విలక్షణమూ, వినూత్నమూ అయిన ప్రయోగాత్మక గ్రంథం ‘ఒక గురువుగారు-నలుగురు శిష్యులు’
సాహితీపరులూ, మిత్రులూ, పాఠకులూ ‘ఏరిన ముత్యాలు’గా వస్తున్న రచనల్ని హర్షించి, ఆదరించి, అభినందిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. అయితే, చాలామంది ఈ శీర్షికను కథా ప్రక్రియకు మాత్రమే పరిమితం చేయకుండా-సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోని ఉత్తమ రచనల్నీ, అ-పూర్వ సృజనల్నీ- పరిచయం చేస్తే బాగుంటుందనీ, అలా చేయమని కోరుతున్నారు. ఈ సూచనని ఆచరణీయంగా భావించి, ఇక నుండి అన్ని ప్రక్రియల్లోని రచనల్ని/గ్రంథాల్ని ఈ శీర్షిక ద్వారా పరిచయం చేయాలని పూనుకుంటున్నాను. తదనుగుణంగా ఇదిగో ఈ సంచికలో వస్తున్న గ్రంథం:
‘ఒక గురువు గారు – నలుగురు శిష్యులు‘
రచన: చీకోలు సుందరయ్య
గురువుగారేమో-కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ కవి దిగ్గజం ‘శివుడు’ అనబడే కె.శివారెడ్డి, శిష్యులేమో-విశిష్టమైన రచనా నేపథ్యంతో సాహితీ చైతన్య పతాకలుగా నిలిచిన నందిని సిధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, ఆశారాజు, నాళేశ్వరం శంకరం.
తెలుగు సాహిత్యంలో ఇంతకుముందు రాని అ-పూర్వ రచన ఇది. ఒకరి ఆత్మకథని, జయాపజయాల్ని అనుభవాల్ని మరొకరు గ్రంథస్థం చేసిన ఉదాహరణలు తెలుగులో చాలా ఉన్నాయి. కానీ ఈ గ్రంథం అలాంటిది కాదు
“ఇది ఒకరకంగా… ఒక గురువు తన శిష్యులలోని నలుగురితో తన అనుబంధాన్ని చెప్పడంగా, ఆ నలుగురి సాహిత్య నేపథ్యాన్ని, క్రమవికాసాన్ని అంచనా వేయడంగా, ఆ నలుగురు శిష్యులూ తమ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకోవడంగా ఈ పుస్తకం కనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే, ఒక గురువుగారికి, వారి నలుగురు శిష్యులకు మధ్యన ఉన్న అనుబంధాన్ని గూర్చి, మరో శిష్యప్రాయులు, సన్నిహిత మిత్రులు అయిన చీకోలు సుందరయ్యగారు రాసిన విశ్లేషణగా దర్శనమిస్తుంది. ఏ భాషలోనూ ఇలాంటి ప్రయోగం జరిగి ఉండకపోవచ్చు! అట్లా ఈ పుస్తకం విలక్షణమైనది. ఏ విధంగా చూసినా ఇది అపూర్వ ప్రయోగమే” అన్నారు తమ సుహృద్వాక్యంలో పెన్నా శివరామకృష్ణగారు.
ఇలాంటి ప్రయోగాత్మక రచన విషయంలో –
వినటం వేరు శ్రద్ధాశ్రవణం వేరు. చూడటం వేరు, నిశిత దృష్టి వేరు. పనిచేయటం వేరు, నిమగ్నత, నిబద్దత వేరు. ఇవన్నీ ఒనగూడినప్పుడే పరిశీలన ఫలవంతమౌతుంది, ప్రయోజనాత్మకమూ అవుతుంది. వీటన్నిటినీ సాధించుకొని సుందరయ్య తమ పూనికని విజయవంతం చేశారు.
మొదటి వందపేజీల్లో శివారెడ్డి జీవనరేఖలు, ఆయన కవిత్వంలోని విభిన్న గుణవిశేషాల సారం వచ్చింది. ఆయన గురించి ఎవరేమన్నారో, ఆయన ఏ ‘…..రసం’లోనూ సభ్యుడు కాదుగదా? గురించి నిజనిర్ధారణ, అదిగో ద్వారక, కలిసిన వారెందరో వంటి ఉపశీర్షికలతో ఉత్కంఠ ప్రేరకంగా రచన సాగింది. ఆనాటి ద్వారకా హెటల్ సమావేశాల విశేషాలు అక్కడ కలిసిన సాహితీపరుల వివరాలూ-పొందుపరచారు. వారిలో ఆనాటి సినారె, రావూరి భరద్వాజ నుండి ఈనాటి విల్సన్ రావు వరకూ ఉన్నారు.
