హేమంతం తన విలాసం చూపుతూ కాస్తంత వణికిస్తున్న వేళ.. అప్పటిదాకా ముద్దబంతుల సొగసును తిలకిస్తున్న నేను తలుపు మూసి లోపలికి వచ్చి కుర్చీ నాశ్రయించాను. ఎదురుగుండా టేబుల్ మీద పేపర్లో తిరుప్పావై పాశురం, తాత్పర్యం.. గోదాదేవి కథ కనిపించాయి. నా మనోనేత్రం అక్కడ చిక్కుకుంది. శ్రీకృష్ణదేవరాయలు గోదాదేవి కథనే కదా ‘ఆముక్తమాల్యద’ పేరుతో రచించాడు. దానికే ‘విష్ణుచిత్తీయం’ అని మరో పేరు కూడా ఉంది. ఈ తెలుగునాట ఎన్నెన్ని కథలు, గాథలు.. వేటి ప్రత్యేకత వాటిదే. అయితే ‘తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి’ అన్నది ఆర్యోక్తి. అది ప్రత్యక్షర సత్యం. మహాభారతాన్ని మించిన రచన లేదంటే అతిశయోక్తి కాదు. అన్నిరకాల మానవ ప్రవృత్తులకు, ఊహాతీత అంశాలకు నెలవైంది మహాభారతం. అందులోనే అసంఖ్యాక ఉప కథలు. అసలు జీవితం నుంచి కథను విడదీయలేమేమో. ఎందుకంటే నిత్యం మన ముందే ఎన్నో కథలు.
లేటుగా ఇల్లు చేరినందుకో, లేదా అర్థాంగి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోనందుకో కొందరు భర్తలు, భార్యలకు చెప్పే కథలు, ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లిన ఉద్యోగి పై అధికారికి చెప్పే కథలు, మూడు రోజులు చెప్పా పెట్టకుండా పని ఎగ్గొట్టి ఆ మర్నాడు వచ్చి పని మనిషి చెప్పే కథలు, అప్పు కోసం అప్పారావులు చెప్పే కథలు కట్టుకథలు.. పిల్లలు నిద్రపోయే ముందు ‘కథ చెప్పవూ’ అంటే అమ్మమ్మో, తాతయ్యో, బామ్మో, అమ్మో, నాన్నో వినిపించే కథలు మామూలే. చాలా కథలు ‘అనగనగా..’తోనే మొదలవటం మొన్నటి వరకు పరిపాటి. ఇప్పటికీ పిల్లల కథలు చాలావరకు అలాగే కొనసాగుతున్నాయి.. అనుకుంటూ ఉంటే పాటొకటి గుర్తొచ్చింది…
అనగనగా ఒక రాజు.. అనగనగా ఒక రాణిరాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్నఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారువారు చదువు సంధ్యలుండి కూడ చవటలయ్యారు..వట్టి చవటలయ్యారు..పడకమీద తుమ్మ ముళ్లు పరిచెనొక్కడుఅయ్యో ఇంటిదీప మార్పివేయ నెంచె నొక్కడు..తల్లితండ్రులు విషమని తలచెనొక్కడుపడుచు పెళ్లామే బెల్లమని భ్రమ సెనొక్కడు… ॥అనగనగా॥కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచిప్రేమయనే పాలుపోసి పెంపు చేసేనుకంటిపాప కంటె యెంతో గారవించెనుదాని గుండెలోన గూడుకట్టి ఉండసాగెను, తానుండసాగెను ॥అనగనగా॥నాదినాది అనుకున్నది నీది కాదురనీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా..కూరిమి గలవారంతా కొడుకులేనురా..జాలిగుండెలేని కొడుకుకన్న కుక్క మేలురా, కుక్క మేలురా ॥అనగనగా॥
