భారత స్వాతంత్ర్యపోరాటం విభిన్న సిద్ధాంతాలు, వైరుధ్యాలు, ఉద్యమాలకు నెలవు. కొన్ని వేలమంది నాయకులు నడిపించారు. వారిలో దేశీయులతో పాటు విదేశీయుల పాత్ర ఎనలేనిది. ఈ విదేశీయులలో పేరెన్నిక గన్న మహిళ శ్రీమతి అనీబెసెంట్.
‘అనీ’ 1847వ సంవత్సరం అక్టోబరు 1వ తేదీన లండన్ లోని కాఫ్లామ్లో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఐర్లాండ్‌కు చెందిన ఎమ్లీ మోరీస్, విలియం లు. ఐదేళ్ళ వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారామె. తల్లి కుటుంబ పోషణ కోసం కష్టపడేవారు. ‘అనీ’ని తన స్నేహితురాలు మారియట్ సంరక్షణలో ఉంచారు.
మత ఛాందసుడు ‘బెసెంట్’తో ‘అనీ’ వివాహం జరిగి ‘అనీబెసెంట్’ అయ్యారు. అయితే మతానికి సంబంధించి ఇద్దరు దారులు వేరయ్యాయి. అనీబెసెంట్ ఒంటరిగానే జీవించసాగారు.
బ్రాత్లాతో పరిచయం ఆమెను మంచి వక్తగా తయారు చేసింది. ఆ తరువాత దివ్యజ్ఞాన సమాజ స్థాపకులు బ్లావట్స్కీతో పరిచయమయింది. 1893వ సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధిగా భారతదేశానికి వచ్చారామె.
లండన్‌లో ఉన్నపుడే ఆమె భారతీయ తత్వం, హిందూ మత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకున్నారు. ఈ విషయాలు భారతదేశంలో ఆమె కార్యకలాపాలను సుసంపన్నం చేయడానికి దోహదపడ్డాయి. మద్రాసులోని అడయార్ కేంద్రంగా ఈమె దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలను నిర్వహించారు.
డాక్టర్ భగవాన్ దాస్ సహాయంతో భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించారు. పురాణేతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీతలను గురించి చాలా ప్రదేశాలలో ఉపన్యాసాలను ఇచ్చారు. భారతదేశంలోని వివిధ ప్రదేశాల ప్రజలు వీటి పట్ల ఆకర్షితులయ్యారు. సమాంతరంగా మత సహనాన్ని గురించి వివరించడం ఈమె గొప్పతనాన్ని పెంపొందించింది.
1907వ సంవత్సరసంలో దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలయ్యారు. అప్పటి నుండి తన కార్యకలాపాలను విస్తృతపరిచారు. చెన్నపట్టణంలోని అడయారుని ముఖ్యకేంద్రంగా చేసుకుని పని చేశారావిడ. 1914 నుండి కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్రను నిర్వహించడం మొదలుపెట్టారు.
18885లో స్థాపించబడిన ‘భారత జాతీయ కాంగ్రెస్’లోని ముఖ్య బాధ్యులు చాలామంది దివ్యజ్ఞాన సమాజ సభ్యులవడం ఈమె ఉద్యమాలను సుసంపన్నం చేసింది. ఈమె కాంగ్రెస్‌లో పని చేయడం మొదలయిన తర్వాత దివ్యజ్ఞాన సమాజం, కాంగ్రెస్ వార్షిక సమావేశాలు ఒకే రోజు జరిగాయంటే… వీటి సహసంబంధం తెలుస్తుంది.
1916లో ‘హోమ్ రూల్’ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 1917వ సంవత్సరంలో ‘భారత జాతీయ కాంగ్రెస్’కు తొలి మహిళా (విదేశీ) అధ్యక్షురాలయ్యారు. హోమ్ రూల్ ఉద్యమానికి అనుబంధంగా లండన్‌లో ఒక శాఖని స్థాపించారు. అక్కడి భారతీయులతోనూ, భారతీయుల పట్ల సానుభూతి గల బ్రిటీషువారితోను ఉద్యమాన్ని ఉరకలేయించారు.
గాంధీజీ కాంగ్రెస్‌లో ప్రవేశించిన తరువాత ఆయన రూపొందించిన ఉద్యమాలతో విబేధించారు. 1919 తర్వాత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు. అయినప్పటికీ భారతదేశం, బ్రిటన్లలో తన పంథాలో ఉద్యమాన్ని కొనసాగించారు.
ఈమె ఉద్యమ సమయంలో చేసిన ఉద్రేకపూరిత ఉపన్యాసాలకు ప్రజలు ప్రభావితులయ్యారు. బ్రిటీషు వారు ఆమెను అరెస్టు చేశారు. ఆమెను విడుదల చేసేవరకు ప్రజలు తమ నిరసనను తెలియజేశారు.
ఈమె స్వాతంత్ర్య పోరాటానికి, దివ్యజ్ఞాన సమాజానికి కేంద్రబిందువులా వ్యవహరించడమే కాదు, విద్యావేత్త, సంఘసంస్కరణాభిలాషి కూడా! వారణాసి లోని హిందూ హైస్కూలు, కళాశాలల స్థాపకురాలు.
‘కామన్ వీల్’, ‘న్యూ ఇండియా’, ‘యునైటెడ్ ఇండియా’ వంటి పత్రికల సారథి.
‘వేకప్ ఇండియా’, ‘ఇండియా – ఇంగ్లండ్ – ఆఫ్ఘనిస్తాన్’ వంటి గ్రంథాల రచయిత్రి.
‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా’, ‘హోమ్ రూల్’ సంస్థల స్థాపకురాలు.
భారతదేశంలోని మహిళల కోసం మహిళామండలులను స్థాపించారు. అస్పృశ్యత, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. స్త్రీ విద్య కోసం, మహిళలకు ఓటు హక్కు కోసం కృషి చేశారు.
ఈమె 1933 సెప్టెంబర్ 20వ తేదీన అడయార్‌లో మరణించారు.
అదే విధంగా ఒక ఐరిష్మహిళ మన దేశ సంస్కృతీ, సాంప్రదాయాలను నిలపడం కోసం, స్వాతంత్ర్యం కోసం, మహిళల కోసం కృషి చేసినందుకు ఆమె జయంతి రోజున స్మరించుకోవడం మన విధి.
Aaha entha baga vivarincharu madam….👏👏Annie besant gari gurinchi. Vaariki janmadhinabhivananamulu…🙏🙏💐💐.Avida gurinchi maaku teliyajesinandhuku meeku dhanyavadamulu…🙏🙏
అనిబిసెంటమ్మ వ్యాసం సమగ్రంగా బాగుంది. వ్యాసకర్తకు అభినందనలు. నిడమర్తి రామయ్య అడ్వకేట్ గుడివాడ
Thanq Usha Rani garu
ధన్యవాదాలు రామయ్య గారూ
మన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రేమ మూర్తి గల ఐరిష్ మహిళ అనిబిసెంట్ గారి గురించిన చక్కని వ్యాసం ఇది, లక్ష్మి గారూ, అభినందనలు.
ధన్యవాదాలు గౌరీ లక్ష్మి గారూ!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™