[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]


ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘చంబల్ కీ కసం’ (Chambal Ki Kassam, 1980) చిత్రం లోని ‘సిమటీ హుయి యే ఘడియాఁ’. గానం లత, రఫీ. సంగీతం ఖయ్యాం.
~


సాహిర్ రాసిన రొమాంటిక్ పాటల్లో ఒక హిట్ గీతం ‘చంబల్ కీ కసం’ సినిమాలో వస్తుంది. ఈ పాట సినిమాలో సందర్భాన్ని బట్టి మూడు సార్లు వస్తుంది. దీన్ని సిట్యూయేషనల్ సాంగ్‌గా చిత్రీకరించారు. సాహిర్ పూర్తి శృంగార రసంతో ఈ పాటను నింపేస్తూనే జీవితంలో ఇద్దరు మనుషులు ఒకరి నుండి మరొకరు పొందే సాంత్వన, ప్రేమానుభూతి ఏ స్థాయిలో ఉండాలో గొప్పగా చెప్పారు. ఇక్కడ శరీరాలు పలకరించుకుంటూనే మానసికమైన ఐక్యతను ప్రదర్శిస్తాయి. అంటే శారీరిక కలయికకు ముందు మానసికంగా రెండు హృదయాలు కలసి ఉండాలన్నదే కవి ఉద్దేశం. దాన్నే ఆయన ప్రేమగా తన పాటల్లో గుర్తించారు. మానసికంగా ఇద్దరు వ్యక్తులు దగ్గరవడమే నిజమైన సంగమం అని ఆయన ప్రతి రొమాంటిక్ గీతంలోనూ తన శైలిలో చెప్పేవారు. ఈ పాటకు ఖయ్యాం సమకూర్చిన సంగీతం కూడా బావుంటుంది. ఇది గజల్ రూపంలో రాసిన గీతమే అయితే దీన్ని రఫీ, లతాలు గానం చేసిన విధానం ఇంకా బావుంటుంది. పాటలో ఒక వాక్యాన్ని ఇద్దరూ చెరో సగం పాడడం. ఆపిన వాక్యాన్ని మళ్ళీ రెండో వారు కొనసాగించడం ఈ పాటకు వింత అందాన్ని ఇస్తుంది. సాహిర్ పాటల్లో భావాలు స్త్రీ పురుషులకు సమానం అని, ఆయన పాటల్లో లింగ బేధం ఉండదని, అనుభూతి స్థాయిలో ఆయన స్త్రీని పురుషుడిని విడిగా చూడలేదని మనం చెప్పుకున్న విషయాన్ని ఈ పాట కొత్త పద్ధతిలో మరోసారి నిరూపిస్తుంది.
సిమటీ హుయీ యే ఘడియాఁ, ఫిర్ సె నా బిఖర్ జాయే
ఫిర్ సె నా బిఖర్ జాయే
ఇస్ రాత్ మే జీ లే హమ్, ఇస్ రాత్ మే మర్ జాయే
ఇస్ రాత్ మే మర్ జాయే
సిమటీ హుయీ యే ఘడియాఁ
(లభించిన ఈ ఘడియలు మరో సారి చెల్లాచెదురు కాకూడదు. ఈ రాత్రిలోనే జీవించాలి మనం, ఈ రాత్రే మరణించాలి కూడా)
ఎంతో కష్టం మీద కలుసుకున్న ఆ ప్రేమికులు ఆ కాస్త సమయంలోనే జీవన మరణ అనుభవాలను పొందాలని కోరుకుంటున్నారు. వారికి అలాంటి ఏకాంతం మళ్ళీ దొరికుతుందనే నమ్మకం లేదు. ఇక్కడ ఆ జంట కలిసిన ఆనందంలోనూ, పారవశ్యంలోనూ ఆ రాత్రిని ఎంతగా తమ మనసుల్లో భద్రపరుచుకోవాలో ఆలోచించుకుంటుంది.
సాహిర్ ‘సిమ్టీ’ అన్న పదం వాడటంతో పాటలో మృదువయిన, సున్నితమయిన భావన రెక్కలు విప్పుకుంటుంది. సందర్భోచితంగా పాత్రల ఆరాటం, భయాలు, నమ్మకం అపనమ్మకాల నడుమ ఊగిసలాడే మనసుల్లోని సందిగ్ధాలు శ్రోతల మనస్సులు గ్రహిస్తాయి.
