[వల్లూరి విజయకుమార్ గారు రాసిన ‘అమ్మమ్మ ఏం చదివిందో’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఎయిత్ స్టాండర్డ్, అంటే ఎనిమిదో క్లాసు రిజల్స్ వచ్చాయి. పాసయ్యాను.
అమ్మ, బామ్మా, పక్కింటి విశాలాక్షి పిన్నిగారూ, అందరూ యెంత సంతోషించారో.
“మన ప్రసాదు పాసవపోతే యెవరు పాసవుతారూ” బామ్మ విశాలాక్షి పిన్నిగారితో కచ్చితంగా చెప్పేసింది.
“మరేం, యింకా చూస్తుండగా, ఫది, పదకొండూ.. తరవాతేంట్రా ప్రసాదూ”
పిన్నిగారి లెక్క ఎనిమిది తరవాత తొమ్మిది దాటేసి ఫదికి వెళ్ళిపోయింది.
“విస్సు పిన్నీ, ఎనిమిది తరవాత తొమ్మిది మర్చిపోయావు..” నాకు లెక్కలు వచ్చు అని జ్ఞ్యాపకం చేసానిలా!
“సుబ్బమ్మత్తా, వీడికి ఇప్పటినుంచే ఓ పిల్లని చూసి పెళ్లి చేసేద్దాం, ఏమంటావ్. మా మేనకోడలు చిట్టి ఉందిగా. గట్టిముండ, వీడిలాగే.. ప్రసాదుకి పాఠం చెప్పేస్తుంది మరి!”
“ఆఁ బావుందేవ్, విశాలాక్షీ” నాన్నమ్మ నవ్వుతూ తలూపింది.
పిన్నిగారి చిట్టి నాకెందుకు తెలీదూ..
చిట్టి నాకన్నా పొట్టిది. యిప్పుడే మూడో క్లాసు కొచ్చింది.
(వీళ్ళకి థర్డ్ స్టాండర్డ్ అంటే తెలిదు కదా)
పెళ్లంటే తెలీదు కానీ పొట్టి చిట్టితో ఆడుకుంటే బావుంటుంది.
ఐతే ముక్కు చీవిడి మాత్రం ఇలా గవునుతో తుడిచేసుకుంటుంది అసయ్యంగా.
నాన్న మాత్రం, దగ్గరికి తీసుకుని భుజం తట్టాడు. “నువ్వు వేగం కాలేజీకొచ్చెయ్, సైకిల్ కొనిస్తా!”
“ఇంకేం నువ్వు సైకిలు మీద కాలేజీకి వెళ్తే, చిట్టిముండని వెనకాల కూచోపెట్టుకో, స్కూల్లో దింపొద్దుగాని” పిన్నిగారికి నాన్న వున్నా లెఖ్ఖలేదు.
“సెలవులకు అమ్మమ్మా, తాతగారిని చూసొచ్చేయండి, కాన్వెంటు చదువులు.. మళ్ళీ వీలుపడదు.. అమ్మా, రైలుకి మంచిరోజు చూడవే”
అమ్మమ్మ ఊరెళ్ళడం ఎంతో బెస్టు, గుండు మామయ్యా, పిలక తాతగారు, శారద పిన్నీ.. నా సంగతేమో కానీ అమ్మ కళ్ళు మాత్రం మెరిసాయి.
***
“తమ్ముడూ యిందరా, మీ బావగారిచ్చారు”, అమ్మ, ‘కలం సెట్టు’ గుండు మామయ్య కిచ్చిది.
అప్పుడొచ్చినప్పుడు శారద పిన్ని పరికిణీలు వేసుకుని, వనజక్క, రాధా భాయ్‌తో గిరికీలు ఆడేది. యిప్పుడు జాకెట్టు, లంగా ఓణీతో బావుంది.
“ఈ యేడాది శారద పబ్లిక్ పరీక్షలు రాస్తుందే అమ్మణ్ణి!”అమ్మణ్ణి అంటే మా అమ్మ.
శారదకి చీరా, తాతయ్యకి నస్యం డబ్బా, అమ్మకి పెద్ద తువ్వాళ్లు నాలుగూ..
