

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటుడు అల్ నాసిర్:


వారి తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఘస్నవి. ఆయన ఫ్యాకల్టీగా, లా ఛాన్సలర్‌గా గౌరవప్రదమైన పదవిలో ఉండేవారు.
అల్ నాసిర్ ప్రాథమిక విద్యను డెహ్రాడూన్‌లోని కల్నల్ బ్రౌన్ స్కూల్లో అభ్యసించారు. ఆ తర్వాత కాబూల్‌కి వెళ్లి రెండేళ్లు చదువుకున్నారు. అందమైన, అగ్రశ్రేణి నటుడు కావాలని ఆయన కలలో కూడా అనుకోలేదు. అప్పట్లో ఆయన ఫ్లయింగ్ పైలట్ అయ్యేందుకు చాలా ఆసక్తి చూపారు. ఇందుకోసం బొంబాయి వెళ్లారు.
ఆ ప్రయత్నాలలో ఉండగా, ఒకరోజు తన స్నేహితుడిని కలవడానికి నేషనల్ స్టూడియోకి వెళ్ళారు అల్ నాసిర్. వారి స్నేహితుడు ఆయన్ని దర్శకుడు మెహబూబ్‌కి పరిచయం చేశాడు. మెహబూబ్ అల్ నాసిర్లో చారిత్రాత్మక పాత్రలకు నప్పే నటుడిని గుర్తించారు, సినీరంగంలో ప్రవేశించమని కోరారు. అల్ నాసిర్ నవ్వుతూ తన సమ్మతిని తెలిపారు. మెహబూబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 6 నెలల పాటు పనిలేకుండా సెట్లో ఉండేవారు నాసిర్. అయినా ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు అక్కడే ఉంటూ సినిమాలను ఎలా తీస్తారో శ్రద్ధగా గమనించేవారు. సహజంగా నేర్చుకునే గుణం ఉండటం వలన ఆయన చాలా వేగంగా నటన లోని సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకున్నారు. ఆయన నటుడిగా మారే సమయానికి, నేషనల్ స్టూడియో మూతపడింది. నేషనల్ స్టూడియోస్ పేరోల్‌లో ఉన్న దర్శకుడు మోహన్ సిన్హా 1942లో అల్ నాసిర్కి మొదటి సినిమా ‘ప్రీతమ్’ని అందించారు. ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూడలేదు.


అల్ నాసిర్ మూడుసార్లు పెళ్ళి చేసుకున్నారు, మొదట నటి మీనా షోరేతో, తరువాత మనోరమతో. చివరగా 1947లో ప్రముఖ నటి వీణాను వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు హుమా, అల్తమాష్ జన్మించారు.


అల్ నాసిర్ – ఎలుగుబంటి:
అల్ నాసిర్ మాటల్లోనే ఒక ఆసక్తికరమైన ఉదంతం! 09 జూన్ 1954న, అందాల సినీ నటుడు అల్ నాసిర్ భోపాల్ నుండి ‘ఫిల్మ్‌ఫేర్’కి ఓ కథనం రాశారు – అక్కడ తాను విహారయాత్రకు వెళ్ళాననీ, ‘ఒక నిపుణుడైన వేటగాడు, అల్ నాసిర్’ అంటూ ఒక ఫోటోను జతపరిచారు. “ఓ భారీ ఎలుగుబంటిని తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భోపాల్ అడవుల్లో కాల్చివేశాను” అని రాశారు.
అల్-నసీర్ భార్య నటి వీణా, వారి ఇద్దరు పిల్లలు ఈ హాలిడే ట్రిప్‌లో నటుడితో పాటు ఉన్నారు. ఆ లేఖలో, అల్ నాసిర్ – “నేను రేపు మళ్ళీ బయలుదేరుతున్నాను, కానీ ఈసారి పులిని వేటాడేందుకు. నేను విజయం సాధించినట్లయితే, నేను ఖచ్చితంగా మీకు మరొక ఫోటోను పంపుతాను” అని కూడా వ్రాశారు.


ప్రముఖ సహాయ నటుడిగా ఎన్నో సినిమాలు చేశారు. తన భార్య వీణా సరసన అమర్ సింగ్ రాథోడ్ (1957) వంటి కొన్ని చిత్రాలలో మరపురాని పాత్రలలో నటించారు. ఈ సినిమాలో వీణా ‘ముంతాజ్ మహల్’గా, అల్ నాసిర్ ‘షాజహాన్’గా నటించారు. అయితే ఈ జంట తెరపై పెద్దగా ప్రభావం చూపలేదు. మిస్టర్ & మిసెస్ 55 (1955), బీవీ (1950), దాస్తాన్ (1950), కాశ్మీర్ (1951), హతిమ్ తాయ్ కి బేటీ (1955), మేరా సలామ్ (1957) వంటి చిత్రాలలో ఆయనకు మరపురాని పాత్రలు ఉన్నాయి.
అల్ నాసిర్ ధనుర్వాతం సోకి, అక్టోబర్ 17, 1957న మరణించారు.
అల్ నాసిర్ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ యుట్యూబ్ లింక్ చూడండి
https://www.youtube.com/watch?v=w1akzz0vzSI

పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.