“క్షేత్రములలో కాశీ వంటి క్షేత్రము లేదు,
పిలిచిన పలుకుటలో శివుని వంటి దైవము లేడు,
నదులలో మందాకిని వంటి నది లేదు,
భారతావనియంటి పుణ్య భూమి లేదు జగతిలో॥” అని పెద్దలు చెబుతారు.
తారకమంత్రములా మననము చెయ్యవలసిన కష్టము లేక కేవలము క్షేత్ర దర్శనముతో మానవుల పాప పరిహారమునకు కాశీ క్షేత్రములో పాదము మోపటము మార్గం.
మానవజాతికి తెలిసిన చరిత్ర త్రవ్వి చూస్తే 5000 సంవత్సరాలుగా, సదా ఈ కాశీ నగరము పరమ పవిత్ర క్షేత్రముగా వర్ధిల్లుతోంది. సదా నాగరికతతో విరజిల్లుతున్న నగరము కూడా ఇదే. ఈ క్షేత్రములో ప్రతీ రాయి శివుడే. ఏ జలము చూసినా గంగే! జగదంబ అన్నపూర్ణగా సస్యశ్యామలం చేసి, వచ్చిన వారికి కడుపునింపుతున్నదీ ఈ నగరములోనే. మరో ప్రక్కగా అమ్మ విశాలక్షిగా జగత్తును కనిపెట్టుకు కాచుకుంటున్నదీ ఈ నగరములోనే. కాశీలో నివసించటానికి ఎంతో పూర్వ పుణ్యము చేసుకొని వుండాలి. లేకపోతే ఇక్కడకు రావటము సాధ్యము కాదు. ఈ నగరములో కాలు మోపటానికి మహాదేవుని కరుణ ఎంత వుండాలో, అంత కృప కాలభైరవునిదీ వుండాలి.
లేకపోతే మనము ఈ గడ్డ మీదకి రాలేము. రావాలనే సంకల్పమూ కలగదు. కలిగినా ఏవో ఆటంకాలు కలుగుతాయి. కనుక ఆ కాళభైరవ స్వామి కరుణిస్తే, మనకు విశ్వనాథుని దర్శనము, స్పర్శనము పాపనాశనము కలుగుతాయి. కాశీలో సామాన్యముగా మూడు నిద్రలు చేస్తారు ప్రజలు. లేదా తొమ్మిది నెలల గర్బసమయానికి గుర్తుగా తొమ్మిది రోజులు వుంటారు. మరికొందరు అదృష్టవంతులు కాశీ గర్బవాసమని చేస్తారు. అంటే కాశీ కి 25 మైలు దాటకుండా తొమ్మిది నెలల పై తొమ్మిది రోజులుంటారు. అలా గడిపిన తరువాత మరి జన్మ వుండదని నమ్మకము వుంది.
కాశీ అనాదిగా హైందవులకు తమ జీవిత కాలములో ఒక్కసారైనా తప్పక వెళ్ళవలసిన ప్రదేశము. వేదవేదాంగాల నుంచి, కాశీ ఖండము వరకూ, అంతెందుకు మొన్నటి (100 సంవత్సరాల ముందటి) ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర వరకూ కాశీని తప్పక దర్శించాలనే ఒక భావన తరతరాలకు బదిలీ చెయ్యబడింది.


