[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘ఏ జన్మలోని ఋణమో..!-2’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]


“శీతోష్ణ సుఖ దుఃఖ ఆది సహిష్ణుత్వం తితిక్ష” – తత్త్వబోధ.
సంసారి జీవితం ద్వంద్వాల మయం. ఎందుకంటే సంసారాన్నీ, ద్వందాలను కూడా కల్పించేది మనస్సే! నిజానికి ఈ ద్వంద్వాలు రెండూ కలిసే ఉంటాయి. ఒకటి ఎప్పుడు వెళుతుందా అని రెండోది ఎదురు చూస్తుంటుంది. సుఖం కంటే దుఃఖం ఎక్కువ అనుభవం అవుతుంది. అందుకే.. సర్వం దుఃఖం అన్నాడు బుద్ధుడు.
మా ఆచార్యుడు బ్రహ్మ విద్యానంద సరస్వతి అంటారు – “ది ప్లెజర్ ఈస్ ఏ స్మాల్ గ్యాప్ బిట్వీన్ టు పెయిన్స్.”
***
ఆ రోజు ఉగాది. 23-03-2012 శుక్రవారం. వేప పువ్వు పచ్చడి చేసుకున్నాము. పంతులు గారు వచ్చి పూజాదికాలు పూర్తి చేసి. పంచాంగ పఠనం చేశారు. నా జాతకం స్టడీ చేశారు. ఆ సంవత్సర ఫలితాలు చెప్పారు.
“రెడ్డిగారూ! ఈ సంవత్సరం మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి.” అన్నారు
“అంటే..? మంచివా? చెడ్డవా?” అడిగాను ఆత్రుతగా.
“ఎయిదర్! ఏదైనా కావచ్చు! నిజానికి రెండూ ఒకటే! మంచి చెడు కోసం కావచ్చు! చెడు మంచి కోసము కావచ్చు! రెండూ కలిసే ఉంటాయ్.” చెప్పారు
“వివరాలు చెప్పగలరా?” అడిగా.
“మీ ప్రశ్నకు జవాబు కాలo మాత్రమే చెప్పగలదు. మనం ఎదురు చూడటమే! ఏమి జరిగినా ఆ ఘటనను సాక్షిగా వీక్షించండి! అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్!” ఆశీర్వదించి దక్షిణ స్వీకరించి వెళ్లారు.
మనసులో ఆత్రుత పెరిగింది. ఆ ఆత్రుతకు సమాధానం సాయంత్రం నాల్గుగంటలకు తెలిసింది,
టీవీలో ఉగాది కార్యక్రమాలు చూస్తున్న నాకు ల్యాండ్ ఫోన్ రింగ్ వినిపించి లిఫ్ట్ చేసి “హల్లో” అన్నాను.
“మేము చెన్నై పోలీస్ మాట్లాడుతున్నాము” వినగానే నా గుండెల్లో పిడుగు పడింది.
“చెప్పండి” అన్నాను చాలా నీరసంగా.
“ఈ బాడ్ న్యూస్ చెప్పటానికి విచారిస్తున్నాము. కానీ తప్పదు. మీ అబ్బాయి గౌతమ్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్, యూనియన్ బాంక్ ఆఫ్ ఇండియా, రోడ్ ఆక్సిడెంట్లో మరణించాడు. తదుపరి కార్యక్రమం జరిపించడానికి మీరు వెంటనే రాగలరు” ఫోన్ పెట్టేసారు
ఏం చెయ్యాలో తోచలేదు. అంతా శూన్యం అయిపోయిన భావన! నా భార్య నన్ను ఓదార్చింది. ఆమె సలహా మేరకు వూళ్ళో ఇద్దరు సన్నిహితులకు ఫోన్ చేసి రమ్మన్నాను. రెంట్ కారు రప్పించి మేము నలుగురం బయలుదేరి చెన్నై వెళ్లి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బాడీని ఎలక్ట్రిక్ క్రెమేషన్ చేయించి తర్వాతి రోజు రాత్రికి ఇంటికి తిరిగివచ్చాము. ఫ్రెండ్స్ ఇద్దరూ వారి ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పటికే ఈ వార్త వూరంతా పాకిపోయింది. ఫోను మ్రోగుతూనే వుంది. ల్యాండ్ ఫోన్ ఫ్లగ్ తీసేసాను. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసాను. వీధి గుమ్మానికి బయటకు తాళం వేసేసి పెరటి వైపు లోపలికి గడియ పెట్టేసుకున్నాము.
