[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]


పిల్లలూ బాగున్నారా
~
చిత్రం: ఓనమాలు
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: కోటి
గానం: నిత్య సంతోషిని


~
పాట సాహిత్యం
పల్లవి:
పిల్లలూ బాగున్నారా? ఏవర్రా ఏవయ్యార్రా ॥ 2 ॥
మన్ను చాటు తల్లి వేరునర్రా మీ చిన్ననాటి పల్లెటూరినర్రా ॥ మన్ను చాటు ॥
వేలు విడిచి నడిచి వెళ్ళారనుకున్నా
నేల విడిచి సాము చేస్తున్నారని విన్నా గగనమేలు ఘనులౌతారనుకున్నా
తెగిన గాలిపటాలయ్యారని విన్నా
అవునా నిజమేనా ॥ 2॥
కాని మాటలన్నానా పిచ్చి తల్లి పిలుపు వినండర్రా వచ్చి పచ్చి గాలి పీల్చుకెళ్ళండర్రా ||2||
॥ పిల్లలూ బాగున్నారా॥
చరణం:
ఎక్కడెక్కడిప్పుడు ఉన్నా ఇక్కడున్నప్పటికన్నా చక్కగానే జీవిస్తున్నామని గట్టిగా చెప్పగలరా వృత్తులన్నీ మూలపడి పద్ధతులు పాతబడి తప్పకే వెళ్ళామంటే తప్పు పట్టలేను గానీ తరతరాల నుంచి తెచ్చి మీ నెత్తురులో ఉంచిన నిక్షేపమంటి లక్షణాలేవీ పోల్చలేని కాలంలో మార్పు ఇదని అంటారా అది మార్పో మరుపో గమనించారా
అచ్చమైన మనిషి జన్మనందించాను
కంచె లాగ కాసి మిమ్మల్ని పెంచాను
వెర్రి పరుగుల్లేని కాలినడకిచ్చాను
తల్లి ఒడిలాంటి నేల పడకిచ్చాను
ఇచ్చకాలు లేని మాట తీరిచ్చాను
మచ్చరాలు లేని మంచి మనసిచ్చాను హెచ్చుతగ్గుల్లేని గుండె సడినిచ్చాను
వెచ్చదనం పోని కంటితడినిచ్చాను తలుపులేసుకోని గడపల్లో నడిపాను పలకరింపులోనే వరసల్ని కలిపాను
సాటి మనిషి పోతే కాటి దాకా వెళ్ళి
సాగనంపే పాటి తీరుబాటిచ్చాను
ఇంత సంపద ఇక్కడే వదిలేసి వెళ్ళారా ఇప్పుడైనా వచ్చి మీవైన విలువల్ని పట్టుకుపోండర్రా..॥ పిల్లలూ బాగున్నారా॥
చరణం:
వలస పిట్టలకైనా సొంత నెలవు తెలిసుంటుంది కడలిలో కలిసే దాకా నది నదికో కథ ఉంటుంది మన గతమేమిటని మన గతి ఎటో అని ఎందుకిటు వచ్చామని ముందు తరం అడుగుతుంది
జ్ఞాపకాల జాడే లేని వ్యాపకాల నీడే గానీ
గడచిన నిన్నలేవి వెంట తెచ్చుకోలేదని
మీ పిల్లలకెలాగ చెబుతార్రా? మీ రేపటికేం సంపదనిస్తార్రా?
ఓనమాలు ఇవి ఆనవాళ్ళు ఇవి
నడక నేర్చుకున్న అడుగుజాడలవి
కట్టుబొట్టు ఇవి కట్టుబాట్లు ఇవి
ఆటపాటలివి ఆటుపోటులివి
అమ్మ పాలు లాంటి నమ్మకాలు మావి
ఉమ్మడి బతుకుల బొమ్మరిళ్ళు మావి దాచనక్కర్లేని ధర్మ ధనం మాది
దోచుకో వీల్లేని దొడ్డ గుణం మాది
వేడుకలివి వాడుకలివి సర్దుబాటివి దిద్దుబాట్లివి పస్తులున్నా, పరమాన్నమైనా గానీ
కలిసి పంచుకున్న చెలిమి కలిమి మాది
నలుగురి నవ్వుల్లో కలతల్ని కరిగించి
బరువు దించుకున్న బాంధవ్యాలు మావి
అంటూ చెప్పుకోను ఏదీ లేని పేదలయ్యారా
అమ్మ ఉన్నా అనాథలయ్యారా
నన్ను బిడ్డలున్న గొడ్రాలిని చేస్తారా ॥ పిల్లలూ బాగున్నారా ॥
♠
‘తెల్లవారక ముందే పల్లె లేచింది, తనవారినందర్నీ తట్టీ లేపింది..’ అనే పాటలో మల్లెమాల..
