ఈ పాటికి స్వజాతి ప్రేమల మీద సినెమాలు రావడం సాధారణం అయిపోయింది. అయితే దీని పరిణామ క్రమం చూస్తే ఎగతాళి, ఫార్స్ తో నిండిన దోస్తానా (అంతంకు ముందు ఓనిర్ వున్నాడు గాని, నేను వ్యాపార చిత్రాల గురించి మాట్లాడుతున్నాను) నుంచి తల్లిదండ్రులు అర్థం చేసుకుని దీవించే రకం చిత్రమైన ఈ శుభ్ మంగల్ జ్యాదా సావధాన్ వరకూ ప్రయాణం మెచ్చుకోతగ్గదే.
అల్లాహాబాద్ లోని వో సమ్యుక్త కుటుంబం. సైంటిస్ట్ అన్న శంకర్ త్రిపాఠి (గజ్రాజ్ రావ్) కొడుకు అమన్ (జితేంద్ర కుమార్) ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంటాడు. లాయర్ తమ్ముడు (చమన్ త్రిపాఠి) 27 ఏళ్ళ కూతురు గాగల్గా పిలవబడే రజనీ త్రిపాఠి (మానవి గగ్రూ) పెళ్ళి ఎట్టకేలకు కుదిరింది. అయితే ఈ కుటుంబానికి తెలియని విషయం అమన్ ఢిల్లీలో కార్తీక్ (ఆయుష్మాన్ ఖురానా) తో ప్రేమలో పడ్డాడనీ, చెప్పే ధైర్యం లేక దాన్ని రహస్యంగానే వుంచాడనీ. గాగల్ పెళ్ళికి అయిష్టంగా వస్తాడు అమన్. కూడా వస్తాడు కార్తీక్. రైలులో వో మూల వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడం చూసిన శంకర్ కి అర్థమవ్వడమే కాదు వాంతి కూడా వస్తుంది. ఈ ఒక్క సన్నివేశంతో సమాజం లో వున్న హోమోఫోబియా (దీనికి తెలుగు పదం లేదు, స్వజాతి ప్రేమల పట్ల నిరసన, భయం, అసహ్యం వగైరా) ఎలాంటిదో బలంగా చెబుతాడు దర్శకుడు. నిజమే,అలాంటి ప్రేమికులు సమాజంతో తర్వాత ముందు యుధ్ధం చేయ్యాల్సింది తల్లి దండ్రులతోనే. ఇంట గెలిచాకే రచ్చ. అలాంటి కుటుంబంలో వీళ్ళ పోరాటం ఎలాంటిది, గెలుస్తారా, పెద్దవాళ్ళ ఆలోచనల్లో మార్పు తేగలుగుతారా అన్నది మిగతా కథ.
బహుశా ఇది దర్శకుడు హితేష్ కేవల్యా మొదటి చిత్రం. కథ కూడా వ్రాసుకున్న ఇతని ప్రతిభ మెచ్చుకోతగ్గదిగా వుంది. ప్రేమికులుగా ఆయుష్మాన్, జితేందర్ లు బాగా చేశారు. మిగతా పాత్రధారులందరూ బాగా చేసినా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నీనా గుప్తా గురించి. ఈ రెండవ రాకడలో వైవిద్యమైన పాత్రలు చేస్తూ తనూ సంతోషంగా వుంది, ప్రేక్షకులు కూడా మంచి నటన చూడగలుగుతున్నారు. 3-4 సన్నివేశాలే వున్న “పంగా” అయినా, తక్కువ మాట్లాడే పాత్రలో “బధాయీ హో” అన్నా, కుండ బద్దలు కొట్టినట్టు మాత్లాడే పాత్రలో ఈ చిత్రంలో ఐనా నీనా గుప్తా ని మరచి పోవడం కష్టం. “తను వెడ్స్ మను” లో చేసిన చిరంతన్ దాస్ ఇందులో కూడా మంచి సినెమేటోగ్రఫి అందించాడు. సంగీతం వేర్వేరు సంగీతకారులు అందించారు. తనిష్క్ బాగ్చి, వాయు, టోని ఖక్కడ్ లు. పాటలు బాగున్నాయి.