గార్డెన్ మెటీరియల్ దగ్గర దొరికింది ఎండ్రిన్ డబ్బా. రెండు గ్లాసుల్లో సగం సగం పోసుకొని కోలాతో గ్లాసులు నింపి కూర్చున్నాము. అంతకు మించి ఆలోచించే స్థితిలో మా మనసులు లేవు. ఎందుకంటే రేపటి నుండి మొదలయ్యే పరామర్శల పర్వాన్ని ఎదుర్కోవడం మా వల్ల కాదు. జీవితాన్నిఅంతం చేసుకోవాలి.
వన్ టూ త్రీ చెప్పుకొని ఆ విషాన్ని సేవించడమే మిగిలి వుంది.
ఒక్క సెకను నా దృష్టి డోర్ దగ్గర క్రింద పడివున్న అందమైన కవరు మీద పడి వెళ్లి చేతి లోకి తీసుకొన్నాను. ఆ రోజు పోస్ట్‌లో వచ్చిందన్న మాట. మా చిరకాల మిత్రుడు ఏ.వి. ప్రభాకర్ హైదరాబాదు నుండి పోస్ట్ చేసిన కవర్. ఒక్క క్షణం దాన్ని ఓపెన్ చెయ్యాలనిపించింది. ఓపెన్ చేసాను. వాళ్ళ అబ్బాయి ప్రణవ్ బెంగళూరు నుండి పంపిన గ్రీటింగ్ కార్డు మీది మేటర్ నాకు రాసి పంపించారు. అందులో.. ‘ఏ బెండ్ ఇన్ ది రోడ్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్.. అన్లెస్ యు ఫెయిల్ టు మేక్ ది టర్న్’ అని ఉంది. ఇది మా జీవితాలను మార్చేసి మా గమ్యాన్ని చూపించే వాక్యం అయింది!
వెంటనే పురుగుల మందుతో నింపిన గ్లాసుల్ని తీసుకొని.. సింక్‌లో పారబోసాను.
“మీకేమన్నా పిచ్చి పట్టిందా?” ఆశ్చర్యంగా అడిగిది మా సువర్ణ.
“కాదు పిచ్చి వదిలింది.” అన్నాను ఉద్వేగంగా.
“మన ఇద్దరివీ కొద్దిగా బట్టలు ఒక సూట్ కేసులో సర్దు” అన్నాను
“ఎక్కడికీ మన ప్రయాణం?” అడిగింది ఆశ్చర్యంగా.
“తెలియని చోటుకి!” ఇంక మాట్లాడలేదు నా భార్య
సెల్ ఆన్ చేసి టాక్సీ ఓనర్ కం డ్రైవర్ పంతులికి ఫోన్ చేసి “తెల్లవారు ఝామున నాలుగు గంటలకల్లా మా ఇంటికి రా” అన్నాను.
“ఎక్కడికెళ్ళాలి రెడ్డిగారూ?” అడిగాడు పంతులు
“ప్రొద్దుట చెబుతా!” అన్నాను
మా సువర్ణకు అంతా ఎక్సప్లయిన్ చేసాను.
“చూడు సువర్ణా! ఈ రోజు వరకూ మన జీవితం వేరు. రేపటినుండి వేరు. ఈ లోభ మోహాలు, వరవడి, రేపటి నుండి వుండవు. ఈ జగత్తులో అన్ని సంపదలలోకి పెద్ద సంపద ఏమిటో తెలుసా? భూములు కాదు బంగారం కాదు. నిన్నునీవు తెలుసుకోవడమే! నీ చైతన్యాన్నితెలుసుకోవడమన్నా, ఆత్మ దర్శనమన్నా, దేవుని దర్శించు కోవడమన్నాకూడా అదే!! నీ ఆత్మ, నీ చైతన్యం, భగవంతుడు అన్నీఅదే! నీ కంటే అన్యంగా ఏదీ వుండదు! సాధారణంగా జనులు భగవంతుణ్ణి చూస్తూ జగత్తుని చూస్తున్నాము అనుకుంటారు. అజ్ఞానం వల్ల అలా అనుకుంటారు. జనరల్‌గా దేముడు తిరుమలలోనో, శ్రీశైలం లోనో వుంటాడనుకొని పరుగులు – ప్రయాణాలు చేస్తుంటారు. నిజానికి వున్నది నీవు మాత్రమే, కనిపించేది – వినిపించేది అంతా మాయ! నీ సృష్టి! సృష్టించేది-పాలించేది- లయం చేసేది కూడా నీవే!! మాతానాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరాః! అర్ధం నాస్తి, గృహం నాస్తి, తస్మాద్ జాగ్రత జాగ్రత!! మన దగ్గర వున్న దానిని మనం మన బాగు కోరుకొనే వారికి వితరణ చేసేసి, మనకు అవసర మనుకున్నది మన దగ్గర ఉంచుకొని, మనం తెర చాటుకు వెళ్లిపోబోతున్నాము. రేపటినుండి మనం భార్యాభర్తలమే కానీ, సంసారులం కాదు! ఒకే గూడు క్రింద నివసించే ఇద్దరు సాధకులం! ఆత్మ తత్త్వ్తాన్ని తెలుసుకునేందుకు సాధన చేసుకుందాము. ఓకేనా సువర్ణా?” అన్నాను.
