వేంపల్లి నాగ శైలజ గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.
“మనకు వున్న ఒక్క పిల్లాడు చాలు సుశీలా, ఇక ఆపరేషన్ చేయించేసుకో” భార్యతో చెప్పాడు శ్రీనివాస్.
“పాప గానీ,బాబు గానీ, మరొక్కరుంటే బాగుంటుందేమోనండీ” భర్తతో అంది సుశీల.
“ఇంకో కానుపులో కొడుకే పుడతాడన్న గ్యారంటీ ఏం లేదు గానీ, ఒకవేళ పుడితే మాత్రం ఇప్పుడు ఎందరి విషయంలోనో జరుగుతున్నట్లుగా వృద్ధాప్యంలో మనల్ని వాటాలుగా చెరొకరు పంచుకుని విడదీస్తారేమోనని, ఆ వయస్సులో అది నేను భరించలేను” కంగారుగా చెప్పాడు శ్రీనివాస్.
“మేడం, అమ్మగారు పోయారని హాస్పటల్ నుండీ ఇప్పుడే కాల్ వచ్చింది” విదేశాల్లో షూటింగులో వున్న అగ్రతారతో చెప్పాడు అమె సెక్రటరీ.
“అయ్యో, అలాగా, వెంటనే మన తిరుగుప్రయాణం ఏర్పాట్లు చూడు, ముఖ్యంగా మరచిపోకుండా నా వ్యానిటీ బ్యాగులో గ్లిజరిన్ బాటిల్ పెట్టించు, ఎన్నో ఏడుపు సీన్లలో దాంతోనే నటించడం అలవాటయి మామూలుగా కన్నీళ్ళు రావడం లేదు. అమ్మ శవం దగ్గర ఏడవకున్నా ఈ పత్రికలు, చానెళ్ళ పోరు భరించడం మహా కష్టం” చెప్పిందా సహజనటి.
“గీతా, మాలాగా అందంగా కాక, నల్లగా, మరీ అంద విహీనంగా వుంటానని నీకు ఎప్పుడూ బాధగా అనిపించదా?” యూనివర్శిటీలో క్లాస్‌మేట్‌ను జాలిగా అడిగింది మాధురి.
“అస్సలు అనిపించదు, పైగా ఇలా వుండడం వల్ల మీకు వున్నట్లుగా తమ కంటి చూపులతోనే దేహాల్ని తూట్లు పొడిచే పోకిరీ కుర్రాళ్ళ బాధ, యాసిడ్ దాడుల భయం నాకు ఏమాత్రం లేనందుకు సంతోషం కూడా” జవాబిచ్చింది గీత.
“జయా, ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నావ్?” నాలుగేళ్ళ తర్వాత సిటీలో ఎదురుపడిన తన ఒకప్పటి డిగ్రీ క్లాస్‌మేట్‌ను అడిగింది సుమ కుశలప్రశ్నలయ్యాక.
“ఆడవాళ్ళకు కోచింగ్ క్లాసెస్ నడుపుతున్నా” చెప్పింది జయ.
“కుట్లు, అల్లికలు, టైలరింగ్ లాంటివా?” ప్రశ్నించింది సుమ.
“కాదు సుమా, పెళ్ళయ్యాక అనవసరంగా వేధించే అత్తలు, ఆడపడచులు, మొగుళ్ళ టార్చర్లతో ఆత్మహత్యలకు పాల్పడక ఎలా ఎదిరించాలా అనే విషయం మీద” జవాబిచ్చింది జయ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™