[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘భారతీయ ప్రేమ కథామాలిక’ అనే కథాసంపుటిని విశ్లేషిస్తూ ప్రొ. సిహెచ్. సుశీలమ్మ అందిస్తున్న వ్యాస పరంపర. ఇది రెండవ భాగం.]
ఫిబ్రవరి 14వ తేదీ కంటే కొన్ని రోజుల ముందు నుండే యువతరం వెర్రెక్కి, ఉర్రూతలూగి పోయే భావోద్వేగం మరియు ఎదురుచూపులు గురించి ఆధునికులైన పెద్దలు కొంత చూసీ చూడనట్లు వుంటున్నారు. కానీ ఆ రోజు కానీ, తర్వాత కానీ ఒకానొక ఉన్మాదావస్థతో అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకొనే సంఘటనలు మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 తేదీన ప్రేమించిన అమ్మాయి తనను నిరాకరించిందని, ఆమెకి పెళ్లి కుదిరిందని ఒక ఉన్మాది ఆమెపై యాసిడ్ దాడి చేసాడు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతోంది. ప్రేమంటే ఏమిటి? దీనిని ప్రేమంటారా? అని కొందరు పెద్దలు విస్తుపోతున్నారు. “నేను ప్రేమిస్తున్నాను, నువ్వూ ప్రేమించాలి” అని నిర్బంధించడం, “ప్రేమించు లేదా చచ్చిపో” అని కర్కశంగా కత్తితోనో యాసిడ్ తోనో బెదిరించడం చూస్తే – వీటి వెనుక అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుని ఉన్నాయని గుర్తించాలి.
ఫిబ్రవరి 14 కు ముందు ‘ప్రేమికుల వారోత్సవాలు’ జరుపుకోవడం గమనించి కొందరు వ్యంగ్యంగా 14 తర్వాత ‘ప్రేమికుల వ్యతిరేక వారం’ అని ప్రకటించారు. ఒంటరిగా ఉండేవారు, ప్రేమలో మోసపోయినవారు బహుశా కసితో ‘యాంటీ వాలెంటైన్స్ వీక్’ అంటూ కొనసాగింపు కూడా చెప్పారు కాబోలు.
- ఫిబ్రవరి 15న స్లాప్ డే,
- 16న కిక్ డే,
- 17న పెర్ఫ్యూమ్ డే,
- 18న ఫ్లర్ట్ డే,
- 19న మిస్సింగ్ డే,
- 20న మెమరీస్ డే,
- 21న బ్రేకప్ డే.
ఇక గతాన్ని మర్చిపోయి మూ ఆన్ అయ్యే రోజు(లు).
పాశ్చాత్యులు చెప్పిందే వేదమని భావించి, వేలంవెర్రిగా వాలెంటెన్స్ డే జరుపుకునే యువతను ఆగి ఆలోచించమని చెప్తున్నారు కస్తూరి మురళీకృష్ణ ‘భారతీయ ప్రేమ కథామాలిక’లో. ప్రపంచమంతా గౌరవించే భారతీయ దాంపత్యాన్ని, దంపతుల ప్రేమ భావాన్ని ఆలకించమన్నారు. రామాయణ భారత భాగవతాది గ్రంథాల్లోని పాత్రలను, వారి అవ్యాజమైన ప్రేమను విశదీకరించి, నేటి తరానికి కరదీపికలుగా ఉండాలన్న దృక్పథంతో ఈ కథలను వినిపించారు.
భారతీయ ప్రేమ కథల్ని పరిశీలిస్తే – అవి పుష్పించి, ఫలించి, ‘పండిన జీవితాలు’ అని తెలుస్తుంది. అవి సమాజానికి సక్రమమైన దిశా నిర్దేశం చేశాయి. సందేశాన్ని అందించాయి. ఆ ప్రేమలో ఎక్కడా హత్యలు, ఆత్మహత్యలు కనపడవు. పూర్వం భారతీయ కావ్యాలు, నాటకాలు విషాదాంతాలు కావు. అవన్నీ సుఖాంతాలు. శుభాంతాలు. ఆంగ్ల సాహిత్య పరిచయం, ప్రభావం వలన మన దేశ భాషల రచనల్లో ‘ట్రాజడీస్’ ప్రవేశించాయి. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యాలకు మొట్టమొదట స్పందించే వంగ దేశంలోనే శరత్చంద్ర చటర్జీ రచించిన దేవదాసు, బడదీది వంటి విషాదాంత నవలలు రావటం, ఆ విషాదంలోనే ‘బాధే సౌఖ్యమ’నే భావన రావడం, అనేక భారతీయ భాషల్లో ఈ విషాదాంతాలు రావడం మొదలయ్యాయి. అంతకముందు మనకు అన్నీ ‘సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ మంగళాశాసనం గావించే రచనలే ఉన్నాయి. నిజానికి ‘పోరాడు, జయించు, జీవించు’ అనే సూత్రం పై భారతీయ సిద్ధాంతం నిలిచివుంది.