ఒక జీవిత కథను కొద్ది పంక్తులలో పాటగా ఎంతో అర్థవంతంగా ‘ఆత్మబంధువు’ చిత్రానికి అందించారు ఆత్రేయ. ఇది నేటికీ ఎందరో తల్లిదండ్రుల మనో వేదనాగీతం. మనిషికి అమితమైన ఆసక్తిని కలిగించేవి కథలు. దీనికి దేశ, భాష, కాల బేధాలేమీ లేవు. పిల్లలకు, పెద్దలకు కూడా కథలంటే చెప్పలేనంత ఇష్టం. కథలు ఎన్నోరకాలు. పౌరాణిక కథలు, రాక్షసుల కథలు, జానపద కథలు, రొమాంటిక్ కథలు, ప్రేమ కథలు, హాస్య కథలు, సస్పెన్స్ కథలు, క్రైమ్ కథలు, చారిత్రక కథలు, ఆత్మకథలు, మహాత్ముల జీవిత చరిత్రలు, తాత్విక కథలు, రాజకీయ కథలు, అభ్యుదయ కథలు, స్త్రీవాద కథలు, దళితవాద కథలు ఇలా ఎన్నో. ఇప్పుడైతే ఒక్కో అంశం మీద, ఒక్కో ప్రాంతం మీద కథలు, కోటల కథలు, నదుల కథలు, పుణ్యక్షేత్రాల కథలు.. విభిన్నాంశాలతో కోకొల్లలుగా వస్తున్నాయి. ఇక హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు వంటివి ఒక ప్రత్యేక శైలిలో ఇద్దరో ముగ్గురో కలిసి, పాటలు, పద్యాలు, మధ్య వ్యాఖ్యానం, హాస్య, చతురసంభాషణంతో ప్రేక్షక సమూహాన్ని అలరించే కథారూపాలనవచ్చు. హరికథ అనగానే ‘వారసత్వం’ చిత్రంలో ఘంటసాల పాడిన సీతా కల్యాణ సత్కథ గుర్తొస్తుంది.
శ్రీనగజా తనయం.. సహృదయం..చింతయామి సదయం త్రిజగన్మహోదయం..శ్రీరామభక్తులారా.. ఇది సీతాకల్యాణ సత్కథ..నలుబది రోజులనుంచి చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నా.అంచేత కించిత్తు గాత్రసౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయనా! కాస్త పాలు, మిరియాలు ఏవైనా..చిత్తం.. సిద్ధంభక్తులారా.. సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచివిచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షిషంచిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి ఆహ్హ!అతడెవరయ్యా అంటే.. రఘురాముడు, రమణీయ వినీల ఘనశ్యాముడురమణీయ వినీల ఘనశ్యాముడువాడు నెలరేడు, సరిజోడు మొనగాడువాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురావానిచూచి మగవారలైన మైమరచిమరుల్కొనెడు మరోమరుడు మనోహరుడు, రఘారాముడూ..
ఆత్రేయ నిర్మించిన ‘వాగ్దానం’ చిత్రానికి శ్రీశ్రీ ఈ హరికథ రాయటం విశేషం. అయితే ఇందులో ‘ఫెళ్లుమనె విల్లు.. గంటలు ఘల్లుమనె’ పద్యం కరుణ శ్రీ గారి ‘శివధనుర్భంగం’ లోనిది. అలాగే ‘భూతలనాథుడు రాముడు’ పద్యం పోతనవిరచిత భాగవతంలోని నవమస్కంధంలో ఉన్న శ్రీరామచరిత్ర లోనిది.
ఇక సినిమాలలో బుర్రకథల పాటలకూ లోటులేదు. ‘పూలరంగడు’ చిత్రంలోని ఓ చక్కని బుర్రకథ మదిలో మెరిసింది.
వినరా భారత వీర సోదరా విజయము నీదేరా.. తందాన తానకళ్లు తెరిచి నీ దేశ పరిస్థితి ఒక్కసారి కనరా.. తందాన తాననీ తాతలు తండ్రులు దేశం కోసం త్యాగం చేశారు.. తందాన తానస్వతంత్రమే మన జన్మహక్కని చాటి చెప్పినారుబానిసతనముకన్న మరణమే మేలని అన్నారుమరఫిరంగుల గుండు దెబ్బలకు రొమ్ములొడ్డినారుపరాయి దొరలను ధర్మయుద్ధమున పారద్రోలినారుఅమూల్యమైన స్వతంత్ర్యము నీకప్పగించినారు..
