ఎడతెరిపి లేని వర్షం. ఫాతిమా సరుకులు తీసుకుని గొడుగు విప్పి, ఇల్లెలాగైనా చేరాలని బురఖా అంచులు నీళ్ళలో పడకుండా, పైకి లాక్కుని నడుస్తోంది. వర్షం జోరు ఎక్కువ కావడం మూలాన రోడ్డులో ఎక్కడా జనసంచారం లేదు. ఆమె తపనంతా తొందరగా ఇల్లు చేరుకోవాలనే.
ఐదు వందల గజాలు నడిచిన తర్వాత ఒక ఆటో అదుపు తప్పి పుట్‌పాత్ ఎక్కి, మెల్లగా నడుస్తున్న ఫాతిమాను ఢీ కొట్టింది. ఫాతిమా వెల్లకిలా పడి, సృహ కోల్పోయింది. ఆటో వాడు బండి వెనక్కు తీసుకొని వెనుదిరిగి చూడకుండా వేగంగా పరారయ్యాడు. సహజమే కదా అలాంటి పరిస్థితులలో.
జయరాం తన స్నేహితుడి ఇంటి దగ్గర నుండి వస్తూ ఫుట్‌పాత్ మీద వెల్లకిలా పడున్న అమ్మాయిని వీధి దీపం వెలుగులో చూసాడు. బురఖా ముఖం నుండి తొలగిపోయి ఉంది. నుదుటికి తగిలిన గాయం నుండి రక్తస్రావం. జయరాం ఆమెను లేవదీసి, అక్కడే ఉన్న బస్ షెల్టర్ బెంచీ మీదకి సున్నితంగా చేర్చాడు. కిం కర్తవ్యం అని, అంబులెన్స్‌కి ఫోను చేసి కూర్చున్నాడు. పది నిమిషాలలో అంబులెన్స్ సైరన్‌తో వచ్చింది. అమ్మాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేర్చాడు.
ఆమె నుదుటికి కుట్లు వేసి, విరిగిన చేయికి ప్లాస్టర్ కట్టు వేసారు. రాత్రి పది దాటింది. జయరాం డాక్టర్లకి కృతజ్ఞతలు తెలిపి, ఇవ్వవలసిన వాళ్ళకి డబ్బు ముట్ట చెప్పి ఆమెతో మెల్లగా బయటికి వచ్చి పోర్టికోలో నుంచున్నాడు. ఇంకా వాన సన్నగా పడుతోంది. వార్డ్ బాయ్ బైక్ మీద వెళ్ళి ఆటో తీసుకుని వచ్చాడు.
“మీ పేరండి” అన్నాడు జయరాం మెదటి సారిగా, ఆమెకు దూరంగా కూర్చుంటూ.
“ఫాతిమా.”
“ఇప్పుడు ఎలా ఉంది?”
“తలమీదేదో పెద్ద బరువు పెట్టినట్టు ఉంది.”
“అది మత్తు మందు పని. కాసేపట్లో తగ్గిపోతుంది.”
“థాంక్స్.”
“ఇంటికి ఫోను చెయ్యండి.”
“ఫోను ఎక్కడో పడిపోయినట్టుంది పడ్డంతో.”
“నాన్న నంబరు తెలుసా?”
“తెలుసు. కాని కంగారు పడతారు. ఇంకో పదినిమిషలలో ఎటూ ఇల్లు చేరుకుంటాంగా. మీ పేరు చెప్పలేదు?”
“జయరాం. గౌతమి కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్.”
“అరె! నేను మీ కాలేజీకి కొద్ది దూరంలో ఉన్న ద్వారకామాయి వుమెన్స్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ని”
“నైస్” అన్నాడు ఇంకేం మాట్లాడాలో తెలియక.
“అదో ఆ పెద్ద ఇల్లే మాది” అంది ఫాతిమా.
ఆమె ఆటో దిగి “లోపలికి రండి” అంది.
“ఆలస్యం అవుతుంది. నేనిదే ఆటోలో ఆసుపత్రికి తిరిగి వెళ్ళి నా బైక్ తీసుకుని ఇంటికెళ్ళిపోతాను. మరో సారి వస్తాను లేండి. ఆరోగ్యం జాగ్రత్త” అని ఆటోలో కూర్చున్నాడు.
***
లోపలకి వచ్చిన ఫాతిమాను చూసి కంగారు పడింది ఆమె తల్లి. “ఏమయింది నీకు? ఈ దెబ్బలేమిటి? ఎందుకు నీ ఫోను స్విచ్ ఆఫ్‌లో ఉంది?” అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంకా బయట వర్షం తగ్గలేదు.
“అంతా నింపాదిగా చెబుతానమ్మా. ముందు నాకేదైనా పెట్టు, ఆకలిగా ఉంది.”
