[‘కోర్ట్’ అనే తెలుగు సినిమాని సమీక్షిస్తున్నారు రాధాకృష్ణ కర్రి.]
అప్పుడెప్పుడో విజయవాడలో ఏదో రేప్ అండ్ మర్డర్ కేసు గురించి మీడియాల్లో విపరీతంగా వార్తలు వస్తుంటే.. బాధితురాలి పట్ల జరిగిన అమానుషం ఒకవైపు, అనుమానితుడు, నిందితుడు అంటూ ఒక వ్యక్తిని నిజం చెప్పమంటూ.. కాదు కాదు.. ఒప్పుకోమంటూ అతనిపై జరిగిన హింస మరోవైపు, ఇదంతా చూసి చాలా బాధపడ్డాను. వాస్తవ అవాస్తవాలు సీబీఐ – పోలీసులకు, హత్యకు గురియైన ఆ అమాయకురాలికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే నేను చూసిన ఓ సినిమాలో కూడా చేయని తప్పును చేసినట్లు ఒప్పించే ప్రయత్నం చేసిన సీన్‌ను చూసిన వెంటనే అప్పట్లో జరిగిన పైన చెప్పిన వాస్తవం గుర్తొచ్చింది. ఇంతకీ నేను చూసిన సినిమా బహుశా చాలా మందే చూసి ఉంటారు. అదేనండీ.. ‘కోర్ట్’.


అయితే ఆ కుర్రాడిని పోక్సో చట్టంలో అన్యాయంగా ఇరికించి, నిందితుడ్ని 14 ఏళ్ళు జైల్లో ఉంచాలనుకునే క్రమంలో తుది తీర్పుకు తేదీ నిర్ణయించిన ఆఖరు సమయంలో అనుకోకుండా సూర్య తేజ అనే పాత్ర ప్రవేశంతో మలుపులు తిరిగిన కథ ఇది. కోర్టులో ఆఖరి సీన్లో ఈ సినిమాకు అసలుసిసలైన కథా నాయకుడైన ప్రియదర్శి.. “తప్పులు చేయొద్దు అని చెబుతారు.. అసలు తప్పు అంటే ఏంటో చెప్పరు. తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని చెబుతారు.. ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో చెప్పరు. చట్టం కేవలం పోలీసులకు, కోర్టులకు మాత్రమే పరిమితం కాదు, అందరికీ తెలియాలి” అని చెప్పిన డైలాగు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది. సెక్స్ ఎడ్యుకేషన్‌ను పరోక్షంగా 8వ తరగతి నుండే ప్రవేశ పెట్టిన ప్రభుత్వం.. చట్టాలు, శిక్షలకు సంబంధించి విషయాలను ప్రాథమిక విద్యలోనే ప్రవేశపెడితే అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టే పిల్లలకు కొంత అవగాహన వస్తుంది. ప్రతి విషయానికి అడ్డదారులు వెతుక్కునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ కనీసం కొందరైనా సక్రమంగా ఉండడానికి ఉపయోగపడొచ్చు.
ఒక సందర్భంలో సూర్యతేజ కేసును మధ్యలోనే వదిలేసి నిరాశ, నిస్పృహతో తను అడ్వకేట్ అవ్వాలనే కల నెరవేరదు అని ఇంటికి వచ్చేసిన సమయంలో తన బాస్ అయిన సాయికుమార్ అతని దగ్గరకు వచ్చి “లాయర్‌కు కావలసింది సమాధానాలు చెప్పడం కాదు.. ప్రశ్నించడం. పైగా నీలో ఉన్న ఒకే ఒక్క బలహీనత ఇన్స్టంట్ డెసిషన్. నువ్వు తెలివైన వాడివి. జాగ్రత్తగా డీల్ చేసుకో” అని అతని బలం, బలహీనతలను తెలియచేసి కేసులో ముందుకు వెళ్లే ప్రోత్సాహాన్ని పరోక్షంగా అందివ్వడమే అప్పటివరకు అసిస్టెంట్‌గా పనిచేసిన సూర్యతేజ అడ్వకేట్ గా మారడానికి దొరికిన ఓ మలుపు.. గెలుపు. సాయికుమార్‌కు ప్రియదర్శికి మధ్య ఆ సన్నివేశాన్ని చూసి ..’ఇలాంటి గురువు ఒక్కరుంటే చాలు ప్రతి శిష్యుడు విజయాన్ని సాధిస్తాడు కదా..!’ అని అనిపించింది.