చదువు అంతగా లేని కాలంలో తెలుగు ఇళ్లలో పెద్దలు కథలు చెపుతుంటే, పిల్లలు, ఇతరులు కూడా వినడం సర్వసాధారణంగా జరిగేది. కథ చెప్పటం ఆషామాషీ కాదు. అది ఒక కళ. వినేవారికి ఆసక్తికరంగా ఉండేలా, ముందేం జరుగుతుందో అనే ఉత్సుకత కలిగేలా చెప్పాలి. కథ చెపుతూ ఉంటే వింటున్నందుకు గుర్తుగా ఊఁ కొట్టడం మామూలే. గుర్తు తెలియని కాలం నుంచి మన తెలుగునాట తూర్పుదేశాల కథలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేవి. తెలుగు కథ పురుడు పోసుకుని వందేళ్ల పైచిలుకు మాటే. తొలి కథ భండారు అచ్చమాంబ రాసిన ‘ధనత్రయోదశి’.ఇక పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలివాన’ కథతో తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈ కథకు పందొమ్మిదివందల యాభై రెండులో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథానికల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది.
పిల్లలకు కథలంటే ఇష్టం అనే మాట అటుంచితే, ఏ విషయమైనా కథగా చెపితే సులభంగా అర్థం చేసుకుంటారనేది కాదనలేని వాస్తవం. తెలుగునాట ఏనాటినుంచో వాడుకలో తరతరాలుగా చెప్పు కునే కథ ‘అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లారు. ఏడు చేపలు పట్టారు. ఏడు చేపల్ని ఎండలో పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు..” ఇది తెలియని వారుండరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తాతయ్యలు, అమ్మమ్మలు పిల్లలకు ఈకథ చెప్పటం, పిల్లలు ఆసక్తిగా వినటం, చివరకు ‘చీమచీమా ఎందుకు కుట్టావ్ అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా మరి’ అంది అనే మాట పిల్లలకు ఎంతో నచ్చటం మామూలే. అసలు రాజకుమారులు చేపలు పట్టి ఎండ పెట్టడమేమిటని ఇటీవలికాలం వరకు ఎవరూ సందేహం వ్యక్తం చేయలేదు. అయితే ఈ మధ్య ఈకథలో తాత్త్వికత దాగి ఉందన్న వివరణ వెలుగులోకి వచ్చింది. అది.. ఈ కథలో రాజు అంటే మనిషి, ఏడుగురు కొడుకులు మనిషిలోని సప్తధాతువులు, వేటకు వెళ్లటం జీవితం, ఏడు చేపలు పట్టారన్నది మనిషి లోని సప్త వ్యసనాలకు (కామం, వేట, జూదం, మద్యపానం, వాక్ పారుష్యం, దండ పారుష్యం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేయటం) సంకేతం, ఎండ పెట్టడం అంటే సాధనతో మనిషి తన లోని వ్యసనాలను జయించటం. ఏడింటిలో ఆరింటిని జయించ గలిగినా కామాన్ని జయించటం కష్టం. మోక్షసాధనకు అదే ప్రతిబంధకం. ఆ ఏడో చేప ఎండక పోవటానికి కారణం గడ్డిమోపు.. అంటే అజ్ఞానం. అజ్ఞానం పోకపోవటానికి కారణం ఆవు మేయక పోవటం.. ఆవు ఇక్కడ జ్ఞానానికి ప్రతీక.
జ్ఞానం కలగనిదే అజ్ఞానం పోదు. కారణం గొల్లవాడు మేపక పోవడమే.. అంటే సద్గురువు బోధ లేకపోవడమే. గొల్లవాడు మేపక పోవడానికి కారణం అమ్మ అన్నం పెట్టక పోవడం.. అంటే జగన్మాత, సద్గురువును పంపలేదని.. అమ్మ అన్నం ఎందుకు పెట్టలేదంటే పిల్లవాడు ఏడవటం.. అంటే జగన్మాత కోసం ఆర్తితో పరితపించడం. మరి అటువంటి వారికే కదా ఆమె ఇచ్చే తొలి ప్రాధాన్యత. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడంటే చీమ కుట్టినందుకు. చీమ అంటే సంసారం.. మనల్ని అంటి పెట్టుకుని ఉండే సమస్త భావాలు. చీమ కుట్టడానికి కారణం దాని బంగారు పుట్టలో వేలు పెట్టడమే. నిజానికి చీమలవి మట్టిపుట్టలే. కానీ మనిషికి సంసారంపట్ల అనురక్తి కలగటం వల్లే అది బంగారు పుట్ట. చివరకు అనురక్తిపోయి సంసారబాధల నుండి తనను రక్షించమని దైవం కోసం మనిషి పరితపిస్తాడు.