సిమ్టీ అంటే, ఒక చోట చేర్చటం, ఏరి కుప్ప పోయటం,అన్నిటినీ దగ్గరగా చేర్చి, ఎక్కువ పదార్ధాన్ని తకువ స్థలంలో వొత్తిపెట్టటం, ఒదిగిపోవటం వంటి అర్ధాలు వస్తాయి. ‘హమ్ జబ్ సిమట్ కే ఆప్కే బాహోంమే ఆగయే’ అంటే, నేను వొదిగి నీ బాహువులను చేరినప్పుడు అన్నది సామాన్యార్ధం. ఆమె అతని బాహువుల్లో వొదిగింది అన్నది ఒక అర్ధం. అతని మీద ప్రేమతో ఆమె కరిగి అతని బాహువులలో వొదిగిందన్నది ఇంకో అర్ధం. ప్రేమలో వొదగటం అంటే, ఆమె తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయి అతనిలో వొదిగిపోయిందన్నమాట.
ఈ పాట సందర్భంలో కాలం కుచించుకుపోయింది. కాలం వొదిగిపోయింది. అంటే, వారి జీవితం మొత్తం ఇప్పుడు వారు కలసి గడిపే ఈ క్షణాలకు కుచించుకుపోయిందన్నమాట. వారి జీవితం మొత్తం ఈ క్షణాలలో వొదిగిపోయిందన్నమాట. ఆమె సమాజం నుంచి పారిపోతున్నది. అతడిని సమాజం వేటాడుతోంది. వారిద్దరూ కలసి ఏకాంతంగా గడిపే సమయం అరుదుగా లభిస్తుంది. అంటే, వారు జీవిస్తున్నది, ఇలా అరుదుగా దొరుకుతాయో లేదో తెలియని కలసి గడిపే సమయం కోసం, కలసినా ఎంతసేపు కలసి వుండగలరో తెలియకుండా, తరువాత మళ్ళీ ఎప్పుడు కలుస్తారో, ఇక అసలు కలవరో ఏమీ తెలియక, ఈక్షణంలో మనకు ఏకాంతం లభించింది, జీవితం మొత్తం ఈక్షణంలోనే గడిపేయాలి, మరో క్షణం ఉందో లేదో అన్న భావన ‘ సిమ్టీ’ అన్న పదంలో ఒదిగింది. అందుకే, మళ్ళీ ఈ సమయం వ్యర్ధం కాకూడదు, అన్న భావనను వెంటనే ప్రదర్శిస్తున్నారు. వారి జీవితమంతా ఒక చోట కేంద్రీకృతమయింది. అది చెల్లాచెదురుకాకూడదు అన్నది భావన. అందుకే ఈ రాత్రే బ్రతకాలి, ఈ రాత్రే మరణించాలి అనుకుంటున్నారు ప్రేమికులు. వారి కలయిక జీవితం. వేరవటం మరణం. వారి మొత్తం జీవితం ఆ రాత్రిలో వొదిగిపోయిందన్న మాట.. వారేం చేసినా, బ్రతికినా చచ్చినా ఆ ఘడియలే. ఈ భావాన్నే కైఫి అజ్మీ ‘ సఫర్ ఎక్ ఉమ్ర్ కా పల్ మే తమామ్ కర్లూంగా’ అన్నాడు. మొత్తం జీవిత ప్రయాణాన్ని క్షణంలో పూర్తిచేస్తాడట. పాట పల్లవి కేవలం సినిమా సందర్భంలో పాత్రల ఆరాటాన్ని, ఆశ నిరాశలను మాత్రమే ప్రదర్శించదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రేయసీ ప్రియుల కలయికలోని సందిగ్ధాన్నీ, భయాలనూ ప్రదర్శిస్తుంది.