కాశీలో తన వృద్ధాప్యము గడపాలని చాలా మంది కోరిక కూడా. కాశీలో మరణిస్తే మరల జన్మ వుండదని ముక్తికి, మోక్షానికి ఇది దగ్గర దారి అని హిందువుల నమ్మకము. కాశీలో ఎవరైనా మరణిస్తే చుట్టాలు పక్కాలు కూడా దుఖించరు. కారణము వారికి జన్మరాహిత్యము లభించింది కనుక.
ఇక గంగా నది పవిత్రత ఎంత తలచినా తక్కువే. పూర్వ కాలము నుంచి నేటి వరకూ మనకు లభించిన విజ్ఞానము, వరం ఈ గంగమ్మ తల్లి. ఆ నది మీద పశ్చిమ దేశ శాస్రజ్ఞులు పరీక్షలు జరిపి చెప్పినదేమంటే, ప్రపంచములో ఎక్కడా లేని విధముగా గంగమ్మ తనను తాను శుభ్రపరచు కుంటుందిట. అందుకే నీరు మీరు ఒక సీసాలో పట్టుకు తీసుకుంటే మరునాటికి శుద్దిగా కనపడుతుంది. అలా శుభ్ర పరచుకోవటము గంగకు మాత్రమే వున్న ప్రత్యేకత.


కార్తీకమాసము తెలుగువారి ముఖ్యమైన నెలలో ఒకటి. ఈ మాసము శివునకు ప్రియమైనదని తెలుగువారి నమ్మకము. కార్తీకపురాణము కూడా అదే చెబుతుంది. కార్తీకములో శివయ్యకు అభిషేకాలు, అర్చనలు తప్పక చేస్తారు, కుదిరినంతగా. అలాంటి ఈ వికారి సంవత్సర కార్తీకము నాకు కాశీలో గడిపే అవకాశము కలిగింది. ఒక శివభక్తుడు నేను అడిగిన వెంటనే గది ఒకటి నెల రోజులకు ఏర్పాటు చేశారు. వెంటనే డబ్బు కట్టి, నా రూము రిజర్వు చేసుకున్నాను.
పరమాత్మ భక్తులు ప్రేమగా పిలిస్తే ఎక్కడికైనా వస్తాడు. తథ్యం. కాని భగవంతుని ఆస్థానము వద్దకు భక్తులు వచ్చి బ్రతిమాలుకుంటే ఆయనకు మనలను అనుగ్రహించటానికి సులభమని శ్రీ కుర్తాళం స్వామి వారు చెప్పివున్నారు. అందుకే అంది వచ్చిన ఈ అవకాశము సద్వినియోగము చేసుకోవటానికి అట్లాంటా నుంచి ఆదరాబాదరాగా అందిన విమానమెక్కి, 30 గంటలు, మూడు చోట్ల మార్పులు, ఒక్కో చోట ఏడేసి గంటల ఎదురుచూపులతో ప్రయాణించి భాగ్యనగరము చేరాను.
నేను వెడుతున్నానంటే నాతో పాటు వచ్చి మూడు రోజులలో వెనకకు వెళ్ళిపోతామని అక్క వాళ్ళు చెప్పారు. హైద్రాబాదులో నాతో కలసి మిగిలిన కుటుంబ సభ్యులము కాశీకి విమానము టికెటు స్పైస్జట్లో కొన్నాము. ఆ విమానము ఆ రోజు ఆరు గంటల ఆలశ్యమై, చివరకు కార్తీకము మొదటి ఘడియకు కాశీ మహానగరానికి చేర్చింది మమ్ములను.
అలా నా ఈ కాశీ యాత్ర ప్రారంభమైనది!!
***
కాశీనే ‘వారణాసి’ అని కూడా అంటారు. వారణ మరియు అసి అన్న రెండు నదులు కలియుట వలన వారణాసి అయ్యింది ఈ నగరము. కాశీ చేరిన వెంటనే ముందుగా ధూళీ దర్శనము చేసుకోవాలి. దూళీదర్శనమంటే వచ్చిన బట్టలతో కాళ్ళూ చేతూలు కడుగుకొని వెళ్ళిపోతారు. ఆర్జితసేవలు తరవాత. ఎక్కడైనా ఏ క్షేత్రమైనా ఇలా మొదటి దర్శనము చేసుకుంటారు.
“విశ్వనాథుని పలకరించి ప్రణామాలు సమర్పించి రావాలి కదా!” అని బయలు చేరాము.
మేము వచ్చే సరికే దీపావళి పొద్దులు వీడలేదు. విమానాశ్రయము నుంచి మాకు గది దొరికిన సత్రానికి చేరుకొని, సామాను గదిలో పెట్టి, ఏకాఎకిన దూళిదర్శనము అని బయలుదేరాము అపూర్వసోదరీమణులము.
అన్నపూర్ణమ్మ తల్లికి అన్నకూట్ సంబరముతో పాటూ ఆ తల్లిని బంగారు రూపుతో, బంగారు చీరతో అలంకరించేది ఈ దీపావళి సమయములోనే. మరో సమయములోనైతే ఇంత హడావుడి వుండదు. మేము వెళ్ళి లైనులో నిలబడ్డాము. జనము. ఎటు చూసినా జనము.ఇసుక వేస్తే రాలటంలేదు. విపరీతమైన సెక్యూరిటీ, అంతా క్రొత్త. సెల్ఫోను తీసుకోకూడదు. పెన్ను, అద్దము దువ్వెన, ప్లాస్టికి సీసా, పెద్ద బ్యాగు ఏవీ అనుమతించరు. కేవలము డబ్బుల పర్సు మాత్రమే వుంచుకోవాలి.


