వాణిజ్య ప్రసారాల విభాగంతో పాటు ప్రాంతీయ శిక్షణా కేంద్రం బాధ్యతలు కూడా నేను రెండేళ్ల పాటు నిర్వహించాను. గతంలో 1967-75 మధ్య కందుకూరు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసిన అనుభవం, గత రెండు దశాబ్దాలుగా చాలా సభలలో ఇచ్చిన వందకు పైగా ఉపన్యాసాల బలంతో శిక్షణకు శ్రీకారం మొదలెట్టాను. అదే భవనంలో మిద్దె మీద శిక్షణా సంస్థ ఉండేది. నాలుగేళ్లుగా ఇద్దరు డైరక్టర్లు పని చేశారు. జనవరి 31న నేను చార్జి తీసుకున్నాను. శిక్షణా సంస్థలో ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్, ఒక టైపిస్టు క్రొత్త కుర్రవాడు పని చేస్తున్నారు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలలోని వివిధ ఆకాశవాణి కేంద్రాలకు చెందిన డ్యూటీ ఆఫీసర్లు, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లకు శిక్షణ యివ్వాలి. నెల రోజుల ముందుగా ఢిల్లీలోని staff training institute డైరక్టరుకు నేను పెట్టబోయే శిక్షణా కార్యక్రమం థీమ్ – అందులో మాట్లాడే వక్తల పేర్లు పంపి ఆమోదం పొందాలి. అది డైరక్టర్ జనరల్ వరకు ఆమోదం కోసం పంపుతారు. ఈలోగా నేను దక్షిణాది రాష్ట్రాలు – ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరీలలోని ఆకాశవాణి కేంద్రాల డైరక్టర్లకు ఉత్తరాలు వ్రాసి ఆ తేదీలలో వారి కేంద్రానికి చెందిన ఒకరిని నామినేట్ చేయమని కోరాలి. వారి టూర్ ప్రోగ్రాం మళ్లీ డైరక్టర్ జనరల్ ఆమోదం పొందాలి. ఈ కృత్యాద్యవస్థ కనీసం 40 రోజులు పడుతుంది. నేను ఫిబ్రవరి మొదటి వారంలోనే తొలి శిక్షణ – PUBLIC RELATIONS మార్చి 25న ప్రారంభించడానికి (హైదరాబాదులో) ఆమోదం పొందాను. ప్రతి ట్రైనింగులో కనీసం 16 మంది వచ్చేవారు.
రెండేళ్లుగా నిద్రాణంగా వున్న శిక్షణా సంస్థను జాగృతం చేసి ప్రతి నెలా ఒక శిక్షణ ఏర్పాటు చేశాను. ఇలాంటి ప్రాంతీయ శిక్షణా కేంద్రం కటక్‌లో తూర్పు ప్రాంతాల వారికుంది. నేను ఒక నెల హైదరాబాదులోను, మరు నెలలోను ఏదో ఒక రాష్ట్రంలోను శిక్షణలు జరిపాను. తద్వారా ఆయా కేంద్రాల పని తీరును కూడా శిక్షణ పొందే వారు గమనిస్తారు. ముందుగా ఆ కేంద్ర డైరక్టర్లుకు ఫోను చేసి వారి సౌకర్యం కనుక్కుని ఆ నగరంలో శిక్షణకు డైరక్టర్ జనరల్ ఆమోదం పొందేవాడిని. డైరక్టర్లు అందరూ సానుకూల ధోరణిలో స్పందిచారు. పాల్గొనేవారు కూడా పర్యాటక స్థలాలు చూడటానికి సంబరపడేవారు. వాటికి ‘WORKSHOP’ అని పేరు పెట్టాం. అప్పుడప్పుడు చమత్కారంగా అనేవాడిని అధికారులతో “LESS WORKING AND MORE SHOPPING”. మే నెలలో హైదరాబాదులో మరో కోర్సు నడిపాను.
నా హయాంలో తొలిసారిగా తిరుచురాపల్లిలో జూన్ 1985లో CONSUMER PROTECTION మీద వారం రోజుల వర్కషాప్ నిర్వహించాను. అక్కడి డైరక్టర్ యస్.వేణుగోపాలరెడ్డి తెలుగువారు. చాలా సీనియర్. ఉపన్యాసాలకు స్థానిక లెక్చరర్లను, ఆకాశవాణి రిటైర్డ్ అధికారులను పిలిచాము. ప్రస్తుత డైరక్టర్లు కూడా వచ్చారు. పనిలో పనిగా తంజావూరు, తిరువాయూరు, శ్రీరంగం, మధుర క్షేత్రాలు దర్శించాను. తిరుగు ప్రయాణంలో కంచి కామకోటి పీఠాధిపతి, కామాక్షితాయి దర్శనం లభించాయి.