ఇక పిల్లలకు ఈ కథలో నీతి చెప్పాలంటే అనవసరమైన వాటి జోలికి పోయి ప్రమాదాలు తెచ్చుకోకూడదని.
‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో వేటూరివారు..
కట్టుకథలు సెప్పి నేను కవ్విస్తే, నవ్విస్తేబంగారు బాల పిచ్చుక మా మల్లి నవ్వాల పకాపకమళ్లీ మళ్లీ నవ్వాల పకాపకా..అనగనగా ఓ అల్లరి పిల్లోడుఒకనాడా పిల్లోణ్ణి సీమ కుట్టిందిసీమ కుట్టి సిన్నోడు ఏడుస్తుంటే,సీమా సీమా ఎందుకు నువ్వు కుట్టావంటేపుట్టలో ఏలెడితే కుట్టనా, నా పుట్టలో ఏలెడితే కుట్టనా..నేనూ కుట్టనా, అంటా కుట్టనా అన్నది..
అంటూ ఎంతో అందంగా పాటనల్లి నవ్వించారు. కాకి తెలివి, బాతు-బంగారు గుడ్డు, తాబేలు-కుందేలు, నాన్నాపులి వంటి కథలు ఆనాటి నుంచి ఈనాటివరకు మళ్లీ మళ్లీ చెప్పుకుంటూనే ఉన్నాం. పంచతంత్ర కథలు, భేతాళ కథలు, అమ్మమ్మ కథలు, తాతయ్య కథలు, అద్భుత సాహస కథలు ఇలా అనేకం. ఉమ్మడి కుటుంబాలు పోయి, అమ్మమ్మ, నానమ్మ, తాత చెప్పే కథలకు పిల్లలు దూరమైన నేటికాలంలో కొంతమంది అమ్మమ్మలు పాఠశాలలకే వెళ్లి పిల్లలకు కథలు చెప్పటం సంతోషదాయకం. అన్నట్లు కథ చెప్పడం పూర్తికాగానే ‘కథ కంచికి మనం ఇంటికి’ అంటుంటాం. దాని అంతరార్థం ఏమిటన్న దానిపై సామవేదం షణ్ముఖశర్మ గారు ఇలా వివరించారు.. గతంలో దక్షిణాదిలో కాంచీపురం గొప్ప విద్యా కేంద్రం. అక్కడ ఘటికాస్థానాలు అంటే విద్యా స్థానాలు ఉండేవి. సకలశాస్త్ర పండితులు ఉండేవారు. రచయితలు ఎవరు ఏ గ్రంథం రచించినా ముందుగా అక్కడికి పంపటం నియమంగా ఉండేది. అక్కడి పండితులు వాటిని పరిశీలించి, శాస్త్ర సమ్మతమని ఆమోదముద్ర వేసి పంపితే ఆ గ్రంథాలకు గౌరవం చేకూరేది. ఆ రకంగా ‘కథ కంచికి, మనం ఇంటికి’ వచ్చింది. తెలుగు చిత్రాల్లో కథను ఇముడ్చుకున్న పాటలెన్నో అనుకోగానే ‘పండంటి కాపురం’ చిత్రంలో పాట గుర్తుకొచ్చింది.
బాబూ వినరా.. అన్నాతమ్ములా కథ ఒకటీకలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం..ఒక్క మాట పై ఎపుడు నిలిచారు వారుఒక్క బాట పై కలసి నడిచారు వారు..అన్నంటే తమ్ములకు అనురాగమే..అన్నకు తమ్ములంటే అనుబంధమే.. ॥ బాబూ వినరా॥
దాశరథి రాసిన ఈ పాట ఆనందగీతం అయితే, ఇదే పల్లవితో ఇదే బాణిలో విషాద గీతం కూడా ఉంది.