అబ్ సుబహ్ నా ఆ పాయే, ఆవో యే దువా మాంగే (2)
ఇస్ రాత్ కే హర్ పల్ సె రాతే హీ ఉభర్ జాయే
రాతే హీ ఉభర్ జాయే
సిమటీ హుయీ యే ఘడియాఁ
(ఇక పగలే రాకూడదని, రా ఆ భగవంతుడ్ని వేడుకుందాం. ఈ రాత్రి మనకు దొరికిన ప్రతి క్షణం నుండి ఎన్నో రాత్రులు ఉద్బవించాలి)
తెల్లవారకూడదని కోరుకుంటూ వారికి దొరికిన ఆ ఒక్క రాత్రిలోని ప్రతి క్షణాన్ని ఒకో రాత్రిగా మార్చుకోవాలని వారు తపన పడుతున్నారు. దొరికిన ఆ ఒక్క అవకాశాన్ని జీవితంగా మార్చుకోవాలని, శాశ్వతం చెసుకోవాలని ఆ జంట కోరుకుంటుంది.
ఇక్కడ సాహిర్ ఉపయోగించిన పదబంధాలను చూడండి, అతి సరళమైన పదాలను అటు ఇటుగా మార్చి ఆయన ఎంతటి లోతు, వేదన విరహం ఆ వాక్యంలో కూర్చారో గమనించండి. “ఇస్ రాత్ కే హర్ పల్ సే రాతే హీ ఉభర్ జాయే” ఎంత సరళమైన వాక్యమో అంతే గొప్ప పదప్రయోగం కూడా. దొరికిన ఆ కొద్ది క్షణాలను వేల రాత్రులుగా మార్చుకుని ఆనందించాలనే వారి కోరికను ఈ వాక్యం చాలా గొప్పగా వ్యక్తీకరిస్తుంది. ఇక్కడ వేల రాత్రులుగా మార్చుకోవటం అంటే, ఒక్కో క్షణంలో వేల రాత్రుల అనుభవాలను మూటకట్టుకోవటం. ‘తూ జియో హజారో సాల్, సాల్ కే దిన్ హో పచాస్ హజార్ ‘ అని దీవిస్తారు. నువ్వు వెయ్యేళ్ళు బ్రతకాలి, ప్రతి సంవత్సరంలో యాభవేల రోజులుండాలి అన్నట్టన్నమాట. ఈ రాత్రి ముగియకూడదు. ప్రతిక్షణం నుండీ, అనేక రాత్రుళ్ళు ఉద్భవించాలి..ఇదీ ఆ ప్రేమికుల కోరిక.
దునియా కీ నిగాహే అబ్ హమ్ తక్ నా పహుంచ్ పాయే (2)
తారో మే బసే చల్కర్ ధర్తీ మే ఉతర్ జాయే
ధర్తీ మే ఉతర్ జాయే
సిమటీ హుయీ యే ఘడియాఁ, ఫిర్ సే నా బిఖర్ జాయే
ఫిర్ సె నా బిఖర్ జాయే
(ఈ ప్రపంచం చూపు మన దాకా చేరకూడదు. పద చుక్కల్లో నివాసం ఏర్పరుచుకుండాం, ఈ భూమిలో దిగిపోదాం)
ఆ ఇద్దరూ ప్రపంచం పరిత్యజించిన వారే. వారిద్దరూ కలిసి ఉండగా ప్రపంచం చూస్తే సహించలేదు. అందుకే ప్రపంచపు చూపు ప్రసరించని చోటకు వెళ్ళిపోదాం అనుకుంటుంది ఈ జంట. ఈ చరణాలలో వాక్యంలో ఒకో భాగం ఆమె అతను కలిసి పాడతారు. ఎవరు ఏ భాగం అందుకున్నారన్నది అప్రస్తుతం. ప్రస్తుతం వారి స్థితి ఒకేలా ఉంది. ఒకరిపై ఒకరికున్న ప్రేమలో బేధాలు లేవు. వారి అనుభూతి కూడా ఒకటే. అలాంటప్పుడు వారి మనసు పలికే భాష కూడా ఒకటే అవుతుంది. దాన్ని చెప్పడానికి ప్రతి చరణంలో ఒకో వాక్యం ఇద్దరూ కలిసి గానం చేస్తారు. ఆమె హృదయం ఎలా స్పందిస్తుందో అతనిదీ అదే స్థాయిలో బదులిస్తుంది. ఇరువురిలోనో ఒకే స్థాయి ప్రేమ చూస్తాం. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఆ ఏకాంత సమయంలో ఇద్దరూ మనసు విప్పి తమ కోరికను బైటపెట్టుకుంటున్నారు. ఇద్దరిలోనూ సిగ్గు బిడియం లేవు. ఎందుకంటే దొరికిన ఆ కాస్త సమయంలో తమ కలయికకు ఏదీ అడ్డు లేకుండా చూసుకుంటున్నారు వాళ్లు. ఇక్కడ ఆమెలో స్త్రీ సహజమైన సిగ్గు, అతనిలో తొందరపాటు కనపడకుండా ఇద్దరినీ ఒకే ప్లేన్‌లో చూపించడంలో కవి, సంగీత దర్శకుడు ఇద్దరూ విజయం సాధించారు. ఈ పాటను అంతే రసరంజకంగా రఫీ లత గానం చేసారు.
