఏ మాత్రం గర్వము లేనివాడు’. ‘విద్యా దదాతి వినయమ్’ అన్నారు కదా పెద్దలు! అనేక విషయములను గ్రహించినా, పంచేంద్రియాల ప్రభావానికి లోను గాలేదు. యవ్వనపరుడైనా కామా దివ్యసనాల పాలబడలేదు. ప్రపంచంలో తాను కన్న విన్న వాటి పట్ల వస్తువాంఛ లేనివాడు. నిరంతర హరినామ పరితంత్రుడు అని చెప్పారు పోతన గారు.
అప్పటికింకా ఈ వ్యక్తిత్వవికాస కోర్సులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్లు, వెర్రితలలు వేసి, వేల రూపాయలు ఫీజు దండుకొనే సంస్కృతి లేదు. ప్రహ్లాదుని క్యారెక్టర్లో అవన్నీ స్పృశించాడు పోతన”, వివరించాడు వైనతేయ. అలా పనికి వచ్చే సందేశాన్ని కథలో మనోరంజకంగా ఇమిచ్చాడు.
దస్తగిరిసారుకు వాడి పరిణితి చూస్తే ఎప్పటికప్పుడు ఆశ్చర్యమనిపిస్తూ ఉంటుంది. తాను కేవలం నిమిత్తమాత్రుడనని, వాడిలో పూర్వజన్మ నిష్ఠమైన ప్రజ్ఞ ఏదో బలీయంగా ఉందని అనిపిస్తుంది. ‘ఆ వాచికం, అభినయం, భావ వ్యక్తి, చక్కని ఉచ్చారణ, గాత్ర సౌలభ్యం, అనన్య సాధ్యం’ అనుకున్నాడాయన. వాడు తన శిష్యుడు కావడం తన అదృష్టం అనుకొన్నాడు, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారికి కవిసమాట్ విశ్వనాథ శిష్యుడైనట్లు!
రాత్రి పదకొండు దాటింది. భక్తులెవ్వరూ కదలలేదు. కనీసం ఆవులించలేదు. ప్రహ్లాద హరికథాగానంతో ఓలలాడసాగారు. ఇక కథ చివరికొచ్చింది. ఎప్పుడు సాధన చేశాడో. ఆ బాల హరిదాసు, నృసింహవిర్భావ ఘట్టంలోని ఒక దీర్ఘ సమాస బంధురమైన వచనాన్ని అలవోకగా పలికించాడు –
“వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి..”
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లుగా, ఆ బుడతడు పిడుగుల వంటి నుడువులను గంభీరంగా పలుకుతూ ఉంటే, శ్రోతలు నిశ్చేష్టులైనారు.
“ఆ నరసింహ రూపాన్ని గని హిరణ్యకశిపుడిలా అనుకున్నాడట.
కం.:
నరమూర్తి గాదు, కేవల
హరిమూర్తియు గాదు, మానవాకారము, గే
సరి యాకారము నున్నది
హరిమాయా రచితమగు యథార్ధము చూడన్”
నరహరి, రాక్షసుని సంహరించడం, ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించి, అతనిని మూర్ధాభిషిక్తుని చేయడంతో కథ ముగిసింది. చివర్ల ‘మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ, సార్వభౌమాయ మంగళం’ అను మంగళాశాసనంతో కథ ముగిసింది.
చప్పట్లు మారుమోగాయి. భజన బృందం లోని పెద్దలు వైనతేయను భుజాల మీదకి ఎత్తుకున్నారు. భక్తులు వరుసగా నిలబడి బాలహరిదాసుకు సంభావన చదివించి, పాదాలకు నమస్కరించారు. మొత్తం రెండు వందల నలభై రూపాయలు వచ్చింది. కొందరు దస్తగిరిసారు బేతంచెర్లలో ఎక్కడ ఉంటాడో కనుక్కున్నారు.
మర్నాడుదయం రంగాపురం స్టేషన్ చేరి, డోను – గుంటూరు ప్యాసింజర్‌లో బేతంచెర్లకు వెళ్లారు.