ఈ అధ్యాయంలో అత్యంత విలువైన ‘శివారెడ్డి స్వగతం’ ఉన్నది. తనను మలుపుతిప్పిన పుస్తకం గురించి రాస్తూ, ఆనాటి తన మనఃస్థితినీ, పథాన్ని ఇలా చెప్పుకున్నారు శివారెడ్డి.
“నా జీవితాన్ని, సాహిత్య జీవితాన్ని మలుపుతిప్పిన పుస్తకం… కమ్యూనిస్టు మేనిఫెస్టో. అది నా ప్రాపంచిక దృక్పథాన్ని మార్చివేసింది. కింది మధ్యతరగతి వ్యవసాయిక కుటుంబం నుంచి వచ్చిన నామీద అనేక ప్రభావాలు, అశాస్త్రీయ ధోరణులు… వాటన్నింటినీ అది వడకట్టింది. ఒక స్పష్టమయిన చూపునిచ్చింది. ప్రపంచాన్ని, దాని వర్గాలను, వర్గ స్వభావాలను కుటుంబం, పెట్టుబడి, భూస్వామ్య విధానం దాని స్వభావం… పెట్టుబడి దాని స్వభావం… దాని సంస్కృతి… ఇలా ఎన్నో విషయాలు అప్పటిదాకా అయోమయంగా అర్థం కాకుండా వున్న విషయాలు చాలా అర్థమయ్యాయి. ఆ సందర్భంలోనే ప్రపంచవ్యాప్తంగా వామపక్ష భావజాల ప్రభావపు గొప్ప రచయితల్నీ, కవుల్నీ చదవడం, అర్థం చేసుకోవడం. సిద్ధాంతం వేరు, సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని, చుట్టూ వున్న సమాజానికి అన్వయించి జీవనానుభవాన్ని కళగా మార్చటం, కవిత్వం చేయటం వేరు అన్న విషయం బోధపడటం” ఈ స్పష్టీకరణ సృజనాత్మకంగా జీవిస్తున్న రచయితలందరికీ ఆలోచనీయం, అనుసరణీయం!
‘కవిత్వం చేయటమే’ రసవిద్య, ఆల్కెమీ! అది అధ్యయనం, అనుభవం, అభ్యాసం ద్వారా గుండెని మండించుకుంటేనే సాధ్యమవుతుందనే సంభావ్యమైన రీతిలో – ‘కవిత్వంపట్ల అచంచలమైన ప్రేమ… అనంతమైన అధ్యయనం… నాతో సమానంగా లేదా నాకంటే ఎక్కువ చదువుకున్నవాళ్లు ఉండవచ్చు. నాలాగ నేర్చుకుంటానికి ప్రయత్నించేవాళ్ళు తక్కువ’ అని గుండె దిటవుతో చెప్పుకున్నారు.
శివారెడ్డి కవిత్వ జీవన ప్రస్థానం వివరణ తర్వాత ఆయన – నలుగురు శిష్యుల వ్యక్తిత్వ, సాహిత్య వ్యక్తిత్వ విశేషాల్ని – నాలుగు పరిచ్ఛేదాలుగా రాశారు సుందరయ్య. ప్రతి కవి-కవిత్వం ఆవిర్భావ వివరాలు, ఆ కవికి శివారెడ్డితో తొలిపరిచయం, ఆ తర్వాతి సాన్నిహిత్య సౌహార్దాల విశదీకరణ వచ్చాయి. ఆ కవుల రచనలు, సాధించిన విజయాలు, వాటి వెనుక గల గురువుగారి ప్రేరక, చోదకాలూ-వివరంగా చిత్రితమైనాయి.
‘ముక్తాయింపు’గా సుందరయ్య చెబుతున్నారు
‘సిధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, ఆశారాజు, నాళేశ్వరం శంకరం ఈ నలుగురు శిష్యులు తమ హృదయావిష్కరణలో గురువుగారి గురించి ఎంత గొప్పగా భావిస్తున్నారో, ఆ గురువుగారు కూడ వారి గురించి అంతే గొప్పగా భావిస్తున్నారు’ అందుకే ఇవి గురుశిష్య ప్రపంచంలో కలకాలం నిలిచేవనడంలో సందేహం లేదు.
గురువు కె.శివారెడ్డి గారంటారు… ‘నా నుండి వాళ్లేమి స్వీకరించారో తెలియదు. వాళ్ళకి తెలియకుండా వాళ్ల నుంచి నేను చాలా స్వీకరించా. నన్ను ముప్పేటగా కాదు, అనేక పేటలుగా పేనిన వాళ్ళు వీళ్ళు. They are insiders… not outsiders. నేను యిటువంటి కవిమిత్రుల్ని కలిగి వుండటం నా అదృష్టం…. అందరం కలిసినప్పుడు ఒక క్రొత్త ప్రపంచం అక్కడ జన్మిస్తుంది. అనేకానేక అందాలతో… అలా లోపలా బయటా నిలిచిపోతుంది. ‘I am lucky to have such successors… great, beautiful successors.’
