[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘చిరునవ్వులే వరాలై వర్షించే శుభముహూర్తాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


పసి పాపాయిల పసిడి నయనాలలో మెరిసే
చిరునవ్వుల హర్షాలు!
ఇష్టమైన వాళ్ళు ఎదురైనప్పుడు
హాయిగా పలకరిస్తూ
కరచాలనంతో చిరునవ్వుల రాగాల కలయికలు!
ఆటల్లో విజయాలు చేకూరినప్పుడు
అభిమానుల ఆత్మీయ అభినందనల నడుమ
ఉత్సాహంగా కదులుతూ సమరానికి మారుపేరై
విజేతగా గుర్తింపు పొందుతున్నప్పుడు మోమున విరిసే
జయం తాలూకు అనుభూతులతో చిరునవ్వుల గర్వాలు!
పార్క్‌లో కూర్చున్న ప్రేమికులు లోకాన్ని మరిచి
అధరాల చివరల్లో మెరుస్తున్న నులివెచ్చని జ్ఞాపకాలని
పంచుకుంటున్న మధుర భావన ల మధురోహల యాగాలు
..యుగాలని మరిచి క్షణాల్లా సాగుతున్న వైభవాలు!
వివాహ సమయంలో వధూవరుల ఆనందాల వేడుకల హేల
ఒకరివైపు ఒకరు చూసుకుంటూ
చిరునవ్వుల సరిగమల సంతోషాల శుభముహూర్తాన ఒక్కటయ్యే సందర్భాలు!
కుసుమాల సుపరిమళాలు హృదయన్ని హత్తుకుంటుంటే
మనసు పలికే అనురాగ స్వరాలు చిరునవ్వుల సందేశాలు!
అవనిలో అగుపించే ముచ్చటైన మురిపాల ప్రతిరూపాలు
చిరునవ్వుల స్వరూపాల వరాలై వర్షించే శుభముహూర్తాలు!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
2 Comments
పింగళి శ్రీనివాస రావు
కవిత చాలా బాగుంది
Gorrepati Srinu
Thank you Srinivas garu