మార్చి 20 వ తేదీ రామ్‌ఘర్ రాణి రాణి అవంతీబాయి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
సుమారు 160 సంవత్సరాల క్రితమే అందరూ సమైక్యంగా పోరాడితేగాని బ్రిటిష్ వారిని తరిమికొట్టలేమని భావించి, ఆ పని చేసి చూపించి సమైక్యంగా బ్రిటిష్ వారితో యుద్ధం చేసి, తొలి విజయాన్ని సాధించినా, బ్రిటిష్ సైనిక బలం ముందు మోకరిల్లడం ఇష్టంలేక, ఆత్మాహుతి చేసుకున్న రాణి ‘రామ్‌ఘర్ రాణి రాణి అవంతీబాయి’.
వీరు 1831వ సంవత్సరం ఆగష్టు 16వ తేదీన ఒక జమిందారీ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి (Jujhar Singh) జుఝార్ సింగ్. బాల్యం నుండి కత్తిసాము, కర్రసాము, విలువిద్య, గుర్రపు స్వారీలను అభ్యసించారు. యుద్ధవిద్యలు, యుద్ధవ్యూహలలో నైపుణ్యాన్ని సంపాదించారు.
జమిందారీ బిడ్డ కదా! జమిందారీ నిర్వహణకు ఉపయోగపడతాయనుకుంటే, కూతురు రాణి అవుతుందని యుద్ధం చేసి ప్రాణ త్యాగం చేస్తుందని ఊహించి ఉండరాయన. అనుకోనివి జరగడమే జీవితం కదా!
1849 వ సంవత్సరంలో రామ్‌ఘర్ (నేటి మధ్యప్రదేశ్ లోని లోథీ ప్రాంతం) యువరాజు విక్రమాదిత్యలోథి (సింగ్)తో వీరి వివాహం జరిగింది. వీరికి అమన్‌సింగ్, షేర్సింగ్ అనే ఇద్దరు కుమారులు. వీరు మైనర్లు. రాజా విక్రమాదిత్యసింగ్ పరిపాలన గురించి పట్టించుకునేవారు కాదు. తరువాత అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు అవంతీబాబు రాజ్యపరిపాలనా బాధ్యతలను స్వీకరించారు. అయితే అప్పటి తూర్పు ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. స్త్రీలకు, మైనర్లకు, దత్తపుత్రులకు రాజ్యపరిపాలనాధికారం ఉండదు. ఆ రాజ్యాలను కంపెనీ సామ్రాజ్యానికి కలుపుకుంటారు.
దీని ప్రకారం 1851 సెప్టెంబర్ 13వ తేదీన ‘కోర్ట్ ఆఫ్ వార్డ్స్’ (Court of wards) ను ప్రకటించింది కంపెనీ ప్రభుత్వం. షేక్ మహమ్మద్ అనే వ్యక్తిని రామ్‌ఘర్‌లో తన ప్రతినిధిగా నియమించింది.
రాణి అవంతీబాయి ఆ ప్రతినిధిని ధిక్కరించి స్వయం పరిపాలనను కొనసాగించారు. 1857లో విక్రమాదిత్య సింగ్ మరణించారు.
అప్పటికి మీరట్‌లో ప్రథమ స్వాతంత్ర్య పోరాటం మొదలయింది. బ్రిటిష్ కంపెనీ ప్రభుత్వాన్ని ఎదిరించే రాజ్యాలు ఎక్కువవుతున్నాయి.
రాణి అవంతీబాయి దూరదృష్టి గలవారు. ఒంటరిగా యుద్ధం చేసి పోరాడడం కంటే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఐకమత్యంగా ఉండడమే ఏకైక మార్గమని అవగాహన చేసుకున్నారు. రాజ్యాలను ఏకం చేయడం కోసం ప్రణాళికను అమలు చేశారామె.
