[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]


రాశి ఫలాలు
జానకిరాం పుట్టిన సమయంలో వాళ్ల నాన్న అతని జాతకం రాయించాడు.
ఇప్పుడు ఆయన లేకపోయినా, ఆయన రాయించిన జాతక పుస్తకం ఉంది. దాని నిండా గ్రహాల గురించి, వాటి ప్రభావాల గురించి, వాటి చలనాల గురించి రాసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జానకిరాంకి ఈ గ్రహాల గురించి అంతగా తెలియదు. తెల్సుకోవాలన్న ఆశా లేదు. కాకపోతే భవిష్యత్తులో ఏం జరగబోతోందో ముందుగానే తెల్సుకోవాలన్న ఆత్రం అందరికీ ఉన్నట్లే అతనికీ ఉంది. అందుచేత ఏమీ తోచనప్పుడు ఆ జాతక పుస్తకం తీసి చూసుకుంటుంటాడు.
అందమైన అనుకూలమైన కళత్రం లభిస్తుందని రాసి ఉంది. కొంచెం అటు ఇటుగా అది నిజమే గదా అని భార్యని చూసుకుని తృప్తి పడుతుంటారు. పుత్ర సంతానం కలుగుతుందని రాశారు. అదీ నిజమే గదా అని తల ఊపుతుంటాడు. బంధు మిత్రులలో, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని రాశారు. అది నిజమే గదా అని అనుకుంటూ ఉంటాడు.
ఇవన్నీ బేరీజు వేసుకుని జాతక ఫలాల మీద కొద్ది కొద్దిగా నమ్మకం ఏర్పడింది. ఫలానా సమయంలో ఆనారోగ్యం, గండం ఉన్నదనీ జాతకం హెచ్చరించింది. అదీ నిజమే అయింది. ఆ మధ్య కరోనా సమయంలో కొద్దిగా జబ్బుపడి లేచాడు. అలా జోస్యం చెప్పినవన్నీ జరిగాయి కదా – అనీ మనసులోనే నిర్ధారించుకున్నాడు.
ఇల్లు మారినప్పుడు, జానకిరాం భార్య ఇంటి నిండా చెత్త పేరుకున్నదంటూ, కొన్ని పుస్తకాలు అమ్మేసింది. వాటితో పాటే, ఈ జాతకం రాసిన పుస్తకము పోయింది. ఈమధ్య ఇల్లంతా ఎంత వెదికినా అది దొరకలేదు. కించితే బాధ కలిగినా చేసేదేమే లేక ఏది అయితే అదే అవుతుందని గుండె దిటవు చేసుకున్నాడు.
లాప్టాప్లో ‘యూట్యూబ్’లో ఫలానా రాశివారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో జోస్యం చెప్పేవారు ఎక్కువ అయ్యారు.
వచ్చే జనవరి నుంచీ ఈ రాశివారికి పది సంవత్సరాల పాటు గజ రాజ యోగం ఉందనీ, పట్టిందల్లా బంగారం అవుతుందనీ, వద్దన్నా డబ్బు వచ్చిపడుతుందనీ, వంద కోట్లకు తక్కువ కాకుండా ఆర్జిస్తారనీ ఒకరు; కాదు, ఇద్దరు కాదు; పది మంది జోస్యం చెప్పారు. అయితే, ‘యస్’ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో పరిచయం ఏర్పడుతుందనీ, ఆమె వల్లనే ఈ రాశి వారికి విశేష ధనార్జన ఉంటుందని చెప్పారు. తాము చెప్పింది జరగకపోతే ఇక జోస్యం చెప్పటం మానేస్తాననీ ఒకరిద్దరు శపథం కూడా చేశారు.
ఇది విన్నప్పటి నుంచే జానకిరాం పంచ రంగుల కలల్లో తేలిపోతున్నాడు.
అందమైన స్త్రీతో పరిచయం, కోట్ల కొద్దీ ధనం.. ఇంతకంటే ఎవరు మాత్రం ఏం కోరుకుంటారు? పైగా గురువు ఈ ఇంట్లో ఉన్నాడు, శుక్రుడు ఈ ఇంట్లో ఉన్నాడు. శని ఇలా చూస్తున్నాడు, అలా చూస్తున్నాడు.. అందుచేత ఈ రాశివారి ఇంట్లోకి ఒక స్త్రీ రాబోతోంది. ఆమె వల్ల బీరువాల నిండా నోట్ల కట్టలు రాబోతున్నదని అందరూ ముక్త కంఠంతో చెప్పారు.
వాళ్లు చెప్పిన జనవరి వచ్చింది. వెళ్లింది. అలాగే ఇంకా ఆరునెలలు వచ్చాయి. వెళ్లాయి. కానీ ‘యస్’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల స్త్రీ రాలేదు. అసలు ఏ స్త్రీ రాలేదు. అలా అని ఆ గ్రహాల ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది?
