మార్చి 23వ తేదీ శ్రీమతి సుభద్రాజోషి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ఆమె నిరంతర స్ఫూర్తి ప్రదాత. స్వాతంత్ర్యం రావడానికి ముందు, వచ్చిన తరువాత దేశానికి వివిధ రంగాలలో సేవలందించిన సంఘసంస్కర్త, సామాజిక సేవకురాలు, రాజకీయ నాయకురాలు, అన్నింటికీ మించి అసలు, సిసలు లౌకికవాది.
అణగారిన వర్గాల వారి కోసం, నిరాశ్రయులైన అభాగ్య మహిళల కోసం పాటు పడిన మహిళా నాయకురాలు ఆమె.
మహానేత స్వర్గీయ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయిని రెండు సార్లు లోకసభ ఎన్నికలలో ఓడించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు. స్వర్గీయ మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత కాంగ్రెస్‌కు దూరమయిన నాయకురాలు, మతసామరస్యం కోసం అహర్నిశలు శ్రమించిన శాంతికాముకురాలు సుభద్రా జోషి.
ఈమె 1919 సంవత్సరం మార్చి 23 వ తేదీన నాటి బ్రిటిష్ ఇండియా (నేటి పాకిస్తాన్) లోని సియాల్ కోటలో జన్మించారు.
ఈమె తండ్రి విశ్వేశ్వర్నాథ్ దత్ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంటులో అత్యున్నత పోలీసు అధికారిగా పని చేసేవారు. జయపూర్‌లో విధులను నిర్వహించేవారు ఆయన.
జయపూర్ మహారాజా వారి పాఠశాల లోను లాహోర్‌లోని లేడీ మాక్లెగాన్ ఉన్నత పాఠశాలలోను, జలంధర్ లోని మహా విద్యాలయం లోను పాఠశాల స్థాయి చదువును పూర్తి చేశారు. లాహోర్ లోని ‘ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజ్’ లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత అక్కడే రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాని తీసుకున్న ఉన్నత విద్యాధికురాలు ఆమె.
విద్యార్థినిగా ఉన్నప్పుడే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. లాహోర్ మహిళా సెంట్రల్ జైలులో శిక్షని అనుభవించారు.
1942లో గాంధీజీ పిలుపును అందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ‘క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా అరుణా అసఫాలీ’ ఆధ్వర్యంలో ఉద్యమకారిణిగా కృషి చేశారు.
గాంధీజీ ఆశయ సిద్ధాంతాలకి అనుగుణంగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వార్ధా ఆశ్రమంలో ఆశ్రమవాసినిగా గడిపారు. ఆశ్రమవాసులకు సేవా కార్యక్రమములలో శిక్షణను ఇచ్చేవారు. స్వాతంత్రోద్యమ అవసరాలను గురించి చర్చించేవారు.
‘హమారా సంగ్రామ్’ అనే పత్రికను అజ్ఞాతంలో ఉండి నడిపారు. మనదేశ జాతీయోద్యమం, పోరాట యోధులు, ఆశయాలు, వివిధ రకముల ఉద్యమాలను గురించిన ఎన్నో అంశాలను పొందుపరిచి నడపడం ద్వారా ఉద్యమమును ముందుకు తీసుకుని వెళ్ళారు.
ఆ తరువాత తన కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మార్చుకున్నారు. పారిశ్రామిక శ్రామికులు నివసించే ప్రాంతాలకు వెళ్ళారు. వారి అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేశారు. వారి పిల్లలకు, పెద్దలకు పాఠాలు చెప్పడం కోసం పాఠశాలలను నెలకొల్పారు. పారిశ్రామిక వేత్తలకు, కార్మికులకు మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొల్పడానికి కృషి చేశారు.
దేశవిభజన ప్రకటన ఈమెని కూడా మానసిక వేదనకి గురిచేసింది. భారత్ నుండి ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతపు ముస్లింలు పాకిస్థాన్‌కు తరలి వెళ్ళకుండా కృషి సలిపారు.
1946వ సంవత్సరంలో ఢిల్లీలో మతకల్లోలాలు చెలరేగాయి. చాలా సంయమనంతో వ్యవహరించవలసిన సమయం. ఈమె ఈ పరిస్థితులలో మత సహనాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. మత సామరస్యపు అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
ఈమె తను చేస్తున్న కృషిని గురించి గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూలకు ఎప్పటికప్పుడు నివేదికలను అందించేవారు. బిర్లా హౌస్‌లో బాపూజీని కలిసి పరిస్థితులను గురించి చర్చించేవారు. కొన్నిసార్లు హిందూ, ముస్లింల మరణాలు సంభవించినప్పుడు బాపూజీ ఆమెను నిందించేవారు. తరువాత ఆమె ప్రయత్నాలను గమనించి ప్రశంసించేవారు. ఈమె (DPCC) ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పని చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ విజయాల కోసం కృషి సలిపారు.
