[కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న ‘చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం’ అనే వ్యాసపరంపర.]


“It is a case of reconstructing history where there are no texts and if there are, they have no direct bearing on the question. In such circumstances what one has to do is to strive to derive what the texts conceal or suggest without being even quite certain of having found the truth.”
‘The Untouchables’ పుస్తకానికి ముందుమాటలో ‘అంటరానితనం’ గురించి తాను చేసిన ప్రతిపాదనలు ‘వినూత్నమైనవ’ని, – The thesis on the origin of Untouchability advanced in the book is an altogether novel thesis అని ప్రకటిస్తూ, ఈ ప్రతిపాదనలకు ఆధారాలను వివరించారు డా. అంబేద్కర్. ఇది అంతవరకూ భారతీయ చరిత్ర పరిశోధన, విశ్లేషణలో ఎవరూ ప్రదర్శించని నూతన దృక్కోణం. ఈ దృక్కోణం వినూత్నం. ఇది అర్థం చేసుకోవాలంటే డా. అంబేద్కర్ తన దృష్టిని భారతదేశ సామాజిక జీవనంలో ‘అస్పృశ్యత’ ఆరంభాన్ని అన్వేషించటం ప్రారంభించి, ఫలితాలను ప్రకటించే కాలంలో భారతీయ చరిత్ర గురించి విశ్లేషణ జరిపిన దృకోణాల గురించి తెలుసుకోవాల్సివుంటుంది.
భారతీయుల దృక్కోణంలో చరిత్ర వేరు. చరిత్ర రచన లక్ష్యం వేరు. పాశ్చాత్యుల దృష్టిలో చరిత్ర రచన, దాని లక్ష్యాలు వేరు. కాబట్టి, ఆధునిక పాశ్చాత్య భావ ప్రభావిత చరిత్ర రచయితలు భారతీయ చరిత్ర రచన, పరిశోధన, విశ్లేషణలు 18వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయని తీర్మానిస్తారు.
ఆధునిక చరిత్ర రచన పద్ధతులు యూరోపియన్లతో పాటు భారతదేశంలో అడుగుపెట్టాయి. వారు పాలకులు. భారతీయులు పాలితులు. కాబట్టి, భారతదేశ చరిత్ర రచనలో వారి దృష్టి పాలకుల దృష్టి. తాము గెలుచుకున్న ప్రజలు తమ మాట వినేట్టు చేసుకోవాలంటే చరిత్రను ఎలా రాయాలో అలా రాశారు పాలకులు. వారి ఆదర్శాలు, వారి విలువలు, వారి లాభాలు ఆధారంగా చరిత్రను విశ్లేషించారు.ాధికారం వారిది కాబట్టి వారిమాట చెల్లకతప్పదు.
Colonial ideologies, values and explanation structured the agenda of history writing (Dominance without Hegemony, Ranjit Guha)
ఆనాటి యూరోపియన్ పాలకులు వారి చరిత్ర రచన పద్ధతులు ఇక్కడ ప్రవేశపెట్టారు. అనుభవ పూర్వకంగా, ఆధారాల ద్వారా గ్రహించిన విజ్ఞానానికి వారు ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో శాసనాలు, కావ్యాలు, గణాంక వివరాలు వంటి సాక్ష్యాధారిత చరిత్ర రచన ప్రాధాన్యం వహించింది. ఇలా లభించిన సాక్ష్యాలు నమ్మదగినవా? కాదా? ప్రామాణికమా? కాదా? అన్నది విశ్లేషించి పరిశీలించి, పరోశోధించి నిగ్గు తేల్చుకోవటం ద్వారా చారిత్రక సత్యాలను నిర్ధారించే పద్ధతి ఏర్పడింది. ప్రాచీన కావ్యాల ద్వారా ప్రాచీన చరిత్రను గ్రహించటం, రాజులు, ఆనాటి అధికారిక పత్రాలు, రాజాస్థానం లోని వారు వ్రాసిన రాజుల చరిత్రలు వంటి వాటిని ఆధారాలుగా కొన్ని నియమాల ద్వారా నిర్ణయించారు. అయితే ప్రధానంగా చరిత్ర పరిశోధకుల దృష్టి రాజకీయ చరిత్రకు మాత్రమే పరిమితమయింది.