‘మీకు మీ దేశం పట్ల విధేయత లేదా గౌరవం ఏమైనా ఉంటే, అప్పుడు ఆయుధాలు తీసుకుని పోరాడండి. లేకపోతే ఈ గాజులు ధరించి ఇంట్లో కూర్చోండి’ అని చుట్టుప్రక్కల రాజులకు లేఖలు వ్రాశారు. సందేశం సత్ఫలితాలను అందించింది. రాజులు ఒక సవాల్‌గా తీసుకున్నారు. అందరూ అవంతీబాయికి అండగా నిలిచారు. 4000 మంది సైన్యాన్ని కూడగట్టారు.
మాండ్లా సమీపంలోని ఖేరీ గ్రామం వద్ద బ్రిటిష్ కంపెనీ సైన్యంతో తలపడ్డారు. స్వతహాగా అవంతీబాయి మంచి యుద్ధవ్యూహకర్త. అందరి సహకారం, యుద్ధవ్యూహాలు, యుద్ధ చతురత, నైపుణ్యాలతో బ్రిటిష్ వారి మీద తొలి విజయం సాధించారు. బ్రిటిష్ కమాండర్ వాడింగ్టన్ అహం దెబ్బతింది. ముఖ్యంగా ఒక మహిళ చేతిలో పరాజయాన్ని తట్టుకోలేకపోయారు.
తిరిగి వాడింగ్టన్ సైన్యం రామ్‌ఘర్ మీద దండెత్తింది. అవంతీబాయి గెరిల్లాల సహాయాన్ని కోరారు. దేవగిరి సమీపంలోని కొండలు, అడవులలోకి పారిపోయారు. కొండ చుట్టు బ్రిటిష్ సైన్యం మోహరించింది. ఆ ప్రాంతంలో నిప్పు ముట్టించారు ఆ దుండగులు. బలమైన బ్రిటీష్ సైన్యం ముందు రాణి అవంతీబాయి సైన్యం నిలువలేకపోయింది.
పైగా కొన్ని ఉత్తర భారత రాజ్యాలు బ్రిటిష్ వారికి అండగా నిలిచాయి. రేవా రాజు బ్రిటీష్ వారికి సహాయం చేశారు. ఇక లొంగిపోక తప్పని పరిస్థితి ఎదురయింది రాణి గారికి.
ఉమ్రావ్ సింగ్‌తో “సోదరా! శత్రువుల చేతికి చిక్కడం కంటే ఆత్మాహుతి మంచిది” అని చెప్పారావిడ. “నన్ను చావనివ్వండి” అని అన్నారు. అందుకు సమాధానంగా ముందుగా నేనూ ఆత్మాహుతి చేసుకుంటాను అన్నారు ఉమ్రావ్ సింగ్.
వెంటనే ఉమ్రావ్ కత్తి దూసి బ్రిటీష్ సైనికులని పశువులను వెంటాడినట్లు వెంటాడారు. సుదూరంగా వెళ్ళిపోయారు. 1858 మార్చి 20వ తేదీన వాడింగ్టన్ రాణి అవంతీబాయిని సమీపించారు. ఆవిడ గుర్రం మీద నుంచి దూకి కత్తితో పొడుచుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. వాడింగ్టన్ ఆమెకి వందనం చేసి ఆమెకి సహాయం చేస్తున్న వారి గురించి చెప్పమని అడిగారు.
“నాకు ఎవరూ లేరు. ఈ యుద్దానికి బాధ్యురాలిని నేను మాత్రమే” అని చెప్పి ‘హరి ఓం’ అంటూ ప్రాణాలు వదిలారు. నిజమయిన వీరులు శత్రువుల చేతికి తమ పార్థివ దేహం చిక్కడానికి కూడా ఇష్టపడరు కదా !
మాండ్లా ప్రాంతం 1857 డిశంబరు నుండి 1858 ఫిబ్రవరి వరకు వీరి ఆధీనంలో ఉంది.
వీరి పరిపాలనా కాలం కొద్దికాలమే అయినా ప్రజారంజకంగా పరిపాలించారు. మహిళల సమస్యలు తెలుసు కాబట్టి వారి పట్ల అభిమానంగా ఉండేవారు.
