శార్ఙ్గరవ, శార్ఙ్గరవ!
(ప్రవిశ్య)
ఉపాధ్యాయ, ఆజ్ఞాపయ!
(ప్రవిశ్య=ప్రవేశించి), ఉపాధ్యాయ=గురువుగారూ, ఆజ్ఞాపయ=ఆదేశించండి.
కి మేష కలకలః?
ఏష కలకలః+కిమ్= ఆ సందడి ఏమిటి?
(విభావ్య) ఉపాధ్యాయ, ఏష ఖలు శకట దాసం వధ్యమానం వధ్యభూమే రాదాయ సమపక్రాన్తః సిద్ధార్థకః॥
(విభావ్య=పరికించి చూసి), (పరులెవరూ లేరని గమనించుకుని), ఉపాధ్యాయ=గురుదేవా! ఏష+ఖలు+వధ్యమానం+శకటదాసం=ఇదేమిటంటే, మరణశిక్ష పడిన శకటదాసును, వధ్యభూమేః+ఆదాయ=శ్మశానం నుంచి తీసుకువచ్చి, సిద్ధార్థకః=సిద్ధార్థకుడు, సం+అపక్రాన్తః=కనుమరుగయ్యాడు (పారిపోయాడు).
(స్వగతమ్) సాధుసిద్ధార్థక, కృతః కార్యారమ్భః (ప్రకాశమ్) ప్రసహ్య కి మపక్రాన్తః? (సక్రోధమ్) వత్స, ఉచ్యతాం భాగురాయణో యథా త్వరితం సంభావయేతి॥
(స్వగతమ్=తనలో), సాధు=భేషు! సిద్ధార్థక!, కార్యారమ్భః+కృతః=పని మొదలైంది (మొదలుపెట్టబడింది), (ప్రకాశమ్=పైకి) ప్రసహ్య+కిమ్+అపక్రాన్తః?=తెగించి పారిపోయాడా? (సక్రోధమ్=కోపంగా) వత్స=నాయనా, ఉచ్యతామ్+భాగురాయణః=భాగురాయణుడితో చెప్పు (చెప్పబడుగాక), యథా=ఏమనంటే, త్వరితం+(ఏనం)+సంభావయ+ఇతి=వెంటనే వాడిని పట్టుకొమ్మని చెప్పు.
(నిష్క్రమ్య ప్రవిశ్య చ) (సవిషాదమ్) ఉపాధ్యాయ, హా ధిక్ కష్టమ్! అపక్రాన్తో భాగురాయణోఽపి॥
(నిష్క్రమ్య=వెళ్ళి, ప్రవిశ్య+చ=తిరిగివచ్చి), (సవిషాదమ్=విచారంగా) ఉపాధ్యాయ=గురువుగారూ, హా! ధిక్ కష్టమ్!=అయ్యయ్యో, కష్టం వచ్చిపడింది, భాగురాయణః+అపి+అపక్రాన్తః=భాగురాయణుడు కూడా చెయ్యిదాటిపోయాడు.
(స్వగతమ్) వ్రజతు. కార్యసిద్ధయే. (ప్రకాశమ్ సక్రోధమివ) వత్స, ఉచ్యన్తా మస్మద్వచనాద్ భద్రభట పురుషదత్త డిఞ్గరాత బలగుప్త రాజసేన రోహితాక్ష విజయవర్మాణః, శీఘ్ర మనుసృత్య గృహ్యతాం దురాత్మా భాగురాయణ, ఇతి॥
(స్వగతమ్=తనలో), కార్యసిద్ధయే=పని జరపడం కోసం, వ్రజతు=వెళ్ళనీ. (ప్రకాశమ్=పైకి, సక్రోధం+ఇవ=కోపంతో అన్నట్లుగా)… వత్స=నాయనా, భద్రభట, పురుషదత్త, డిఞ్గరాత, బలగుప్త, రాజసేన, రోహితాక్ష, విజయవర్మాణః=ఈ పేర్లు గల ఏడుగురినీ, మత్+వచానాత్+ ఉచ్యతామ్= నా మాటగా చెప్పాలి, “దురాత్మా+భాగురాయణః=దుర్మార్గుడైన భాగురాయణుడిని (అతడిని), శీఘ్రం+అనుసృత్య=తొందరగా వెంటాడి, గృహ్యతాం=పట్టుకోవాలి (అతడు పట్టుకోబడాలి)”, ఇతి=అని -.