ఈ సినిమాలో కేసు మొదలైందగ్గర నుండి ట్విస్టులు మాత్రం బాగా చూపించారు. చివరకు న్యాయం గెలవడం అనేది సహజాతి సహజం. అయితే, ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే కేసు వాదించడానికి వచ్చిన లాయర్ నిందితుడికి శిక్ష పడకుండా చేసే క్రమంలో విలన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం. దీనితో కాపాడదాము అనుకున్న లాయర్ కూడా కేసును మధ్యలోనే విడిచిపెట్టి వెళ్లిపోవడం. ఈ కేసును మధ్యలో వదిలి వెళ్ళిన లాయరే మళ్ళీ కేసును వాదించి తప్పుచేయని ఆ నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయించడం, ఆ పిల్లాడు చదువు విలువ తెలుసుకొని చదువుకోవడానికి సిద్ధపడడం అంతా మామూలుగానే సాగింది. అయితే ఆఖరున ఒక సీన్.. బస్ స్టాప్‌లో నిలబడి ఉన్న ఆ హీరో దగ్గరకు హీరోయిన్ వచ్చి “ఇవాళ నా పద్దెనిమిదవ పుట్టిన రోజు” అని చెప్పి నిలబడుతుంది. అదే పబ్లిక్ రోడ్డు మీద ఒకరినొకరు కౌగలించుకుంటారు. ఇక్కడితో కథ సుఖాంతం అవుతుంది.
ఇదిగో ఈ ఆఖరు సీన్ మాత్రం సినిమా మొత్తాన్ని ఎంత అద్భుతంగా చెప్పిందంటే 17 సంవత్సరాల 11 నెలల 15 రోజులలో రాని మెచ్యూరిటీ 18వ ఏడు, అంటే మరో 15 రోజులు రాగానే చట్టపరంగా వచ్చేస్తుంది అని అంతర్లీనమైన సందేశం. ఇలాంటి లూప్‌హోల్స్ తెలివైన వాడికి చుట్టాలు, అమాయకులకు అక్కరకు రాని చుట్టాలు.
హీరో నాని నిర్మాతగా మారి ఇటువంటి మంచి చిత్రాన్ని నిర్మించేందుకు చూపిన చొరవకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు, ఓ చక్కని సామాజిక సందేశం ఉన్న సినిమా. ఇలాంటివి తీయాలంటే గుండె ధైర్యం కావాలి.. సరిగ్గా ఒకప్పుడు కొత్తవారితో కళాతపస్వి గారు కళాత్మకమైన సినిమాలు తీస్తే, వారికి సపోర్ట్ అందించిన నిర్మాతల్లాగ.
స్క్రీన్ ప్లే చాలా బావుంది. దర్శకుడు.. హీరో పాత్ర ద్వారా నైతిక విలువలను చెప్పకనే చెబుతూ కులం, ధనం కన్నా గుణం ముఖ్యం అనే సందేశాన్ని అంతర్లీనంగా అందించాడు. బహుశా 2013 నాటి పరిస్థితులు నేటి పరిస్థితుల్లా మరీ అంత ఫాస్ట్‌గా లేవేమో. ఎందుకంటే సినిమా మొదలవ్వగానే 2013 విశాఖపట్నం అనే సీన్ టైటిల్. ఎక్కడా కూడా commercial సినిమాలా విపరీతమైన ఎక్స్‌పోజింగ్‌లు, ఫైటింగ్ సీన్స్, వెహికల్స్ గాల్లో తేలడాలు వంటివి లేకుండా అతి సాధారణంగా నడిచిన కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా.
సందర్భానుసారంగా ఓ రెండు పాటలున్నాయి. అందులో “కథలెన్నో చెప్పారు.. కవితల్ని రాసారు.. కాలాలు దాటారు.. యుద్ధాలు చేసారు”.. సన్నివేశానికి తగినట్టు రాసిన పాట సాహిత్య పరంగా కూడా చాలా బాగుంది. నేపథ్య సంగీతం కూడా చెవులకు ఇంపుగా, హాయిగా ఉంది.
మొత్తానికి ఎక్కువ హంగులు ఆర్భాటాలు లేకుండా అతి సహజంగా తీసిన సినిమా. రామ్ జగదీష్ తీసిన మొదటి సినిమా అయినా కూడా మంచి స్క్రీన్‌ప్లేతో, సన్నివేశాలతో బాగా చేశారు. ప్రతి పాత్రను తీర్చిదిద్దిన తీరు బావుంది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా నేటి యువత.
1 Comments
కొల్లూరి సోమ శంకర్
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: *కోర్ట్ సినిమా సమీక్ష బాగుంది.. సాధారణంగా సమాజం సానుభూతి ఆడపిల్లల పట్లే ఉంటుంది.. మగపిల్లాడి కోణంలో ఆలోచించి న్యాయం నిలబెట్టడం వైవిధ్యభరితమైన కథ.. సమీక్ష బాగుంది.*