[శ్రీ శింగరాజు శ్రీనివాసరావు రచించిన ‘అ(స)బల’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]


నిజాల చొక్కాను విప్పేసి
ఊహల ఉత్తరీయాన్ని వేసుకుని
ఆకాశంలో నడిచిపోతున్నాడు
గుండె గదుల చుట్టూ సిమెంటు గోడకట్టి
మానవత్వపు ధ్వనులను
మరుగున పడవేశాడు
కంటి రెటీనా మీద
కామపు లెన్సు వేసుకుని
చీరకు చిల్లులు పెడుతున్నాడు
పుట్టిన చోటును మరచి
పుట్టగొడుగుల కోరికలకు బానిసై
పశువుగా మారిపోతున్నాడు
ఒగుడాకులను గాలికి వదిలేసి
ఒంటరి కుంపట్లు పెట్టుకుని
మనిషిగా మాయమై పోతున్నాడు
వంపులు లేని మాంసపు ముద్దను
రొమ్ములు రాని పసికూనను
రాక్షసుడై రమిస్తున్నాడు
అమ్మ పొత్తిళ్ళలో బిడ్డలు
రుధిర చారికలతో రోదిస్తున్నారు
తిమిరంతో సమరం చేస్తున్నారు
గంతలు కట్టుకున్న గాంధారులు ఇకనైనా
కళ్ళు తెరిచి నిజాలను చూడాలి
జీవితాలను కాల్చిన వాళ్ళను
జీవితం నుండి నెట్టివేయాలి
కూరలు తరిగే చేతులు కత్తులు కావాలి
పొంగులు దాచిన కొంగులు ఉరితాళ్ళు కావాలి
అబలను తొక్కిపెట్టి, సబల రుద్రమూర్తి కావాలి