“అలాగే మామయ్యా” అంది సువర్ణ.
తెల్లవారు ఝామున పంతులు టాక్సీలో బయలుదేరాము. మెయిన్ రోడ్డు చేరగానే పంతులు అడిగాడు.
“ఎక్కడికెళ్లాలి సార్”
“కాకినాడ వైపు పోనియ్” అన్నాను. నలభై నిముషాల్లో కాకినాడ చేరాక, ఎక్కడికని మళ్ళీ అడిగాడు.
“హైవేకి వెళ్లి వైజాగ్ వైపు పోనియ్. తేటగుంట అనే వూరు వచ్చాక చెప్పు” అన్నాను
“అక్కడేమి పని సార్?” అడిగాడు
“అక్కడ సూరిబాబు పాక హోటల్ ఉంటుందట! అక్కడ పెసరట్టు బావుంటుందట! మా పసలపూడి వంశీ గారి పుస్తకాల్లో చదివాను. తినేసి పోదాం.” అన్నాను. తనలో తాను నవ్వుకొని ముందుకు పోనిచ్చాడు టాక్సీ.
తేటగుంటలో పెసరట్టు తిన్న తర్వాత అడిగాడు ఇప్పుడెక్కడికని.
“వెనక్కి వెళ్ళిపోతే ఎలా వుంటుంది?” అడిగాను. మా సువర్ణ కూడా ఆశ్చర్యంగా చూసింది నావైపు.
“పరమ చెండాలంగా వుంటుంది. వచ్చిన పని చూసుకోకుండా సూరిబాబు ఉప్మా పెసరట్టు తిని వెనక్కు మళ్ళిపోతే నవ్వుతారు సార్ ఎవరైనా!” అన్నాడు.
అర్జునుడికి మార్గ నిర్దేశం చేసిన భగవాన్ శ్రీకృష్ణుడు కనిపించాడు పంతుల్లో!
“సరే అయితే ముందుకు నర్సీపట్నం పోనియ్! అక్కడికెళ్ళాక నీకు దారి చెబుతాను” అన్నాను.
నర్సీపట్నం చేరుకున్నాక “ఇక్కడి నుండి అప్పర్ సీలేరు గాటీ లో చింతపల్లి వెళ్ళాక, ఆంధ్రాకాశ్మీర్గా పిలవబడే లంబసింగి మార్గంలో నున్న ‘స్వామి ప్రణవానంద సేవాశ్రమాని’కి మనo వెళ్ళాలి” చెప్పాను
“అక్కడ మీ తాలూకా ఎవరున్నారు సార్?” అడిగాడు
“ఆ ఆశ్రమాన్ని మా ‘తాలూకా’గా చేసుకొని అక్కడ ఉండటానికి మేము వెళుతున్నాము పంతులు గారూ” అన్నాను.
అర్థం కాలేదు అయినా “సరే సార్” అన్నాడు.
లంబసింగి చేరుకున్నాక ఆశ్రమానికి దారి అడిగి వెళ్ళాము. ఆశ్రమం గేటు ముందు కారు అపాడు.