సావిత్రి
మృత్యువుని జయించిన ప్రేమకు ఏనాటికీ నిలిచి ఉండేది ‘సావిత్రి’ వృత్తాంతం. మహాభారతంలోని సావిత్రి కథను ఎన్నో భాషల్లో, ఎన్నో నూతన భావాలతో, ఎందరో మళ్లీ మళ్లీ తమ భావనల్లో రచించారు. ఆమె కేవలం ఒక పాత్ర కాదు. భారతీయ ఆత్మ. ఇంద్రియ పరిధి దాటి, అధి భౌతిక స్థాయిలో, గంభీరంగా నిలిచి ఉన్నది సావిత్రి.
రాజ్యాన్ని కోల్పోయి అంధులైన తల్లిదండ్రులతో అరణ్యాలలో ఉన్న సత్యవంతుడిని – ఒక్క సంవత్సరం మాత్రమే ఆయుష్షు ఉందని తెలిసీ, ప్రేమించి వివాహమాడింది సావిత్రి. భర్తను, అత్త మామలను ప్రేమానురాగాలతో అలరించింది.
“అశాంతితో అనంతకాలం బ్రతకటం కన్నా, సుఖ సంతోషాలతో సంవత్సరకాలం బ్రతికి, జీవితాంతం మరపురాని మధురానుభూతులను మూట కట్టుకోవడం మేలు” అని తలచింది.
భర్త ఆయువు అంతమయ్యే సమయం దగ్గర పడుతున్నది. అది అతనికి తెలియదు. పెళ్లికి పూర్వమే జ్యోతిష్యులు ఆమెకు తెలియజేసారు. చివరి మూడు రోజులు నిరాహార వ్రతం చేసి, చిట్ట చివరి రోజు ఒంటి కాలి మీద నిల్చొని వ్రతాన్ని ఆచరించింది. దాని ప్రభావం వల్లనే కాబోలు భర్త ఆయువును తీసుకొని వెళుతున్న దృగ్గోచరాసాధ్యమైన యమధర్మరాజును చూడగలిగింది, నిలువరించింది, ప్రశ్నించగలిగింది. గత్యంతరం లేని పరిస్థితిలో పడవేసి ఆ సమవర్తి చేతనే వరాలను పొందగలిగింది. మామగారికి, తండ్రికి మేలు కలిగేలా వరాలు పొందింది. చివరకు చిక్కు ప్రశ్న వేసి యమధర్మరాజునే మెప్పించి పతి ప్రాణాలు తిరిగి పొందగలిగింది. ఇదే నిజమైన ప్రేమ. నిక్కమైన దాంపత్యం. సత్యాన్వేషణ చేసి, సత్యసాక్షాత్కారం పొందిన ధన్యజీవులు, ప్రేమ జీవులు సావిత్రీ సత్యవంతులు. ప్రపంచానికే ఆదర్శనీయులు.
“శరీరమే సర్వస్వం అనుకున్నవారు మామూలు మనుషులు గానే మిగులుతారు. యోగం ద్వారా శరీర పరిమితులను అధిగమించి విజ్ఞానాన్వేషణ ద్వారా, చింతన ద్వారా, తపస్సు ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. తనలోని దివ్యత్వాన్ని దర్శించాలి. అదే అసలైన ప్రేమ. సృష్టి స్థితి లయకారుడై, అద్యంతాలు లేని ఆ దివ్య జ్యోతి దర్శనాన్వేషణే ప్రేమ. ఆ ప్రేమ పై మనసు నిలుపు. మిగతావి భ్రమలు” అని యమధర్మరాజు చేత పలికిస్తారు మురళీకృష్ణ.