/పాలవెల్లిలాంటి మనుషులు, పండు వెన్నెల వంటి మనసులు మల్లెపూల రాశివంటి మమతలు, పల్లేసీమలో కోకొల్లలు.. అనురాగం, అభిమానం, కవలపిల్లలూ ఆ పిల్లలకు పల్లెటూర్లు కన్నతల్లులు../ పల్లెటూర్లకు కితాబిచ్చారు.
The Quiet Life అన్న మనసుకు హత్తుకునే poemలో Alexander Pope, పల్లెలోని ప్రశాంతమైన జీవితాన్ని వర్ణిస్తూ, ఏమాత్రం ఉనికి కోసం ఆరాటపడకుండా.. పల్లెలోనే ప్రశాంతమైన మరణాన్ని కూడా కోరుకుంటున్నారు.
Happy is the man whose wish and care
A few paternal acres bound
Content to breathe his native air
In his own ground.
Whose herd with milk, whose fields with
bread,
Whose flocks supply him with attire;
Whose trees in summer yield him shade,
In winter, fire.
Blest, who can unconcern’dly find
Hours, days, and years, slide soft away
In health of body; peace of mind;
Quiet by day;
Sound sleep by night; study and ease
Together mix’d; sweet recreation,
And innocence, which most does please
With meditation.
Thus let me live, unseen, unknown;
Thus unlamented let me die;
Steal from the world, and not a stone
Tell where I lie.
సహజమైన పల్లెసీమ అందాలను, ఆనందాలను అనుభవించిన వారెవరికైనా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఆహ్లాదాన్ని పంచే మధురమైన జ్ఞాపకాలు పల్లెటూళ్లు.
/పల్లెటూరు మన భాగ్యసీమరా.. పాడి పంటలకు లోటు లేదురా/ మంచితనం మమకారం మనిషి మనిషిలో కనబడురా/… అన్న కొసరాజు గీతం కానీ,
/ఆకు పచ్చని చేలు అల్లోనేరెల్లో../ ఆపైన పైరగాలి అల్లోనేరెల్లో..అందాల మాపల్లె అల్లోనేరెల్లో/ఆనాటి రేపల్లె అల్లోనేరెల్లో- అనే సినారె బాణీ కానీ..
/ఊరు పల్లెటూరు
దీని తీరే అమ్మ తీరు.. కొంగులోన దాసిపెట్టి
కొడుకుకిచ్చే ప్రేమ వేరు..
ఊరు పల్లెటూరు దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే అడుగుతున్న సంబరాల పంటపైరు../
కాసర్ల శ్యామ్ సాహిత్యం.. వంటి పాటలు కానీ, ప్రతి మనసును తట్టి లేపుతాయి.
అయితే పల్లెసీమల సహజమైన అందాలు, ఆనందాలు.. అనుబంధాలు.. కరువైపోతూ.. పట్టణీకరణ నిరంతరంగా కొనసాగుతూ.. పల్లె చిత్రాలన్నీ.. చిత్ర చిత్రంగా మారిపోతూ ఉంటే.. గుండెలు మరిగి.. ఎంతోమంది సాహితీకారులు ఇటు సినిమా సాహిత్యంలో కానీ, అటు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా కానీ, తమ వేదనకు అక్షరరూపమిచ్చి స్వరబద్ధం చేశారు. ఆ విధంగా బాగా పాపులర్ అయిన పాటలు ఇటీవల కాలంలో మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. అందులో ఒకప్పుడు, చౌరస్తా వారి /ఊరెళిపోతా మామ, ఊరెళిపోతా మామ.. ఎర్ర బస్సెక్కి మల్ల తిరిగెళ్ళిపోతా మామ../ నల్లమల్ల అడవుల్లోన, పులిసింత సెట్లా కింద, మల్లెలు పూసేటి, సల్లని పల్లెకొటుందని, మనసున్న పల్లె జనం మోసం తెలియనితనం, అడవి ఆ పల్లె అందం, పూవు తేనెల సందం/ ఎంతో వైరల్ అయింది.
