చిన్నప్పుడు అమ్మ
రాజకుమారులూ ఏడుచేపల కథ చెప్తూ వుండేది
ఎన్నిసార్లు చేపలెండక పోయినా
కథలెందుకో వినాలనిపించేది
ఎక్కడో కొంచెం నిజం వున్నట్లనిపించేది
ఒకోసారి కథలు నిజాల్లా
నిజాలు కథల్లా అనిపించడం
అసహజం కాక పోవచ్చు
కానీ అన్నిసార్లూ
చాలా మాటలు కథల్లా మిగలటం
ఒయాసిసులకు బదులు ఎండమావులై
నిలవడం సహజమై పోతున్నపుడు
జీవితం కథకావడంలో వింతేముంటుంది
ఎన్నో మాటలు
నీవైనా నావైనా
అన్నీ కథలే
ఒకోటీ ఒకో ముగింపుతో
కానీ ఏ కథ లోనూ అమ్మ చెప్పిన కథలో లాటి
నిజమైతే ఇప్పటికీ కనిపించట్లేదు
కానీ తెల్లవారితే కథలు వినకా తప్పడంలేదు

విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని,
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి.
డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
drvijaykoganti2@gmail.com
8309596606
1 Comments
Koganti Dasaradhi
Good one..
Times have changed
Truth will never change