మార్చి 26వ తేదీ మహాదేవి వర్మ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ఆమె హిందీ సాహిత్యానికే వన్నె తెచ్చిన గొప్ప కవయిత్రి, రచయిత్రి, వ్యాసరచయిత్రి, బాల సాహితీవేత్త, చిత్రకారిణి, అనువాదకురాలు. అంతేకాదు సంపాదకురాలు, సంకలనకర్త, స్త్రీవాది, సంఘసంస్కర్త, మహిళా విద్యావేత్త. ముఖ్యంగా హిందీ సాహిత్య ప్రక్రియలలో ముఖ్యమయిన ఛాయావాద కవిత్వ మూలస్తంభాలలో ఒకరు. హిందీ సాహితీచరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన గొప్ప సాహితీవేత్త. భారతదేశంలో సాహితీరంగంలో ప్రసాదించే అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ స్వీకర్త. ఈమే మహదేవీ వర్మ.
ఈమె 1907 మార్చి 26వ తేదీన యునైటెడ్ ఫ్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔధ్ – బ్రిటిష్ ఇండియాకి చెందిన (ఈనాటి ఉత్తర ప్రదేశ్) ఫరూఖాబాద్‌లో జన్మించారు.
తల్లి హేమరాణిదేవి సంగీత ప్రియురాలు. ఇతిహాసాల పట్ల మక్కువ గలవారు. కుమార్తెకు ఈ విషయాలను వినిపిస్తుండేవారు. తండ్రి గోవింద్ర ప్రసాద్ వర్మ భాగల్పూర్లోని కళాశాలలో ఆంగ్లభాషా ప్రొఫెసర్‌గా పనిచేసేవారు.
ఈమెకి తొమ్మిదేళ్ళ వయసులోనే స్వరూప్ నారాయణ వర్మతో వివాహం జరిగింది. అయితే భర్త చదువు పూర్తయ్యేవరకు తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయారు. తరువాత భర్త ఈమెని అంగీకరించలేదు.
అలహాబాద్ లోని క్రాఫ్ట్ వైడ్స్ కాలేజీలో చదివారు. తరువాత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసించారీమె. సంస్కృత భాషలో యం.ఎ.పట్టాని తీసుకున్నారు.
ఈమె బౌద్ధం గురించి క్షుణ్ణంగా చదివారు. బౌద్ధ బిక్షువుగా మారాలని అనుకున్నారు. కాని ఆ కోరికను వదిలారు. సమాజం కోసం కృషి చేయాలనీ, స్త్రీలను జాగృతపరచాలని ఆశించారు. అందుకోసం తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకున్నారు.
అలహాబాద్‌లో ఆడపిల్లల చదువు కోసం స్థాపించిన ‘ప్రయాగ విద్యాపీఠం’లోని రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేశారు. ఇక్కడ ఆడపిల్లలకు సాహిత్య, సాంస్కృతిక రంగాలలోను, సమస్యలను అధిగమించడం కోసం పరిష్కార మార్గాలను వివరించడంలోను వివిధ అంశాలను బోధించేవారు.
ఈమె ఈ విద్యాపీఠంలో అంచెలంచెలుగా ఎదిగి విద్యాపీఠం వైస్ – ఛాన్సలర్ స్థాయికి ఎదిగారు. మహిళలకు ఎదురయ్యే మానసిక, శారీరక వేధింపులను గురించి ఈమెకు మంచి అవగాహన ఉంది.
ఈమె మహిళా విద్యావేత్తగా కంటే మంచి కవయిత్రి, రచయిత్రిగా భారతదేశానికి, ప్రపంచానికి తెలుసు. ఈ ప్రస్థానాన్ని అవలోకిస్తే విద్యార్థిగా ఉన్నప్పుడే వ్రాయడం మొదలు పెట్టారు. ఈమె తన ‘స్మృతిచిత్ర’ (Memory Sketch) లో ఈ విధంగా వ్రాసుకున్నారు.
“కొందరు ఆరుబయట ఆడుకుంటుంటే/నేనూ, సుభద్రాదేవి చౌహన్ ఒక చెట్టు మీద కూర్చుని మా సృజనాత్మకత ఆలోచనలను ఒక దానికొకటి పంచుకునే వాళ్ళం. ఇద్దరము ‘ఖరీబోలి’లో వ్రాసేవాళ్ళం. రోజుకి రెండు పద్యాలూ, కవితలూ వ్రాసేవాళ్ళం” అని చెప్పుకున్నారు.
ఇద్దరు కలిసి జంట కవయిత్రులలా వారపత్రికలకి రచనలు పంపించేవారు. ఇద్దరూ కలిసి కవితా సదస్సులకు హాజరయ్యేవారు. కవితలు చదివేవారు. ప్రముఖ హిందీ కవులను కలిసేవారు. వీరిద్దరి కవితా భాగస్వామ్యం క్రాఫ్ట్ వైట్ నుండి గ్రాడ్యుయేషన్ చదువు వరకు కొనసాగింది.
తన బాల్యపు రోజులను ‘మేరే బచపన్ కే దిన్’ గా వ్రాసుకున్నారు. ఇందులో తన కుటుంబం వంటి ఉదారవాద కుటుంబంలో పుట్టడం తన అదృష్టమని చెప్పుకున్నారు. తల్లి స్వయంగా హిందీ, సంస్కృత భాషలలో పండితురాలని తనకి తొలి గురువు, తన సాహితీ సృజననీ ప్రోత్సహించిన వ్యక్తి అని వ్రాసుకున్నారు.