జూలై నెలలో మదరాసులో వాణిజ్య ప్రసారాల సెమినార్ జరిపాను. డైరక్టరు ఆర్.యస్.నాయరు అందరికీ సౌకర్యంగా ఏర్పాట్లు చేశారు. డైరక్టరేట్ నుండి వాణిజ్యవిభాగాధిపతి యం.యస్.చేడి వచ్చారు. అడ్వర్టయిజింగ్‌లో అనుభవజ్ఞులు ప్రసంగించారు. చంద్రమోళి అప్పుడు వాణిజ్య ప్రసార విభాగ అధిపతి.
1986 ఏప్రిల్‌లో కోయంబత్తూరు ఆకాశవాణి కేంద్రంలో నాటకాలకు సంబంధించి ఒక వర్క్‌షాపు నిర్వహించాను. ప్రసార రంగంలో అనుభవజ్ఞుడైన నటరాజన్ అక్కడ డైరక్టరు. మరో సీనియర్ డైరక్టరు జి.సుబ్రహణ్యం సెమినార్లో ప్రసంగించారు. మదరాసు నుండి ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ యస్. లీల శిక్షణ పొందారు. ఆమె లోగడ యం.జి.రామచంద్రన్ సరసన సినిమాలలో నటించిన గ్లామర్ గలది. శిక్షణ పొందే వారిని ఊటీ తీసుకెళ్లి హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్- ఇందూ-ఫ్యాక్టరీ చూశాము. అక్కడ అంధులు పని చేయడం విశేషం. ఫిల్మ్ డెవలపింగ్ కారుచీకట్లో చేస్తారు.
కర్ణాటకలోని మంగళూరులో అప్పుడు తెలుగు వారైన బి.ఆర్.చలపతిరావు డైరక్టరు. ఆయన 1985లో U.P.S.C ద్వారా నేరుగా డైరక్టరుగా సెలక్టు అయి మొదటి పోస్టింగు మంగుళూరులో చేరారు. అక్కడ నాటక ప్రయోక్తల శిబిరం నిర్వహించాను. ప్రసిద్ధ ప్రయోక్తలను ఆహ్వానించాము. 1985 నవంబరులో ఐదు రోజులు నడిపాము. సోమవారం నుండి శనివారం వరకు శిక్షణ. పుణ్య స్థలాల సందర్శనలో భాగంగా ధర్మస్థల మంజునాథాలయం, కొల్లూరు ముకాంబిక, ఉడిపి శ్రీకృష్ణ ఆలయాలు దర్శించాను. మధ్యలో ఆదివారాలు నాతో బాటు శిక్షకులు కూడా ఇలా వాడుకోనేవారు. ఆ రోజుల్లో బెంగుళూరు నుండి మంగుళూరుకు దాదాపు 16 గంటల కొంకణ రైలు ప్రయాణం. 12 గంటల ప్రయాణం మించితే విమానంలో వెళ్లవచ్చుననీ, దానికి అధికార హోదాతో సంబంధం లేదని ఆదేశం. అందు వలన బెంగుళూరు నుండి నాతో శిక్షణ పొందేవారు ఐదుగురు విమానంలో ప్రయాణించారు. ఆ రోజుల్లో అదో లగ్జరీ.
1986 జనవరిలో గుల్బర్గాలో సైన్స్ వర్క్‌షాప్ పెట్టాను. జి.కె. కులకర్ణి డైరక్టరు. అక్కడ ప్రొడ్యూసర్ సిరిహట్టి మంచి పలుకుబడిగలవాడు. శిక్షణ పొందే వారి అన్ని సౌకర్యాలు చక్కగా ఏర్పాటు చేశాడు. బీదర్, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు చూపించాడు అందరికీ. ప్రతి రోజూ ఏదో ఒక సంస్థ డిన్నర్ ఏర్పాటు చేశారు.
