[బాలబాలికల కోసం ‘బహుమతులు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]


విజయపురి రాజు నరేంద్రుడు సాహితీ ప్రియుడు. ఏ కవి, రచయిత గానీ కావ్యం, గద్యం వ్రాసుకొచ్చినా వాటిని క్షుణ్ణంగా పరిశీలించకుండానే వారికి మంచి బహుమతి ఇచ్చి పంపేవాడు.
వాటిలో చాలా రచనలు ఏ బహుమతికీ అర్హం కాదు. అయినా బహుమతి కోసం మిడి మిడి జ్ఞానంతో ఏదో ఒకటి వ్రాసుకొచ్చి రాజు గారికి చూపించి మంచి బహుమతి తీసుకెళ్ళేవారు!
ఇదంతా గమనించిన మంత్రి సుమేధుడు బాగా ఆలోచించి రాజుగారితో ఒకరోజు అంతఃపురంలో ఈ విధంగా చెప్పాడు.
“మహారాజా, తమరు అనేక రచనలకు విరివిగా అనేక బహుమతులు ఇస్తున్నారు. నేను ఆ రచనలను ఎంతో పరిశీలించాను, మన అస్థాన కవులతో కూడా చర్చించాను. మేమందరం ఆ రచనలను గురించి చర్చించాము. వాటిలో చాలా రచనలు ఏ బహుమతికీ అర్హత సాధించలేవని వారు కూడా చెబుతున్నారు. అందుకని మనం వచ్చిన వారికి వెంటనే బహుమతి ఇవ్వకుండా మన పండితులు ఆ రచనలను కూలంకషంగా చదివి వారు నిర్ణయించిన ఉత్తమ రచనలకు ఒక సభలో బంగారు, వెండి రేకులపై వారి రచన, బహుమతి వివరాలు చెక్కించి ఇస్తాము. అర్హత సాధించని రచనల రచయితలకు వేరే సభ నిర్వహించి రాగిఫలకాల మీద వారి రచన వారి పేరు చెక్కించి ఇస్తాము. ఈ విధంగా ఎందుకు చేస్తున్నామో కొంతకాలానికి వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. రచన లోని విషయాన్ని, శైలిని పరిశోధించి, పలిశీలించి రచనా శైలిని వృద్ధి చేసుకుంటారు. అందుకు తగినట్లుగా మన పండితులచేత వారికి తగిన శిక్షణ ఇప్పిస్తే కూడా బాగుంటుంది. వారిలో ఉన్న రచనా శక్తికి మరింత మెరుగు పెడితే మనకి మంచి రచయితలు లభించవచ్చు. ఆలోచించండి మహారాజా” అని మంత్రి సుమేధుడు వివరించాడు.
“మీ ఆలోచన బాగుంది అయితే రచయితలను నిరుత్సాహపరచకుండా వారికి రాగి రేకుల మీద వారి రచన పేరు చెక్కించి, కొంచెం ధనం కూడా ఇస్తే బాగుంటుంది” రాజు నరేంద్రుడు తన అభిప్రాయం చెప్పాడు.
ఆయన సూచనకు మంత్రి సుమేధుడు చిరునవ్వుతో చప్పట్లు కొట్టాడు.