***
ఒక రోజు యానాదుల దిబ్బలో, తమ యింట్లో పరిస్థితిని దస్తగిరి సారుకు వివరించాడు వైనతేయ. తాను చేనిలో ఉండగానే శేషశయనారెడ్డి మనుషులు వచ్చి బలవంతంగా జొన్నల సంచులను తీసుకొనివెళ్లడం, ఇక తన అమ్మానాన్నా ఆ ఊర్లో ఉండడం ఏ మాత్రం తనకిష్టం లేకపోవడం, అన్నీ చెప్పాడు.
దస్తగిరి సారు నవ్వి “నేను మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పనే చెప్పినా కద రా! రెడ్డి మీ అక్క పెండ్లికి అప్పు యిచ్చింది మీ మీద ప్రేమతో గాదు, మీ చేనును మింగుదామని” అన్నాడు.
“నెలనెలా నాయన జీతంలో రెండు వందలు పట్టుకొంటున్నాడు గూడ సార్. అయినా వడ్డీతో కలిపి ఎనిమిది వేలయిందంటున్నాడంట.”
“సరేలేరా! కోనేటయ్య మాంసం వంటలు చేయడంలో మొనగాడు. చేతిలో విద్య ఉన్నోనికి బ్రతకటానికి బొచ్చెడు తోవలు! కానీ, నీవు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరాల కదా! బేతంచెర్లలో కాలేజీ లేదు. నంద్యాల కన్నా బోవాల, లేదా కర్నూలు. డోన్‌లో కూడా కాలేజి ఉంది. కాని రెడ్డికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే చేను దక్కలేదని, ఆయన మీ వాండ్లకు హాని చేయడానికి కూడా వెనుకాడడు. కర్నూలో, నంద్యాలో అయితే పెద్ద నగరాలు. మీ జోలికి రాడు.
నాయనకు కూడా అక్కడే ఏదో ఉపాధి చూస్తే సరి. నీవు గూడ వాండ్ల దగ్గరే ఉండి చదువుకోవచ్చు. నా దగ్గరికి నీవు రావాలన్నా, మీ దగ్గరికి నేను రావాలన్నా, అనుకూలము”
వైనతేయ ముఖం సంతోషంతో విచ్చుకుంది. సారు మళ్లీ అన్నాడు..
“మా చిన్నాయన కొడుకు నంద్యాలలో కో-ఆపరేటివ్ బ్యాంకులో గుమస్తాగా పనిచేస్తాడు. నాకంటే చిన్నాడు. వాని పేరు వలీ. ఉస్మాన్ వలీ.. రేపు వాని దగ్గరకు పోదాము. ఏదైనా మిలిటరీ హోటల్లో నాయనకు పని దొరుకడానికి మనకు సాయం చేస్తాడు.”
చేతులెత్తి సారుకు మొక్కబోయాడు వైనతేయ. సారు వారించాడు.
“ముందు పెదరెడ్డి బాకీ చుప్తా చేయాల. నేను నా ప్రావిడెంట్ ఫండ్ మీద లోను బెడతాను. అది రెడ్డికి కట్టేద్దాం. మీరు కొంచెం స్తిమితపడే వరకు రెండు నెలలు కొంచెం డబ్బు అవసరం కదా! అందుకని పదివేలు తీసుకుంటాను. నెలకు ఐదువందల ప్రకారము నా జీతంలో కట్ చేస్తారు. మనం దాచుకున్న డబ్బులే గాబట్టి వడ్డీ ఉండదు. ఏమంటే ఆడ మనకొచ్చే వడ్డీ బోతాది. అంతే.”
మర్నాడు గుంతకల్ – గుంటూరు ప్యాసింజర్ నంద్యాలకు వెళ్లారు గురుశిష్యులు. సారు తమ్ముడు ఉస్మాన్ వలీ నడిగడ్డ వీధిలో ఉంటాడు. స్టేషను నుంచి జట్కాలో అతని యిల్లు చేరుకున్నాడు.
వలీ – అన్నయ్యను చూసి మహదానంద భరితుడైనాడు. “అన్నా, ఎన్నాళ్లకు నా మీద దయగలిగె?” అన్నాడు దస్తగిరి సారును కరుచుకొని. వలీ భార్య ఫాతింబీ సాదరంగా వారిని ఆహ్వనించింది. చాయ్ ఇచ్చింది.
వైనతేయను గురించి గర్వంగా చెప్పాడు సారు.