తారల్లో నివసిద్దాం, భూమిలోకి దిగిపోదాం అనటంలో, ప్రేమ ఎత్తులను అందుకుందాం, లోతులను చవిచూద్దాం అన్న భావన దాగుంది. అంటే, వారికి అందుబాటులో ఉన్న ఆ ఘడియల్లోనే ప్రేమను సంపూర్ణంగా అనుభవించాలన్న ఆకాంక్షను ఆ ఇద్దరూ అంతే తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తున్నారు.
హాలాత్ కే తీరో సే ఛల్నీ హై బదన్ అప్నే (2)
పాస్ ఆవో కే సీనోం కే కుఛ్ జఖ్మ్ తొ భర్ జాయే
కుఛ్ జఖ్మ్ తొ భర్ జాయే
సిమటీ హుఈ యే ఘడియాఁ
(పరిస్థితుల బాణాలు మన శరీరాలను గాయం చేసాయి. దగ్గరకు రా, మనసుకు అయిన కొన్ని గాయాలయినా నయం చేసుకుందాం)
ఈ చరణం సినిమాలో మరో సందర్భంలో వస్తుంది. అతను చట్టం నుండి తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటూ తిరిగి కలుసుకుంటారు. ఆ సందర్భంలో వారి మనసుల్లో అలజడిని ఈ చరణం వ్యక్తీకరిస్తుంది. పరిస్థితులు వారిద్దరినీ వేరు చేసాయి. మనసుల్ని తూట్లు పొడిచాయి. ఇప్పుడు ఇన్నాళ్ళకు కలిసాక ఒకరికి మరొకరు దగ్గరగా రావాలని, ఆ కలయికతో కొన్ని గాయాలనయినా నయం చేసుకోవాలని కోరుకుంటారు ఆ ఇద్దరూ. వారికి మనశ్శాంతి దొరికేది పరస్పర సాంగత్యంలోనే . కాని పరిస్థితులు వారిని ఇంకా దూరం చేసాయి. మళ్ళీ అనుకోకుండా కొన్ని క్షణాలు కలిసి ఉండడం కుదిరితే ఆ కాస్త సమయం ఒకరికి మరొకరు దగ్గరగా ఉండి గడపాలని ఆశిస్తుంది ఆ జంట.
ఆగే భీ అంధేరా హై, పీఛే భీ అంధేరా హై (2)
అప్నీ హై వహీ సాంసే, జో సాథ్ గుజర్ జాయే
జో సాథ్ గుజర్ జాయే
సిమటీ హుఈ యే ఘడియాఁ
(ముందూ చీకటే ఉంది, వెనుక ఉన్నదీ చీకటే, మనవనే ఆ కొన్ని ఘడియలు ఇద్దరం కలిసి ఉన్నవి మాత్రమే)
వాళ్ళిద్దరికీ భవిష్యత్తు అంధకారంగానే కనిపిస్తుంది. ఆ పరిస్థితులను ఎదిరించి బైట పడడం ఇద్దరి వల్లనూ అవట్లేదు. అందుకే మనవిగా మిగిలే క్షణాలు ఇలా కలిసి గడిపినవే అని వీలయినంతగా దొరికిన సమయాన్ని ఒక చోటే గడపాలని వారు కోరుకుంటున్నారు.