“సరే. నాన్న నిన్ను వెదకడానికి ఇద్దరిని తీసుకుని వెళ్ళారిప్పుడే.”
“నేను వచ్చేసానని నాన్నకి ఫోను చేసి చెప్పేయ్” అని బట్టలు మార్చుకోడానికి లోపలికెళ్ళింది ఫాతిమా.
తన తల్లితండ్రులకు జరిగినదంతా పూసగ్రుచ్చినట్లు చెప్పింది ఫాతిమా. జయరాంని మొచ్చుకోకుండా ఉండలేకపోయారు.
ఫాతిమా కాలాజీకి ఆరు వారాలు శెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. జయరాం ఆలోచనలు ఆమెను చుట్టుముట్టుకొనున్నాయి. అతని లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఎవరికీ ఏమీ జరగదు అని పలు మార్లు అనుకుంది.
ఫాతిమా నాన్న ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్లాస్టర్ తీయించి ఎక్సరే తీయించాడు. ఎముక బాగా అతుక్కుపోయింది. కాలేజీ నుండి సహద్యోగులు వచ్చి పలుకరించిపోయారు. కాలేజీలో చేరిం తర్వాత అబాలగోపాలం ఫాతిమాను పరామర్శించారు.
ఫాతిమాకు తనను కాపాడిన జయరాంని చూడాలనిపించింది. కుర్చీ మీద ఉన్న బురఖాని వేసుకుని గౌతమి కాలేజికి బయలుదేరింది. జయరాం క్లాసులో ఉన్నడని చెప్పాక బయటికెళ్ళి, స్వీట్లు, పళ్లు తెచ్చి విజిటర్స్ గదిలో కూర్చుంది. అతడు క్లాసు కాగానే, ఆమెను కలిసి, “ఎవరు మీరూ, ఏం కావాలి?” అని అడిగాడు అమాయకంగా.
“నేను ఫాతిమానండి. ఆ రోజు మీరు…” అని ముసుగు తొలగించింది.
“ఓ…. అయామ్ సారీ” అన్నాడు నవ్వుతూ.
“నేనే చెప్పాలి సారి మీకు. ముసుగులో ఉన్న నన్ను ఎలా గుర్తు పడతారు” అని నవ్వింది ఆరిందాలా.
‘ఎంత అందంగా చక్కగా ఉంది’ అని అనుకున్నాడు జయరాం మనసులో.
“థాంక్ గాడ్! మీ నుదుటి మీద చిన్న మచ్చ కూడా లేదిప్పుడు. ఆ సంచేదో చేతిలో పట్టుకునే నుంచున్నారుగా? అంటే ఆ చెయ్యి కూడ పూర్తిగా నయమయిపోయి ఉండాలి” అని సన్నగా నవ్వాడు.
“అవునండి. మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. ఇవి తీసుకోండి” అని బ్యాగు అందించింది.
“ఇవన్నీ ఎందుకండి” అని బ్యాగ్ తిరిగి ఇచ్చేయబోయాడు.
ఆమె కళ్లు తడి కావడంతో ఉంచేసుకుని “థాంక్స్….. కాని మీ కలువల్లాంటి కళ్ళలో ఎప్పుడూ నీళ్ళు రాకూడదు” అన్నాడు ధైర్యంగా.
ఆమె అప్రయత్నంగా చేతిలోని జేబు రుమాలుతో కళ్ళు తుడుచుకుంది.
వాళ్ళ స్నేహం కొనసాగడంతో ఒకళ్ళ నొకళ్ళు ఇష్టపడ్డారు. ఫోన్లలో మాటలు, మెసేజీలు, అప్పుడప్పడు రామకృష్ణ బీచ్‌లో కలుసుకునేవారు.
“జయరాం, మిమ్మల్ని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్ళి చేసుకుని ఒక ఇంటి దాన్ని చేస్తారా” అంది ఫాతిమా జయరాంతో ఒక సాయంత్రం బీచ్‌లో.
“నేను కూడ ఫాతిమా. కాని మనకు రెండు అవరోధాలున్నాయి. ఒకటి మీరు శ్రీమంతులు కావడం. రెండోది మన మతాలు వేరు కావడం. అందుకని పెద్దలు మన పెళ్ళికి పచ్చజండా ఊపకపోవచ్చు” అన్నాడు వేదాంత ధోరణిలో.
“నేను మావాళ్ళని ఎలాగోలాగ ఒప్పిస్తానండి. ఒక్కతే కూతురుగా. మరి మీరు మీ వాళ్ళని ఒప్పించాలి” అంది సాంత్వన ఇస్తూ.
“నేను నా తల్లి తండ్రులకి ఒక్కడినే సంతానం. వాళ్ళు రెండు సంవత్సరాల క్రితం గోదావరిలో మునిగిపోయన లాంచీలో ఉన్నారు. ఇప్పుడు నాకెవరూ లేరు. నువ్వు తప్ప. నా తరుపున అడ్డు పెట్టే వాళ్ళెవరూ లేరు” అన్నాడు జయరాం ఆమెతో.