ఇంతకన్నా మించిన ప్రశంస, అభినందన, మనసులోని మాట ఇంకేముంటుంది?! అది శిష్యుల అదృష్టం. ఈ గురువుగారి సౌమనస్యం!
“నమ్మిన విశ్వాసాల్ని పిడికిట్లో తీసుకుని నుదుటి కానించుకొని మంత్రించి నల్దిశలా వెదజల్లిన కవి శివారెడ్డి. కవుల్ని ప్రేరేపించిన కవి శివారెడ్డి. ఒక కవిత్వ వాతావరణంలో తెలుగు నేల పొడుగునా పొద్దు పొడుపులా అల్లుకుపోయాడు. ప్రజల రహస్య భాష తెలిసిన కవి…” అంటారు నందిని సిధారెడ్డి.
“శివారెడ్డికి తన నీడ అప్పుడప్పుడు ఉండేది కాదేమో, కానీ నేను ఎల్లప్పుడూ నీడలా ఉన్నాను. నియమంగా ఉన్నాను. నిబద్ధతతో ఉన్నాను… శివారెడ్డి కవిత్వంలో నన్ను వెన్నుతట్టలేదు గానీ, వెన్నుదన్నుగా ఉన్నారు…” అంటారు కంశ్రీ.
“శివారెడ్డి సార్ గురువే కాదు, నా గార్డియన్, నా కుటుంబానికి పెద్ద దిక్కు. నాకు కవిత్వాన్ని నేర్పించారు. కవిగా బతకడం చూపించారు” అంటూ పలవరిస్తారు ఆశారాజు.
“శివారెడ్డి తొలినాట ఎలా మనసులో నిలుపుకున్నానో నేటికీ నాలో చెదరకుండా ఉన్నాడు…” అంటూ విశదీకరిస్తారు నాళేశ్వరం శంకరం. ‘ఈ కలయిక చరిత్రాత్మకం! ఎన్నడూ విననిది… ఎక్కడా చూడనిది… వెనుకటి తరాల్లో లేనిది… ముందు తరాల్లో ఉంటుందో లేదో చెప్పలేనిది!’ అంటారు సుందరయ్య. అచ్చంగ అలాంటి ఈ పుస్తకం కూడా అనటం స్వభావోక్తి! పక్కా ప్రణాళిక, రచన, ప్రయోగం, సాఫల్యం అన్నీ ఆయనవి! ఆరుగురికీ అన్ని ఇన్ని అభినందనలు.

విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.
3 Comments
Valliswar
ఈ గురు శిష్యుల మధ్య సాహితీ స్నేహ బంధం గురించి వినటమే కానీ ఈ పుస్తకం నేను చదవలేదు. మీ వ్యాసం చదివాక చదవాలనిపిస్తోంది . ఒక పెద్ద కొండని చిన్న అద్దంలో ఎంత ఎంత హృద్యంగా చూపించారు !
రామలక్ష్మి
చాలా బాగుంది సర్ ఈ పుస్తక పరిచయం!
Nandyala Muralikrishna
సాహిత్యం పట్ల అమితమైన ప్రేమను పెంచుకుని సుమారు నాలుగు దశాబ్దాల పైచిలుకు సాహితీ సహవాసం చేసిన, ఒక పఠనం ,శ్రవణం ,రచన వివిధ ప్రక్రియ లనూ ఆకళింపు చేసుకున్న గొప్ప కవి ,కథకుడు, విశ్లేషకులే కాక అనేక సాహిత్య కార్యక్రమాల రూపశిల్పి ,నిర్వహణ బాధ్యత లను చాలా సహృదయంగా నెరపిన తెలుగు సాహితీలోకం లో నిఖార్సయిన కార్యదక్షులు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రతిష్టాత్మకమైన తెలుగు సాహితీ సంస్థ ‘రంజని’ ని ఆకాశమంత ఎత్తున నిలపడంలో మూలస్తంభంగా సేవలందించిన శ్రీ చీకోలు సుందరయ్య గారికి నమఃపూర్వక అభినందన చందనాలు.
మీ ‘ఒక గురువుగారు నలుగురు శిష్యులు’ పుస్తకాన్ని ఉన్నతంగా విశ్లేషణ చేసి సమీక్షను తెలుగు సాహితీ మేరునగధీరులు శ్రీ విహారిగారు చేపట్టడం ఓ గొప్ప వరం. ప్రముఖ సాహితీవేత్తలు శ్రీవిహారి గారికి హృదయ పూర్వక నమస్సులు.
-నంద్యాల మురళీకృష్ణ. హైదరాబాద్.