స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ భిన్నంగా వుంటాయా? లేదని చెప్పడానికి హిందీలో బాగా హిట్ అయిన ప్రేమ చిత్రాలలోంచి సన్నివేశాలు తీసుకుని స్పూఫ్ గా వాడుకున్నారు. ముఖ్యంగా దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. అందులో యువ జంట పెద్దల వొప్పుదల కోసం పోరాడినట్టే ఇందులోనూ, అయితే మరీ బానిసగా మారిపోయి కాదు. అందులో లాగే ఇందులోనూ “జా సిమ్రన్ జా, జీలే అపనీ జిందగి” లాంటి డైలాగ్ ఉంది, కాని వొక ఉదారంగా పెట్టిన భిక్షలా కాకుండా మనస్పూర్తిగా ఇచ్చిన దీవెనలా. కథలో ఇద్దరి మధ్య ప్రేమ కన్నా కూడా కుటుంబంలో స్వజాతి ప్రేమల పట్ల వున్న ప్రతికూల భావనలతో యుధ్ధం మీద ఎక్కువ ఫోకస్ వుంది. వొకే చిత్రం లో అన్నీ పెట్టడం ఎలానూ సాధ్య పడదు. ఇదే విషయాన్ని గంభీరంగా చెబితే బహుశా ప్రేక్షకులకు అందదేమో, ఇక్కడ హాస్యం జోడించి చెప్పడం బాగుంది, షేక్స్పియర్ డ్రామా లా, చివర్న కొంత అతి చేసినా కూడా. ఆ పెళ్ళీ అవీ అతి కాక మరేమిటి? ప్రస్తుతానికి ఇలాంటి సంబంధాలు నేరపరిధి నుంచి బయటికొచ్చాయి అంతేగాని, మిగతా హక్కుల కోసం ఇంకా వేచి చూడాల్సిందే. పెళ్ళి, దాని ద్వారా వచ్చే ఇతర హక్కులూ వగైరా.
సైంటిస్ట్ అయిన శంకర్ పురుగు పట్టని నల్ల క్యాలిఫ్లవర్ ఆవిష్కరిస్తాడు. వూరంతా అదే పంట విరగ కాయడంతో వొక రకంగా రైతులకు నష్టమే జరుగుతుంది. టిఫిన్ లో, మధ్యహ్న-రాత్రి భోజనాల్లో రోజులతరబడి క్యాలిఫ్లవరే తిన్నా ఇంకా పంచిపెట్టడానికి మిగిలే వుంటాయి. కోపంతో రైతులు వీళ్ళింట క్యాలిఫ్లవర్లు విసురుతారు. సృష్టిలో సహజంగా జరిగే క్రమంలో మానవుడు మార్పులు తేగలడా? జెనెటికల్లి మాడిఫైడ్ ఫుడ్ పేరుతో వస్తున్న వాటి మీద ఇంకా పూర్తిగా పరిశోధనలు జరగలేదు. వాటి దుష్పరిణామాలు తెలీదు. ఇందులో మాత్రం చివర్న శంకర్ తన ఇంటి క్యాలిఫ్లవర్లు వొక్కొక్కటీ తెంచి చూస్తే పురుగులు కనబడతాయి. ప్రస్తుతానికి సమాజంలో ఆమోదయోగ్యం కానివి పురుగుల్లా తీసిపారెయ్యడానికి వీల్లేదు. ఎందుకంటే స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కలిగినపుడు శరీరంలో స్రవించే రసాయనాలే స్వజాతి ప్రేమికుల మధ్య పుట్టిన ప్రేమ సందర్భంలోనూ స్రవిస్తాయి.
విభిన్నంగా వుండే పాత్రలని ఎంచుకోవడంలో, ఇతర నటులు చెయ్యడానికి భయపడే పాత్రలలో కూడా ఆయుష్మాన్ ఒప్పుకుని, నటించి మెప్పించడం శుభపరిణామమే.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™