[శ్రీరామనవమి సందర్భంగా శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఆదర్శప్రాయుడు శ్రీరాముడు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


తండ్రి మాట జవదాటని సుపుత్రుడు
అడవులు బాట పట్టిన వీరుడు!
సహోదరుల పట్ల
అమిత వాత్సల్యంతో
మసలుకున్న ఉత్తముడు!
కట్టుకున్న భార్యను
రావణుడనే రాక్షసుడు అపహరిస్తే
సముద్రాన్ని నిలువునా చీల్చి
వారధిని నిర్మించి
లంకకు చేరి
దశకంఠుడిని సంహరించిన అజేయుడు!
రామభక్తితో
సదా రామనామ స్మరణతో
దగరైన ఆంజనేయుడిని గుండెలకి హత్తుకున్న
సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం!
భక్తితో ఎంగిలి పండ్లను సమర్పించిన శబరికి
మోక్షాన్ని ప్రసాదించిన
మహిమాన్వితుడు సద్గుణ సంపన్నుడు!
రాతిని నాతిగా మార్చి
ఇలలో జనులచే కీర్తించబడిన
రఘువంశ ఘనుడు!
‘శ్రీరామ’ అంటూ మనస్సున తలిస్తే
సకల పాపాలను తొలగించి
మనసంతా భక్తి పారవశ్యాన్ని నింపే
ఆనందకారకుడు శ్రీరాముడు!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
1 Comments
తుర్లపాటి నాగేంద్ర కుమార్
సుధా రాణి గారి కధకి, సూక్ష్మ రూపంలా ఉంది, మీ కవిత. అభినందనలు.