ఆధ్యాత్మిక గురువు అరబిందో భావనలో ‘సావిత్రి’ ఒక ప్రతీక. మానవాళి పునరుజ్జీవనం యొక్క గాథ. దైవిక రూపంలో మనిషి పునరుద్ధానం, సుప్రమెంటల్ జననం (సూపర్ – మెంటల్ కోసం శ్రీ అరబిందో ఉపయోగించే పదం), ఆధ్యాత్మిక మార్గదర్శిగా సావిత్రిని దర్శించారు ఆయన. “నేను సావిత్రిని స్వర్గారోహణ సాధనం గా ఉపయోగించాను” అన్నారు శ్రీ అరబిందో.
దమయంతి
ప్రపంచంలోనే ప్రేమ కథలను ఉట్టంకించే సందర్భంలో, ‘ప్రేమ’ గురించి తెలిపేటప్పుడు మొదటి వరుసలో ఉండే జంట నలదమయంతులు. హంస ద్వారా నలమహారాజు గురించి తెలుసుకుని, అతనినే మనోవాక్కాయకర్మలందు ప్రేమించి, స్వయంవరంలో స్వయంగా వచ్చిన దేవతలను తృణీకరించి, నలునినే వివాహమాడినది దమయంతి. అటువంటి దమయంతిని, రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసంలో ఉండగా నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు నలుడు. ఎందుకు? ఇదే నా ప్రేమ? ఇదేం న్యాయం?
“మనిషి శరీరంపైనే ఉండే ప్రేమనే అసలు ప్రేమ అనుకునే వారి ప్రేమ శరీరం సన్నిహితంగా ఉండటం పై ఆధారపడి ఉంటుంది. ప్రేమ భౌతిక ప్రపంచానికి చెందినది కాదు. దాని స్వరూప స్వభావాలు తెలిసినవారికి ప్రేమ మనిషి ఎదురుగా ఉండటంపై ఆధారపడి ఉండదు” అని ఈ సందర్భంగా దమయంతిచే అద్భుతంగా పలికించారు మురళీకృష్ణ.
కనుకనే – శరీరం కాకుండా మనసుని ప్రేమించిన దమయంతి అనాకారిగా, వంటవానిగా ఉన్న భర్తను గుర్తించింది. అతడి మనసును బైటకు రప్పించడానికి తండ్రిచే (మరోసారి) స్వయంవరం ప్రకటింపజేసింది.
బాహుకుడి పేరుతో ఉన్న నలుడు తప్పక వస్తాడని ఆమె నమ్మకం. వచ్చినవానిని, అతని కంటిలోని తడిని, దానిలోని వేదనను, ప్రేమను గుర్తించింది. “నన్ను వదిలి ఎలా మనగలిగారు” అని మాత్రం అనగలిగింది. “జీవచ్ఛవంలా. నువ్వెక్కడో హాయిగా ఉండి ఉంటావు అన్న ఆశతో. నన్ను క్షమించు. నా దురదృష్టం నీడలా నన్ను వెంటాడుతుంటే, దాని నీడలో నువ్వు మగ్గకూడదని నా దురదృష్టపు నీడను నా వెంట నీకు దూరంగా తీసుకువెళ్లాను” అన్నాడు. “మన ఇద్దరి అదృష్టాలు, దురదృష్టాలు పెనవేసుకుపోయినప్పుడు ఆ నీడ మీ ఒక్కరిది కాదు. మన ఇద్దరిదీ. మీకు దూరంగా బ్రతకాల్సి రావటాన్ని మించిన కష్టం ఇంకేదీ లేదు” అన్నది దమయంతి దృఢంగా.
సౌందర్యరాశి ‘కుబ్జ’
అందం సాపేక్ష పదం. ఒకరికి అందంగా అనిపించింది మరొకరికి అందంగా అనిపించకపోవచ్చు. అందంపై ఆధారపడే ప్రేమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను, వ్యక్తి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ప్రేమించే అర్హత లేనిది, అందవిహీనమైనది ప్రపంచంలో కనబడదు – ఇది కృష్ణ తత్త్వం.