తథా. (ఇతి నిష్క్రమ్య పునః ప్రవిశ్య సవిషాదమ్) హా ధిక్! కష్టమ్! సర్వ మేవ తన్త్ర మాకులీభూతమ్, తేఽపి ఖలు భద్రభట ప్రభృతయః ప్రథమతర ముష స్యే వాపక్రాన్తాః ॥
తథా=అలాగే -(ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, పునః+ప్రవిశ్య=మళ్ళీ వచ్చి, స+విషాదమ్=విచారంగా), హా ధిక్! కష్టమ్!=అయ్యయ్యో కష్టం వచ్చిపడింది. సర్వం+తంత్రం+ఏవ=మొత్తం మనుగడే, ఆకులీభూతమ్=చెడిపోయింది (చెదిరిపోయింది). తే+భద్రభట ప్రభృతయః+అపి=భద్రభటుడు మొదలైన (ఏడుగురు), ఉషసి+ఏవ=తెల్లవారుతుండగానే, ప్రథమతరం+ అపక్రాన్తః+ఖలు=మొదటనే పారిపోయారే!
(స్వగతమ్) సర్వథా శివాః సన్తు పన్థానః। (ప్రకాశమ్) వత్స, అలం విషాదేన. పశ్య.
(స్వగతమ్=తనలో), సర్వథా=అన్ని విధాలా, (తే)+పన్థానః=వారి దారులు, శివాః+సన్తు=శుభకారకాలు అగుగాక! (ప్రకాశమ్=పైకి), అలం+విషాదేన=విచారించకు. పశ్య=చూడు, వత్స=నాయనా.
యే యాతాః కి మపి ప్రధార్య హృదయే పూర్వం, గతా ఏవ తే; యే తిష్ఠన్తి భవన్తు తేఽపి గమ నే కామం ప్రకామోద్యమాః ; ఏకా కేవల మేవ సాధనవిధౌ సేనా శతేభ్యోఽధికా నన్దోన్మూలన దృష్టవీర్య మహిమా బుద్ధి స్తు మాగా న్మమ. 26
యే=ఎవరైతే, పూర్వమ్=ఇంతకు ముందే, కిమ్+అపి+హృదయే+ప్రధార్య=మనస్సులో ఏదో పెట్టుకుని, యాతాః=వెళ్ళిపోయారో, తే=వారు, గతాః+ఏవ=విడిచి వెళ్ళిపోయినట్టే! యే=ఎవరైతే, తిష్ఠన్తి=ఉన్నారో, తే+అపి=వారు కూడా, గమనే=వెళ్ళిపోవడం విషయమై, ప్రకామ+ఉద్యమాః=గట్టిగా ప్రయత్నిస్తున్నవారే, కామం=మిక్కిలిగా, భవన్తు=ఉండనీ – ఏకా+కేవలం+ఏవ=ఒకే ఒక్కటి మాత్రమే, మమ+బుద్ధిః=నా బుద్ధి (ఆలోచన), సాధన+విధౌ= కార్యసాధన విషయమై, సేనా+శతేభ్యః+అధికా=నూరు సైన్యాల కంటే ఎక్కువ, నన్ద+ఉన్మూలన+దృష్ట+వీర్య+మహిమాః=నందవంశాన్ని రూపుమాపడంలో ఋజువైన సామర్థ్యం, మా+ఆగాత్=విడిచిపోకుండుగాక.
శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.
కావ్యలింగాలంకారం. ఎవరు వెళ్ళినా వెళ్ళనీ – నందుల్ని నిర్మూలించిన నా బుద్ధి కౌశలం పోకుండా ఉంటే చాలు – అన్న సమర్థన కారణం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం)
పోయిన వాళ్ళనీ పోనీ – పోదలుచుకున్నవాళ్ళనీ ప్రయత్నించుకోనీ – నా బుద్ధి బాగుంటే చాలు అని చాణక్యుడి ధీమా – నిజానికి ఈ ‘పారిపోవడాలు’ కూడా మన పన్నుగడలో భాగమేరా నాయానా – అని శిష్యుణ్ణి సేదదీర్చడం ఇక్కడ వ్యంగ్యం.