తన ప్రయత్నమూ కొంత ఉంటేగాని, పలితం కనిపించదు అని అనుకున్నాడు. ఇంక అక్కడ నుంచీ ‘యస్’ అనే అక్షరంతో మొగలయ్యే పేరు గల స్త్రీ కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు.
లక్ష్కీగా వెనక వీధిలో శాంతి అనే నడి వయసు భామామణి ఉన్నదని తెల్సి, ఆమెనే దుర్భిణీ వేసి చూడసాగాడు. ఇందు వదన అందము, చందము, తళ్కులు, వన్నెలు, చిన్నెలు చూచి జానకిరాం బొక్క బోర్లా పడిపోయాడు.
కూరలు కొట్టు దగ్గరకు, కిరాణా షాపు దగ్గరకు, పూలు కొనటానికి, మిరపకాయ బజ్జీలు కొనటానికి ఆమె వచ్చినప్పుడల్లా జానకిరాం కూడా అక్కడకు వెళ్లి, నీ వెంట తోడు నీడై నే వచ్చెద, నీకున్, నాకున్ దైవంబు లంకె చేసె – అన్నట్లు నీడలా ఆమెను అనుసరించాడు.
అప్పుడప్పుడు ఆమె దగ్గర చిల్లర లేనప్పుడు, అతను ఆదుకున్నాడు. శాంతి భర్త అయ్యప్ప పూజలు చేస్తుంటే, ఈ జానకిరాం అయ్యప్ప భక్తుడై పోయి వాళ్ళింట్లోకి చేరుకున్నాడు.
శాంతి భర్త చేసే అయ్యప్ప పూజకు అయ్యే ఖర్చు కూడా జానకిరాం పెట్టుకున్నాడు. అలా ఆమె భర్తకు, ఆమెకూ దగ్గరయ్యాడు.
శాంతి భర్త శబరిమలై వెళ్లినప్పుడు ఒంటరిగా ఉన్న శాంతికి మనశ్శాంతి చేకూర్చాడు – తోడు నీడై నిలిచి.
ఇలా కొన్ని గెలలు గడిచాయి. వినయోక్తులతో వింతల కౌగిలింతల దాకా సరసాలు సాగినయి. కానీ ఈ శాంతి ద్వారా తనకు ఎప్పటికే తాను ఆశించే సిరిసంపదలు చేకూరవని గ్రహించి, క్రమంగా ఆమెకు కనిపించటం మానేశాడు.
కానీ అన్వేషణ ఆపెయ్యలేదు.
శకుంతల అనే ఒక దూరపు బంధువు కొంచెం దూరం లోనే ఉందని తెల్సి, ఆమెకూ దగ్గరయ్యే ప్రయత్నం చేసాడు. ఇంద్రియములు తిన్నగా ఉండనిచ్చేవి కావు. కోర్కెలు గుర్రాలు అయ్యాయి.
‘నాకు నువ్వు సహకరిస్తే, నేను నీకు పుత్రుడిని ప్రసాదిస్తాను’ అన్నది శకుంతల. అతను దుష్యంతుడే అయినాడు.
వనిత ద్వారా అంతులేని విభవము కలుగుతుందని కలలు కన్నాడు. పిల్లాడిని కన్నాడు..
బోలెడంత డబ్బు ఖర్చు అయిందేగానీ, కొత్తగా డబ్బు వచ్చిందేమీ లేదు.
ఈసారి శ్రీదేవితో స్నేహం చేశాడు. వెనక ముందర లేరు – ఆమెకు నెనరైన చుట్టాలు. అందుచేత అయస్కాంతంలా అతన్ని గుండెలకు హత్తుకుంది – కిలకిల నవ్వుచు, కన్నులు తళతళ ఎప్పుడు లంచమిచ్చిన గానీ, కొంచెమైనను చేరనివ్వక బహు భాషల, బహు విధములు అలరించి మురిపించింది.
స్త్రీ అతని ఇంట్లోకి రాలేదు. అతని స్త్రీల ఇంటి లోనికి వెళ్ళాడు. ఆశించిన నోట్ల కట్టలు రాలేదుగానీ, కుప్పలు తిప్పలుగా అప్పుల పాలైనాడు.
అప్పుడొక వేదాంతి అతనికి కనువిప్పు కలిగించాడు.
ఒకే రాశి గలవారు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ రాశి వారిలోనే ఒకడు ప్రభువై దేశాన్ని ఏలితే, ఒకడు ఊడిగం చేస్తుంటాడు.
ఎవరి జాతకం వారిదే. ఎవరి బ్రతుకు వారిదే – అని వివరించాడు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.