మా చిన్నక్కకు హడావిడి జాస్తి. అందుకే ఏ షాపు కనబడినా చెప్పులు వదిలేయ్యటము. ‘ఆగు తల్లీ నీవు!’ అని వెనక మేము హెచ్చరికలు. ఇంక దాని పట్టలేక మేము హడావిడిగా ఆ కార్యక్రమం చేసి ముందుకు వెళ్ళాము. వెళ్ళినది సరాసరి అమ్మ లోగిలికే. అది మాకు తెలియదు. కాని కాకతాళీయముగా అలా జరిగింది.
ఇక్కడ కాశీలో పాండాలు వుంటారు. దాదాపు మన సినిమా హాళ్ళ ముందు బ్లాకులో టికెట్లు అమ్మే వారిలా ‘వందకు రెండు’ టైపులో రెండు వందలకు ఒకరిని తీసుకుపోతా అంటూ మా చెవిలో వూదుతూ తిరుగుతున్నాడా కుర్రవాడు. అక్కలు గుసగుసలాడి సరే అన్నారు. ఐదు నిముషాలలో అమ్మవారి గుడిలో వున్నాము. అతనికి ముందే చెప్పాను ‘విశ్వనాథుని దర్శనము కావాలయ్యా!’ అని. కాని గుడిలో కెళ్ళి చూస్తే ఎక్కడ చూడూ తినుబండారాలతో అలంకారము. మధ్య అమ్మ ధగధగలు. హడావిడి జన సందోహము. అసలు తినుబండారముతో చిన్నచిన్న ఆలయాలు కట్టి అందులో దేవతామూర్తులు పెట్టారు. చాలా అందముగా వున్నాయని. ఆ స్వీట్సు అన్నీ మరురోజు నుంచి ప్రసాదముగా పంచేశారు.


రెండో అక్క కూతురు ఇక వుండలేక ఏడునొక్క రాగాలపాన మొదలెట్టింది. ఇక ఆ పిల్ల తల్లి పూనకముతో వూగిపోతూ, మా అందరిని బయటకు లాగి గదికి తీసుకుపోయింది. మా ధూళీదర్శనము అమ్మను ప్రత్యక్షముగా, అయ్యవారిని టీవిలో చూసి తృప్తి చెందాల్సివచ్చింది.
(సశేషం)

3 Comments
Kalavathi
Sandhya garu, kaashi kshetradarshanam chalabagaa chupincharu
Mee anubhavala tho malli kaashi sandarshina anubhuthi podinanu.
Thanks
sandhya
Thanks a lot andi
Kondal Nallajerla
Very well researched and written !!!