ఆగిన కారు దగ్గరకు ఇద్దరు మనుషుల్లాటి వారు వచ్చారు. చాలా చిత్రంగా వున్నారు. ఒకరు పై బటన్స్ విప్పేసున్న సఫారీ సూట్ వేసుకున్నాడు. అందులోంచి ఒక బుల్లిదూడను కట్టేయడానికి సరిపోయే బలం కల దారపు పోగుల జందెం కనిపిస్తుంది. పాట్ బెల్లీ, కారిపోయేటంత నూనె రాసి మధ్య పాపిడి తీసిన జుట్టుతో చిత్రంగా వుంటే నాకు చిన్నప్పుడు చూసిన చింతామణి నాటకంలోని సుబ్బిశెట్టిలా అనిపించాడు. ఇక రెండోవాడు ఏ సంస్కారము లేని అడవిని తలపించే జుట్టుతో, మాసి చిరిగిపోయిన గుడ్డలతో వళ్లంతా బూడిద పట్టేసిన భిక్షగాడిలా విచిత్రంగా వున్నాడు.
“ఆయ్! ఆశ్రమం చూడటానికి వచ్చారా? ఏ ఊరండీ తమరిది?” అడిగాడు సుబ్బిశెట్టి తూ.గో.జీ యాసలో.
“మాది పసలపూడి. అవకాశం వుంటే ఇక్కడ ఉందామని వచ్చాము” అన్నాను.
“అయ్ బాబోయి! రాంపురం పక్కనున్న మా పసలపూడే! ఎవరి తాలూకండీ తమరు?” అడిగాడు
“తూరుపు పేటలో తురకల వీధి లోని నల్లమిల్లి నారాయణ మూర్తిగారి అబ్బాయిని.” చెప్పాను
“మా నారా మూర్తి బాయ్య కొడుకువి. నీ పేరు చంటోడు కదూ?” అడిగాడు
“అక్కడ అందరూ అలాగే పిలిచేవారు. నా పేరు శాంతి రెడ్డి, నాదొక అనుమానం మీ మెడలో జందెం కనిపిస్తుంది. మా నాన్నను బావా అంటున్నారు మేము శూద్రులం కదా?” అడిగాను.
“అదిరా నీ అనుమానం! జన్మతః ప్రతివాడు శూద్రుడే! విద్య వలన, వివేకం వలన, వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా, బ్రహ్మ విద్య ద్వారా బ్రాహ్మణుడుగా, పాలనాభిలాష దక్షత కలవారు క్షత్రియలుగా, వ్యవసాయం వ్యాపారం పై అభిలాష వల్ల వైశ్యలుగా, పై మూడు వర్గాలవారికి అవసరమైన సహకారం అందించేవారు శూద్రులు అవుతారు. ఈ సంగతి ఋగ్వేదంలో వుంది. ద్విజులైన వారికి ఈ జందెం అలంకారం అవుతుంది. నీ చిన్నప్పుడు మీ నాన్న చెయ్యి పట్టుకొని మా దుకాణంకు వచ్చేవాడివి, మీ నాన్న చుట్టలు కొనుక్కొనేవాడు. నీకు బెల్లం ముక్క గానీ, చప్పలించే నిమ్మతొన బిళ్ళ గానీ ఇచ్చేవాడిని. జమ్మిచెట్టు వీధిలో ఉండేది నా దుకాణం. నలభై సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయిన తర్వాత వ్యాపారం మా అబ్బాయి సూర్యానికి అప్పజెప్పి ఈ ఆశ్రమానికి వచ్చేసాను. ఇరవై సంవత్సరాల క్రితం మా సూర్యం కాలం చేసినప్పుడు ఒకసారి పసలపూడి వచ్చాను. అప్పటికే మీ నాన్న కూడా చనిపోయాడన్నారు. ఇప్పుడు మా మనవడో- మునిమనవడో వ్యాపారం చేస్తుండవచ్చు. ఇక నీ సంగతి చెప్పు అల్లుడూ? ఆశ్రమం చూసి వెళ్తారా లేక రెండు రోజులు వుండి వెళ్తారా?” అడిగాడు బంగార్రాజు.


బంగార్రాజు
“అవకాశం వుంటే.. ఇక్కడ ఉండి పోదామని..” అన్నాను సందేహంగా.
“సాదారణంగా మూడు రోజులండటానికి కుటీరం ఇస్తారు. అసాదారణంగా పెర్మనంట్ రెసిడెన్స్ కూడా ఇవ్వవచ్చు. ఈశ్వర సంకల్పం ఎలా ఉందో చూద్దాము. అంతకు లేకపోతే నా కుటీరమ్ ఎలాగూ వుంది.” అన్నాడు.
సూట్ కేసు కారు లోంచి దింపుకొని పంతులుకి కారు బాడుగ ఇచ్చేసి పంపించేసాను. అప్పుడు బంగార్రాజు పక్కనే వున్న రెండో అసామి సీన్ లోకి వచ్చాడు.