అందరికీ అర్థమయ్యే రీతిన సరళమైన హిందీ భాషలో సాహిత్యాన్ని వెలయించారు.
ఛాయావాద కవిత్వానికి గల నాలుగు స్తంభాలలో ఈమె ఒకరు. సుమిత్రానందన్ పంత్, కవయిత్రి సూర్యకాంత త్రిపాఠి నిరాలా, జయ శంకర ప్రసాద్‌లు మిగిలిన ముగ్గురు. వీరు నలుగురే హిందీలో ఛాయావాద సాహిత్యంలో ఎక్కువ పేరు పొందారు.
ఈమె కవితా సంకలనాలలో నిహార్, నీలాంబర, నీర్జా, సంధ్యాగీత్, దీపశిఖ, అగ్నిరేఖ, యమ హిందీ సాహిత్యంలో ఈమెను అగ్రస్థానంలో నిలిపాయి.
అతీత్ కే చాల్ చిత్ర, మేరా పరివార్, స్మృతి కీ రేఖాయేం, పథ్ కే సాధీ, శృంఖలాకి కడియాన్, స్కెచెస్ ఫ్రమ్ మై పాస్ట్ వంటి గ్రంథాలు హిందీ వచన సాహిత్యంలో పేరెన్నికగన్నాయి. వీటిలో అనేక సమస్యలు, పరిష్కార మార్గాలను ప్రస్తావించారు.
ఈమె బాలసాహితీకర్తగా కూడా పేరు పొందారు. ‘ఠాకూర్జీ భోలే హై’, ‘ఆజ్ ఖరీదేంగే హమ్ జ్వాలా’ వంటి గ్రంథాలను బాలల కోసం వెలయించారు.
కళలు, సాహిత్యరంగాలను గురించి ‘సాహిత్యకార్ కీ ఆస్తా’ లో ప్రస్తావించి వివరించారు.
‘గౌర’ అనేది ఆమె స్వీయచరిత్రను గురించి తెలియజేస్తుంది. ‘స్కెచెస్ ఫ్రమ్ మై పాస్ట్’ ఈమె బాల్యపు అబ్బురమైన జ్ఞాపకాల స్మృతి కావ్యం.
‘బీబియా కథ’లలో భారతీయ మహిళలకు ఎదురయ్యే మానసిక, శారీరక బాధలు, వేధింపులను గురించిన అంశాలు పాఠకుల మనసులను తడిపేస్తుంది. కళ్ళను చమరింపజేస్తుంది.
1923లో స్థాపించబడిన మహిళా పత్రిక ‘చాంద్’ కి సంపాదకత్వం వహించారు. స్త్రీవాద ఉద్యమ రచనలు, కవితలు, వ్యాసాలను ప్రచురించారు. ఈమె స్వయంగా చిత్రకారిణి కాబట్టి చిత్రాలను కూడా చిత్రించి ముద్రించేవారు.
1955లో అలహాబాద్‌లో ‘సాహిత్య పార్లమెంటు’ను స్థాపించారు. దీనికి సంబంధించిన చర్చలు, ఉపన్యాసాలు వంటి వాటిని క్రోడీకరించి ఇలచంద్రజోషి సహాయంతో గ్రంథ రూపంలో వెలయించారు.
నైనిటాల్ సమీపంలో రామ్‌ఘర్‌కు చెందిన ఉమాఘర్ గ్రామంలో ఒక ఇంటిని నిర్మించుకున్నారు. దీనికి ‘మీరా టెంపుల్’ అని పేరు పెట్టుకున్నారు. ఆ ఊరి ప్రజల అభివృద్ధి, విద్యకోసం చాల కృషి చేశారీమె. ప్రస్తుతం ‘మహదేవీవర్మ మ్యూజియం’ గా విలసిల్లుతుంది.
1983లో ఢిల్లీలోని ‘3వ ప్రపంచ హిందీ సదస్సు’కి ఈమె ముఖ్యఅతిథిగా హాజరయి దిశానిర్దేశం చేశారు. సామాన్యుల పట్ల కరుణ, దయలను కలిగి ఉండాలని, స్త్రీల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈమె సాహితీ సేవలకు గాను అనేక పురస్కారాలను పొందారు. 1956లో పద్మభూషణ్ పురస్కారాన్ని, 1979లో సాహితీ అకాడమీ పురస్కారాన్ని పొందారు. సక్సారియా బహుమతిని కూడా పొందారు ఈమె. సాహితీ అకాడమీ పురస్కారాన్ని పొంది తొలి మహిళ ఈమె! 1982లో ఈమె సృజించిన ‘యమ’ కవితా సంకలనాలకు గాను భారతదేశంలో సాహితీరంగానికి చెందిన అత్యున్నత పురస్కారం ‘జ్ఞాన్‌పీఠ్’ ను పొందారు. 1988లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఈమెకు బహూకరించింది.
ఈమె జీవితంలో సింహభాగం రాయడం, చదవడం, ఎడిట్ చేయడం, మహిళా విద్య కోసం కృషిచేశారు. మహిళల సమస్యలను ప్రస్తావించే రచనలను చేసి పాఠకులకు అందించారు. ముఖ్యంగా గద్యరచనలలో మహిళా సమస్యల ప్రస్తావన కనిపిస్తుంది.
ఈమె కొంత కాలం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఖాదీ దుస్తులనే ధరించారు. ఈమె 1987 సెప్టెంబర్ 11వ తేదీన ఆళ్వార్‌లో మరణించారు. ఈమె జ్ఞాపకార్థం ది 16-09-1991వ తేదీన 2 రూపాయల విలువగల స్టాంపును విడుదల చేసింది.


జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీత, ఛాయావాద ప్రక్రియకు చెందిన మరోమూలస్తంభం శ్రీ జయశంకర్ ప్రసాద్ స్టాంపుతో కలిసి se-te-nent గా విడుదలయింది.


ఈమె జయంతి మార్చి 26వ తేదీ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

5 Comments
P.Usha Rani
Aadhunika meera “Maha Devi Verma gari gurinchi entho baga rasaarumadam….


కొల్లూరి సోమ శంకర్
మహాదేవి వర్మ గారి గురించి మీరు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. మొదటి పేరాలో ఆమె గొప్పదనాన్ని తెలియజేశారు. ఇంక మాటలు లేవు.ఇలాంటి మాహానుభావుల జీవితాల్ని మాముందు ఉంచుతున్న మీరు ధన్యులు.
వి. జయవేణి
కొల్లూరి సోమ శంకర్
Madam, in nutshell you have clearly, precisely narrated about a great poetess. Your work is laudable. You are making people like me to know about great women personalities of this nation. I pray God to give strength to do much more service in this field.





నిర్మల జ్యోతి, తిరుపతి
కొల్లూరి సోమ శంకర్
మహాదేవి వర్మ గొప్పరచయిత్రి.ఈమె రచనల్ని ప్రజాశక్తివాళ్లు ప్రచురించారు.వాటిలో చాలా రచనల్ని మాగురువుగారూ గొప్పమార్క్సిస్ట్ ఏ.జి.ఎతిరాజులుగారు అనువదించారు.మీ వ్యాసం చాలా బాగుంది.ధన్యవాదాలు
డా. వి. ఆర్. రాసాని, తిరుపతి
Jhansi Lakshmi
మహాదేవివర్మ గారి గురించి మీరు అందించిన వ్యాసం చాలా బాగుంది..
బాల కవయిత్రి,రచయిత్రి, పత్రికా సంపాదకురాలు,స్త్రీ సమస్యల పట్ల సానుభూతి కలిగిన చైతన్యశీలి జీవిత చరిత్ర మీరు పరిచయం చెయ్యకపోతే తెలిసి ఉండేది కాదు… ఇప్పటి ప్రజల్లో ఆ చైతన్యం లోపించింది.. అందించిన మీకు ధన్యవాదాలు