పూర్తిగా మారిపోయిన పల్లె చిత్రాన్ని ప్రతిబింబిస్తూ, ఎక్కువగా ఆకట్టుకున్న పాటల్లో.. గోరేటి వెంకన్న సాహిత్యం ఒకటి. మడుగులన్ని అడుగంటి పోయినాయనీ.. బావులు సావుకు దగ్గరయ్యాయని, వాగులు వంకలు ఎండిపోతున్నాయనీ.. కుల వృత్తులన్నీ కనుమరుగైపోతున్నాయన్న ఆవేదన వ్యక్తపరుస్తూ.. /పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల../ పాట ద్వారా బ్రతుకు చిత్రాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.
విద్య, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు, నగరాలకు పోటెత్తుతున్న జనాల సంఖ్య నిరంతరంగా పెరుగుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి క్రమంలో పట్టణీకరణ అనివార్యమైన అంశమైనప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గి, పట్టణాల్లో, నగరాల్లో అనూహ్యమైన జనసాంద్రత పెరిగి, అందరికీ అన్నం పెట్టే రైతు జీవితాలు కుప్పకూలి, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. యువత పట్టణాల వైపు పరుగులు తీస్తుంటే గ్రామీణ రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోతోంది. పట్టణీకరణ గురించిన నా భావానికి Concrete Symphony title క్రింద A.I. ఈ కవితను నాకు అందించింది.
A jungle of steel, where once fields spread wide,
Towers pierce the sky, where birds once did glide.
A symphony of horns, the rhythm of the street,
Human pulse quickens, beneath concrete feet.
The village whispers, now lost in the din,
A thousand flickering lights, where stars once did spin.
Glass and glass reflect, a mirrored maze,
A city’s heartbeat, in a tireless daze.
From rural roots, to urban embrace,
A yearning for space, in this concrete race.
The echo of dreams, in a neon glow,
A city’s soul, where shadows grow.
కథా నేపథ్యం:
నారాయణ రావు మాస్టారు (రాజేంద్రప్రసాద్)కి తను పుట్టిన ఊరన్నా, పల్లె వాతావరణమన్నా, అక్కడి జనం మధ్య ఉన్న ఆప్యాయతలన్నా మహా ఇష్టం. అయితే పిల్లలు అమెరికా వెళ్లి పోవడంతో వారితో పాటు అక్కడికెళ్లిన మాస్టారు మనసుకు ఇష్టం లేకున్నా అక్కడ కొన్నాళ్లు అయిష్టంగానే గడిపి ఇక ఉండలేక మళ్లీ తన పల్లెబాట పడతాడు. తన పల్లె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఊరుచేరుకున్న మాస్టారు, అక్కడ ఎదురుపడిన పరిస్థితులను చూసి, ఖంగుతిని, పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నించడమే కథాంశంగా ఈ చిత్రం రూపొందింది.
దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో నేటి తరం ఉండటానికి ఇష్టపడక, ఉపాధి కోసమో, అవకాశాల కోసమో, అభివృద్ధి నగరాల్లోనే దొరుకుతుందన్న భ్రమతోనో, అమ్మ ఒడిలాంటి పల్లెలను విడిచి పట్నం వైపు పరుగులు తీస్తున్న తీరు, దాని పరిణామాలు తెరకెక్కిస్తూ విడుదలైన చిత్రం ‘ఓనమాలు’. ఈ చిత్రంలో తన సాహిత్యం ద్వారా పల్లె చిత్రాన్ని, దాని విలువను వ్యక్తపరుస్తూ పట్టణీకరణ సమస్యలను విశ్లేషిస్తూ మళ్లీ అందరూ పల్లె బాట పట్టాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు సిరివెన్నెల.