“చాయ్” అన్నాడు. టీ కి డబ్బులు అడుగు తున్నాడనుకొని జేబు లోంచి ఇరవైనోట్ తీసి ఇచ్చాను. దాని వంక చాలా అసహ్యంగా చూసి తిరిగి ఇచ్చేసాడు.
“అల్లుడూ! వాడికి డబ్బులు ఇవ్వకు. నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా వెంట్రుక ముక్కతో సమానంగా భావించి వాడు తీసుకోడు.” అన్నాడు బంగార్రాజు.
“మరి.. చాయ్ అంటున్నాడు” అడిగాను.
“అది వాడి ప్రారబ్దంలో మిగిలిపోయిన అనుభవించాల్సిన సంస్కారం.” బంగార్రాజు
“ఇంతకీ ఎవరితను?”అడిగాను.
“ఇతనికి వూరు పేరు లేదు. అలాగే భాష భావం కూడా లేదు. ఈ ప్రాంతంలో శ్రీరాముడంటే భక్తి. అందుకని అందరూ ‘రామ్’ అని పిలుచుకొనేవారు. నేను ఆశ్రమానికి వచ్చాక ఆ పేరుకి ‘సింగ్’ తగిలించాను. అప్పటినుండి ‘రాంసింగ్’ అయ్యాడు. మనం ఎలా పిలిస్తే అలా పలుకుతాడు అల్లుడూ!” చెప్పాడు బంగార్రాజు.
“వెరీ ఇంటరెస్టింగ్! ఇంకా చెప్పు మావయ్యా!” అడిగాను.
“ముందు మీకు కుటీరమ్ ఏర్పాటు అయ్యింతర్వాత అంతా వివరిస్తాను. పదండి లోపలికి!” అంటూ సూట్ కేస్ తీసుకున్నాడు. మా యావిడ భుజానికి తగిలించు కొంటున్న హేండ్ బాగ్ లాగేసుకుని మా ముందు గేటు లోపలికి నడుస్తున్నాడు శ్రీరాంసింగ్. శ్రీ నేను తగిలించాను.
ఆశ్రమ రిసెప్షన్లో వున్న వ్యక్తితో బంగార్రాజు అంటున్న మాటలు వినిపిస్తున్నాయి.
“ధనరాజు అన్నయ్యా! మా పసలపూడి నుండి మా నారామూర్తి బావ గారి చంటోడు అతని భార్యా వచ్చారు. వారికి కుటీరం, మీల్స్ కూపన్ ఇప్పించండి. సాయంత్రం మాతాజీని పెర్మనెంట్ రెసిడెన్స్ అడుగుతాము.” అన్నాడు.
ధనరాజు గారు మా వివరాలు నోట్ చేసుకొని మాకు కేటాయించిన కుటీరంలో కూర్చున్నాక మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు బంగార్రాజు.
“ఈ రాంసింగ్ ఒక ‘అస్పర్శ’ యోగి”.
“అదేమి యోగం ఎప్పుడూ వినలేదే!” అన్నాను
“ఇక మీదట చాలా వింటావులే! ఇది మాండూక్య ఉపనిషత్ శ్రీమాన్ గౌడ పాదాచార్యుల కారికల్లో వివరించిన యోగం. ‘అస్పర్శ యోగో వైనామ దుర్థర్శః సర్వ యోగిబి:! యోగినో బిభ్యతి హ్యాస్మాదభయే భయదర్శినః!!’ దేనితోనూ కలవక పోవడం, ఏ భావానికి స్పందించక పోవడం ఈ యోగం ప్రత్యేకతలు. ‘డోంట్ అటాచ్ టూ ఎనీ థింగ్ అండ్ కీప్ ఎంప్టీనెస్ వితిన్ యూ’ అనేది దీని నిర్వచనంగా చెప్పుకోవచ్చు. దేనినీ అంటుకోకుండా, అంటించుకోకుండా ఆకాశంలా ఎవరు ఉంటారో వారు అనుష్ఠించే యోగం అస్పర్శ యోగం. ఈ యోగం నిజాన్నిదర్శించే దృష్టికోణం. ఆత్మ ‘అసంఘ’ అనేది అస్పర్శయోగం. దీన్ని వైరాగ్యం అనవచ్చు. ఇతను సుఖ-దుఃఖములకు అతీతుడు. ఒక పువ్వును ఒక పాప నవ్వునూ – ఏడ్పునూ ఒకేలా చూస్తాడు. తన స్వరూపం ఆనందం. జీవితంలో సంభవించే ఒక ఘటన నుండి వచ్చే దుఃఖం గానీ, సుఖం గానీ స్వీకరించక పోవడమే అస్పర్శ యోగం. అదే సంసార లంపటత్త్వం! ‘కృపాళు ర కృత ద్రోహః తితిక్షు స్సర్వ దేహినాo! సత్య సారో అనవ ద్యాత్మాసమ సర్వోపకారకః!!’