(ఉత్థాయ) ఏష దురాత్మనో భద్రభటప్రభృతీ నాహరామి। (ప్రత్యక్షవత్ ఆకాశే లక్ష్యం బధ్వా, ఆత్మగతమ్) దురాత్మన్, రాక్షస, క్వేదానీం గమిష్యసి? ఏషోఽహ మచిరాత్ భవన్తమ్…
(ఉత్థాయ=తాను కూర్చున్న చోటు నుంచి లేచి) ఏషః+భద్రభట+ప్రభృతీన్=ఈ భద్రభటాదుల్ని, అహరామి=తిరిగి పట్టుకువస్తాను.(ప్రత్యక్షవత్=ఎదుట ఉన్నట్లుగా, ఆకాశే=ఆకాశంలో, లక్ష్యం+బధ్వా=దృష్టి నిలిపి, ఆత్మగతమ్=తనలో) దురాత్మన్=దుర్మార్గుడా!, రాక్షస=రాక్షసమంత్రీ!, ఇదానీం=ఇప్పుడు (నా ఉచ్చులో పడ్డాకా), క్వ+గమిష్యసి?=ఎక్కడకు పోగలవు? ఏషః+అహం=ఇదిగో యీ నేను, భవన్తమ్=నిన్ను, అచిరాత్=తొందరలోనే…
స్వచ్ఛన్ద మేక చర ముజ్జ్వలదానశక్తి ముత్సేకినా మదజలేన విగాహ్యమానమ్ బుద్ధ్యా నిగృహ్య వృషలస్య కృతే క్రియాయా మారణ్యకం గజ మివ ప్రగుణీ కరోమి. – 27
స్వచ్ఛందం=తన యిష్టానుసారం, ఏక+చరం=ఒంటరిగా తిరిగే, ఉజ్జ్వలదానశక్తిమ్=అధిక బలం గల, ఉత్సేకినా=ఉరకలు వేస్తున్న (ఉప్పొంగుతున్న), మదజలేన+విగాహ్యమానమ్=మదజలంతో మునిగితేలుతున్న (మదమెక్కిన), ఆరణ్యకం+గజం+ఇవ=అడవి ఏనుగు మాదిరిగా (ఉన్న), భవన్తమ్=నిన్ను, బుద్ధ్యా=బుద్ధిబలంతో, నిగృహ్య=నిలువరించి, వృషలస్య+కృతే=చంద్రగుప్తుడి కోసం, క్రియాయా=అవసర కార్యంలో, ప్రగుణీం+కరోమి=వశపరుచుకుంటాను.
మదన వృత్తం. త-భ-జ-జ-గగ – గణాలు.
ఉపమాలంకారం. – మదమెక్కి ఒంటరిగా అడవిలో తిరిగే ఏనుగుకీ, పాటలీపుత్రం నుంచి తప్పించుకుపోయి ఒంటరిగా ఎక్కడో ధైర్యంగా తిరుగుతున్న రాక్షసమంత్రికీ, పోలిక – ‘మదగజ మివ ప్రగుణీమ్ కరోమి’ అని. ‘ఇవ’ అనే పదం ద్వారా సూచించడం కారణం.
(ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని – కువలయానందం).
ఇక్కడ ఉపమానోపమేయాలు ఉపమా వాచకం స్పష్టం.
గుణం అనే పదానికి త్రాడు అనే అర్థం కూడా ఉంది. ‘ప్రగుణీ కరోమి’ అంటే గట్టి తాడుతో బంధిస్తాను (తాడు విసురుతాను) అని అర్థం.
(ఇతి నిష్క్రాన్తాః సర్వే)
(ఇతి=అని, సర్వే=అందరూ (అన్ని పాత్రలు), నిష్క్రాన్తాః=వెళ్ళిపోతారు).
ముద్రారాక్షస నాటకే ముద్రాలాభోనామ
ప్రథమాఙ్కః
ముద్రారాక్షస నాటకే=ముద్రారాక్షసమనే నాటకంలో, ముద్రాలాభః+నామ=’ఉంగరం దొరకడం’ అనే పేరుగల – ప్రథమాఙ్కః=తొలి అంకం ముగిసినది.
(సశేషం)
ప్రియమిత్రులు శ్రీ శ్రీకాంతశర్మ గారికి నమస్కారములతో,
శ్రీ విశాఖదత్తుని ముద్రారాక్షసానికి అందమైన తెలుగు అనువాదంతో మీరు రచిస్తున్న ఈ “శ్రీకాంత” వ్యాఖ్యను నేను చాలా ఆలస్యంగా – ఈరోజే చూచి, వెంటనే ఇప్పటి వరకు ప్రకాశితమైన పర్యంతం పూర్తిగా అన్ని ‘సంచిక’లలోను చదువుకొన్నాను. మీ తెనుగుసేత వల్ల నాటకమంతా ఏ పల్లెటూళ్ళోనో రంగస్థలంపైని ప్రదర్శింపబడుతున్నట్లు కన్నులకు కట్టినట్లుగా ఉన్నది. శ్రీ నేలటూరి వారి వ్యాఖ్యలో ప్రస్తావితములైన తద్గురువులు శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి గారి పాఠాంశాలను మీరు ఉదాహరించటం వల్ల ప్రకరణానికి మరింత సమగ్రత చేకూరినట్లయింది. అనువాదానికి ఏ మాత్రం లొంగని సాంస్కృతికాలను చక్కటి వ్యావహారికపు ఒడుపుతో మీరు ఆంధ్రీకరిస్తున్న తీరు ఎంతగానో ప్రశంసనీయం. మీ కృషి ఆసాంతం హృద్యంగా నెరవేరి అచిరకాలంలో గ్రంథరూపాన్ని ధరించాలని ఎదురుచూస్తుంటాను.
మీకు హార్దిక శుభాభినందనలతో, ఏల్చూరి మురళీధరరావు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™