మొదటి రెండు చరణాలు పూర్తిగా శృంగారభరితం అయితే తరువాతి రెండు చరణాలలో వారి అసహాయత, వేదన ద్వనిస్తాయి. కాని ఇది మొత్తం ఒకే పాటగా వింటే భిన్న సందర్భాలలో ఇది ముక్కలు ముక్కలుగా చిత్రించబడ్డ గీతం అని అనిపించదు. విషాదం నిండిన ప్రేమ విరహ గీతంగా ఇది ధ్వనిస్తుంది. ఒక గజల్లో ప్రతి షేర్‌కి విడిగా ఒక ప్రాముఖ్యత ఉంటే అది ఇతర షేర్లతో కలిసి గజల్ రూపంలో వచ్చేటప్పుడు అదే అర్థాన్ని మరో మూడ్‌లో అందిస్తుంది. ఈ శైలి సాహిర్‌కి వెన్నతో పెట్టిన విద్య. దీన్ని ఆయన క్లబ్ గీతాల నుండి టైటిల్ గీతాలు, బాక్గ్రౌండ్ పాటల దాకా ఉపయోగించుకున్నారు. సినిమాలో సందర్భాన్ని బట్టి ఆ చరణాలను దర్శకులు ఉపయోగించుకున్నా, మళ్ళీ కలిపి చూస్తే ఇది ఒకే మూడ్‌లో రాసిన గజల్ లేదా పాటగా ధ్వనిస్తుంది. అది సాహిర్ శైలిలోని మాజిక్.
బిఛడీ హుయి రూహోం కా యే మేల్ సుహానా హై (2)
ఇస్ మేల్ కా కుఛ్ ఎహసాన్ జిస్మోం పె భీ కర్ జాయే
జిస్మో పె భీ కర్ జాయే
సిమటీ హుయీ యే ఘడియాఁ
(విడిపోయిన ఆత్మల ఈ కలయిక అందంగా ఉంది. ఈ కలయిక ప్రభావం కొంత శరీరాలకు కూడా ఉపయోగపడేలా చూద్దాం)
ఇది మరో సందర్భంలో వచ్చే చరణం. ఇక్కడ చరణానికి ముందు ఓ ఆలాపన ఉంటుంది. దానితో ఈ పాట రెండు భాగాలుగానూ విడదీసి వినవచ్చు.ఇప్పుడు వారిద్దరూ మళ్ళీ కలిసారు. కొంత సమయం అన్ని భయాలు వీడి గడపగల అవకాశం వారికి దొరికింది. దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ఇద్దరూ. విడిపోయిన ఆత్మలు మళ్ళీ కలిసిన సందర్భం అది. ఇక శరీరాలూ కల్సి ఆ క్షణాలు శాశ్వతంగా నిలిచిపోవాలని వారు కోరుకుంటున్నారు. తమ కోరికను బైట పెట్టుకుంటూ ఆత్మలు కలిసాక మేం ఒకటే కాని ఈ కలయిక కూడా జరిగితే బావుండు అనుకోవడంలో కేవలం వాంఛ బైట పెట్టుకోవడం కాదు అపారమైన ప్రేమ ధ్వనిస్తుంది. రెండు శరీరాలు పడకపైకి చేరే ఆ కామ క్రీడను అంత ప్రేమాస్పదంగా అంతే సూటిగా చెప్పడం, దానిలో అశ్లీలత ద్వనించకుండా కేవలం ఆ ప్రేమికుల అసహాయతనే ద్వనించేలా రాయడం, దాన్ని సంగీతంతో కలిపి గానం చేయడం ఎంత కష్టమో అర్థం అవాలంటే ఇలాంటి ఫక్తు ప్రేమ రాత్రులలోని శరీరపు కోర్కెను ఇంత సూటిగా వ్యక్తీకరిస్తూనే అది విన్న శ్రోతలలో ప్రతికూలత రాకుండా సంస్కారయుక్తమైన పదబంధాల ప్రయోగాలను సినీ గీతాలలో వెతికితే మనకు దొరికే అరుదైన శృంగార రస గీతాలలో సాహిర్ పాటలు పైన ఉంటాయి.
