[శ్రీమతి గాడేపల్లి పద్మజ గారి ‘అక్షరంబు లోక రక్షితంబు’ అనే రచనని అందిస్తున్నాము.]


విద్యాసుగంధాలు ఇంకా లోకమంతటా వ్యాపించని రోజులవి. సరస్వతీ అనుగ్రహాన్ని చాలా కొద్దిమంది మాత్రమే పొంది, దాన్ని ఆస్వాదిస్తున్న రోజులలో, ఒక విషయాన్ని లేదా ఒక వార్తను బంధువులకు గానీ, స్నేహితులకు గాని, మనిషి సాయంతో తెలియజేసేవారు. రాజుల కాలంలో వార్తాహరులుండేవారు. పావురాళ్ళ ద్వారా వార్తలు పంపేవారు. వెంటనే వార్త చేరవేసే అవకాశం ఉండేది కాదు. తరువాత కొంత కాలానికి పోస్టాఫీసులు వెలిశాయి. వీటి ద్వారా వార్తలు రెండు, మూడు రోజుల్లో గమ్యానికి చేరేవి. గౌరవప్రదమైన సంబోధనతో మొదలుపెట్టి, ప్రతి చిన్న విషయాన్ని వివరంగా కార్డు, లేదా కవరు మీద ముత్యాల్లాంటి అక్షరాలతో పొందుపరచేవారు. ఒక్కొక్కరినీ పేరుపేరునా అడిగినట్లు చెప్పు అంటూ ఉత్తరం ద్వారా కుశలము అడిగేవాళ్ళు. కానీ ఉత్తరము చదవాలంటే – ఆ రోజుల్లో ఊరు మొత్తం మీద చదవగలిగిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉండేవాళ్ళు. నాలుగైదు ఊళ్ళకొక పోస్టాఫీసు ఉండేది. ఉత్తరం రావడం చాలా అరుదు. ఉత్తరం ఎప్పుడన్నా వచ్చినా చదివేవాళ్ళు దొరకడం కష్టం.
అలాంటి టైంలో ఒక ఊళ్ళో సోమిదేవమ్మకు ఒక ఉత్తరం వచ్చింది. పోస్టమాన్ సింగయ్య వచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. ఆమెకు అదే మొదటి ఉత్తరం కావడంతో, ఎవరు రాశారో ఏంటో? అంటూ భయంతో ఆమె గుండె గుబగుబ లాడింది. ‘ఓయమ్మో నాకా ఉత్తరం? ఎవరికి ఏ ప్రమాదం వచ్చిందో ఏంటో?’ అని భయపడుతూ, “ఇదిగో సింగయ్యా, కాస్త ఉత్తరం చదివి పెడుదూ” అని అడిగింది పోస్ట్మాన్ను. “ఇప్పుడు కుదరదమ్మ. పక్కూరు పొయ్యిరావాలి. ఇవాళ నాలుగు ఉత్తరాలున్నాయి. వచ్చేటప్పుడు వస్తాలే” అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు పోస్ట్మాన్. ఇక తన కంగారునూ, ఉత్సుకతను ఆపుకోలేక పోయింది సోమిదేవమ్మ. హఠాత్తుగా ఆవిడకు ప్రక్కింటి భద్రయ్య అల్లుడు సుందరం పట్నం నుండి వచ్చాడని గుర్తొచ్చింది.
సామాన్యంగా పట్నంలో వాళ్ళంతా చదువుకుని ఉంటారనుకుని, ఉత్తరం తీసుకుని సుందరం దగ్గరకు వెళ్ళి చదవమంది. సుందరానికి ఒక్క ముక్క వస్తే ఒట్టు. చదవడం రాదని చెప్పలేని అమాయకుడు. దాంతో ఉత్తరం చూసి ‘వా’ అని రాగం తీస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చేరారక్కడ. ఎవరో పోయారనుకుని వాళ్ళు కూడ ఏడవడం మొదలుపెట్టారు. అందరు కలిసి రోడ్డు మీద ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ పెద్దగా ఏడుస్తున్నారు. ఇంతత పక్క ఊరు వెళ్ళిన పోస్ట్మాన్ తిరిగి వచ్చి, జరిగింది తెలుసుకున్నాడు. “ఏది ఉత్తరం” అని అడిగి తీసుకుని చదివాడు. “ఇదుగో సోమమ్మా, ఇది నువ్వు ఏడ్చే సమయం కాదు. సంతోషించవలసిన సమయం. పదేళ్ళ క్రితం కాశీకి పోయిన మీ ఆయన రేపు తిరిగి వస్తున్నాడు. అదే ఈ ఉత్తరంలో వ్రాశాడు. సంతోషపడాల్సింది పోయి ఏడుస్తున్నావా?” అనడంతో నివ్వెరపోయింది సోమిదేవమ్మ.
ఆ రోజుల్లోని మనుషుల అమాయకత్వానికి పరాకాష్ఠ ఇది. ఆ రోజుల్లో చదువుకోవాలని ఉన్నా విద్యావకాశాలు లేక అక్షరజ్ఞానం పొందలేని వారెందరో? నిరక్షరాస్యులైన వీరితో జ్ఞానాన్ని తట్టిలేపింది విద్య. ఇప్పటి మన సమాజంలో అలాంటి సమస్యలు మచ్చుకైనా లేవు. అయితే విద్యావంతుడౌతున్న ప్రతి వ్యక్తి చదువుతో బాటు సంస్కారం నేర్చుకుంటేనే ఆ విద్య పరిపూర్ణమవుతుంది అనేది అక్షర సత్యం.
*సమాప్తం*