దేశవిభజన జరిగినప్పుడు శాంతిని నెలకొల్పడం కోసం ‘శాంతిదళ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మతకల్లోలాలలో నష్టపోయిన ప్రజలకు సహాయ, సహకారాలను అందించేందుకు కృషి చేశారు. అవసరమయిన ఆర్థిక సాయాన్ని, వైద్యసహాయాన్ని అందించేవారు. నిరుపేదలకు ఎల్లవేళలా అండగా నిలిచారు.
పాకిస్తాన్ నుండి మన దేశానికి వచ్చిన వారికి పునరావాసం కల్పించేందుకు కృషి చేశారు. మన దేశం నుండి పాకిస్తాన్‌కు బలవంతపు ముస్లింల తరలింపును ఆపడం కోసం తన శాయశక్తులా ప్రయత్నం చేశారు.
“శాంతికి భగ్నం కలిగినట్లు వార్తలు అందినపుడు హుటాహుటిన వివిధ గ్రామాలకు తరలి వెళ్ళి యుద్ధప్రాతిపదిక మీద అవసరమైన సహాయక చర్యలను చేపట్టేవారు. ఈ విధంగా శాంతి స్థాపన కోసం ఈమె చేసిన కృషి ఎనలేనిది.” అని తన ‘ఇన్ ఫ్రీడమ్స్ షేడ్’ గ్రంథంలో ఈమెని ప్రశంసించారు అనిస్ కిద్వాయ్.
తను దేశవిభన సమయంలో మత సామరస్యాన్ని కొనసాగించడం కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ దిశగా చేపట్టిన కార్యక్రమాలను గురించి 1988లో సాగరి ఛబ్రాతో జరిగిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 4 సార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1952లో కర్నాల్ నుంచి, 1957లో అంబాలా నుండి ఎన్నికలలో గెలిచారు.
ఈమె లోక్‌సభ ఎన్నికలలో రికార్డులను సృష్టించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయ్‌ని రెండు సార్లు ఓడించిన గొప్ప నాయకురాలు సుభద్రా జోషి. దీనిని బట్టి ప్రజలకు ఈమె పట్ల గల అభిమానం తెలుస్తుంది. 1962 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ నియోజకవర్గంలో సుభద్రా చేతిలో వాజ్ పేయి ఓడిపోవడం చారిత్రక విశేషం.
ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రత్యేక వివాహ చట్టం, ఇంకా బ్యాంకుల జాతీయీకరణ, రాజ్యభరణాల రద్దు, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సవరణ) బిల్లు, ఆలీఘర్ విశ్వవిద్యాలయ సవరణ చట్టం వంటి అనేక బిల్లులు చట్టాలుగా రూపొందడానికి ఈమె చేసిన కృషి అనుపమానం.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా పలుమార్లు మతకల్లోలాలు జరిగాయి. ఆయా సందర్భాలలో ఈమె ముందుండి మత సామరస్యం కోసం చర్యలను చేపట్టారు.
1961లో దేశంలో ఉవ్వెత్తున మతకల్లోలాలు జరిగాయి. ఈమె మధ్య ప్రదేశ్ లోని సాగర్‌లో కొంతకాలం ఉండి పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఉమ్మడి మత వ్యతిరేక రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ‘సంప్రదాయిక్త వ్యతిరేక కమిటీ’ని స్థాపించారు.
దీనికి కొనసాగింపుగా మతపరంగా సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పి, ప్రశాంత వాతావరణాన్ని కల్పించేటందుకుగాను ‘క్వామి ఏక్తా ట్రస్ట్’ ను స్థాపించారు.
ఈమె లౌకికవాదినని కబుర్లతో కాలం వెళ్ళబుచ్చలేదు. చేతలతో చూపించారు. 1968లో ‘సెక్యులర్ డెమోక్రసీ’ అనే పత్రికని కూడా స్థాపించారు. ఈ పత్రిక ద్వారా లౌకికవాద భావాలను, మతసహనం యొక్క ప్రాముఖ్యత తెలియజేసే విషయాలను ప్రచురించేవారు.
1984లో స్వర్గీయ ఇందిరాగాంధీ హత్య సందర్భంగా జరిగిన అల్లర్లకు కూడా ఈమె కలత చెందారు. మతకల్లోలాలలో వేలాదిమంది మరణించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆనాటి సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించారామె. శాంతిని నెలకొల్పి కల్లోలాలను మాపడానికి ఈమె చేసిన కృషి పలువురి చేత కొనియాడబడింది.
జబల్పూర్, అహమ్మదాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో మతపరమైన అల్లర్లు జరిగేవి. వాటిని పరిష్కరించడం కోసం ఈమె చేసిన కృషి శ్లాఘనీయం.