. సర్వ ప్రాణులందు దయ గలవాడు, ఏ జీవికి హాని చేయని వాడు, క్షమా గుణం కలవాడు, సత్య దీక్ష గలవాడు, సర్వం బ్రహ్మమయంగా భావించువాడూ ఈ యోగాన్నిఆచరించే వాడవుతాడు. సర్వ ద్వంద్వాల నుండి విడివడి
ఉండడమే అస్పర్శ యోగం! ఈ రాంసింగ్ అటువంటి యోగే! అతనికి తను ఒక యోగినని కూడా తెలియదు. ఇతడు అప్రయత్నంగా దొరికిన ఆహారాన్నితిన్నప్పుడు చేతులు నోరూ ఎలా కడుక్కోడో అలాగే మల మూత్రాలు విసర్జించాక కూడా కడుక్కోడు. అయినా అతని దగ్గర దుర్వాసన రాదు, పైగా మల్లెపూల పరిమళం వస్తుంది. ఎవరైనా పిలిచి నీళ్లు గుమ్మరించి అభిషేకం చెయ్యాలే గానీ తనకు తానుగా స్నానం చెయ్యడు. నాకైతే శివాలయంలో లింగానికి ఇతనికి తేడా కనిపించదు. అప్పుడప్పుడూ నా కుటీరానికి తీసుకెళ్లి, అభిషేకం చేసి బట్టలు మార్చే అవకాశం నాకు ఇస్తాడు. ఈ జన్మకు అదే చాలనుకుంటాను. ఇతనొక అవధూత!! ఆ సంగతి ఇతనికి తెలీదు. సరే! మీరు ప్రెష్ అయ్యిభోజన శాలకు వెళ్లి వచ్చి విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం వస్తాను. మాతాజీ దర్శనానికి వెళ్లి మీ సంగతి మాట్లాడదాము” అని చెప్పి వెళ్లిపోయాడు.
***
సాయంత్రం మాతాజీ సద్విద్యానంద సరస్వతి వారిని కలిసాము. గోశాలలో సేవ చెయ్యడానికి అంగీకరించినందున పెర్మనంట్ రెసిడెంట్‌గా అద్దేపల్లి రామమోహనరావ్ గారు కట్టించిన శాంతి నివాస గృహ సముదాయంలో కుటీరమ్ కేటాయించారు.
తర్వాత రోజు ఉదయాన్నేగోశాలకు వెళ్ళాము. నేనూ సువర్ణా ఒక నోట్ బుక్‌లో డేటా నమోదు చేసుకున్నాము. అక్కడున్న ఎద్దులు, గిత్తలు, పాలిచ్చేఆవులు, గొడ్డుపోయిన ఆవులు, పొల్లుదలకు వచ్చిన పెయ్యలు, లేగ దూడలు వివరాలు, వాటికి అవసరమైన ఆహారం వివరాలు రాసుకొన్నాము. అదనపు వసతుల వివరాలు నమోదు చేసుకున్నాము. అప్పటికి అక్కడికి బంగార్రాజు మావయ్య కూడా వచ్చాడు. వివరాలు చర్చించుకున్నాము. ముగ్గురం వంటశాలకు వెళ్లి రోజువారి పాల దిగుబడి వివరాలు తీసుకున్నాము. గోశాల నుండి రోజుకు నలభై మూడు లీటర్లు పాలు వస్తుంటే – పాలకేంద్రం నుండి నలభై లీటర్లు కొంటున్నారని కుక్ చెప్పాడు.
“సరిపోతున్నాయా?” అడిగాను
“సరిపెట్టుకుంటున్నాము.” అన్నాడు
అక్కడినుండి ఆఫీస్‌కు వెళ్ళాము. అకౌంట్స్ అనలిస్ట్ బాల కృష్ణారెడ్డిని కలిసి గోశాల ఖాతా నఖలు తీసుకొన్నాము.
