[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘కొద్ది మందికే కంఠస్థం నేను..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ఈ పెనుగులాట నాది కాదు.
నా లోపల నాకు అడ్డంగా
నా శత్రువులెవరో
నా మెదడులో గుచ్చిన ఓ వాక్యానిది..
దానికి మొలిచిన నా పోలిక గల కవితది.
మరొకడు ముఖంపై పడ్డ గాటులా గుర్తుకొచ్చి
నేనొక్కడినే పత్రికల్లో, పుస్తకాల్లో
పుట్టపగిలినట్లు అక్షరాలను
దారిపొడవునా చల్లినట్లు నడుచుకుపోయే
ఒంటరి ప్రపంచంలో
భయానికి నిజమే తోడు
బాధకు మౌనమే బలం.
చుట్టూ కలయే రాత్రి కాపలా..
ఇంకొకడు పచ్చిగా నన్ను నెట్టేసిన రోజే
రేపు నన్ను లిఖించబోయే గీతంలా నిలచినా
ఆలపించడం ఇష్టంలేని వాళ్ళే ఎక్కువ
కొద్ది మందికే కంఠస్థం నేను.
అందరూ మరిచినా
కాలం గుర్తుపెట్టుకుని
నాలో నేను పోగొట్టున్నవి ఏరి పెట్టీ
నా మనసు ఆకలి తీర్చుతుందనే
నమ్మకం అంటే చాలా ఇష్టం.
