ఎప్పుడూ ఆలయాల గురించే చెబుతున్నానంటారా? ఇవాళ ఒక చక్కని జలపాతం గురించి చెబుతానండీ. జలపాతాలంటేనూ, జలకాలాటలంటేనూ ఇష్టం లేనిదెవరికి చెప్పండి? అయితే మన హైదరాబాదు సమీపంలో జలకాలాటలనే పాటేగానీ ఆటలెక్కడివంటారా? ఉన్నాయండీ. వాటికోసం మీరేమీ పదిరోజుల ప్రయాణాలు చెయ్యక్కరలేదు, వేలకి వేలు ఖర్చు పెట్టక్కరలేదు. కొంచెం మెడ సారించి చూడండి. హైదరాబాదుకు సుమారు 170 కి.మీ.ల దూరంలో శ్రీశైలం వెళ్ళే రోడ్డులో వుంది. అదేనండీ మల్లెల తీర్ధం. శ్రీశైలం వెళ్ళే దోవలో ఎడమవైపు బోర్డు కనబడుతుంది. అక్కడనుండి లోపలికి 8 కి.మీ.ల దూరం వుంటుంది. రోడ్డు బాగుంది. కంకర రోడ్డు. ఇది ఇదివరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనిది, ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో వుంది.
దీని గురించి అందరూ రకరకాలుగా చెప్పారు. మా అబ్బాయేమో నువ్వా మెట్లు దిగలేవు, చాలా వున్నాయి అన్నాడు. రోడ్డు బాగుండదని కొందరు. కొందరేమో నీళ్ళు చాలా తక్కువ వుంటాయి. సరే.. ఇన్ని అభిప్రాయాలెందుకు.. వెళ్ళి చూస్తే సరిపోతుందికదా అనుకున్నానుగానీ, దేనికన్నా టైము రావాలికదా. ఈ మారు శ్రీశైలం ట్రిప్‌లో ఆ టైము కుదిరింది.
అయితే అసలు సంగతి అక్కడకెళ్ళాక వుంది. మరి 350 మెట్లు దిగాలి.. మళ్ళీ ఇంటికెళ్ళాలంటే ఎక్కి పైకి రావాలి కూడా. భయపడకండి.. మెట్లు చిన్నగానే వుంటాయి. మెట్లు దిగిన తర్వాత దాదాపో 200 గజాల దూరం కొండరాళ్ళ మధ్య నడవాలి. అసలే మేము వెళ్ళింది వేసవి కాలం. నీళ్ళు వుంటాయో, వుండవో అనే అనుమానం. కానీ, పైన మెట్ల దగ్గరే చెప్పారు.. నీళ్ళు వున్నాయి, స్నానం చెయ్యవచ్చు అని. కష్టపడి ఇన్ని మెట్లు దిగాము, మళ్ళీ ఎక్కాలి, పైగా ఈ కొండ రాళ్ళ మధ్య నడక, చివరికి అక్కడికెళ్తే ఎలా వుంటుందో, ఇంత కష్టపడుతున్నాము అనుకుంటూనే వెళ్ళాము. మరి జలపాతంలో జలకాలాడాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదండీ. వెళ్ళాక అక్కడ దృశ్యం చూసి అన్నీ మరచిపోయాము… పైనుంచి మల్లెలలా జాలువారే జలపాతం.. ఎంత అద్భుత దృశ్యమో! పడ్డ శ్రమ అంతా మరచిపోయాము.
పైనుంచి నిరంతరం నీళ్ళు పడుతూ వుండటంవల్ల కొంచెం పాచి పట్టినట్లు వుంటుంది. సంతోషంలో కొంచెం జాగ్రత్తగా వుండండి. అక్కడే వున్న చిన్న శివలింగం మీదకూడా జలపాతం జల్లులు పడుతూంటాయి. కొందరు స్నానమయిన తర్వాత దోసిళ్ళతో నీరు తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తారు. అక్కడ పురోహితుడెవరూ వుండరు. మీ ఇష్టం మీది. హాయిగా మీ ఇష్టం వచ్చినంతసేపు జలకాలాడండి.
మేము వెళ్ళి వచ్చాక బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ఉపన్యాసంలో విన్నాను. ఆ స్ధలమంతా అతి పవిత్రమైనదట. అందుకే గండు తేనెటీగలు (కొండ తేనెటీగలు) అక్కడ ఎప్పుడూ కాపలా కాస్త్తూ వుంటాయట. మెట్లు దిగే ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతాయట (గుంపులుగా కాదు). వచ్చేవారు స్వఛ్ఛమైన మనస్సుతో, మాదక ద్రవ్యాలేమీ సేవించకుండా వస్తే వాటి దోవన అవి వెళ్ళి పోతాయట. లేకపోతే కుట్టి కుట్టి తరుముతాయట. వాళ్ళ బృందంలో ప్రతి ఒక్కరిచుట్టూ ఈ తేనెటీగలు తిరిగాయని అన్నారు. మేము ముందు తెలియక పోవటంతో గమనించలేదు. ఒకటీ అరా తిరిగినా అన్నీ చెట్లేగనుక తిరుగుతున్నాయనుకున్నాము.
ఆయన ఉపన్యాసంద్వారా తెలిసిన ఇంకొక విషయం అక్కడ అనేక రకాల చెట్లు వున్నాయి. అందులో ఒక అద్భుత వృక్షం అంకూల వృక్షం. ఇది చాలా అరుదుగా కనిపించే వృక్షం. ఈ వృక్షం పరబ్రహ్మమే. పేరే అమ్మతో కలిసిన పరబ్రహ్మంట. ఈ వృక్షం కాయలు పగిలి గింజలు కింద పడితే చెట్టు మళ్ళీ లాగేసుకుంటుందిట. అంటే అవి వెంటనే వెళ్ళి చెట్టుకి అతుక్కింటాయి. అక్కడ చాలా ఓషధి వృక్షాలు వున్నాయి. వాటినుంచి వెలువడుతున్న వాయువులు ఆ ప్రాంతానికెళ్ళినవాళ్ళకి స్వస్ధత చేకూరుస్తాయి.
గురువుగారు చెప్పిన ఇంకొక మాట ఆ తీర్ధానికవతలవైపు చెట్లు కూకటి వేళ్ళతోసహా లేచి ఆకాశంలో వెళ్ళి వాటిష్టం వచ్చినచోట నాటుకుంటాయి. చిత్ర విచిత్రమైన చెట్లు చాలా వుంటాయి. అయితే అవ్వన్నీ అడవిలో చాలా లోపల వుంటాయి. మనం గుర్తించలేము. అక్కడ వుండే స్థానికులు కొన్నింటిని గుర్తించవచ్చు. అడవి లోపలకి మాత్రం మీ అంతట మీరే వెళ్ళే సాహసం చెయ్యవద్దు. ఆ ప్రాంతం బాగా తెలిసిన స్ధానికులను గైడ్‌గా తీసుకుని వెళ్ళాలి. సాయంకాలం పెద్ద పెద్ద సర్పాలు మెట్ల దగ్గరకొస్తాయంటారు.
ఇలాంటి చోటికి వెళ్ళినప్పుడు పగలు మాత్రమే వెళ్ళి చక్కగా సరదాగా గడిపి రండి కానీ లేనిపోని సాహసాలకు పోయి ఆపదలు కొని తెచ్చుకోవద్దు.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™