దీనికి పాలకులు, పాలితులు అన్న స్థితి తోడవటంతో స్థానికుల అభిప్రాయాల కన్నా పాలకుల అభిప్రాయాలకు విలువ ఎక్కువయింది. ఫలితంగా పాశ్చాత్యుల ఆధిక్యత, స్థానికుల న్యూనత ప్రస్ఫుటమయ్యే రీతిలో చరిత్ర తయారయింది. ఈ చరిత్ర తయారీలో ఆనాటి పండితులు, అధిక శాతం బ్రాహ్మణులు, విదేశీ పాలకులకు సహాయం చేశారు. అయితే ఎవరెలాంటి సహాయ చేసినా యూరోపియన్లు అన్నిటినీ తమకనుకూలంగానే మలచుకున్నారు.
ఎప్పుడయితే పాలకులు తమ ఆధిక్యతను నిరూపించుకునేందుకు చరిత్రను ఆయుధంలా వాడుకోవటం ఆరంభించారో, అప్పుడే పాలితులలో నిరసన భావం వ్యక్తమయింది. న్యూనతా భావం వదిలించుకుని తమ ఆధిక్యతను ప్రదర్శించాలన్న దృష్టితో, పాశ్చాత్య చరిత్ర విశ్లేషణ పద్ధతులను ఉపయోగిస్తూ భారతీయ చరిత్రను విశ్లేషించటం మొదలయింది. వీరు జాతీయవాద దృక్కోణంలో చరిత్రను రచించటం ఆరంభించారు. పాలకులు దెబ్బతీస్తున్న ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాలను పాలితులలో నిలిపే దృష్టితో వీరు చరిత్ర రచించటంతో భారతదేశ చరిత్ర రెండు విభిన్నమైన దృక్కోణాలతో అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా 1857 ఘటన పాలకుల దృష్టిలో ‘సిపాయిల తిరుగుబాటు’ అయితే జాతీయవాదుల దృష్టిలో ‘ప్రథమ స్వాతంత్ర సంగ్రామం’ అయింది.
ఇటు విదేశీ పాలకుల దృష్టిని, అటు జాతీయవాదుల దృక్కోణాన్ని పట్టించుకోకుండా చరిత్రను నిష్పాక్షికంగా చూసి విశ్లేషించాలి తప్ప, దేశ గౌరవం, ఆత్మవిశ్వాసం వంటి వాటి కోసం చరిత్రను వాడవద్దనే ఇండోలజిస్టులది మూడో దృక్కోణం. ఈ దృక్కోణానికి అత్యంత ప్రచారం ఇచ్చిన వారు ఆర్. వి. భండార్కర్.
ఈ మూడు దృక్కోణాల నడుమ మార్క్సిస్ట్ దృక్కోణం వచ్చి చేరింది. ఈ దృక్కోణం ప్రకారం చరిత్ర పీడకులు, పీడితుల నడుమ పోరాటం, ప్రతీదీ ఆర్థికంతో ముడిపెట్టి విశ్లేషించటం , పీడితుల పక్షాన చరిత్ర రాయటం మార్క్సిస్ట్ చరిత్ర రచనకు ప్రధానం.
“The history of all previous societies has been the history of class struggles” అన్నాడు మార్క్స్.
ఈ దృక్కోణాలకు భిన్నంగా జ్యోతిబా ఫూలే ‘కులం’ దృక్కోణంలో చర్రిత్రను విశ్లేషించే నూతన దృక్కోణానికి తెర తీశారు. భారతీయ చరిత్రలో అంటరానితనం కొనసాగటానికి బ్రాహ్మణులే కారణం అని ప్రకటించారు.
“True history would unravel the trickery of Brahmin caste towards the downtrodden people and their history of glorious struggle against oppressive, unjust caste system; and then they would revolt against it.” అన్నారు.