శ్రీరాముడికి సంబంధించి, రామకథను తెలిపే సినీగీతాలు చాలానే ఉన్నాయి.
రామకథా.. శ్రీరామ కథఎన్నిసార్లు ఆలించిన గానీ, ఎన్ని మార్లు దర్శించిన గానీతనివితీరని దివ్యకథా, కన్నుల విందౌ పుణ్య కథా.. ;వినుడు వినుడు రామాయణ గాథా, వినుడీ మనసారా …ఆలపించినా, ఆలకించినా ఆనందమొలికించే గాధ.. ;శ్రీరాముని చరితమును వినుడోయమ్మా.. ఘన శీలవతి సీతకథ వినుడోయమ్మా.. ;రామకథను వినరయ్యా… ఇహపర సుఖములనొసగే..సీతారామకథను వినరయ్యా.. ఇలా ఎన్నెన్నో…
‘జయభేరి’ సినిమాలో శివభక్తుడు నందుడి కథను తెలిపే పాటను శ్రీశ్రీ ఎంతో గొప్పగా రాశారు. అది..
అధికులనీ, అధములనీ నరుని దృష్టిలోనే భేదాలుశివుని దృష్టిలో అంతా సమానులే..నందుని చరితము వినుమా.. పరమానందము గనుమా..
అలాగే ‘భక్తకన్నప్ప’ చిత్రంలో వేటూరి గారు కిరాతార్జునీయం కథను పాటగా అనుపమానంగా రాశారు.
తకితథక తకతకిత జకిత పదయుగళ..నికట గంగాస్తవిత మకుట తట నిగళా..జయజయ మహాదేవ శివశంకరా..హరహర మహాదేవ అభయంకరాఅని దేవతలు శివుని కొనియాడ..పరవశమున శివుడు తాండవమాడగాకంపించెనింతలో కైలాసమావేళ ..కనిపించెనంత అకాల ప్రళయ జ్వాల..
పదాల పొహళింపు గొప్పగా ఉంటుంది.
యుగళ గీతాల్లోనూ కథ వినిపిస్తూనే ఉంటుంది.
తెలిసిందిలే, తెలిసిందిలే.. నెలరాజ నీరూపు తెలిసిందిలే..సొగసైన కనులేమో నాకున్నవిచురుకైన మనసేమో నీకున్నది.. అని ఆమె అంటేకనులేమిటో, ఈ కథ ఏమిటోశ్రుతి మించి రాగాన పడనున్నది, పడుతున్నది.. అంటాడతను.
మావి చిగురు తినగానే కోయిల పలికేనాకోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..ఏమో ఏమనునోగానీ ఆమని.. ఈవని.ఒకరి ఒళ్లు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాలఉయ్యాల.. జంపాల.. జంపాల.. ఉయ్యాలఒకరి పెదవి పగడాలో.. వేరొకరి కనుల దివిటీలో..పలకరింతలో.. పులకరింతలోఏమో.. ఏమగునోగానీ ఈ కథ.. మన కథ..
అలాగే ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో సినారెగారు రాసిన
చెప్పాలని వుంది.. చెప్పాలని వుంది
దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని వుంది… చాలా హిట్ పాట. సినారె గారే ‘కలెక్టర్ జానకి’ చిత్రానికి అందించిన పాట…
అనగనగా ఒక చిలకమ్మా, అనగనగా ఒక రామయ్యా పాటలో అన్యోన్యంగా ఉన్న కాపురంలో కలతలు తలెత్తిన కథను ఎంతో అర్థవంతంగా పొదిగారు.
అలాగే ‘అంతులేని కథ’ చిత్రంలో ఆత్రేయ అందించిన
తాళికట్టు శుభవేళ మెడలో కల్యాణమాల..ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో..వికటకవిని నేను.. వినండి ఒక కథ చెపుతాను..కాకులు దూరని కారడవి..అందులో కాలం యెరుగని మానొకటి..
అనే పాట ఎంతో పాపులర్. హిందీ పాటల్లోనూ కథను వినిపించే పాటలెన్నో.
‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ చిత్రంలో ఆనంద్ బక్షీ రాసిన ఓ ప్రేమకథా గీతం ఎంతో బాగుంటుంది. అది..
ఏక్ థ గుల్ ఔర్ ఏక్ థి బుల్ బుల్దోనో చమన్ మే రహ్తే థీహై యే కహానీ బిలుకుల్ సచ్చీమేరే నానా కహ్తే థే…
కథలు వాటి నిడివిని బట్టి.. కాలమ్ కథలు, సింగిల్ పేజీ కథలు, చిన్న కథలు, పెద్ద కథలు.. అదీ దాటితే నవల. నాటకానికైనా, సినిమాకైనా, సీరియల్ కైనా కథే కీలకం. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథలు బుద్ధుని జాతక కథలు, సింద్బాద్ కథలు, అరేబియన్ నైట్స్ కథలు, గల్లీవర్ సాహసయాత్ర వగైరాలెన్నో. ఇక మన దేశంలో భోజరాజు కథలు, కాశీమజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, మర్యాదరామన్న కథలు, అక్బర్-బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యులకథలు. ఇలా ఎన్నెన్నో. కథలేవైనా మానవ జీవితాల్లోంచి, అనుభవాల్లోంచి జనించేవే. కొంత కల్పన ఉన్నప్పటికీ, వాస్తవికత మిళితమయ్యే ఉంటాయి. కథలు కేవలం కాలక్షేపానికి కాదు. కథలు ఆయా కాలమాన పరిస్థితులను రికార్డు చేస్తాయి. కథల్లో ఎన్నోరకాల మనస్తత్వాలను, పరిస్థితులను, సమస్యలను, పరిష్కారాలను, అనేకానేక ప్రదేశాలను పరిచయం చేస్తాయి. అయితే కథలను రచయితలు తమ ఇష్టమైన రీతిలో, ఊహ కనుగుణంగా మలుపులు తిప్పగలరు, ముగింపునివ్వగలరు. కానీ నిజ జీవితంలో అది కుదరని పని. ఎంత గొప్ప సస్పెన్స్ కథలు రాసినా, జీవితాన్ని మించిన సస్పెన్స్ కథ ఉండబోదు. రచయితకు అక్షర సేద్యమే ఆనందాన్నిస్తుంది, తృప్తినిస్తుంది, సాంత్వన నిస్తుంది. చైతన్య పరిచినా, సందేశమిచ్చినా, సంతోషమిచ్చినా, సేదతీర్చినా, పాఠకుణ్ణి ఆత్మావలోకనానికి ప్రేరేపించినా, ఎంతో కొంత జ్ఞానాన్ని పెంచినా అది తప్పకుండా మంచికథే అవుతుంది.. మొబైల్ మోగటంతో ఉలిక్కిపడ్డాను.చూస్తే కల్పన..
‘కథల సంపుటి’కి కథ రాస్తున్నావా? అంటూ…
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 60కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. భూమిక కథల పోటీలో ఒకసారి బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన వంటి కాలమ్‌లు రాశారు.
From J Guru Prasad Wonderful narration by smt syamala garu regarding our telugu culture and telugu movies and telugu Poets From J Guru Prasad 9a
From J Guru Prasad Wonderful narration by smt syamala garu regarding telugu culture and beautiful movies and telugu Poets From J Guru Prasad
మంచి వ్యాసం కధ గురించిన వ్యాసం మంచి పాత పాటలను జ్ఞాపకం తెచ్చిన వ్యాసం పాటలలో హరికథలు బుర్ర కధలను ఉదహరించిన వ్యాసం రచయిత్రి గారికి అభినందనలు
వ్యాసం బహు బాగుంది పాత పాటలను అందులో బుర్ర కధలు హరికధలు ఉదహరించిన తీరు బాగున్నాయి రచయిత్రి కి ధన్యవాదాలు
Very interesting narration of social and cultural activity of sharing stories. The philosophical interpretation of the story of king and seven sons deserves special appreciation. Congratulations to the writer.
కధానందలహరి శ్రీమతి శ్యామల కలం నుండి జాలువారిన మరో మంచి వ్యాసం. రాసే దాని మీద పూర్తి సాధికారత కలిగిన రచయిత్రుల లో శ్యామల గారు ఒకరు అనడానికి ఎలాంటి సందేహము లేదు.