నిజానికి ఇది ఎంతో తాత్విక భావన. వేరయిన ఆత్మల కలయిక ఎంతో సుందరమయినది. కానీ, ఆత్మలు ఒదిగినది శరీరంలో. శరీరం ప్రభావం ఆత్మపై వుండదు కానీ, ఆత్మ ప్రభావం శరీరంపై వుంటుంది. ఆత్మపొందే ఆనందం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ‘ఇస్ మేల్ క ఎహెసాన్’ అన్నాడు సాహిర్. ఎహెసాన్ అంటే జాలి, దయ, కరుణ వంటి అర్ధాలున్నాయి. ఆత్మలు కలిశాయి. ఆ కలయిక శరీరాలవరకూ విస్తరించాలని అతి సున్నితంగా అభ్యర్ధిస్తున్నారిద్దరూ.
తర్సే హుయె జజ్బోం కో అబ్ ఔర్ నా తర్సావో (2)
తుం షానే పె సర్ రఖ్ దో, హమ్ బాహోం మే భర్ జాయే
హమ్ బాహో మే భర్ జాయే
సిమటీ హుయీ యే ఘడియా ఫిర్ సె న బిఖర్ జాయే
ఫిర్ సె నా బిఖర్ జాయే
సిమటీ హుయీ యే ఘడియాఁ
(ఆరాటపడుతున్న భావేద్వేగాల ఆరాటాన్ని ఇంకా పెంచకు. నువ్వు నా భుజంపై తల పెట్టుకో నేను నీ కౌగిలిలో ఒదిగిపోతాను. సేకరించి పెట్టుకున్న ఈ ఘడియలు మరో సారి చెల్లాచెదురు కాకూడదు.)
అప్పటిదాకా ఒకరిని ఒకరు కలవాలనే ఆరాటం. కలిసాక ఆ అరాటం ఇంకా పెరుగుతుంది. ఒకరిలోకి ఒకరు ఒదిగిపోయి ఆ ఆరాటాన్ని తగ్గించుకోవాలని ఇద్దరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నారు ఆ జంట.
ఈ పాటలో గొప్పతనం ఏంటంటే, ప్రేమ, విషాదం, విరహం, నమ్మకం, భయం, అనిశ్చింత ఇవన్నీ ఒకే పాళ్లలో ధ్వనిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఓ గొప్ప మాధుర్యం ఈ విషాదాన్ని అంటి పెట్టుకుని ద్వనిస్తూ ఉంటుంది. దానికి రఫీ గొంతు జీవం పోస్తే లత పూర్తి సహకారాన్ని అందించింది. తన పాటలను పూర్తిగా అర్థం చేసుకున్నవారే సంగీతం కూర్చాలని సాహిర్ చాలా పట్టుబట్టేవారు. ఖయ్యాం సంగీత దర్శకత్వంలో ఆయన చాలా ఇష్టపడి పాటల్ రాసేవారట. డిబ్బై చివర్లలో సాహిర్ ఖయ్యంతో ఎక్కువ పని చేసారు. ఈ గజల్‌ను ఒకే గీతంగా కంపోజ్ చేస్తూ అన్ని రకాల మూడ్స్‌ను అందులో చూపించగలిగేటంత గొప్పగా పాటకు సంగీతాన్ని అందించారు ఖయ్యాం. ఇది సాహిర్ రాసిన గొప్ప రొమాంటిక్ గీతాల సరసన గర్వంగా చేరుతుంది. ఇందులో రఫీ గొంతు తేనెలూరుతూ ఉంటుంది. రఫీ అభిమానులు మరీ మరీ ఇష్టపడి వినే ఈ పాటలో లత గానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పాటను వింటుంటే భాష తెలియని వారు కూడా ఆ గానామృతంలో మైమరచిపోకుండా ఉండలేరు. ఇక సాహిత్యం అర్థం అయిన వారు ఈ శృంగార రస ఝరిలో తడవకుండా ఉండలేరు. ఈ పాటకు నటించిన మౌశ్మీ చటర్జీ తనపై చిత్రితమైన పాటలన్నిటిలోకీ ఈ పాట తనకు అతి ఇష్టమైన పాట అంటుంది.
“ఇస్ మేల్ కా కుఛ్ ఎహసా జిస్మో పె భీ కర్ జాయే”
శారీరిక కోరికను ఇంత సొంపుగా వ్యక్తీకరించగల వాక్యం మరొకటి ఉండడేమో..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)