“మామయ్యా! ఈ రోజు సాయంత్రం మళ్ళీ మాతాజీని కలసి మా రిపోర్ట్‌ను, మా రికమండేషన్స్ తెలియజేద్దాము” అన్నాను
“అలాగే అల్లుడూ.” అని తన కుటీరానికి వెళ్ళిపోయాడు
గోశాల నిర్వహణ గాడిలో పడినట్టే! ఈ విషయంలో మాకంటే బంగార్రాజు పాత్రే ముఖ్యమైంది. ఒక గడ్డి కోసే మిషను, గడ్డిని గుండగా చేసే చాప్ కట్టర్ కొని డొనేట్ చేసాడు. ఆవులకు అవసరమైన అలంకార సామాగ్రీ, బుల్లి దూడలకు రక రకాల పూసల దండలు నర్సీపట్నం నుండీ, తునినుండి తెచ్చేవాడు.


గోశాల
“అల్లుడూ! నా దగ్గర చాలా డబ్బుంది. గోవులకు కావాల్సిన ఏ చిల్లర ఖర్చు ఐనా నన్నుఅడుగు.” అంటూ భరోసా ఇచ్చాడు. చాలా సమయం గోశాలలో గడపడం నాకూ మా సువర్ణకు చాలా బావుంది. అప్పుడనిపించింది భగవంతుడు ఆడుకొనే చదరంగంలో మేము పావులమని. సంసారం అనే గడి లోంచి తప్పించి ఇక్కడ ఆశ్రమంలో పెట్టాడు. గాడ్ ఈజ్ గ్రేట్!!
బంగార్రాజు ఆశ్రమ సేవకుల్ని చాలా ప్రేమగా నాన్నా అనో, బాబూ అనో, బంగారూ అనో, అమ్మా అనో, పాపా అనో పిలిచేవాడు. బుల్లిదూడలు అతని వెనకాలే తిరిగేవి. కుటీరము దగ్గర కుక్కలకూ, కోతులకూ బిస్కట్లు పెట్టేవాడు. పక్షులకు గింజలు జల్లేవాడు. పావురాలు, చిలుకలు అతని భుజం మీద వాలేవి. పూలు మొక్కల నుండి కోయ రాదనేవాడు. రాలిన పూలను మాత్రమే సేకరించి దేవుడికి సమర్పించాలని వాదించే వాడు, గీత లోని శ్లోకం ‘అద్వేష్టాసర్వ భూతానామ్ మైత్రః, కరుణ ఎవచ! / నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖః క్షమీ!!’ అని కోట్ చేసేవాడు!.
ఆ రోజు అమావాస్య. తెల్లవారు జామున గోశాలకు వచ్చేసాం. మొదటి గోవు పాలు తీసేటప్పటికి శ్రీరాంసింగ్ వచ్చాడు. ఆ పాలు అతనికి సమర్పించాము. పాల దిగుబడి వంద లీటర్లకు పెరిగింది. ఆశ్రమావసరాలకు సరిపోతున్నాయి. అందరూ సంతోషంగా వున్నారు. ఆరోజు ఆవులను (స్నానం) కడుగుతున్నాము. నానీ రాంసింగ్‌ను గోవుల వరుసలో నిలబెట్టాడు. సూర్రావ్ కాపు పైప్ తో నీళ్లుకొడుతుంటే, గన్నియ్య వట్టిగడ్డి బ్రెష్‌తో వళ్ళు రుద్దాడు. ఈ అభిషేక కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి మా సువర్ణ కుటీరం నుండి తెచ్చిన తెల్ల బట్టలతో రాంసింగ్‌ను అలంకరించాడు అప్పారావు.
బంగార్రాజు ఎందుకు ఇంకా రాలేదో తెలియలేదు మాకు.
కేరేజిలు పట్టుకెళ్ళిన నాగమణి వచ్చి చెప్పింది మమ్మల్ని కుటీరానికి రమ్మన్నారని. వెళ్ళాము. నీరసంగా కనిపించాడు.
“ఏం మామయ్యాఎలా వున్నారు?” అడిగాను.