“ఇపుడివన్నీ ఎందుకే పిల్లా..” అమ్మమ్మ నవ్వితే అమ్మకన్నా బావుంటుంది.
“శారద వంటా అదీ నేర్చుకుంటుందా, యింట్లో నీకు అదే సాయం మరి” అమ్మ శారద పిన్నిని దగ్గరగా తీసుకుంది.
“ఆఁ ఆఁ, చేస్తుంది సాయం, నువ్వెంత చేసేదానివో అదీ అంతే!”
***
రాత్రి భోజనాలయ్యాక అమ్మమ్మ దగ్గరే నేను.
“ప్రసాదూ, సుమతీ శతకంలో పద్యం ఒకటి చెప్పరా”
‘చెప్పులోన రాయి, చెవిలో జోరీగ..’ మొదలెట్టేసా
“బడుద్దాయీ, యిది వేమన శతకంలో పద్యంరా”
“అమ్మమ్మా, నాకిదే వచ్చు, మా కాన్వెంట్లో తెలుగు పద్యాలు నేర్పరు మరి”
“ఒరే నీకు అక్కరకు రాని చుట్టము, పజ్జం తెలీదూ!”
అప్పుడెప్పుడో నేర్చుకున్నా.. యిప్పుడు జ్ఞ్యాపకం లేదు. బుర్ర గోక్కున్నా.
“ఏదన్నా మంచి కధ చెప్పు అమ్మమ్మా!”
“ఆంజనేయుడు, లంకా దహనం చెప్పనా”.
“దహనం అంటే ఏంటమ్మమ్మా!”
“ఒరే, నీ క్లాసులో రామాయణం, భారతం కథలుండవా”
“వూహు, డెవిడ్డ్డు గోలియత్తు ఉంటాయి, సిండ్రిల్లా కూడా వుంటుంది”
అమ్మమ్మ జాలిగా చూసింది. దగ్గరికి తీసుకుని లంకాదహనం కధ చెప్పింది.
ఊఁ కొడుతూ విన్నాను.
అడ్వెంచర్స్ అఫ్ హనుమాన్ వుంది కానీ, పరీక్షకి ఇంపార్టన్ట్ కాదని చెప్పలేదు.
ఆఖర్న హనుమాన్ చాలీసా చదివింది, అంత చీకట్లోనూ చూడకుండా ఎలా చదివేసిందో అంత పొడుగు పజ్జం! వింటుంటే వచ్చేసింది నిద్ర..
***
‘అమ్మమ్మ ఏం చదివిందో’ సందేహంతోనే నిద్ర లేచాను.
శారద పాట క్లాసుకెళ్లింది, అమ్మ పక్కవీధిలో రాజమ్మత్తయ్యని చూసొస్తానని వెళ్ళింది.
తాతయ్య, కుర్చీలో చుట్ట కాల్చుకుంటే, మీసాలు కాల్తాయేమో అని చూస్తూ కూర్చున్నా.
అమ్మమ్మ ఏం చదివింది !.. సుమతీశతకం, వేమన శతకం యెలా తెలుసో,
చీకట్లో తడుముకోకుండా అంత పెద్ద చాలీసా పద్యం, ఎలా చెప్పింది!
నాన్నమ్మైతే టివీ చూడ్డం, విశాలాక్షి పిన్నితో కబుర్లు, పనిమనిషిని కోప్పడ్డం.. అంతే. ఒక్కరోజైనా ఇంతింత పెద్ద పద్యాలు చదివీడమే!
సరిగ్గా అప్పుడే పెద్ద మూట పట్టుకుని, “అమ్మగారో” అంటూ వచ్చేసాడు ఒకాయన.
తాతయ్య తలెగరేసి లోపలికెళ్ళు అనేసాడు.
అమ్మమ్మ నవ్వుతూ వంటింట్లోంచి వచ్చేసింది, “సుబ్బయ్యా, ఇస్త్రీకి యిన్ని రోజులా, యింకా ఎవరికైనా అద్దెకిచ్చేసావేమో అనుకున్నా” అంటూ, “పెద్దమ్మాయి వచ్చిందోయ్, వీడు ప్రసాదు, మనవడు, కాన్వెంటులో చదువుతున్నాడు.”