“వీడిని ఇక్కడ ఇంటర్మీడియట్లో చేర్చాల. వీని అమ్మ, నాయిన ప్యాపిలి దగ్గర..” అంటూ పరిస్థితినంతా విశదీకరించాడు తమ్మునికి.
అంతా విని వలీ అన్నాడు – “వీండ్ల నాయన వంటలో అంత పనోడంటున్నావు. ఆయనకు పని దొరకడం అంత కష్టమేమి గాదులే. నాకు తెలిసిన రెండు మూడు మిలిటరీ హోటల్లున్నాయిలే. వాండ్లను అడుగుదాం. రేపే పోదాం.”
బావ వచ్చినాడని పాతింబీ బిర్యానీ చేసింది. దాంట్లోకి ఉద్దివడలు చేసింది. వలీకి ఒక కొడుకు ఆర్.సి.ఎమ్ హైస్కూలులో ఎయిత్ చదువుతున్నాడు. వాని పీరు ఖాదర్ వలీ.
నడిగడ్డలోనే వలీకి తెలిసిన సివిక్స్ లెక్చరర్ ఒకాయన ఉన్నాడు. ఆయన పేరు అశ్వత్థ నారాయణ. ముందు ఆయనను కలిశారు. ఆయన గవర్నమెంటు జూనియర్ కాలేజీలో పని చేస్తున్నాడు. అది మూలసాగరంలో ఉంది.
“ఏ గ్రూపులో చేర్చాలని?” ఆయన ఆడిగాడు దస్తగిరిసారును.
“ఆర్ట్స్ గ్రూపేనండి. వాడికి హరికథలలో ప్రావీణ్యముంది. పైగా యస్.టి.లు. ఏదో బి.ఎ. చేయించి, బి.ఇడి చేయిస్తే, టీచరుద్యోగం వస్తుంది. జీవికకు ఢోకా ఉండదు. తన హరికథా కార్యక్రమాలు కొనసాగించుకుంటూ చదువుకోవాలని..”
“యస్.టి.నా? అంటే?”
“యానాదులమండి” అన్నాడు వైనతేయ వినయంగా.
సివిక్స్ సారు ఆశ్చర్యపోయినాడు. “హరికథలు చెబుతాడా? ఏదీ ఒక పద్యం చెప్పు, విందాము.”
వాడు సారు వైపు చూసినాడు. సారు పాడమన్నట్లు సంజ్ఞ చేశాడు. వాడు గొంతు సవరించుకొని, లవకుశ సినిమాలోని.
“రంగారు బంగారు చెంగావులు ధరించు/శృంగారవతి నారచీరలూనె” అన్న వాల్మీకి పద్యాన్ని సుమధురంగా పాడాడు. అశ్వత్థ గారు ఆనందాబుధిలో ఓలలాడారు. వైనతేయను ఆశీర్వదించారు.
“ఎం.పి.సి, బైపిసి, అయితే సీట్లకు పోటీ ఉంటుంది సార్. 480 మార్కులు వస్తే గాని దొరకవు. హెచ్.యి.సి కాబట్టి సమస్య లేదు. ఈ పిల్లవాడి అడ్మిషన్ నేను చూసుకుంటాను. స్కాలర్షిప్ కూడా వస్తుంది” అన్నాడాయన.
“మీరు కాలేజి రీ-ఓపెనింగ్ అయితూనే రండి” అన్నాడు.
ఆయనకు పాదాభివందనం చేశాడు వైనతేయ. అక్కడ నుంచి ముగ్గురూ బైరల్ వీధిలోని ఒక హోటల్‌కు చేరుకున్నారు. దాని పేరు ముబారక్ హోటల్. దాని యజమాని రహమతుల్లా. వలీని చూసి నమస్కరించాడు
“రాండి సారు! శాన్నాళ్లకు!” అంటూ ఆహ్వానించాడు. కూర్చోబెట్టి, టీలు తెప్పించి ఇచ్చాడు. “చెప్పండి సార్” అన్నాడు వినయంగా.
అతనికి హోటలు పెట్టుబడికి తమ కో-ఆపరేటివ్ బ్యాంకు లోనే లోనిప్పించి ఉన్నాడు వలీ.
నాన్-వెజ్ వంటల్లో ఆరితేరిన ఒకాయన ఉన్నాడనీ, ఆయనకు పని కావాలనీ, నంద్యాలలో పని చేస్తూ కొడుకును చదివించుకుంటాడనీ చెప్పాడు వలీ.
