సంచికలో తాజాగా

విహారి Articles 56

విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.

తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.

15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, 'చేతన' (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.

ఆనాటి 'భారతి', 'ఆంధ్రపత్రిక', 'ఆంధ్రప్రభ' వంటి పత్రికల నుండి ఈనాటి 'ఆంధ్రభూమి' వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.

విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.

అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి 'పాకుడురాళ్లు' - డా. ప్రభాకర్ జైనీ గారి 'హీరో' నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది 'నవలాకృతి' గ్రంథంగా వెలువడింది).

కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.

6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. 'యోగవాసిష్ఠ సారము'ను పద్యకృతిగా వెలువరించారు.

వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!