“వందేమాతరం, సుజలాం, సుఫలాం మలయజ శీతలాం, సస్య శ్యామలాం మాతరం…. శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం. పుల్ల కుసుమిత ధ్రుమదళ శోభినీం, సుహాసినీ, సుమధుర భాషిణీం సుఖదాం…. వరదాం… మాతరం… వందేమాతరం…”
ప్రార్థనాగీతం ముగిసింది. పిల్లలంతా బారులుదీరి మెల్ల మెల్లగా కదుల్తూ, వారి, వారి తరగతి గదులకి వెళ్తున్నారు. తెల్లని పాలనురుగులాంటి దుస్తుల్లో వుండి ఒకరి వెంట మరొకరు నడుస్తుంటే సందరమైన సరస్సులో వరుసలు తీరిన హంసల్లా అందమైన వినీలాకాశంలో శాంతి కపొతాల్లా వుంది ఆ దృశ్యం. చూపరులను కట్టిపడేసేదిలా వుంది చాలా ఆహ్లాదం కలిగిస్తోంది.
పిల్లల వెనుకగా నడిచి వెళ్తుందామె, నీలం అంచు తెల్ల చీర, ఒంటిని అంటి పెట్టుకున్నట్లున్న తెల్లని జాకెట్టు. నల్లని రెండు కొండల నడుమ ఉదయిస్తున్న సూర్యబింబంలా, ఎర్రని సిందూర తిలకం. మెల్లగా శాంతి పావురంలా నడుస్తూ పిల్లలననుసరిస్తోంది.
“ఆమె? అవును ఆమే! ఆమే! సందేహం లేదు” అనుకున్నాడు గేటు దగ్గరగా నిల్చున్న శివ.
స్కూలు గేటుకి దగ్గరగా తచ్చాడుతున్న శివని చూచి అడిగింది ఆయా చాల నమ్రతగా.
“ఎవరు కావాలి బాబూ?”
“ఇక్కడ పని చేస్తున్న టీచరమ్మ!” అంటూ పేరు చెప్పాడు, ‘తనూహించింది నిజం అవాలని’ కోరుకుంటూ…
అక్కడున్న సిమెంటు బెంచి చూపించి…
“కూర్చోండి బాబూ! అమ్మగారికి చెప్తాను…” అంటూ లోనికి వెళ్లింది ఆయా.
“తనూహించింది కరక్టే!” అని సంతోషిస్తూ బెంచి మీద కూర్చున్నాడు శివ. ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ పరిసరాల్ని పరికిస్తున్నాడు.
స్కూలు ఆవరణ చాల అందంగా, ఆహ్లాదకరంగా వుంది. రంగు రంగుల బోగన్ విల్లాలు, వివిధ వర్ణాల చీరలు ధరించిన అందమైన కన్నెపిల్లల్లా కలకల్లాడుతూ కనువిందు చేస్తున్నాయి. గాలి వేసిన జోకుకి కొబ్బరాకులు గలగలా నవ్వుతున్నాయి. చెట్టు మీద గోరువంక ప్రియురాలి చెవిలో గుసగుసలాడుతోంది. పచ్చని పచ్చిక మెత్తని తివాచీలా వుంది. గడ్డి మీద పడిన మంచు బిందువులు మీద ఎండ పడి మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి. చల్లని పిల్ల తెమ్మరులు శరీరానికి, మనసుకి హాయిని కలుగజేస్తున్నాయి.
చాల ఆహ్లాదకరంగా వుంది అక్కడి వాతావరణం. ఆ పరిసరాలు చూస్తుంటే “ప్రకృతిలో యింత అందం యిమిడి వుందా?” అని అప్పుడే అనిపించింది అతనికి.
“చూసే కనులకి మనసుంటే… ఆ మనసుకి కూడా కనులుంటే….” అన్న మాటలు గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు.
“ఎవరు కావాలి?” నిశ్శబ్ధాన్ని భంగం చేస్తూ కోయిల కూసింది.
చటుక్కున లేచి నుంచుని ఆమె వైపు చూచి….
“సుహాసినీ! ఎలా వున్నావ్? నన్ను పోల్చుకున్నావా” తొట్రుపాటుతో సంభ్రమంగా అడిగాడు.
రెప్పపాటు కాలం మౌనం.
“ఓ! నువ్వా! శివా? చాలా బాగున్నాను” సర్వసాధారంణంగా వుంది ఆమె జవాబు.
ఆమెనే చూస్తున్నాడతను.
“అలా కూర్చో శివా!” అంటూ బెంచి చూపించి తనూ ఓ బెంచి మీద కూర్చుంది.
ఎలా మట్లాడాలో, ఏం మాట్లాడాలో తోచడం లేదు అతనికి. కలియక ముందు ఏవేవో ఊరించుకున్నాడు. ఎన్నో మాట్లాడాలనుకున్నాడు. తీరా మనిషిని చూసాక మాటలే కరువయ్యాయి. ఎట్టకేలకి గొంతు సవరించుకుని….
