తండ్రి మాట జవదాటని సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు!
తోడబుట్టిన వాళ్ళకి రాజ్యాన్ని అప్పగించి
తండ్రికిచ్చిన మాటకై
అడవుల బాట పట్టిన మహనీయుడు శ్రీరాముడు!
త్రేతాయుగంలో
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై
అవతరించిన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు
మానవ రూపమే శ్రీరాముడు!
పర స్త్రీ వ్యామోహంతో దశకంఠుడు సీతామాతను అపహరిస్తే
అరణ్యాలను, కొండకోనలను, గుట్టలను, చెట్ల సమూహాలను,
సముద్రాన్ని సైతం దాటుకుని వెళ్లి..
రావణుడిని సంహరించి
సీతాదేవిని కాపాడి అయోధ్యను చేరిన యోధుడు శ్రీరాముడు!
వానరమైన ఆంజనేయుడికి స్నేహ హస్తాన్ని ఇచ్చి
చిరంజీవిగా ఉండేలా అభయమిచ్చిన కరుణామూర్తి శ్రీరాముడు!
రాయిగా మారిన అహల్యకు..
తన పాద స్పర్శతో
శాపవిమోచనం కలిగించి
అనుగ్రహించిన మహిమాన్వితుడు
సౌమ్య స్వరూపుడు శ్రీరాముడు!
భక్తితో ఎంగిలి పండ్లను నైవేద్యంగా అందించిన
శబరిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ఆదరించిన
ఉత్తముడు శ్రీరాముడు!
‘శ్రీరామ’ నామాన్ని భక్తితో స్మరిస్తే
గుండెల్లో కొలువై
సన్మార్గంలో నడిపే దైవం.. శ్రీరాముడు!
తన పాలనలో స్వర్ణయుగాన్ని లోకానికి పరిచయం చేసిన
పాలనాదక్షుడు శ్రీరాముడు!
ఆర్తితో పిలిస్తే ఆఘమేఘాల్లో వచ్చి కాపాడే భక్తసులభుడు శ్రీరాముడు!
రామచరిత ఇలలో ఘనమైనది!
రాములోరి కీర్తి అనంతమైనది.. ఆదర్శనీయమైనది!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.