[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా క్లైర్ హేవుడ్ రచించిన ‘డాటర్స్ ఆఫ్ స్పార్టా’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
క్లైర్ హేవుడ్ రాసిన ‘డాటర్స్ ఆఫ్ స్పార్టా’ నవల గ్రీకు పురాణాలకి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్ళు – క్లైటిమెనెస్ట్రా, హెలెన్ జీవితాలను పునః కల్పన చేస్తుంది. కథ వారి బాల్యంలో ప్రారంభమవుతుంది, స్పార్టాలో వారి తొలి సంవత్సరాలను సంక్షిప్తంగా ప్రస్తావిస్తుంది. ఈ పుస్తకం వారిద్దరి దృక్కోణాల మధ్య ప్రత్యామ్నాయంగా నిలుస్తూ, యుక్తవయస్సులోకి ఎదుగుతున్నప్పుడు వారి వ్యక్తిగత ఆలోచనలు, పోరాటాలు, భావోద్వేగాలను పాఠకులు అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ద్వంద్వ కథనం ద్వారా, రచయిత్రి హేవుడ్ వారి కథలపై కొత్త దృక్పథాన్ని ప్రతిపాదించారు, ప్రసిద్ధ పురాణాలకు మించి వారి అంతర్గత జీవితాలను అన్వేషించారు.
ఈ నవలలో క్లైటిమెనెస్ట్రా, హెలెన్ లను చాలా భిన్నమైన స్వభావాలు కలిగిన యువతులుగా చిత్రీకరించారు. క్లైటిమెనెస్ట్రా ప్రాక్టికల్‌గా ఉంటుంది, తెలివైనది, ప్రశాంతంగా ఉంటుంది. కాగా హెలెన్ ఉల్లాసభరితంగా, ఉద్వేగభరితంగా ఉంటుంది; దూకుడు స్వభావం ఉన్నా, అద్భుతమైన రూపసి. క్లైటిమెనెస్ట్రాకి తన తల్లితో బలమైన, ప్రేమపూర్వక సంబంధం ఉంటుంది, కానీ హెలెన్‌ని తల్లి దూరం పెడుతుంది, దాంతో హెలెన్ తిరస్కరణ బాధను అనుభవిస్తుంది. కారణమేమిటో ఆమెకు అర్థం కాదు. ఈ భావోద్వేగపు అంతరం హెలెన్ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది – తన అందాన్ని ఆరాధిస్తారని తనలో తాను విశ్వసిస్తుంది, కానీ ఆమెను ఎవరూ ప్రేమించరు. అక్కచెల్లెళ్ళిద్దరూ యుక్తవయస్సుకి వచ్చేసరికి, వారి తండ్రి తన రాజకీయ పొత్తులను బలోపేతం చేయడానికి వారి వివాహాలను నిశ్చయిస్తాడు. క్లైటిమెనెస్ట్రాకి శక్తివంతమైన, ప్రతిష్ఠాత్మక పాలకుడైన ఆగమెమ్నోన్తో వివాహం జరిపించి ‘మైసెనె’కు పంపిస్తారు. హెలెన్ స్పార్టాలోనే ఉండి, ఆగమెమ్నోన్ సోదరుడు మెనెలాస్ను వివాహం చేసుకుంటుంది. ఇక్కడి నుండి, వారి జీవితాలు భిన్నమైన, మార్చలేని మార్గాల్లోకి నడుస్తాయి. వారు ఎప్పటికీ తిరిగి కలవరు.
సోదరీమణులిద్దరూ అనిశ్చితితోనే, కొత్త జీవితాల్లో ఆనందాన్ని పొందవచ్చనే బలహీనమైన ఆశతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ, భార్యలుగా వారి బాధ్యతలు తీవ్రమైన అసమానత, కఠినమైన సామాజిక అంచనాలతో కూడి ఉన్నాయని త్వరలోనే గ్రహిస్తారు. క్లైటిమెనెస్ట్రా భర్త ఆగమెమ్నోన్ క్రూరుడు, భార్యని చెప్పుచేతలలో పెట్టుకోవాలనుకుంటాడు. ఆమె పట్ల శారీరక, మానసిక క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాడు. అతనో నమ్మకద్రోహి, ఆమెపై తన అధికారాన్ని ప్రయోగిస్తాడు, ఆమెకు తన స్వంత జీవితంపై నియంత్రణ అతి తక్కువని స్పష్టం చేస్తాడు. ఇదిలా ఉంటే, హెలెన్ తన భర్త మెనెలాస్‌తో భావోద్వేగపరంగా విడిపోయినట్లు భావిస్తుంది. ఆమె అందాన్ని భర్త ఆరాధించినా, అతని నుండి ఎటువంటి ప్రేమ, ఆప్యాయతను పొందదు. తనని వాంఛిస్తున్నాడు తప్ప, నిజంగా ప్రేమించడం లేదు అనే ఆమె నమ్మకం బలపడుతుంది. పితృస్వామ్యానికి విలువనిచ్చే ఆ సమాజంలో ఈ ఇద్దరు స్త్రీలు – తమకంటూ స్వప్నాలు, కోరికలు ఉన్న వ్యక్తుల్లా కాకుండా రాజకీయ సాధనాలుగా పరిగణించబడి, సమాజపు బరువు కింద నలిగిపోతారు.