“నీ కేమయినా మతిపోయిందా ఫాతిమా. నువ్వేమీ చిన్న పిల్లవి కాదు. పైగా బాగా చదివి ఉద్యోగం కూడ వెలగబెడుతున్నావు. మేం వద్దన్నా ఆపదలో ఉన్న వాళ్ళని కాపడ్డం మానవ ధర్మం. జయరాం నీ ఆస్తి మీద కన్నేసి, నిన్ను ముగ్గులోకి దించాడు. నువ్వతన్ని వివాహం చేసుకుంటే మే మిద్దరం ఇంత విషం తాగి చస్తాము. ఆ ఆస్తేదో మదరాసాకి రాసేస్తాం” అంది కోపంగా ఫాతిమా తల్లి.
ఫాతిమా కాసేపు మౌనంగా ఉండిపోయింది. తానొకటి తలచు, దైవమొకటి తలచు అన్నట్టు అయిపోయింది. ఒక నిర్ణయానికి వచ్చింది.
“అమ్మా నేను పెళ్ళంటూ చేసుకుంటే జయరామ్‌నే చేసుకుంటాను. లేకపోతే జీవితాంతం కన్యలాగానే ఉండిపోతాను. పెద్దల నెదరించి పెళ్ళి చేసుకోవడం మా అభిమతం కాదు. జయరాం అనాథ. అతనికి ఆసరాగా ఉండి, భరోసాగా, తల్లిగా ప్రేమించాలి అనుకున్నాను గాని… అతను ముందే చెప్పాడు ఆటంకానికి రెండు కారణాలున్నయని” అని మొహం చేతిలో దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
అప్పుడే వచ్చిన ఫాతిమా తండ్రి, “నీకు వాడి కంటే అందగాడిని శ్రీమంతుడిని తీసుకుని వచ్చి కట్టబెడుతాను. వాడిని మర్చిపో. నేనతన్ని పిలిపించి మొహం వాచేలా చీవాట్లు పెడతానున్నాడు” ఆవేశంగా.
“మీరు భయపడకండి నాన్నా. నేనతన్ని మీ కిష్టం లేకుండా పెళ్ళి చేసుకోను. ఇక నేను పెళ్ళంటూ చేసుకోను. నన్ను ఎట్టి పరిస్థితుల్లో బలవంత పెట్టకండి. జయరాంది అతి సున్నితమైన మనసు. నేనే నచ్చ చెబుతాను” అంది.
“ఆ పనేదో చేసి రేపు ఏడు” అన్నాడు కోపం కట్టలు తెగి వచ్చిదింలా.
“ఇదేం విడ్డూరం అల్లా” అని తల్లి గట్టిగా అరిచింది.
“జయరాం మన పెళ్ళి ఇక జరగదు. నేను నా తల్లి తండ్రులని కాదని పెళ్ళి చేసుకుని సుఖంగా సంసారం చెయ్యలేను. మనం ఇక విడిపోదాం. మన బాసలు మర్చిపోదాం” అని ఫాతిమా భోరున విలపించింది.
జయరాం ఆమెను అక్కున చేర్చుకుని, కన్నిరు తుడిచి “అలాగే ఫాతిమా, నిన్నే భార్యగా ఎన్నో కలలుకన్నాను. కాని, పెళ్ళి చేసుకుని నిన్న నీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకుని రాను. అంతా మన మంచికే అనుకుంటాను” అన్నాడు.
అలాగే వాళ్ళిద్దరూ కొన్ని నిమిషాలు ఒకరి కౌగిలిలో ఇంకొకరు ఒదిగిపోయారు.
“గుడ్ బై జయరాం, నా హార్ట్ ఫీలింగ్స్,” అని ఫాతిమా చేయినందించింది.
“గుడ్ బై అండ్ గుడ్‌లక్ ఫాతిమా” అని ఆమె చెయ్యి అందుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు జయరాం అతని కనులు చెమర్చాయి.
రెండు నెలల తర్వాత జయరాంకి హైదరాబాదులోని బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. జయరాం ఐ.ఏ.ఎస్ పరీక్షలు వ్రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. రెండు సంవత్సరాల తర్వాత విశాఖ పట్టణానికి కలెక్టర్‌గా వచ్చాడు. ఒక రోజెందుకో ఫాతిమా అతని మనస్సులోకి వచ్చింది. చూడాలనిపించింది.