“బాగానే వున్నాను. ఆత్మకు మరణం లేదు. అది ఎక్కడి నుండీ రాలేదు. ఎక్కడికీ పోదు. సృష్టిక్రమంలో ఏది వచ్చిందో అదే పోతుంది. ఈ శరీరం వచ్చి నేటికి తొంబై ఏళ్లయింది. ఎప్పుడొకప్పుడు పడిపోతుంది. తెల్లవారు జామున ఈశ్వరుడు కలలోకొచ్చి ‘వచ్చేయ్’ అంటున్నాడు. కాబట్టి ఈ దేహ యాత్రకు ఏర్పాట్లు చేసుకోవాలి కదా? అందుకే పిలిచాను. నువ్వు నాకొక మాటియ్యాలి అల్లుడూ!” అన్నాడు.
“ఏమిటి చెప్పండి మావయ్యా!” అన్నాను.
“ఈ శరీరం పడిపోయాక, దానికి నీవు అగ్నిసంస్కారం చెయ్యాలి అల్లుడూ! చేస్తానని మాటియ్యి అల్లుడూ.” అడిగాడు.
“అలాగే” అని చేతిలో చెయ్యివేసాను.
“అమ్మా!” సువర్ణను దగ్గరకు పిలిచి “నువ్వు విష్ణుసహస్ర నామాలు బాగా చదువుతావట! ఒక్కసారి ఇప్పుడు నా కోసం వినిపించగలవా?” అడిగాడు.
“అలాగే బాబాయ్” అంటూ దగ్గరగా కూర్చుని మొదలు పెట్టింది.
‘హరిః ఓమ్. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః!’ అంటూ మొదలు పెట్టి ‘శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో అభిరక్షతు!!’ అంటూ పూర్తి చేసేటప్పటికి బంగార్రాజు తల వాల్చేసేడు. దేహ యాత్ర చాలించేసేడు. ఆ తర్వాత పనులు చక చకా సాగాయి.
సద్విద్యానంద సరస్వతి మాతాజీ మరికొంత మంది సన్యాసినులు, సన్యాసులు, బ్రహ్మచారులు, ఆశ్రమవాసులతో శవ యాత్ర ప్రారంభం అయింది. గురుస్తోత్రం, నిర్వాణ షట్కమ్, దశశ్లోకి గట్టిగా గానం చేస్తూ శవ యాత్రను అనుసరిస్తున్నారు. నిప్పు రాజేసి వున్న పిడతతో నేను ముందు నడుస్తున్నాను. గోశాల నుండి పచ్చిక మేపుకు విప్పిన గోవులన్నీ మేత సంగతి మర్చిపోయి బారులు తీరి శవ యాత్రను అనుసరిస్తున్నాయి. ఆ వెనుక కుక్కలు, కోతులు, పిల్లులు అనుసరిస్తున్నాయి!


అవధూత శ్రీరామసింగ్తో శాంతిరెడ్డి
అవధూత శ్రీరామసింగ్ “రామ్ నామ్ సత్య హై” అంటూ చిందులు తొక్కుతూ నృత్య నినాదం చేసున్నాడు. శవ యాత్ర ఆశ్రమ ఉత్తర దిక్కులోని లోతు గడ్డ వైపు తిరిగింది. ఎక్కడినుండి వచ్చాయో కొన్ని వందల పక్షులు చిలుకలు, కాకులు, గోరింకలు, పిచ్చుకలు పాడెకు సమాంతరంగా ఎగురుతూ బంగార్రాజు అంతిమ యాత్రలో అతనికి ఛత్రం పట్టినట్టు కనిపిస్తున్నాయి. చూసే వారికి అది శవ యాత్రలా లేదు, కోనేటికి తరలి వెళ్తున్న కొండల రాయుడి ఊరేగింపులా ఉంది. ఇలాంటి శవ యాత్ర చూడటం ఆ యాత్రలో నేనూ భాగమై ఉండటం నా జీవితంలో ఇదే మొదటిసారి! బహుశా ఇదే ఆఖరిసారి అవుతుందేమో కూడా!!!!
స్వస్తి.

1 Comments
Prabhakar315
The Vedantic Story ” A Janmaloni Runamo – 2 beautifully conveys a profound message about life and mind’s role in shaping our experiences. Human life is filled with opposing emotions Joy and Sorrow, Heat and cold, Good and Bad – all created by the mind.This interplay is merely a mental illusion. Pleasure in reality is a brief pause between two moments of pain. However If we learn to accept both joy and sorrow with belief that everything happens for our ultimate good, we can remain in a state of true bliss (Ananda). Through self introspection we can realise the divinity within ourselves. A deeply insightful story by Sri N V Reddy Garu carrying a powerful spiritual message.