ఎవడుంటాడోయ్ మూడేభైలు
చేయాల్సింది చేసేయ్!
అధిరోహిస్తే ఎవరెస్టైనా
కాళ్ళకిందనుంటుందోయ్!
ముళ్ళున్నాయని ముడుచుకుపోతే
మూగబోతుంది నీలక్ష్యం!
ఆంజనేయునావాహనచేస్తే
కడలే మడుగౌతుందోయ్!
చీడలుపడతాయనుకుంటూ
చిగురించడమే మానేస్తావా?
నీడలుపుడతా యనిదీపం
వెలిగించడమే మానేస్తావా?
దారులు కనబడలేదంటూ
దూరాలను లెక్కిస్తావా?
తారలనైనా అందుకోగలవు
శరమై దూసుకు పోతే!
ఫలప్రదమైతే నీచుట్టూ
పదిమంది చేరికూర్చుంటారోయ్
పెద్దల ఆశీర్వచనాలే
శ్రీరామ రక్షలౌతాయోయ్!

కిలపర్తి దాలినాయుడు కవి, రచయిత, కార్టూనిస్టు. వృత్తిరీత్యా సాంఘికశాస్త్రోపాధ్యాయులు. రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాప పురస్కార గ్రహీత. పలు గేయ సంపుటాలు, వ్యాస సంపుటులు వెలువరించారు. రెండువేలకు పైగా కార్టూన్లు ప్రచురితం. పలు పోటీలలో పురస్కారాలు పొందారు.
1 Comments
34.236.151.67
చేయాల్సింది చేసెయ్ అని మంచికవిత రాసి చూపించారు కిలపర్తి దాలినాయ్డుగారు.చేయాల్సింది
చేద్దాంలే అని వాయిదాలు వేసుకుంటూ పోతే అది ఎప్పటికీ పూర్తికాదు.ఈ లోగా కాలుడు వచ్చి
ఈడ్చుకుపోవచ్చు అభినందనలు సంచిక కు మరియు దా.నా గార్కి. రామారావు సింగిడి (రాయగడ)