పల్లవి:
పిల్లలూ బాగున్నారా? ఏవర్రా ఏవయ్యార్రా ॥ 2 ॥
మన్ను చాటు తల్లి వేరునర్రా మీ చిన్ననాటి పల్లెటూరినర్రా ॥ మన్ను చాటు॥
వేలు విడిచి నడిచి వెళ్ళారనుకున్నా
నేల విడిచి సాము చేస్తున్నారని విన్నా గగనమేలు ఘనులౌతారనుకున్నా
తెగిన గాలిపటాలయ్యారని విన్నా
అవునా నిజమేనా ॥ 2॥
కాని మాటలన్నానా పిచ్చి తల్లి పిలుపు వినండర్రా వచ్చి పచ్చి గాలి పీల్చుకెళ్ళండర్రా ॥ 2 ॥
‘మన్ను చాటు తల్లి వేరునర్రా మీ చిన్ననాటి పల్లెటూరినర్రా ..పిల్లలూ బాగున్నారా? ఏవర్రా ఏవయ్యార్రా..’, అని పల్లె తల్లి, మాస్టారి మనసులోని ఆత్మీయతనంతా రంగరించుకొని ప్రశ్నించినట్లుగా పల్లవి ప్రారంభమవుతుంది. ఎంతో గొప్పగా ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇంకేదో స్థితిలో చూసి, కలత చెందిన మాస్టారు మనసులోని ఆవేదనను పల్లవిలో సిరివెన్నెల వ్యక్తపరుస్తున్నారు. మళ్లీ ఒక్కసారి ఆ పల్లె తల్లిని స్పర్శించి ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని, స్వేచ్ఛా జీవనాన్ని మనసారా గుర్తు చేసుకోమని సిరివెన్నెల ఆహ్వానం అందిస్తున్నారు.
చరణం:
ఎక్కడెక్కడిప్పుడు ఉన్నా ఇక్కడున్నప్పటికన్నా చక్కగానే జీవిస్తున్నామని గట్టిగా చెప్పగలరా వృత్తులన్నీ మూలపడి పద్ధతులు పాతబడి తప్పకే వెళ్ళామంటే తప్పు పట్టలేను గానీ తరతరాల నుంచి తెచ్చి మీ నెత్తురులో ఉంచిన నిక్షేపమంటి లక్షణాలేవీ పోల్చలేని కాలంలో మార్పు ఇదని అంటారా అది మార్పో మరుపో గమనించారా
అచ్చమైన మనిషి జన్మనందించాను
కంచె లాగ కాసి మిమ్మల్ని పెంచాను
వెర్రి పరుగుల్లేని కాలినడకిచ్చాను
తల్లి ఒడిలాంటి నేల పడకిచ్చాను
ఇచ్చకాలు లేని మాట తీరిచ్చాను
మచ్చరాలు లేని మంచి మనసిచ్చాను హెచ్చుతగ్గుల్లేని గుండె సడినిచ్చాను
వెచ్చదనం పోని కంటితడినిచ్చాను తలుపులేసుకోని గడపల్లో నడిపాను పలకరింపులోనే వరసల్ని కలిపాను
సాటి మనిషి పోతే కాటి దాకా వెళ్ళి
సాగనంపే పాటి తీరుబాటిచ్చాను
ఇంత సంపద ఇక్కడే వదిలేసి వెళ్ళారా ఇప్పుడైనా వచ్చి మీవైన విలువల్ని పట్టుకుపోండర్రా.. ॥ పిల్లలూ బాగున్నారా ॥
అచ్చమైన మనిషి జన్మనందించిన పల్లె తల్లి, ఆ మంచి లక్షణాలు, విలువలు, మానవ సంబంధాలు, అనుబంధాలు, మంచి మనసులు, తల్లి ఒడిలాంటి పచ్చని పంటచేలు, తానిచ్చిన ప్రశాంతమైన జీవన విధానం.. కనుమరుగైపోతే, కలతపడిన అమ్మ మనసుతో తన ఆవేదనను వ్యక్తపరచడం మొదటి చరణంలో మనకు కనిపిస్తుంది. మళ్ళీ కల్మషం లేని ఆ ప్రేమ, ఆ విలువలు వెనక్కి రావాలని, సహజమైన ఆ వాతావరణం ప్రశాంతంగా మనిషి జీవించాలన్న సిరివెన్నెల అభిలాష మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
చరణం:
వలస పిట్టలకైనా సొంత నెలవు తెలిసుంటుంది కడలిలో కలిసే దాకా నది నదికో కథ ఉంటుంది మన గతమేమిటని మన గతి ఎటో అని ఎందుకిటు వచ్చామని ముందు తరం అడుగుతుంది
జ్ఞాపకాల జాడే లేని వ్యాపకాల నీడే గానీ
గడచిన నిన్నలేవి వెంట తెచ్చుకోలేదని
మీ పిల్లలకెలాగ చెబుతార్రా? మీ రేపటికేం సంపదనిస్తార్రా?