“ఎలా వున్నావ్ హాసినీ?” అన్నాడు తడబడే పెదాలతో….
“చాల హేపీగా వున్నాను శివా!” అన్నదామె. తన పేరును సార్థకత చేసుకుంటున్నట్లు చిరునవ్వుతో.
అతనాశించిన జావాబు కాదది. తాను తిరస్కరించాక, వదిలి వెళ్లిపోయాక, ఆమె ఎన్నో బాధలు అనుభవిచిందనీ, అవన్నీ తన ముందు వెళ్లగక్కుతుందని అతనూహించాడు. అలా జరగలేదు.
“నీకు చాలా అన్యాయం జరిగిపోయింది. అప్పుడు పరిస్థితి అలాంటిది. తరువాత చాలా కాలానికి నీ కోసం వాకబు చేస్తే, మీ నాన్నగారు పోయారనీ, నువ్వు మీ అమ్మగారు ఎటో వెళ్లిపోయారని తెలుసుకుని చాలా బాధపడ్డాను హాసినీ.”
“ఓహ! అలాగా? అలా జరగిందని నువ్వు బాధపడ్డావేమో నా కైతే అలా జరగడం నాకు ‘వరం’ అని భావిస్తున్నాను!”
“అదేంటి? యిలా ఒంటరిగా జీవిస్తూ యిదే ‘వరం’ అంటావేం? ఆ సమయంలో నువ్వే అఘాయిత్యం చేసుకుని వుంటావో అని నేను చాల మథనపడ్డాను తెలుసా?”
“అలాంటి చిన్న, చిన్న విషయాలకి ప్రాణం తీసుకోవాలనుకునే అల్పప్రాణిని కాను నేను! ఎందుకలా అనుకున్నావ్ అసలు నేను ఒంటరిగా వున్ననని ఎలా అనుకుంటాన్నావ్?”
“కాదా మరి? యిది ఒంటరితనం కాదా?”
“ఇంత మంది పిల్లల మధ్య వున్న నేను ఒంటరినెలా అవుతాను శివా? స్త్రీకి వివాహం అన్నది జీవితాంలో ఓ భాగం కావచ్చు. కాని వివాహమే జీవితానికి పరిమావధి కాదుగా? అయినా ప్రాణం తీసుకోవాలన్నంత తప్పు నేనేం చేసాను? జీవితంలో ఎన్నో అనుకుంటాం. అవి జరగచ్చు, జరక్కపోవచ్చు! అంత మాత్రాన జీవితం నిస్సారమై పోయిదన్న దిగులెందుకు?”
“నీ ధైర్యానికి నా జోహార్లు హాసినీ!” అన్నాడు మరేమనాలో తోచక.
“మనం కేవలం మన కోసం కాక, మరొకరికి సహాయపడేలా ఎందుకు బ్రతకకూడదు? అన్న ఆలోచన నాలో రాగానే ఈ సంస్థ సంగతి తెలిసింది! అంతే! వెంటనే వచ్చి జాయినయ్యాను. ఈ సంస్థ యజమానురాలు నన్ను కన్న కూతురులా చూసుకుంటుంది.”
“నువ్వు నన్న చూడగానే అసహ్యించుకుంటావని, ఎన్నో దుర్భాషలాడతావని ఊహించుకున్నాను. భంగపడి, బ్రతుకు భారంగా ఈడుస్తున్నావని ఎన్నో ఊహించాను.”
“లేదు శివా! నేను భంగపడనూ లేదు! నా బ్రతుకు భారంగానూ లేదు. ఈ ప్రశాంత వాతావరణంలో అశాంతి అన్నది నా దరికి చేరదు!” చాలా సున్నితంగా వుందామె జవాబు.
మనంగా ఆమెనే చూస్తున్నాడు.
“భగవంతుడు మనిషికి అమూల్యమైన సంపద కంటే చక్కని అవయవాలను ప్రసాదించాడు. వాటిన్నింటిని మనిషి సరైన విధంగా ఉపయగించుకుని, సన్మార్గంలో నడిచి, మరో పది మందికి పనికొచ్చే విధంగా మేలు చెయ్య వచ్చు! అంతే కాని మనం అనుకన్నది జరగలేదని ప్రాణం తీసుకోవడం అన్నది భగవంతుని ముందు అపరాధం చేసినట్లే అవుతుంది.”
“ఎంత ఎదిగిపోయావ్ హాసినీ! ఎంత మారిపోయావ్!”
“మార్పన్నది సహజం శివా! అది మనిషికి అవసరం కూడా!”
“నీ సమయం నేను వృథా చేస్తున్నానా?” యింకేమనాలో తోచలేదు అతనికి.
“లేదు! లేదు! నీ వల్ల ఈ సంస్థ సంగతి మరో పది మందికి తెలిస్తే మరి కొంత మంది పిల్లనిక్కడ చేర్చుతారు. ఇప్పుడు పిల్లలు చర్చికి వెళ్తారు!”