పరిచయాలు అయ్యాయి.
8 చొక్కాలు, 5 ఫాంట్లు, 6 పంచలు, 4 చీరలు, 3 జాకెట్లు. సుబ్బయ్య మూట విప్పి బట్టలు బల్లమీద సద్దుతున్నాడు.
“ఎంతయింది” అమ్మమ్మ,
“మీరే లెక్క చూసివ్వండి, ప్యాంట్లు, పంచలు, చీరలు నాలుగేసి రూపాయలు, చొక్కాలు మూడురూపాయలు, జాకెట్లు రెండురూపాయలు చొప్పున”
“ప్రసాదూ, లెక్క వెయ్యి, చెప్పు..” పురమాయించింది అమ్మమ్మ
నేనేం చెబుతా! “అమ్మమ్మా కాలిక్కులేటర్ లేదు, పుస్తకం పెన్ను ఉన్నాయా..” తప్పించుకుందుకి చూసా.
అమ్మమ్మ అడగ్గానే, గుండు మావయ్య పుస్తకం యిచ్చేసింది, కానీ నాకు లెక్క రావట్లేదు వేళ్ళు లెక్క పెట్టుకుంటున్నా, యిందులో మల్టిప్లికేషన్, ఆడిషన్ కలిసి వున్నాయి మరి. యిలా లాభం లేదనుకుంది అమ్మమ్మ.
తాతయ్యని అడుగుతుందేమో అనుకుంటే, “సుబ్బయ్యా, లెక్క చెప్పూ, అంటూ వేళ్ళు ఆడించుకుంటూ,.నోట్లోనే గుణించేసుకుని, “..యింద సుబ్బయ్యా” అని తొంభై రూపాయలు లెక్క కట్టి మరీ యిచ్చేసింది.
“సుబ్బయ్యా లెక్క చూసుకో”
“మీరు చెబితే కాదుటమ్మా, మీ లెక్క కరెక్టు” డబ్బు జేబులో పడేసుకుని, “తాతయ్యగారూ, వస్తా” అంటూ వెళిపోయాడు సుబ్బయ్య.
ఇంత పెద్ద లెఖ్ఖ నోటితో యెలా చెప్పేసిందో మా టీచరుకే అమ్మమ్మ లెక్కలు చెబుతుంది.. ‘అమ్మమ్మ ఏం చదివిందో!’
***
“అమ్మణ్ణి, యివాళ పౌర్ణమి-సాయంత్రం నలుగురు ముత్తైదువుల్ని పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుందాం శుభంగా.” అమ్మ తలూపింది.
బజారు వెళ్లి సామానులు తేవడం మావయ్య వంతు. “ఒరే చెబుతా రాస్కో, మళ్ళీ మర్చిపోతావ్” లిస్టు చదివేసింది అమ్మమ్మ. సాయంత్రానికి ముగ్గేసి దేవుడి పటం పెట్టింది శారద పిన్ని.
దీపాలు వెలిగించి గంట సేపు యెవరి సాయం లేకుండా ముందు పూజ మంత్రాలూ అవీ చదివేసింది అమ్మమ్మ. తను కథ చెప్పడం, నేను కొబ్బరికాయ కొట్టడం! ఎంత బావుందో దేవుడి కథ, అమ్మమ్మ చెబుతుంటే.
“అన్నపూర్ణా, నీ చేతి ప్రసాదం తినడానికైనా ఆ దేవుడు వస్తాడమ్మా – అమృతమే” అని అంతా మెచ్చుకున్నారు. ఒకసారి నాన్న యిలాగే వ్రతం చేయించాడు. పంతులు గారు పుస్తకం పట్టుకుని అంతా చదువుతూ చూసి కాపీకొట్టేసారు. అమ్మమ్మ అలాక్కాదు.
అమ్మమ్మ ఏం చదివిందో! ఏదో పెద్ద క్లాసే చదివుంటుంది మరి.