[సూర్యదీప్తి గారు రచించిన ‘అమ్మ=అమూల్యం’ అనే కవితని అందిస్తున్నాము.]


అమ్మకన్నా
ఆమె ఫోటోకే అదృష్టమెక్కువ
ఉన్నన్నాళ్ళు ఒక్కకొడుకు ఇంట్లోనూ
ఆమెకు నిలువ నీడలేదు..
నేడు అందరు కొడుకుల ఇళ్లలోను
ఆమె ఫోటో పూజలందుకుంటుంది.. ఆశ్చర్యం..
బతికున్నపుడు దయ్యమైంది
చచ్చాక దైవమైంది.. చిత్రంగా..
బుక్కెడు బువ్వలేక బక్కచిక్కిన అమ్మకు
ఇపుడు రోజూ నైవేద్యాలు..
ఏడాదికోసారి తర్పణాలు.. ఆగడమే లేదు..
ఉన్నప్పుడు వరదలుగా పారాయి ఆమె కన్నీళ్లు
ఎపుడు పోతుందా అని చూసారు అయినవాళ్లే చాన్నాళ్ళు
బతికి సుఖపడలేదు కానీ చచ్చి బతికిపోయింది..
ఇపుడు ఇంట్లోవాళ్లంతా దిగులు ముసుగేసుకున్నారు
ఆమె లేనందుకు..
లోన ఆనందతాండవం చేస్తూన్నారు..
ఆమె లేనందుకు..
ఆమెకు ప్రశాంతతను దూరంచేసి బతికిన వీళ్ళు
ఆమె నవ్వును నలిపేసి నవ్వుతున్న వీళ్ళు..
ఆమె ఆశల్ని చిదిమేసి చిందులేసిన వీళ్ళు
ఒక్కటి తెలుసుకోలేకపోతున్నారు.. అజ్ఞానులు..
ఆమే తమ ఉనికికి ఆధారం అనీ
ఆమే బరువునుకుంటే తమ ఉసురు ఎన్నడో ఆగేదని..
అమ్మ అమూల్యం..
బిక్కుబిక్కుమంటూ తనను చావనివ్వద్దు
దిక్కెవరూ లేరని ఆమెను దిగులుపడనివ్వవద్దు
అమ్మ అమూల్యం
ఆమె సేవలేక దక్కదులే కైవల్యం..