“ఆహా! యిది మిషినరీ స్కూలా?” నాలుగు వైపులా చూస్తూ అన్నాడు.
“ఆహా! కాదు కాదు. ఇక్కడ అన్ని మతాలూ సమ్మతమే. వీళ్లు చర్చికి వెళ్తారు. నమాజు చేస్తారు. మందిరానికీ వెళ్తారు. మత బేధాలు కుల బేదాలు వీళ్లకి చిన్న తనం నుండి తెలియాలి. అంతా ఒక్కటే నన్న స్వభావంకలగాలి.”
“ఎంత చక్కని ఆలోచన!” అతని మనసు పరవశించింది.
“అవును శివా! వీళ్లు చదవుతో పాటు ఆధ్యాత్మిక పాఠాలు, వ్యాయామం, యోగా అన్నీ నేర్చుకుంటారు. సర్వమానవ సమానత్వం అప్పుడే మనిషిలో ఏర్పుడుతుంది. ఈ పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఎంతో ఆనందం వుంది శివా! మదర్ థెరిసా, దుర్గాభాయ్, ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, ఎందరెందరో మహానుభావులు యిలా స్కూల్లో చదువుకన్న వాళ్లే కదూ? ఈ పిల్లల్లో వాళ్లంతా నాకు కనిపిస్తారు! పెళ్లి చేసుకుని వుంటే ఒకరో, యిద్దరో పిల్లల అలనా పాలనా చూస్తూ మూద్దు, మురిపాలలో తేలే దాన్ని, యిప్పుడు చూడు ఎంత మంది పిల్లల చేత ‘అమ్మ’ అని పించుకుంటున్నాను యింత కన్నా అదృష్టం ఏం కావాలి” ఆమె కళ్లల్లో ఏదో మెరుపు.
ఆమె ముందు అతన మరుగుజ్జులా ఫీలయ్యేడు.
“హేట్సాఫ్! హాసినీ! నిన్ను చూసాక యిక్కడి వాతావరణం చూసాక మనిషి ఎలా వుండాలో అర్థం అయింది!”
“నీ కాంప్లిమెంట్సుకి థాంక్స్!”
అక్కడి వాతావరణం, పరిస్థితులు తెలుసుకున్నాక అతనికి స్పురించిందొక్కటే “మనిషి నిగ్రహంగా ఒపికతో సాధనతో ఏదైనా సాధించవచ్చు! జీవితాన్ని నందనవనంలా మార్చుకోవచ్చు!”
“అవును! అలాంటి జీవితమే మనిషి కోరుకోవాలి. కృషి వుంటే నిజంగానే మనుషులు ఋషులవుతారు.”
“వస్తాను హాసినీ! నిన్ను అడక్కూడదు కానీ! అడుగుతున్నా – నువ్వు అంగీకరిస్తే నిన్ను నాతో తీసికెళ్దామనే వచ్చేను. అసలు నా రాకకి కారణం” అదే మనసులో మాట దాచుకో లేక పైకి అనేసాడు.
పకాలున నవ్వింది సుహాసిని.
“నేను చాల ఆనందంగా, ఆరోగ్యంగా వున్నాను శివా. యిలాంటి జీవితం నాకు నీవల్లే దక్కింది. అందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మరి! నా మనస్సుకి నచ్చిన జీవితం యిది.”
“అదేంటి?” అన్నాడు బుర్ర గోక్కుంటూ.
“కాదా మరి? నువ్వు తిరస్కరించబట్టే ఈ సంస్థ నాకు స్వాగతం పలికింది. అందుకే నీకు ధన్యవాదాలు.”
“అదేంటి? యిది తిరస్కారమా? పురస్కారమా?”
“ముమ్మాటికీ పురస్కారమే శివా!” అంది గలగలా నవ్వుతూ.
తాను యిక్కటికి రాక ముందు ఊహించేమిటి? యిక్కడకొచ్చాక చూస్తున్నదేమిటి?
అతని ఆలోచనలు సుహాసిని చుట్టూ తిరుగుతున్నాయి. నిజంగా మనిషికి కావలిసింది ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం, పట్టుదల, కృషి, కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ గుణాలన్నీ సుహాసినిలో పుష్కలంగా వున్నాయి.
“అగాధమగు జలనిదిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీదరికి రాదూ శోధించి, సాధించాలి… అదియే ధీరగుణం”
గాల్లో తెలియాడుతూ మృదుమధురంగా దూరం నుండి వినిపిస్తుంది ఆ తియ్యని పాట.
ఆమె అలోచనలతోనే అతను అడుగులు వేస్తున్నాడు.
chala chakkaga undi madam…… manishi jivitham gurinchi okka matalo chepparu marinni elanti rachanalu cheyalani korukuntu meee…….. abhimani
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™