సంక్రాంతి లక్ష్మి బయలుదేరింది
సంతోషంగా భారతావనికి
ఆకుపచ్చ చీరె, రవికె ధరించింది
వరికంకులు కంఠాభరణమయ్యాయి
మొదట్లోనే ఎదురయ్యాడు కరువు రక్కసి
వికటంగా నవ్వుతూ అన్నాడు
“వచ్చావా! పంటలు లేకుండా చేశాను
వర్షాభావం రైతుల హర్షాభావమైంది
వచ్చి ఏం చేస్తావు ఏడవటం తప్ప”
సంక్రాంతి లక్ష్మి మోము చిన్నబోయింది
మరికొంత దూరం సాగిందామె పయనం
తారసిల్లాడామెకు అతివృష్టి రాక్షసుడు
“మొత్తం ఊడ్చుకుపోయింది!
వరదలతో ముంచెత్తాను
పంటపొలాల్లో ఇసుకమేటలు వేశాను
వెళ్లి చూడు” అన్నాడా అసురుడు.
తల్లడిల్లింది తల్లి మనసు
తర్వాత చూసింది పంటల దేవత
ఉల్లి రైతులు గొల్లుమంటున్నారు
ప్రత్తిరైతులు మొత్తుకుంటున్నారు
“అమ్మా! అధిక దిగుబడి సాధించాం
కనీసధరలు లేక పంటలు రోడ్డునపోశాం”
అని ఆక్రందించారు వారు.
లచ్చి మనసు ఎంతనొచ్చుకుందో!
ఆమె ప్రయాణం సాగేకొద్దీ ఎదురవుతున్నారు
రకరకాల దయ్యాలు
కల్తీవిత్తన వ్యాపారులు
జలగలకేమీ తీసిపోని దళారులు
ఎరువుల అక్రమ నిల్వదారులు
వీరందరికీ కొమ్ముకాసే ప్రభుత్వాలు
వికృతంగా నవ్వుతున్నారు.
పురుగుమందులు పురుగులను చంపకుండా
తమను తాగి అసువులు బాసే రైతుల నోట
నురగలు కక్కిస్తున్నాయి.
కొందరు భూమాత బిడ్డలు ఆమెతో అన్నారు
“తల్లీ, దేన్ని తయారుచేసిన వాడయినా
దాని ధరను నిర్ణయిస్తాడు
హాలికులకు మాత్రమే ఎందుకు లేదీ హక్కు?”
అమ్మ గుండె మండింది.
సేద్యం చేయని సోమరిపోతులు మాత్రం
కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టి, ఉసిగొల్పి
అవి పోట్లాడుకుంటుంటే
పాశవికానందం పొందుతున్నారు.
చట్టాలు చేసే, కాసే వారంతా
చప్పట్లు చరుస్తూ చూస్తుండంగా
సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు
ధాన్యలక్ష్మి వదనంలో దైన్యం
వ్యవసాయాధారిత ఆర్ధిక వ్యవస్థ
కుప్పకూలుతున్న వైనం చూసి
విచారంతో వెనుతిరిగిందా తల్లి
కనీసం వచ్చే సంక్రాంతికయినా
పూయిద్దాం ఆమె ముఖంలో చిరునవ్వులు
కర్షకుల హర్షమే దేశానికి రక్ష!
మేలుకోండి నాయకులు, పాలితులు
మన్నన చేయండి దున్నే వాడిని.

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.