ఓనమాలు ఇవి ఆనవాళ్ళు ఇవి
నడక నేర్చుకున్న అడుగుజాడలవి
కట్టుబొట్టు ఇవి కట్టుబాట్లు ఇవి
ఆటపాటలివి ఆటుపోటులివి
అమ్మ పాలు లాంటి నమ్మకాలు మావి
ఉమ్మడి బతుకుల బొమ్మరిళ్ళు మావి దాచనక్కర్లేని ధర్మ ధనం మాది
దోచుకో వీల్లేని దొడ్డ గుణం మాది
వేడుకలివి వాడుకలివి సర్దుబాటివి దిద్దుబాట్లివి పస్తులున్నా, పరమాన్నమైనా గానీ
కలిసి పంచుకున్న చెలిమి కలిమి మాది
నలుగురి నవ్వుల్లో కలతల్ని కరిగించి
బరువు దించుకున్న బాంధవ్యాలు మావి
అంటూ చెప్పుకోను ఏదీ లేని పేదలయ్యారా
అమ్మ ఉన్నా అనాథలయ్యారా
నన్ను బిడ్డలున్న గొడ్రాలిని చేస్తారా ॥ పిల్లలూ బాగున్నారా॥
/వలస పిట్టలకైనా సొంత నెలవు తెలిసుంటుంది కడలిలో కలిసే దాకా నది నదికో కథ ఉంటుంది/ ఎన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించినా, వలస పక్షులు మళ్లీ వాటి సొంత గూటికి చేరుకుంటాయి.
సర్వాంతర్యామిలాంటి సముద్రంలో కలిసేదాకా ప్రతి నదికీ ఒక స్వంత కథ ఉంటుంది, ఒక identity ఉంటుంది. ఆ individualityని ఒక ప్రదేశం కానీ, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఎప్పటికీ కోల్పోకూడదు. అందుకే, మన ఊర్ల పేర్లు కూడా ఇష్టారాజ్యంగా మార్చడం అమానుషం అనిపిస్తుంది. మద్రాసుగా మారిన చెన్నపట్టణం, బొంబాయిగా మారిన (మహా అంబా మాయి) ముంబాయి – పేర్లు మారిపోతే వాటి ఉనికి మారిపోయిందిగా? ఆ ఆనవాళ్లు ఎప్పటికీ గుర్తుండాలంటే, తరతరాలకి తిరిగి అందించాలంటే, మూలాలు మర్చిపోకుండా, మారిపోకుండా కాపాడగలగాలి. ఈ ఆనవాళ్లు మన జీవితంలో దిద్దుకున్న మొదటి ఓనమాలు- అంటారు సిరివెన్నెల. అలా ఆనవాళ్లు మర్చిపోతే, రాబోయే తరాలకు మీ గతాలు ఏమని కథలు చెప్తారు? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా ఉన్న మాకు మమ్మల్ని మేము మర్చిపోయే వ్యాపకాలు తప్ప, మాకంటూ ఏం జ్ఞాపకాలు మిగలలేదు, అని మీ పిల్లలకు చెబుతారా? మీరే ఆలోచించుకోండి! అన్నది, సిరివెన్నెల గారి ఘాటైన వార్నింగ్.
నలుగురితో కలిసి పంచుకున్న కష్ట సుఖాలు, ఉమ్మడి బ్రతుకులు, అందరూ నా వాళ్ళు అనుకునే విశాలమైన మనసులు, ఎదుటివారి సుఖం తన సుఖంగా భావించి ఆనందించిన హృదయాలు, ఎదుటివారి కష్టం తన కష్టంగా తలచి చెమర్చిన కళ్ళు, చేయూతనిచ్చిన చేతులు, కృత్రిమత్వం అంటని ఆత్మీయతలు, సద్దుబాట్లు, దిద్దుబాట్లు, వేడుకలు, ఆచారాలు (వాడుకలు) అన్నింటినీ మళ్లీ ఒక్కసారి కలబోసి మన ముందు ఉంచారు సిరివెన్నెల. అలా చెబుతూ, ఇలాంటి ఊసులేవీ మా జీవితంలో లేవనీ, పంచుకోవడానికి మాకు ఏమీ లేని పేదలమనే.. బాధను మాత్రమే మిగుల్చుకుంటారా? అని ప్రశ్నిస్తూ, ఏదీ లేని పేదలయ్యారా? అమ్మ ఉన్నా అనాథలయ్యారా? అని ఆవేదనను వ్యక్తపరుస్తూ నన్ను మీరు వదిలేసి దూరంగా వెళ్లిపోతే ‘నేను పిల్లలున్న గొడ్రాలిగా మిగిలిపోతాను కదరా!’ అన్న వేదనాభరితమైన భావాన్ని కూడా మన గుండెల్లో నేరుగా గుచ్చుకునేలా చెబుతున్నారు సిరివెన్నెల. ఒక్కసారి మళ్ళీ అందమైన గతంలోకి ప్రయాణించగలిగితే, ఆత్మీయంగా చేతులు చాచి మిమ్మల్ని గుండెకి హత్తుకోవడానికి పల్లె తల్లి ఎదురుచూస్తోంది, అని సిరివెన్నెల గుర్తు చేస్తున్నారు. ఆధునిక మానవ జీవితం ఎలా ఉందో ఒక్కసారి మాట్లాడుకుని, ఈ వ్యాసానికి ముగింపు పలుకుదాం!
