దావులూరు తెనాలి పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో వుంది. దావులూరులో ముందుగా కనబడ్డ శ్రీ గోకర్ణేశ్వర మరియు కాశీ విశ్వనాథాలయానికి వెళ్ళాము. అతి పురాతన ఆలయం. ఆలయం తీసి వుందిగానీ, ఎవరూ లేరు. కొందరు భక్తులు స్నానం చేసి శుచిగా అక్కడ ఆలయం బయట వండుతున్నారు. బహుశా స్వామికి పొంగళ్ళేమో.
ఆలయం విశాలంగా, శుభ్రంగా వున్నది. స్వామికి నిత్య పూజలయి అలంకారాలు జరిగాయి. ధ్వజస్తంభం ముందు నాగరాజు, వీరభద్రుడి విగ్రహాలున్నాయి. శాసనాలు కూడా వున్నాయి. ఇంత పురాతన ఆలయాల గురించి ఎవరికీ తెలియదనే మా బాధ. వీటన్నిటికీ భక్తుల రాకపోకలుంటే, వీటి చరిత్రలు అందరూ తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది. సర్కారుగానీ, ఆలయ కమిటీలుగానీ ఆలయ చరిత్రల పట్ల కొంచెమన్నా శ్రధ్ధ చూపించి, వివరాలు అక్కడ బోర్డులు పెడితే అందరూ తెలుసుకోగలుగుతారు. ఆలయంలో వున్న శాసనాలని కూడా పరిష్కరింపచేసి వివరాలు నేటి తరానికి అందిస్తే బాగుంటుంది. ఇవన్నీ చేస్తే దూర ప్రాంతాలవారి మాట ఎలా వున్నా, చుట్టు పక్కల ప్రాంతాలనుంచీ భక్తుల రాక అధికమవుతుంది.
శ్రీ నాగార్జునకొండ పిచ్చయ్యగారు, పిడుగురాళ్ళ రచించిన గుంటూరు జిల్లా దేవాలయాలు – చరిత్ర అనే గ్రంథం ఆధారంగా ఈ శివాలయాన్ని గురించి తెలుసుకున్న కొన్ని వివరాలు కింద ఇస్తున్నాను…
దావులూరుని ఇదివరకు దానవులూరు అనేవారుట. గోకర్ణేశ్వర దేవాలయాన్ని ఆయన గొంకేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. కానీ బోర్డుమీద స్పష్టంగా గోకర్ణేశ్వర అని వున్నది.
దీనిలో వున్న శాసనం SII Vol X, No. 109. దీని ప్రకారం అయతమ నాయకుని కొడుకు కొమ్మ నాయకుడు శ్రీ గొంకేశ్వర దేవరని ప్రతిష్ఠించి గుడియు, మంటపంబును గట్టించెనని తెలుస్తోందిట. (గుం.జి.శా.పుట 135)
మా కారు శివాలయానికి చేరుకోగానే వేణుగోపాలస్వామి ఆలయ పూజారిగారు స్కూటర్ మీద వచ్చారు. ఆలయం అటు వుందని మళ్ళీ ఆయనే చెప్పారు – ఇది శివాలయం, దర్శనం చేసుకుని అటు రండి, నేనక్కడ వుంటానని.
గోకర్ణేశ్వరాలయంనుంచి శ్రీ వేణు గోపాల స్వామి ఆలయానికి బయల్దేరాము. విశాలమైన ఆవరణలో లోపలకి వున్నది చిన్న ఆలయం. బయట రోడ్డుకన్నా ఆలయం కొంచెం పల్లంలో వున్నది.
పూజారిగారు చెప్పిన వివరాల ప్రకారం ఇది శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి ఆలయం. చోళ రాజుల సమయంలో నిర్మింపబడింది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు బందిపోటు దొంగలని చంపించిన పాప పరిహారార్థం నిర్మించిన ఆలయాలలో ఇది కూడా ఒకటి.
గర్భగుడి ముందు మండపంలో ఒక చెక్క మీద వున్న అమ్మవారి విగ్రహాన్ని చూపించి చందులూరు మహాలక్ష్మి అని చెప్పారు. 50 సంవత్సరాల క్రితం బ్రాహ్మలు అమ్మవారిని ప్రతిష్ఠించారుట. ఈ అమ్మవారు నెల్లూరులో వుందిట.
పూర్వం విష్ణ్వాలయం ముందు విగ్రహం మాత్రమే వుండేదట. 1200 సంవత్సరాల క్రితం నాగమ్మ అనే మహారాణి ప్రతిష్ఠించిందిట. ఇప్పుడున్న స్వామిని ఒక దంపతులు సంతానం కోసం ప్రతిష్ఠించారుట.
నిత్య పూజలు జరుగుతున్నాయి.
పూజారిగారికి ధన్యవాదాలు తెలిపి 11-20కి అక్కడనుంచి బయల్దేరాము.
దోవలో వున్నది ఈ ఆలయం. రోడ్డుకి, ఆలయానికి మధ్య కాలవ. రోడ్డుమీదనుంచి ఆలయం దాకా నడిచి వెళ్ళటానికి వీలుగా చక్కని బాట. పరిసరాలు, ప్రకృతి బాగుంది. ఆలయం మూసి వుంది. అందుకే కాలవ ఇవతలనుంచే ఫోటో తీసుకుని తిరిగి బయల్దేరాము.
అక్కడనుంచి 11-55కి చిలుమూరు చేరుకున్నాము.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™