అంటరానితనం, కులం, బ్రాహ్మణ ఆధిపత్యం, ఇతర కులాల అణచివేత వంటి అంశాల ఆధారంగా చరిత్రను విశ్లేషించటానికి బీజం పడింది. సమాజంలో ఎలాంటి అధికారానికి నోచుకోక, అణచివేతకు గురయ్యే అట్టడుగున ఉన్న ప్రజల దృక్కోణంలో చరిత్రను నిర్మించటం ‘పీడితుల చరిత్ర’గా గుర్తింపు పొందింది. ఆంగ్లంలో దీన్ని subaltern history అంటారు.
ఆంటోనియా గ్రామ్సీ, మార్క్స్ భావజాల ప్రభావంతో రచనలు చేస్తూ సెన్సార్ దృష్టిని తప్పించుకునేందుకు ‘ప్రాలిటేరియట్’ బదులు ‘సబ్ఆల్టర్న్’ అన్న సమానార్థక పదాన్ని వాడేడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పదం – అణచివేతలకు గురయిన వారు తమ చరిత్రను తమ దృక్పథంతో రచించటాన్ని సూచించేందుకు వాడుతున్నారు. ఫలితంగా Subaltern Studies Group Historians ఏర్పడ్డారు. అయితే ‘సబ్ఆల్టర్న్’ చరిత్ర అధ్యయనం 1980 తరువాత భారతదేశంలో ఊపందుకుంది.
జ్యోతిబా ఫూలే ప్రతిపాదించిన ‘భారతదేశ చరిత్ర, కులాల పోరాతల చరిత్ర’ అన్న ఆలోచనను ఒక ఉద్యమం స్థాయికి తీసుకువెళ్ళి కులం దృక్కోణంలో చరిత్ర రచనకు ప్రామాణికత కల్పించినవారు డా. అంబేద్కర్.
“They cannot make history who forget history” అన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి వ్యక్తి తన చరిత్రను తెలుసుకోవాలన్న ఆలోచనతో భారతీయ చరిత్రను పరిశీలించటం, పరిశోధించటం ప్రారంభించారు డా. అంబేద్కర్.
ఆ కాలంలో ఇది అంతవరకు ఎవ్వరూ ప్రయాణించని మార్గం. దాంతో తాను విదేశాలలో అధ్యయనం చేసిన పాజిటివిస్ట్ చరిత్ర పరిశోధనల పద్ధతులను ఉపయోగించి భారతదేశ చరిత్రలో లభిస్తున్న ఆధారాలను పరిశీలించి, విశ్లేషించి తన దృక్కోణంలో చరిత్ర రాయాల్సి వచ్చింది. అంటే చరిత్ర రచన దృక్కోణంలో ఒక నూతన మార్గాన్ని ఆవిష్కరించారన్న మాట.
మార్గం కొత్తది. దారి తానే ఏర్పాటు చేయాలి. అధికంగా లభించే చారిత్రిక ఆధారాలలో తన దృక్కోణానికి అవసరమయిన అంశాలు తక్కువ. తన దృక్కోణంలో చరిత్ర రచించేందుకు ఆధారాలు తక్కువ. అనేక సందర్భాలలో దొరికిన ఆధారాలు ఆయన దృక్కోణానికి పనికిరానివి. అయినా సరే, చరిత్రను , అణగద్రొక్కబడినవారి చరిత్రను వారి దృక్కోణంలోంచే నిర్మించాలి.ఇందుకు లభిస్తున్న ఆధారాలలో పైకి కనబడకున్నా అంతర్గతంగా నిబిడీకృతమైన అంశాలను ఆధారం చేసుకోవాలి. అంటే, ప్రత్యక్షంగా కనబడుతున్నదానినుంచి చెప్పకపోవటంవల్ల కనబడని అంశాలను ఊహించి, వాటిని నిజమని భావిస్తూ చరిత్రను నిర్మించాల్సివుంటుందన్నమాట. ఇది అంబేద్కర్ దృక్కోణంలో చరిత్ర విశ్లేషణ. ఇందుకు ఆయన సూత్రాలను, పద్ధతులను, నియమాలను, నిబంధనలను స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు. అవి వచ్చేవారం.
(ఇంకా ఉంది)