ఫాతిమా తండ్రికి వ్యాపారంలో అతని పార్ట్నర్ మోసం చేయడంతో, ఉన్న ఆస్తి, ఇల్లుతో సహా స్వాహా అయిపోయింది. అతను విశాఖపట్టణం సిటీ బయట ఒక చిన్న స్టేషనరీ షాపు తెరిచి వ్యాపారం ప్రారంభించాడు. అది దురదృష్టవశాత్తు సరిగా నడవడం లేదు. ఫాతిమా బాధలో ఉద్యోగం మానకపోవడం మంచిదయింది. ఇప్పుడు సంసారమంతా ఆమె సంపాదన మీదనే నడుస్తోంది.
జయరాం ఆఫీసులో బాగా నమ్మకమున్న అదికారిని ఫాతిమా జాడను కనుక్కోమని కోరాడు. అతను రెండు రోజులు వాకబు చేసి, పూర్తి వివరాలు సేకరించి ఇచ్చాడు. జయరాంకి చాలా బాధ వేసింది. ఇదంతా విధి చేస్తున్న గందరగోళం అని అనుకున్నాడు.
ఆదివారం ప్రొద్దుటే జయరాం పళ్ళు వగైరాలు తీసుకుని తన స్వంత కారులో ఫాతిమా ఇంటికి వెళ్ళాడు.
తలుపు తెరిచిన ఫాతిమా తల్లి “లోపలికిరా బేటా” అంది ఆప్యాయంగా.
“ఫాతిమా నీ కోసం ఎవరొచ్చారో చూడు” అని కేకేసింది.
“ఎవరమ్మా… ఇప్పుడే వస్తా నుండు” అని లోపల నుండి జవాబిచ్చింది. ఫాతిమా కంఠం వినగానే జయరాంకి ప్రాణం లేచివచ్చంది.
ఫాతిమా జుట్టు ముడి వేసుకుంటూ వచ్చి, జయరాంని చూసి అవాక్కయిపోయింది.
తమాయించుకుని, “ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు? పిల్లలెంత మంది?” అని వరసగా ప్రశ్నలు వేసింది.
అదే చెరగని అందం, ప్రేమ, ఆప్యాయత.
“బాగున్నాను ఫాతిమా. ఇక్కడే కలెక్టర్‌గా ఉన్నాను. నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆమె ఒద్దంటే ఇదో ఇలాగే ఉండిపోయా” అన్నాడు నవ్వుతూ.
“ఓ మైగాడ్! సార్!” అంది.
“అవును బేటా, మేము మిమ్మల్ని విడదీసిన పాపానికి, దేవుడు మాకు తగిన శిక్ష వేసాడు” అని కంట తడిపెట్టుకుంది ఫాతిమా తల్లి.
“మీరు బాధపడకండి ఆంటీ. జరగవలసింది జరగకమానదు. ఇప్పడు నేనీవూరు వచ్చేసాగా. మీకు అండగా ఉంటాను” అన్నాడు ధైర్యం చెప్పేవాడిలా.
“అవును సరిగ్గా చెప్పావు బేటా” అని వెనుక నుంచి వస్తూ ఫాతిమా తండ్రి అన్నాడు.
“నమస్తే అంకుల్” అని లేచి నుంచున్నాడు జయరాం.
“నాన్నా జయరాం సార్ ఇప్పుడు కలెక్టర్ ఇక్కడ” అంది ఉత్సాహంగా.
“నాకు తెలుసు బేటీ.”
“బేటా, నా తప్పు నేను తెలుసుకున్నాను ఆలస్యంగా నైనా ఫాతిమా నీ భార్య ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి చేసుకో ఆమెను అని ఎలా అనాలి” అన్నాడు కళ్ళోల్లో నీళ్ళు ఉబికిరాగా…
“నిజమే ఒక్క చిన్న షరతు మామయ్యా. ఈ రోజు నుండి మీరిద్దరూ నా దగ్గరే ఉండాలి” అన్నాడు.
“బేటా… జీతే రహో” అని ఆప్యాయంగా అతను జయరాంని హత్తకున్నాడు.
“నాన్న నాక్కూడ ఒక ఛాన్స్ ఇవ్వు” అంది ఫాతిమా.
“అవునమ్మా నీ మొగుడు నీ ఇష్టం” అని విడిపోయి భార్య పక్కన చేరాడు.
“జయరాం చెప్పినట్టు అల్లా ఏం చేసినా మన మంచికే చెస్తాడు. కాని, ఆ మంచి జరిగే దాక మనం ఓపిక పట్టాలి” అంది ఫాతిమా తల్లి.
SARALAGARU RACHINCHINA CHIVARIKI MANASULU MARAYI KADHA CHAALA BAGUNDI. EENATI THARANIKI EEKADHA OKA MANCHI SANDESHAM. PUBLISH CHESINA SANCHIKA EDITOR GARIKI MARIYU VARI SIBBANDIKI KUDA DHANYAVADALU. KONDURI KASIVISVESWARA RAO, WRITER
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™