క్లైర్ హేవుడ్
రచయిత్రి హేవుడ్ గ్రీకు పురాణాల నుండి ప్రసిద్ధ ఘటనలను తన కథనంలో చేర్చారు, కానీ కొన్నిసార్లు వాటిలో లోతు లేని విధంగా మార్చారు. ఆ యా సంఘటనల పట్ల ఆమె వైఖరి ఆసక్తికరమైన దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, కథ చెప్పే విధానం తరచుగా స్పష్టమైన, లీనమయ్యే సన్నివేశాల కంటే వివరణపై ఎక్కువగా ఆధారపడింది. కథనం వేగం అస్థిరంగా ఉంది – కొన్ని భాగాలు తొందర పూర్తయినట్లుగా అనిపిస్తాయి, మరికొన్ని సాగదీసినట్లున్నాయి, దాంతో పాఠకులు కథలో పూర్తిగా లీనమవటం కష్టమవుతుంది. అయితే, నవలలో అత్యంత ముఖ్యమైన బలహీనత – పాత్ర చిత్రణ. నవలలోని వ్యక్తులు, ముఖ్యంగా క్లైటిమెనెస్ట్రా, హెలెన్లు – సంపూర్ణంగా అర్థమయినట్లు అనిపించరు. సంక్లిష్టమైన, చురుకైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలుగా ఉండాల్సిన వాళ్ళు – నిష్క్రియాత్మకమైన వ్యక్తులుగా కనిపిస్తారు, తమ స్వంత అర్థవంతమైన ఎంపికలు చేసుకోవడం కంటే, పురుషుల చర్యల ద్వారా ప్రభావితమవుతారు.
పురాణగాథలో క్లైటిమెనెస్ట్రా ఒక శక్తివంతమైన, ప్రతీకారపూరిత తల్లిగా ప్రసిద్ధి చెందింది, ఆమెకు జరిగిన తప్పులకు న్యాయం చేయాలని నిశ్చయించుకుంది. ఆమెను తరచుగా క్రూరమైన, ఆలోచించి ఎత్తులు వేసే మహిళగా చిత్రీకరించారు, కానీ ఈ నవలలో, ఆమె సంకోచిస్తూ, అనిశ్చితంగా కనిపిస్తుంది. ప్రతీకార శక్తిగా కాకుండా, ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలో లేదో తెలియక అనిశ్చితంగా పోరాడుతుంది. అదేవిధంగా, ట్రోజన్ యుద్ధానికి నాంది పలికిన పురాణ సుందరి హెలెన్‌ను నిస్సారంగా, ఆలోచనారహితంగా చిత్రీకరించారు. ఆమె చర్యల వల్ల సంభవించే తీవ్ర పరిణామాలను పట్టించుకోకుండా, ఆమెను పొగిడే అందమైన అపరిచితుడితో ఆమె హఠాత్తుగా పారిపోతుంది. ఈ పాత్రల చిత్రణలలో వాటిని నిజంగా ఆకర్షణీయంగా మార్చగల లోతు, సంక్లిష్టత నవలలో లేదు.
తన ఈ తొలి నవల ద్వారా, గ్రీకు పురాణాలలోని ఇద్దరు అత్యంత ప్రసిద్ధ మహిళల కథలను కొత్త దృక్కోణం నుండి తిరిగి చెప్పడానికి ప్రయత్నించినందుకు రచయిత్రి హేవుడ్ మాన్యత పొందాలి. సాంప్రదాయ పురాణాలు తరచుగా పట్టించుకోని పాత్రలకి, కొత్త స్వరం ఇవ్వడం; వారి అంతర్గత జీవితాలను అన్వేషించడం రచయిత్రి లక్ష్యం. అయితే, వారిని నిష్క్రియాత్మకంగా, అనిశ్చితంగా చేయడం ద్వారా, నవల వారి దిగ్గజ హోదాను తగ్గించింది. శక్తివంతమైన, బహుముఖీన వ్యక్తులుగా ఉండాల్సిన వారిద్దరూ, తమ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా నియంత్రించబడే మహిళల స్థాయికి తగ్గించబడ్డారు. ఈ పుస్తకం – ఎంతో ధైర్యంతో, అంతర్దృష్టితో కూడిన పునఃరూపకల్పన చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, కానీ చివరికి, ఈ దిగ్గజ పాత్రల బలాన్ని, సంక్లిష్టతను పూర్తిగా వినియోగించుకోడంలో విఫలమైంది.
***


Author: Claire Heywood
Published By: Dutton
Published On: 22 June 2021
No. of pages: 400
Price: ₹1,343
Link to buy:
https://www.amazon.in/Daughters-Sparta-Novel-Claire-Heywood/dp/0593184378

స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తస సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.