ఆకాశాత్ పతితమ్ తోయమ్ యథా గచ్ఛతి సాగరమ్ । సర్వ దేవ నమస్కారః కేశవమ్ ప్రతి గచ్ఛతి ॥
ఆటవెలది గగన సీమ విడచి కదలి వచ్చిన గంగ సాగరాన కలియు సహజ సరణి సకల దేవ ప్రణతి సర్వేశు చరణాల చేరి యిచ్చు సకల సిద్ధి నెపుడు ౬
ఏకేశ్వర వాదం ! చెబుతుంది వేదం !!
***
శిరసా తపనం ధృత్వా ఛాయాం యచ్ఛతి పాదపః । అనుభూయ స్వయం కష్టం సుజనోన్య సుఖప్రదః ॥
ఆటవెలది శిరము మాడు తున్న చింత యన్నది లేక పరుల కొసగు ఛాయ తరులు యెపుడు కష్ట పడుచు తాము కలవర మొందక సుజను లెపుడు పరుల సుఖమె గాంత్రు ౭
పరుల మేలు గోరు ! తరులె మనకు గురులు !!
ఉద్యమేన హి సిద్ధ్యన్తి కార్యాణి న మనోరథైః । న హి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః ॥
తేటగీతి పురుష యత్నము లేకుండ ధరణి యందు జరుగు బోదెట్టి కార్యమ్ము తరచి చూడ నిదుర బోయెడి సింహమున్ నిదుర లేపి దాని మోమున దూరునా బోన మెపుడు ౮
పురుష యత్నం చేద్దాం ! కార్య సఫలత చూద్దాం !!
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్య మప్రియం । ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః ॥
ఆటవెలది ఒరులు మెచ్చు నటుల ఒప్పైన మాటాడు ఒరులు నొచ్చు నటుల ఒద్దు సుమ్మి ఒరులు మెచ్చ తప్పు నొప్పుగా జెప్పకు తొలుత ధర్మ మిదియె తెలియ గాను ౯
సత్య మైనదె ముద్దు ! సత్యమ్ము కానిది వద్దు !!
శక్యోవారయితుం జలేన హుతభు, క్ఛత్రేణ సూర్యాతపో, నాగేంద్రో నిశితాంకుశేన సమదో, దండేన గౌర్గర్దభః । వ్యాధి ర్భేషజసంగ్రహైశ్చ, వివిధై ర్మంత్ర ప్రయోగైర్విషం సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్త్యౌషధమ్ ॥
సీసం – తేటగీతి అగ్ని కీలలపైన అంబు ధారల బోసి అర్ధ నిముషమున ఆర్ప వచ్చు చండ మార్తాండుని దండ తాడనముల ఆతపత్రము దాల్చి ఆప వచ్చు అంకుశమ్మును బట్టి హస్తి రాజమునైన చిటికెలోన అదుపు చేయ వచ్చు వేత్ర దండము దాల్చి వృషభ గార్దభముల గట్టిగా దారిలో బెట్ట వచ్చు
మంచి మందిచ్చి వ్యాధుల మాన్ప వచ్చు వివిధ మంత్రాలచె విషము విరుప వచ్చు నవని యందు నన్నింటిని నయము జేయ మహిత శాస్త్ర సమ్మతమైన మందు గలదు ఖలుల మార్చంగ మందెందు కాన రాదు ౧౦
ఖలుల మార్చు మందు ! దొరక బోదు ఎందు !!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™