ప్రజల పట్ల వీరు చూపించిన కరుణ, దయ, క్షమా గుణాలు వీరిని ప్రజలకు దగ్గర చేశాయి.
ఈ విధంగా రాజులందరినీ ఏకం చేసి, దేశద్రోహుల మోసానికి గురై, బ్రిటీష్ వారికి దొరికినా – ఆత్మాహుతి చేసుకుని దేశభక్తిని నిరూపించుకున్నవారు రాణి అవంతీబాయి.
వీరి జ్ఞాపకార్థం 1988 మార్చి 20 వ తేదీన 130వ వర్ధంతి సందర్భంగా 60 పైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. ది.19-09-2001 వ తేదీన 4 రూపాయల విలువతో మరొక స్టాంపును విడుదల చేసింది. ఈ విధంగా నివాళిని అర్పించింది భారత ప్రభుత్వం.


వీరి వర్థంతి మార్చి 20 వ తేదీ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

9 Comments
ఝాన్సీ లక్ష్మి
ఎక్కడ నుంచి సేకరిస్తున్నారు మేడం ఇంత అధ్బుతమైన వనితల జీవిత కథలు..ఎంతో స్ఫూర్తివంతమైన జీవితాలు వారివి.. రాణి అవంతిబాయి కు మీకు ఇద్దరికీ kudos
నరహరిశెట్టి ప్రసాద్
స్టాంపులు లోని వ్యక్తులకు లేదా చిత్రములకు సంబంధించిన చరిత్ర చెప్పుటలో నాగలక్ష్మి గారు దిట్ట. ఆవిడ దగ్గర వున్న స్టాంపులన్నింటి చరిత్రలను ముద్రిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. నాగలక్ష్మి గారు ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది.అభినందనీయురాలు.
కొల్లూరి సోమ శంకర్
అవంతీబాయి కథ బాగుంది.ఎక్కడినుంచీ సేకరించారమ్మా
రాసాని
కొల్లూరి సోమ శంకర్
She was a great lady..her determination to win the British with the other kings shows how she could muster strength. However, Britishers’ jackal tricks made Raani lose battle and eventually she gave up life. History has so many woman warriors we knew who struggled hard to drive tge enemy away.
Great article. Thank you for sharing. Regards.
A. Raghavendra Rao, HYD.
కొల్లూరి సోమ శంకర్
Madam excellent ga vunde avanthibai





K. Anuradha, Gudivada
ఉషారాణి పొలుకొండ
ఇంత బిజీ లైఫ్ లో పుస్తకాలు చదివే తీరిక లేనందుకు చింతిస్తున్నవారికి …. గొప్ప గొప్ప మహిళల జీవిత చరిత్రలు ఎంతో కష్టపడి సేకరించి మాకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు మేడం…మీ రచనలు చడవగలగడం మా అదృష్టం మేడం..






రాణి అవంతీ బాయి గారి గురించి కూడా చాల చాలా బాగా రాసారు ..మేడం
కొల్లూరి సోమ శంకర్
రాణీ అవంతీ గారి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. ఎలాంటి ఆణిముత్యాల త్యాగ సమాహారమే మన ఈ స్వేచ్ఛా భారతం.
జయవేణి, గుడివాడ
కొల్లూరి సోమ శంకర్
రాణి అవంతీబాయి దేశభక్తి, ఐకమత్యం, త్యాగం చాలా గొప్పవి అని తెలియజేశారు… ధన్యవాదాలు …
ఎ. శ్రీవల్లి, అంకలేశ్వర్
gdkyyprml@gmail.com
పరాయిపాలన లో బానిసత్వం అంగీకరించని ఆత్మాభిమానం గల అసమాన త్యాగమూర్తి రాణీ అవంతీబాయి గురించి వ్యాసం ద్వారా మాకందించిన పుట్టి నాగలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదములు.