ఈశాన్యంలో అతి చిన్న రాష్ట్రం సిక్కిం. కేవలం నాల్గు జిల్లాలతో, గాంగ్టక్ రాజధానిగా, నేపాలీ భాష మాట్లాడే ఆరున్నర లక్షల జనాభా గల కొద్ది పాటి రాష్ట్రం. హిమాలయా పర్వత శ్రేణుల్లో ఒదిగి వుండడం వల్ల ఎటూ ఎదగలేని పిడికెడు కొండ ప్రాంతం. చుట్టూ నేపాల్, భూటాన్, చైనా అంతర్జాతీయ సరిహద్దులు గల కీలక ప్రాంతం. ఇప్పుడు చైనా ఒక వైపు సరిహద్దులో ఉద్రిక్తతలు రగిలిస్తూనే, సిక్కింకి స్వాతంత్ర్యాన్ని డిమాండ్ చేస్తూ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో సంపాదకీయం రాసుకుంది, చైనాలో స్వాతంత్ర్యం నాల్గు పాదాల మీద నాట్యం చేస్తున్నట్టు. కరోనా కరాళ నృత్యం చాలనట్టు. సిక్కింకి స్వాతంత్ర్యం 1975 లోనే లభించింది. ఇప్పుడు చైనా మార్కు స్వాతంత్ర్యం అక్కడి ప్రజలే కోరుకోవడం లేదు. స్వాతంత్ర్య పూర్వం సిక్కిం ఎలా వుండేదో సాక్షాత్తూ సత్యజిత్ రే డాక్యుమెంటరీ ద్వారా ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీకి సెన్సార్ స్వాతంత్ర్యం లభించక నలభై ఏళ్ళూ అంధకారం అనుభవించింది.
సిక్కిం సినిమా పరిశ్రమ అంతంత మాత్రమే. గత ఫిబ్రవరిలో గాంగ్టక్ లో జరిగిన గ్లోబల్ ఫిలిం ఫెస్టివల్లో ఐదు సిక్కిం సినిమాలు ప్రదర్శించారు. దిస్ సైడ్ ఆఫ్ టౌన్, ఆల్టర్డ్, యథావత్, బువా, యాజిటీజ్ అన్నవి. ఈ సినిమాలు ఇంటర్నెట్లో ఎక్కడాలేవు. కనీసం వీటి గురించి వీకీపీడియా పేజీలు కూడా లేవు. దర్శకుల శ్రద్ధ ఇలా వుంది. ట్రైలర్లు మాత్రం యూట్యూబ్‌లో పెట్టారు. ఈ శీర్షికలో ఈశాన్య సినిమాల్ని కవర్ చేస్తున్నప్పుడు సిక్కిం సినిమాలు మిగిలిపోయాయి. చూద్దామంటే వున్న సిక్కిం సినిమాలు అందుబాటులో లేవు. అందువల్ల శీర్షిక నుంచి పక్కకు తొలగి, సత్యజిత్ రే తీసిన క్లాసిక్ డాక్యుమెంటరీ ‘సిక్కిం’ని పరిచయం చేయాల్సి వస్తోంది.
స్వాతంత్ర్య పూర్వం సిక్కిం ఎలా వుండేది? ఇది డాక్యుమెంటరీలో చూడవచ్చు. అయితే అసలు సెన్సార్ పూర్వం ‘సిక్కిం’ అనే ఈ డాక్యుమెంటరీ ఎలా వుండేది? ఇది మనకి తెలీదు. రెండు దేశాలు దీనిమీద కత్తెరలు దూశాయి. ఒకసారి సిక్కిం రాజు చోగ్యాల్ కత్తిరించాక, ఇంకోసారి భారత ప్రభుత్వం తనూ కత్తిరించాక, మిగిలింది మాత్రమే చూడగలం. ఇదెలా వుందో చూద్దాం…
సత్యజిత్ కంఠ స్వరం వివరిస్తూంటే కెమెరా ప్రయాణం కడుతుంది పర్వత లోయల్లోకి… అర్ధచంద్రాకారంలో సిక్కింని చుట్టేసిన హిమాలయాలతో సిక్కిం భౌగోళిక, ప్రాకృతిక దృశ్యాల మీదుగా జనావాసాలు, జీవితాలు, వృత్తులు, సంస్కృతులూ చూపిస్తూ రాజవంశం మీది కొచ్చి, ఆధునిక సిక్కిం అభివృద్ధి చిత్రపటాన్ని కళ్ళకి కడుతుంది కెమెరా. ఈ ఆధునికం నుంచి సంవత్సరాంతపు వేడుకల్లో చెడుని భస్మం చేయడంతో ముగింపుకి తెస్తుంది. ఇదంతా గంట ప్రయాణం. తన కామెంటరీతో సత్యజిత్ కెమెరా పట్టుకుని నడిపించుకుంటూ పోతూంటారు…
టెలిగ్రాఫ్ తీగెల మీద మంచు బిందువులు జారడాన్ని చూసి అది కూడా పట్టుకున్నానన్నారు సత్యజిత్. ఒక యువ బౌద్ధ సన్యాసి సాంప్రదాయ డంచెన్ టిబెట్ బూరె వూదుతూంటే, ఆకాశంలోకి కొమ్మలు చాచిన చెట్టు మీద కూర్చున్న చిట్టి పక్షులు, ఇంకా అటు ఆకాశాన్నంటే హిమాలయా పర్వతాలు, అక్కడ్నించి కింది కొస్తే పూల మొక్కలు, రోడోడెండ్రాన్ అనే వాళ్ళ జాతీయ గన్నేరు పూలు, అర్చిడ్లు, రకరకాల అడవి పూలూ….
ఇంకా కింది కొస్తే గలగలా పారే సెలయేళ్ళు, ఇంకా ఇంకా కిందికి పోతూంటే అగాథాల్లాంటి లోయల్లోకి జమాయించి దూకే జలపాతాలు, ఇప్పుడు తిరిగి పైకి చూస్తే ఏదో రోప్ వే టవర్, అప్పుడు దూరంగా పొగ మంచుని చీల్చుకుంటూ రోప్ వే కార్లో వస్తున్న గని కార్మికుడు, టెలిగ్రాఫ్ తీగెలు, వాటి మీద వజ్రాల్లా మెరుస్తూ జారుతున్న మంచు బిందువులూ …
ఇలా ఒక క్రమ పద్ధతిలో దృశ్యాల్ని పదాలుగా పేరుస్తూ సినిమా కవిత్వం చూపిస్తూంటారు. కెమెరా ఒక్కో దృశ్యంతో పైదాకా సాగి కింది కొచ్చాక, సిక్కిం స్థానిక నైసర్గిక స్వరూపం పూర్తిగా అర్థమై పోతుంది. ఇప్పుడు జనజీవితం, వర్షం వెలసిన తడిసిన సిమెంటు రోడ్లతో చిన్నపాటి పట్టణం, ఆ సిమెంటు రోడ్డు మీద గొడుగు పట్టుకుని నడుస్తున్న ఇద్దరు యువతులు, దీని తర్వాత పశుసంపద, అవి మేస్తున్న పచ్చిక బయళ్ళూ… తిరిగి హిమాలయా ఉన్నత శిఖరాలూ, మంచు కొండల్ని కమ్మేస్తూ కారు మేఘాలూ, ఒక సిక్కిం మ్యాప్. ఆ మ్యాప్ లో సిక్కిం రాజ్యం ఇరుగు పొరుగుని వివరిస్తూంటారు సత్యజిత్. ఇప్పుడు నేపాల్ తనలో కలిపేసుకున్న కాలాపానీ కూడా వుంటుంది.
ఇక మూల వాసులు లెప్చాలు, నేపాలీలు, టిబెటన్లు, భూటియాలు, ఇండియన్లు కూడా. మతం బౌద్ధం, వ్యవసాయం, మెట్ట వ్యవసాయం, సెలయేళ్ల నీటితో వ్యవసాయం, నాగలి పెట్టి దున్నడం, గ్రామాలు, గ్రామాల్లో వుంటున్న 90 శాతం జనాభా, వాళ్ళ కుటీరాల్లాంటి వెదురు ఇళ్ళు, వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు, గ్రామ పాలన, క్వారీ కార్మికులు, మోటారు వాహనాలు, వారాంతపు సంత, సంతలో దుంపలు, బార్లీ, బియ్యం, కోళ్ళు, మేకల అమ్మకాలు, చీకట్లు ముసరడం, లామా గురువులు, వాళ్ళ ప్రార్ధనలు…
ఇలా గ్రామీణ జీవితం చూశాక రాజధాని గాంగ్టక్. అక్కడ రాజభవనం. 1965లో కొత్త రాజైన పల్డెప్ తొండప్ నంగ్యాల్, అతడి అమెరికన్ భార్య హోప్ కుక్, వాళ్ళ ముగ్గురు పిల్లలు, వాళ్ళ విలాసవంతమైన జీవితం, కళ్ళు చెదిరే రాజభవనం, సిరిసంపదలు, పరిచారకులు, అంగరక్షకులు… గాంగ్టక్ అంతా ఆధునికం, అత్యాధునికం…లాల్ బజార్ బిజినెస్ సెంటర్, స్కర్ట్ లు ధరించిన సిక్కిం యువతులు, సూట్లు వేసుకున్న సిక్కిం యువకులు, బార్లు, పాశ్చాత్య సంగీతం, రెస్టారెంట్లు, జనతా హోటళ్ళు, షాపులు, వ్యాపారాలు, కాన్వెంట్ స్కూళ్ళూ…
విద్య ఉచితం. యూనీఫారాల్లో బాల బాలికల పోటాపోటీ ఇంగ్లీషు చదువులు, మిషనరీ స్కూళ్ళ వెంట అలవాటు చొప్పున వచ్చేసిన క్రైస్తవ మత ప్రచారకులు, పాటలతో బహిరంగ మతప్రచారం, బౌద్ధంతో క్రైస్తవం నువ్వానేనా, స్కూళ్ళలో ఇంగ్లీషు ప్రార్ధనలు…
ఇక్కడ కొంత భాగం భావి పౌరుల్ని తీర్చి దిద్దుతున్న విధం… చదువులతో బాటు హస్తకళలు నేర్పడం, క్రీడలు నేర్పడం, ఫన్ గేమ్స్ ఆడించడం, నృత్యగానాలు చేయించడం, రాణి గారు బహుమతులు పంచడం…
ఈ నేపధ్యంలో ఇక డిసెంబర్లో కొత్త సంవత్సరపు వేడుకలు. న్యూ ఇయర్స్ డే. రాజు గారు వైభవోపేతంగా ఉత్సవాలు జరిపిస్తారు. బీదాబిక్కీ కుక్కా మేకా అందరూ రావచ్చు. బ్యాండు మేళంతో పోలీసు దళం వచ్చేస్తుంది. లామాలు క్రూరమృగాల మాస్కులేసుకుని లామా డాన్స్ చేస్తారు. క్రూర మృగాలు చెడుకి ప్రతీక. ఆ సంవత్సరం జరిగిన చెడునంతా ఇప్పుడు భస్మీపటలం చేసి కొత్త సంవత్సరాన్ని అందుకుంటారు.
కుటుంబ సమేతంగా రాజుగారు వచ్చేసి ఆసీనులవుతారు. ఆయన వెంట అధికార గణమంతా కదిలి వస్తుంది. మాస్క్ డాన్స్ ముగించి భోజనాలు. రైస్ అండ్ పోర్క్. వన భోజనాల కొచ్చినట్టు ఎక్కడపడితే అక్కడ కూర్చుని ఆరగిస్తూ జనం. హోదా వున్న జనం బఫే లంచ్‌లో వుంటారు. భోజనాలయ్యాక గ్యాంబ్లింగ్, డబ్బు కాసే కేసినోతో బాటు, మూడు ముక్క లాట వుంటుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ముగించి, చెడుని భస్మీపటలం చేసి కేరింతలు కొడతారు.