అపారమైన ప్రేమ సాగరం శ్రీకృష్ణుడు. అనంతమైనది అతని ప్రేమ. అతనికి ద్వేషం తెలియదు. ఈ ప్రపంచం, ఈ విశ్వం సర్వం అతనిది. అత్యంత అందమైనది. ప్రియమైనది. సృష్టి లోని ప్రతి అణువుపై ప్రేమ రసామృత వర్షం కురిపిస్తాడాయన. బాల్య స్నేహితులు సుధామ, కుచేలులను ఎలా ప్రేమిస్తాడో, గోపికా ప్రేమికలను ఎలా ప్రేమిస్తాడో ‘కుబ్జ’ను అలానే ప్రేమించగలడు. ఆమె గూని, శరీరపు వంకరలు కృష్ణ ప్రేమకు అడ్డు కాలేవు. అందరూ ‘అందవికారి’ అంటూ అసహ్యించుకునే కుబ్జ లోని అనాకారితనం అతని వాత్సల్యానికి ఆటంకం కాదు.
మధురా నగరంలో, రాజాస్థానానికి వెళ్ళే దారి వెంట తలవంచుకుని, ఎవరినీ చూడకుండా నడచివెళుతోంది ఆమె. తన పేరు ఏమిటో ఆమెకు గుర్తు లేదు. కుబ్జ (గూని) అనే అందరూ పిలవడం ఆమెకూ అలవాటై పోయింది. శ్రీకృష్ణుని ప్రేమ గురించి, అతని మురళీగానం గురించి, మైమరిపించే ఆ శబ్ద తరంగాల గురించి విని వుంది, వేచి వుంది. కానీ ఏదో అనుమానం! అతనికి సహ్యం, అసహ్యం అనేదే లేకపోవచ్చు కానీ, ఇతరులెవరూ చూడలేని తన హృదయ సౌందర్యం అతనికి కనిపిస్తుందా! వ్రజభూమిలో ఉండే కృష్ణుడు, బృందావనంలో రాసలీలలో మునిగివుండే కృష్ణుడు తనకు దర్శనమిస్తాడా అనే ఆలోచనలతో నడుస్తున్న కుబ్జ సాక్షాత్తూ తన ఎదుట నిలబడిన కృష్ణుని గమనించలేదు. ఎవరో తుంటరి అనుకుని తప్పించుకుని పోబోయింది. అతని నుండి ‘ఎవరూ తప్పించుకోలేరు’ కదా! తను ఆగాడు, ఆమెను ఆపాడు. చూసింది. నిర్ఘాంతపోయింది. తనను తాను మరచిపోయింది. ఎదురుగా నిలుచున్న శ్రీకృష్ణుని కనుల నుండి ప్రవహిస్తున్న ప్రేమసుధారస ప్రవాహం ఆమె తనువు లోని అణువణువు నెల్ల ముంచెత్తింది. శ్రీకృష్ణుడు అడుగు ముందుకు వేసి, ఆమె కాళ్ళ పై తన కాళ్ళు నిలిపి, చుబుకం కింద చేతులుంచి తలను పైకెత్తాడు.
“నీ మనసుకు పట్టిన కుబ్జత్వం వదిలింది. నిటారుగా నిలువు. అత్యంత సుందరమైన స్త్రీవి నీవు. అబ్జవు” అన్నాడు కృష్ణుడు.
జగమంతా ప్రేమమయం అంటూ కస్తూరి మురళీకృష్ణ శ్రీకృష్ణుని తత్త్వాన్ని వివరిస్తూ – “అందరిలో నన్ను చూసుకుంటాను కాబట్టి అందరినీ ప్రేమిస్తాను. అంటే నేను ప్రేమిస్తున్నది నన్నే కదా. ప్రతి వ్యక్తి ఎప్పుడైతే తాను ప్రేమిస్తున్నది ఎదుట వ్యక్తి లోని తననే అని గ్రహిస్తాడో అప్పుడు తనని తాను తెలుసుకుంటాడు. అప్పుడు ఈ ప్రపంచం అంతా ప్రేమమయం!” అంటారు ‘భారతీయ ప్రేమ కథామాలిక’లో.
మరికొన్ని భారతీయ ప్రేమ గాథలతో మళ్ళీ కలుద్దాం.
***


రచన: కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు
పుటలు: 248
వెల: ₹ 150/-
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ 520 004
ఫోన్: 0866-2436642/43
ఆన్లైన్లో:
https://www.amazon.in/Bharatiya-Prema-Kathamaalika-kasturi-Muralikrishna/dp/B084ZM6LHB