“సార్, నా దగ్గర మొదట్నించీ పని చేస్తున్న చంద్రన్న అనే ఆయన ఉన్నాడు. ఆయనది నందికొట్కూరు. నా దోస్తునిదే ఒక మిలిటరీ హోటలుంది; నూనేపల్లెలో. ‘నవనంది విలాస్’ అని పెద్ద హోటలే. వాని పేరు రామ్ముని గౌడు. ఈడిగోండ్లు! (కల్లు గీత) వైను షాపు కూడా ఉంది ఆడే. వాడికేమైనా అవసరమయితుందేమో అడుగుదాము పాండి.”
అందరూ నూనేపల్లెకు చేరుకున్నారు. అది నంద్యాల శివారు. కడప రోడ్డులో ఉంటుంది. అక్కడ ఎక్కువగా వేరుశనగ నూనె మిల్లులు, నూనె అంగళ్లు, ఎరువులు, పురుగుమందుల అంగళ్ళు ఉంటాయి. పెద్ద బిజినెస్ సెంటరు.
రామ్ముని గౌడుది చిన్న వయసే. వాండ్లది చాగలమర్రి. నవనందివిలాస్ చాలా పెద్ద హోటలు. పక్కనే వాండ్లదే వైన్ షాపుంది. దాని పేరు రామతీర్థ వైన్స్.
“సారోల్లును శానామందిని తీసుకొస్తివి, ఏంది రా సంగతి?” అని రహమతుల్లా నడిగినాడు రామ్ముని గౌడు.
రహమతుల్లా, వారిని పరిచయం చేసి, విషయం స్నేహితునికి చెప్పినాడు.
గౌడు అన్నాడు – “ఎతకబోయిన తీగ కాలికీ తగిలిందని.. ఇదేనేమో రోయ్! నా కాడ పనిచేసే సికెను బిర్యానీ, మటను బిర్యానీ మాస్టరు ఆ మధ్య పాలుమాలినాడు. నీవు చెపుతున్నా యప్ప మంచి పనోడంటున్నావు. నేను నెలకు ఇంతని ఇయ్యను. రోజుకు నూట యాభై ఇస్తా. పొద్దున తొమ్మిదికొచ్చి మూడు వరకుండాల. సాయంత్రం 7 కొచ్చి రాత్రి పదివరకుండాల. రెండు రకాల బిర్యానీలు చేస్తే చాలు. మరి వీండ్లు యాడ ఉంటారు? హోటలు దగ్గరగా ఉంటే మేలు.”
“నూనేపల్లెలోనే యాదయిన చిన్న యిల్లు చూద్దాములే.”
“ఈడ బాడిగలు మిడిమాలెంగుంటాయిరా. రైలు టేసను ఎనక మాల అయితే అగ్గవకు దొరకతాయి.”
దస్తగిరి సారన్నాడు “శానా సాయం చేస్తున్నావు గౌడు! అట్లే ఆయన భార్యకు కూడ ఏదైనా మార్గము చూడు.”
“అట్లే సారు! మన హోటల్లోనే ఏదో పని చేసుకుంటాందిలే ఆ యమ్మ! ఆమెకు మాత్రం నెలకు పదైదు నూర్ల కంటే ఇయ్యలేను.”
వైనతేయకు ఇదంతా కలలా ఉంది! అమ్మానాయన, నంద్యాలకు వచ్చేస్తారు. తను వాండ్ల దగ్గర ఉండి చదువుకుంటాడు. ఆ ఊహే అతనికి ఎంతో హాయిగా ఉంది.
“అయితే మంచి రోజు చూసి జాయినవుతారు.”
గురుశిష్యులిద్దరూ బస్సులో బేతంచెర్ల చేరుకున్నారు. దస్తగిరిసారు పి.ఎఫ్. లోనుకు అప్లయి చేసినాడు. వారం రోజులలో శాంక్షన్ ఐంది. పదివేలు. అది తీసుకొని. వైనతేయతో యానాదుల దిబ్బ చేరుకున్నాడు దస్తగిరిసారు. ఎండకాలం సెలవులు ఇంకో పదిరోజులున్నాయి.
(ఇంకా ఉంది)

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.