ఇదీ నాటి సిక్కిం జీవితం. ఒక క్రమ పద్ధతిలో చూపించు కొచ్చారు. మొదట్లో బూరెతో మొదలైన డాక్యుమెంటరీ చివర్లో భస్మంతో ముగుస్తుంది. మధ్యలో అంచెలంచెలుగా సిక్కిం సామాజిక జీవితం. సౌమలేందు రాయ్ తెలుపు నలుపు, రంగులూ కలగలిసిన కెమెరా షాట్స్ సత్యజిత్ కవిత్వానికి శాశ్వత తత్వాన్ని కల్పిస్తాయి. సంగీతం సత్యజిత్తే. నిర్మాతలు సిక్కిం రాజు, రాణి.
1975 వరకూ సిక్కిం ఒక దేశంగా వుండేది. చోగ్యాల్ రాజవంశీయులు పాలించేవాళ్ళు. 1975 లో భారత్‌లో విలీనమైంది. అయితే విలీనం కాకముందు 1971లో చోగ్యాల్కి మరుగున పడి వున్న తన దేశం ప్రపంచానికి తెలియడం లేదని సినిమా ద్వారా ప్రపంచ దృష్టికి తీసుకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకు ఒక డాక్యుమెంటరీ తీసి పెట్టాల్సిందిగా సత్యజిత్ రేని కోరాడు. నిర్మాతగా చోగ్యాల్‌తో బాటు రాణి హోప్ కూడా వుంటుంది.
తీరా సత్యజిత్ రే డాక్యుమెంటరీ నిర్మించి చూపిస్తే చోగ్యాల్ చిందులేశాడు. పేదరికం చూపించడమేంటి, పైగా రాజభవనం వెనకాలే పిల్లలు ఏరుకుని తింటున్న దృశ్యాలేమిటని కత్తిరించ మన్నాడు. కత్తిరించిన దాంతో సంతృప్తి చెందక డాక్యుమెంటరీని నిషేధించాడు.
1975లో సిక్కిం భారత్ లో విలీనమైంది. సిక్కిం రాజు గురించి ఇంకెందుకని భారత్ కూడా డాక్యుమెంటరీని నిషేధించింది. 2010 వరకూ 40 ఏళ్ళు ప్రింటు బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో వుండిపోయింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తనకి నచ్చిన విధంగా సెన్సార్ చేయించి, 2010లో విడుదలకి అనుమతించింది.
ఇక 2010 నవంబర్‌లో కోల్‌కతా లో జరిగిన ఒక ఫిలిం ఫెస్టివల్లో డాక్యుమెంటరీ చూసేందుకు జనం క్రిక్కిరిసి ఎదురు చూస్తున్నారు. ఇంతలో ప్రదర్శన ఆపేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులొచ్చాయి. ఇన్ని నిషేధాల తర్వాత చివరికిలా యూట్యూబ్ ప్రాప్తమైంది.
సికందర్ ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్. సినీరంగానికి చెందిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ఎన్నో పత్రికలలో భారతీయ, అంతర్జాతీయ సినిమాలను విశ్లేషిస్తుంటారు. వీరు నిర్వహించే “సినిమా స్క్రిప్ట్ అండ్ రివ్యూ” అనే బ్లాగు ప్రసిద్ధి చెందినది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అలనాటి అపురూపాలు-26
వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-23
స్వార్థ రహిత ప్రేమ
మిణుగురులు-9
భయపడకు
దాతా పీర్-17
పవిత్ర బంధం
ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 49 – ఫిర్ కబ్ మిలోగీ
ముసలివాళ్ళ నవ్వులు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®