దేశంలో విభిన్న పరిస్థితులు, వివిధ సమయాలలో ఈమె శాంతి సామరస్యాలు, లౌకిక పరిస్థితులను నెలకొల్పేటందుకు చాలా కృషి చేశారు. కుల, మత, లింగ, వర్గ, ప్రాంతాలకు అతీతంగా ఈమె అందరినీ కలుపుకుని తన లక్ష్యాలని సాధించగలిగారు.
ప్రజలలో చైతన్యాన్ని తీసుకుని రావడానికి, జాతిని జాగృతపరచడానికి ఈమె పలుచర్యలను చేపట్టారు.
జాతీయ సమైక్యత, సాంస్కృతిక సహజీవనం, లౌకిక వాదం, పునరుజ్జీవనం, మతసామరస్యం వంటి వాటిని ప్రజలలోకి తీసుకుని వెళ్ళడానికి సెమినార్లు, వర్క్‌షాపులు, చర్చా కార్యక్రమాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారు. దేశం మొత్తం మీద అవసరమయిన ప్రదేశాలలో వందలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ విధంగా గొప్ప సామాజిక కార్యకర్తగా నిలిచారు.
ఈమె వివిధ అసంఘటిత రంగాలలోని శ్రామికుల, కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించడంలో ముఖ్యపాత్రను నిర్వహించారు.
ధరల నియంత్రణ, ఆహారధాన్యాల పంపిణీ, సహకారసంఘాల ఏర్పాటు, వివిధ వృత్తి పని వారి కోసం సహాయక సంఘాల ఏర్పాటులో ప్రముఖ పాత్రను నిర్వహించారు.
దివ్యాంగులు మూగ, చెవిటి, అంధ, బధిరుల సంక్షేమం కోసం సంస్థలను రూపొందించడంలో కృషి చేశారు.
ఢిల్లీ లోని మహిళల సంక్షేమం కోసం ‘ఢిల్లీ మహిళా సమాజ్ ట్రస్ట్’ను ప్రారంభించారు. అనాథ బాలికలు, నిరాశ్రయ స్త్రీలకు ఆశ్రయం, పని కల్పించడం కోసం ఈ సంస్థ కార్యకలాపాలను నిర్వహించింది.
1977లో ప్రధాని ఇందిర అత్యవసర పరిస్థితులను విధించారు. ఈ సమయంలో జరిగిన విపరీత పరిణామాలు, కొందరు రాజకీయ నాయకులు అనుసరించిన అనైతిక కార్యకలాపాలు, ప్రజలను వివిధ రకాలుగా భయభ్రాంతులను చేయడం ఈమెకు నచ్చలేదు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
రాజకీయాలకు దూరమైనా సామాజిక సేవకు, మతసామరస్య కార్యకలాపాలకి దూరం కాలేదు.
1984లో శ్రీమతి ఇందిరా గాంధీ హత్య తరువాత ఢిల్లీలోను, ఇతర ప్రాంతాలలోను జరిగిన పరిణామాలకు చలించిపోయారు. కొన్ని సహాయక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఆ తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారు. తన అనుచరుల ద్వారా సేవా కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈనాటికీ ఆమె లేకపోయినా ఆమె నెలకొల్పిన సంస్థలు పని చేస్తూ ఆమె ఉనికిని కాపాడుతూనే ఉంటాయి.
ఈమె 2003 అక్టోబర్ 29వ తేదీన తన కార్యక్రమాలను, లౌకికవాదాన్ని తన అనుచురులకు వదిలిపెట్టి, ఢిల్లీలోని రామ మనోహర్ లోహియా హాస్పిటల్లో మరణించారు.
ది 2011 మార్చి 23 తేదీన ఈమె జ్ఞాపకార్థం 5 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. మేలిముసుగులో ఉన్న సుభద్రాజోషితో పాటు, చుట్టూ మేలిముసుగు లోని మహిళల చిత్రాలను ఈ స్టాంపు మీద ముద్రించి, మహిళలతో ఆమె అనుబంధాన్ని గుర్తించి గౌరవించిన భారత తపాలాశాఖ అభినందనీయం.


మార్చి 23 వ తేదీన ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

4 Comments
P.Usha Rani
Subhadhra Joshi gari gurinchi kottagaa telusukuntunna madam….oka spoorthi dayaka mahilamani ni parichayam chesinanduku meeku dhanyavaadamulu…

Alluri Gouri Lakshmi
లౌకిక వాదానికి అచ్చమైన ఉదాహరణ సుభద్రా జోషి..అంతటి త్యాగనిరతి కలిగి ప్రజాభిమానం పొందిన ..మాకు తెలియని ఈమె గురించి చక్కగా తెలియచేసిన నాగలక్ష్మి కి అభినందనలు.
కొల్లూరి సోమ శంకర్
సుభద్రా జోషి గారి గురించి చాలా విపులంగా వివరించారు. ధన్యవాదములు
వి. జయవేణి
కొల్లూరి సోమ శంకర్
Subhadra Joshi gurinchi baagaa visadeekarinchi raasaavu. Chaalabaaundi. Abhinandanalu.
A. Raghavendra Rao