చీకటి భయపెడుతుంది..
ఎంతవరకు.. నువ్వు భయపడినంతవరకు..!
ఓటమి బాధపెడుతుంది..
ఎంతవరకు.. నువ్వు బాధపడినంతవరకు..!
ఒక్కసారి.. నీ చూపు వెలుగు దిశగా సారించు..
చీకటి అంతమైపోతుంది ..
నిన్ను భయపెట్టే చీకటి..
నీలోని బిడియాన్ని పక్కకి నెట్టేసి..
కొత్తగా పరిచయం అయిన
వెలుగుల దిశగా నిన్ను నడిపిస్తుంది!
ఓటమి ఎదురైనప్పుడు.. నువ్వు చేసిన
తప్పులేంటో విశ్లేషించుకుని గ్రహించు..
నిన్ను అప్పటి వరకు అగాధంలోకి నెట్టేసిన
ఓటమిల తాలూకు చేదు అనుభవాలే..
రేపటి రోజు గెలిచేదారులు చూపే
దిక్సూచిలా మారి.. తగిన పాఠాలు నేర్పుతాయి!
నేటి నీ ప్రతి ఓటమి…. ‘రేపటి గెలుపు’కు
చిరునామాగా నిన్నే చూపుతాయి!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.