కధల్లో ఇన్ని రకాలు ఉంటాయి అని ఈ రచన వల్లే తెలిసింది.ముఖ్యంగా కథ కంచికి మనం ఇంటికీ అనే సామెత మూలాన్ని తెలిపినందుకు ధన్యవాదములు ఈసారి శ్యామలగారి రచనసేద్యంలో మంచి కధాపంట పండింది.అద్భుతమైన రచనలు అందించిన శ్యామల గారికి హృదయపూర్వక ధన్యవాదములు
కథల్లో ఇన్ని రకాలుంటాయా? నిజంగా అద్భుతం. తెలియని ఎన్నో విషయాలు ఇంత ఓపికగా మాకు తెలియజేసిన శ్యామలగారికి ధన్యవాదాలు.
ఎవరైనా అసలు విషయాన్ని దాచి వేరే గా చెబుతూంటే ‘ కథలు చెప్పకు ‘ అంటాం. అసలు కథ అంటే ఏమిటో,ఎన్నిరకాల కథలు ఉన్నా యో,కథల అంతరార్థం ఏమిటో ,అవి కంచి కే ఎందుకు వెళతా యో అనే విషయాలను ఎంతో ఆసక్తి కరంగా అద్భుతమైన కథనం తో అందించిన శ్యామల గారికి అభినందనలు.
శ్రీమతి శ్యామల గారి”కథానందలహరి”ద్వారా మనం నిత్యం చదువుకునే కథల పూర్వ చరిత్రను తెలుసుకోగలిగాము.కథలలోని విభిన్నమైన పార్శ్వాలను కూడా తెలుసుకో గలిగాము.ఐతే… చాలామందికి తెలియని శ్రీశ్రీ గారి కథా రచనల విషయం రచయిత్రి వెలుగులోనికి తీసుకువచ్చి ఆయనలోని మరో కోణాన్ని సాహితీ ప్రపంచానికి చూపించారు.విప్లవకవి గా ముద్రపడిన శ్రీశ్రీ ఆత్రేయ గారి వాగ్ధానం చిత్రానికి రాసిన “శివ ధనుర్భంగం”హరికథ,జయభేరి చిత్రానికి రాసిన శివభక్తుడు నందుడు గురించిన కథా గాన రచన ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి.హిందీ చిత్రం జిల్ జిల్ ఫూల్ ఖిలే లోని ప్రేమకథా గీతాన్ని గుర్తు చేయడం కూడా ఆమె శోధనలోని ప్రత్యేకతను చాటుతోంది. విభిన్నంగా శ్రీమతి శ్యామల గారి రచనా వ్యాసంగాన్ని “సంచిక”లో ఆస్వాదిస్తున్న మనం అదృష్టవంతులం. కళాభివందనములతో విడదల సాంబశివరావు.
కథానందలహరి ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది. ఎన్నిపనుల్లో మునిగివున్నప్పటికీ ‘కథ’ అనగానే టక్కున చెవులు రిక్కించి వినడం పిల్లలకైనా..పెద్దలకైనా పరిపాటే.। రచయిత్రి గారు కథల గురించి ఎంతో పరిశోధన చేసి విలువైన సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా రాజుగారు-ఏడుగురు కొడుకులు- ఏడుచేపలు’ కథలోని అంతరార్థం విడమరచి చెప్పడం ఈ ఆర్టికల్ కే హైలైట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో వందల సంవత్సరాలనుంచీ తరతరాలుగా మౌఖికంగానే ప్రాచుర్యంలో ఉన్న ఈకథ అంతరార్థం ఒక శేషప్రశ్నగానే మిగిలిపోయిన నాలాంటి పాఠకులకు ఈ ఆర్టికల్ లో చక్కటి సంతృప్తికరమైన సమాధానం లభించింది. కథల నేపథ్యంలో ఉదహరించిన పాటలన్నీ చాలా బాగున్నాయి.. చక్కటి టాపిక్ ను చాలా బాగా ప్రజెంట్ చేసిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు.💐💐👏👏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™