1985 సెప్టంబరులో త్రివేండ్రంలో యువవాణి కార్యక్రమాల వర్క్‌షాప్ పెట్టాను. అక్కడ జి.సుబ్రహ్మణ్యం డైరక్టరు. తర్వాత మద్రాసు, ఢిల్లీ కేంద్రాల డైరక్టరుగా చేశారు. మూడు Capital కేంద్రాల డైరక్టరుగా పని చేసిన వ్యక్తి ఆయన ఒక్కరే. త్రివేండ్రం వెళ్లడానికి హైదరాబాదు నుండి నేను, నా దగ్గర పని చేసే రామానుజం కలిసి రైలులో 24 గంటల ప్రయాణం ఏ.సిలో చేశాము. నాగర్‌కోయిల్ వెళ్లి కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ చూశాము. తుంబా రాకెట్ ప్రయోగకేంద్రం వెళ్లి శిక్షణ పొందే వారికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగశాల వివరాలు తెలియజేశాము.
హైదరాబాదులోనే గాక విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాలలో గూడ శిక్షణలు జరిపాము. 1986 జూన్‌లో విశాఖపట్టణంలో కార్మికుల కార్యక్రమాల శిక్షణకు 15 మంది హాజరయ్యారు. పోర్టు ట్రస్టు, నావల్ డాక్ యార్డు, బి.హెచ్.వి.పి. సంస్థలకు శిక్షణార్థులను తీసుకెళ్లాము. 1986 సెప్టెంబరులో విద్యా ప్రసారాల సెమినార్ విజయవాడలో జరిపాము. మొత్తం 15 ట్రైయినింగులు జైత్రయాత్రలా జరిపాను.
ఆయా సందర్భాల కనుగుణంగా వివిధ శాఖల మంత్రులతో ఇష్టాగోష్ఠిని శిక్షణ పొందే వారితో ఏర్పాటు చేశాను. వ్యవసాయ శాఖామంత్రి ఆర్.రాజగోపాలరెడ్డి, విద్యాశాఖ మంత్రి జి.ముద్దు కృష్ణమనాయుడు, వైద్యశాఖ మంత్రి డా.యం.యస్. కోటీశ్వరరావులు శిక్షణా సంస్థకు విచ్చేసి ముచ్చటించారు. శిక్షణ పూర్తి కాగానే దానికి సంబంధించిన సమగ్ర రిపోర్టు డైరక్టర్ జనరల్‌కు పంపేవాడిని. మంత్రుల నెందుకు పిలిచావు అంటారేమోనని సందేహించాను. WELL DONE అని ప్రశంసలందించారు. క్రమం తప్పకుండా నెలనెలా శిక్షణ ఢిల్లీలో కూడా జరగడం లేదు. ప్రతి నెలా నా రిపోర్టులు చదివిన డైరక్టర్ జనరల్ అమృతరావు షిండే బుర్రలో కొత్త ఆలోచన వచ్చింది. 1986 నవంబరులో నన్ను ఢిల్లీ స్టాఫ్ ట్రైయినింగ్ ఇనిస్టిట్యూట్‌కు అదే హోదాలో బదలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. పని బాగా చేస్తే వచ్చే బహుమతి అది కాబోలు అనుకున్నాను. అప్పుడు ఢిల్లీలో ట్రైయినింగు డైరక్టర్ గా యస్.కృష్ణన్ ఉన్నారు. ఆయనకు నా పని నచ్చి నేను ఢిల్లీలో తనకు సహకరించాలని కోరుకున్నారు.
వ్యక్తిగత విషయమే అయినా ప్రస్తావించాలి. నా ముగ్గురు పిల్లలు – అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం (సెంట్ ఆన్స్ స్కూలు), ఇద్దరు మగపిల్లలు హైస్కూలు తరగతులు చదువుతున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ జరిగితే చదువులు పాడవుతాయి. ప్రతి రెండేళ్లకు నేనే అడిగి మరో ఊరు వెళ్లడం నాకు ఆనవాయితీ. పిల్లల చదువులు వాళ్ల తెలివితేటల వల్ల కొనసాగాయి. వచ్చే మార్చి నెలాఖరుదాకా మూడు నెలలు బదిలీ నిలిపివేయమని ఢిల్లీకి వ్రాశాను. దొరలు చిత్తగించారు. 1987 మార్చి 31న హైదరాబాదులో రిలీవ్ అయ్యాను. 1986 సెప్టెంబరులో అహమద్ శిక్షణా సంస్థ డైరక్టరుగా నా వద్ద నుండి చార్జీ తీసుకున్నారు. నేను వాణిజ్య ప్రసారాల కేంద్ర వ్యవహారాలు చూశాను.
హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకమైన Administrative staff college వుంది. రాజీవ్ గాంధీ హయాంలో మంత్రులకు, సీనియర్ IAS అధికారులకు అక్కడ శిక్షణ యిప్పించారు. 1986 సెప్టెంబరులో రెండు వారాల పాటు శిక్షకులకు శిక్షణ అనే వర్క్‌షాప్‌కు నేను హాజరయ్యాను. వాళ్ల బోధనా పద్దతులు బాగా ఆకర్షించాయి. అవి నాకు భవిష్యత్తులో బాగా ఉపకరించాయి.
1988 ఫిబ్రవరిలో కౌలాలంపూరులో Asian Institute of Broadcast Development సంస్థ వారు TRAINING FOR TRAINERS అనే పేరు నెల రోజులు శిక్షణ ఇచ్చారు. కొత్త అనుభవం.
1996లో దేశవ్యాప్తంగా వున్న డైరక్టర్లలో ఇద్దరిని ఎంపిక చేసి జర్మనీలోని డచ్వెలి బ్రాడ్కాస్ట్ ట్రైయినింగు సెంటర్లో కోలోన్‌లో నెల రోజులు శిక్షణ పొందాను. 14 దేశాల నుంచి 14 మంది డైరక్టర్లు హాజరయ్యారు. అదొక వింత అనుభవం. నాతో బాటు పాట్నా డైరక్టరు గ్రేస్ కుజ్జూర్ కూడా హాజరయ్యారు.
1999లో ఢిల్లీలోని Indian Institute of Public Administrative వారు రెండు వారాలు Leadership States అనే పేర శిక్షణ ఇచ్చారు. ఇవన్నీ అనుభవాల దొంతరలో పొరలు.
నేను హైదరాబాదులో పని చేస్తుండగా ఈ సంస్థలో అనుబంధం ఏర్పడింది. ఆ సంస్థ అధ్యక్షులు సీనియర్ IAS అదికారి యం.రామకృష్ణయ్య. ప్రధాన కార్యదర్శి డా.టంగుటూరి సూర్యనారాయణ. ఈ సంస్థ పక్షాన నేను సమన్వయకర్తగా చాలా శిక్షణ కార్యక్రమాలు నాలుగేళ్లలో 1982-86 బాగా జరిపాము. 1986 అక్టోబరులో సాంఘిక కార్యకర్తల శిక్షణా కార్యక్రమానికి డైరక్టర్‌గా వ్యవహరించాను. 86 నవంబరులో జాతీయ సమైక్యతపై సెమినార్ జూబ్లీహాల్లో ఏర్పాటు చేశాము. గవర్నరు శ్రీమతి కుముద్ బెన్ జోషీ, మాజీ మహారాష్ట్ర గవర్నరు కాసు బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
నిత్య విద్యార్ధినైన నేను భారతీయ విద్యాభవన్, హైదరాబాదు సాయం కళాశాలలో పబ్లిక్ రిలేషన్స్ డిప్లమో కోర్సుకు డబ్బు కట్టాను. రోజూ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు క్లాసులు. క్రమంగా తప్పకుండా హాజరై, అడ్మిషన్ సమయంలో ప్రిన్సిపాల్ వి.హెచ్.దేశాయ్ (స్వాతంత్ర సమరయోధులు) కిచ్చిన మాట ప్రకారం మంచి మార్కులు తెచ్చుకొని దేశ వ్యాప్తంగా ప్రథముడిగా నిలిచి స్వర్ణ పతకము, రజతపతకము పొందాను. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.భాస్కరన్ చేతుల మీదుగా 1986 మార్చి 10న జరిగిన స్నాతకోత్సవంలో స్వీకరించాను.
ఓపెన్ యూనివర్శిటీ వారి పి.ఆర్ క్లాసులు రెండేళ్లు వరుసగా తీసుకున్నాను. సి.వి.నరసింహారెడ్డి నా చేత వాళ్లకు పాఠాలు వ్రాయించారు. ఈ విధంగా ఐదేళ్ల హైదరాబాదు నగర జీవనయానం ఫలప్రదం చేసుకొని ఏప్రిల్ 1987న దేశ రాజధానికి బయలుదేరాను.
తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
ప్రతివారం అందిస్తున్న మీ అనుభవాలు నేటి తరాలకు స్పూర్తి సర్
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™