‘క్రిక్కిరిసిన నగరపు యాంత్రిక మానవారణ్యంలో,
ఒక స్నేహపు పరిమళం కోసం
సందుగొందుల్లో పడి తిరుగుతున్నాను,
తల్లడిల్లి పోతూ ఒంటరి ఆత్మగా పరితపిస్తున్నాను, నా పక్కనుండే
ఎన్నో ముఖాలు నన్ను దాటిపోతున్నాయి కానీ, అవి అన్నీ ఎంతో దూరంగా అనిపిస్తున్నాయి,
చెప్పుకోవడానికి లెక్కలేనన్ని కథలు వున్నా,
పంచుకోవడానికి ఒక్కరైనా దొరకడంలేదు,
ఎత్తైన భవనాలు, శవాల కౌగిలింతల్లా ఉన్నాయి,
లక్షలాది కిటికీలు తెరుచుకొని ఉన్నా,
స్నేహాన్ని పంచుకునే ముఖం ఒకటి కూడా కనపడడం లేదు..
నగరపు నాడి నిరంతరంగా, అలుపు లేకుండా స్పందిస్తూ వుంది,
అలసిపోయిన నా పాదాల క్రింద ఒంటరి లయతో
జతకడుతూ..
ఒకప్పుడు ఆత్మీయతా గాలులు వీచిన పొలాల కోసం,
నిశ్శబ్దం యొక్క శబ్దం లోంచి పుట్టే, ప్రశాంతమైన రంగు కోసం..
నేను ఈ అసహజపు యంత్రాల కారడవిలో
నగర సందళ్ళలో మనిషితనం దారి వెతుక్కుంటున్న బాటసారిలా ఒంటరిగా తిరుగుతూనే ఉన్నాను..’
ఆరోగ్యపరంగా అందరూ రివర్స్ డయాబెటిస్ లాంటి ప్రతిపాదనలు చేస్తున్న నేటి యుగంలో, కృత్రిమత్వంతో, అసహజత్వంతో, అర్థంపర్థం లేని లక్ష్యాలతో, పిచ్చి పరుగులు తీస్తున్న ఈ mad rat race నుండి ఉపశమనం కావాలంటే Reverse Urbanisation.. అంటే ..Ruralization ఒక ఉద్యమంలా సాగాలనీ, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని, మరి ముఖ్యంగా యువత దీనికి నడుం బిగించాలనీ, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కొబ్బరి చెట్టు నీడ, ఆరు బయట భోజనం, కళకళలాడే లోగిలి, పల్లె తల్లిలోని అమ్మదనం, కమ్మదనం, అద్భుతమైన అనుభూతులన్నీ నింపుకుని సీతారామశాస్త్రి గారు రచించిన ఒక సునిశితమైన, విస్తృతమైన సమీక్ష ఈ పాట.
ప్రతి మనసును కదిలించే ఇలాంటి సాహిత్యాలు ఎంతో, thought provoking గా వుండి, మంచి భవితకు పునాదులు వేస్తాయని అందరం ఆశిద్దాం. సమకాలీన సమస్యలపై ఇంత విశ్లేషణాత్మకమైన, పరిశీలనాత్మకమైన, అనుభవపూర్వకమైన వ్యాసంలాంటి గీతాన్ని అందించిన సిరివెన్నెల గారికి మరోసారి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను.
Images Source: Internet

శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.